“గోధుమ రంగు పిల్లి” కథ పుణ్యమూర్తుల లక్ష్మీ కుమారి- డాక్టరు సత్యనారాయణ గార్ల స్మారక కథల పోటీ లో బహుమతి పొందిన కథని ఇక్కడ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా మరి కొంత మంది కి ఈ కథ అందుతుంది



పండుటాకొకటి ‘టప్’ మని శబ్దం చేస్తూ తలమీద పడింది. అక్కడ రుబ్బు రోల్లా నున్నగా ఉండి, ఏ ఆధారం లేకపోవడంతో నిలవలేక కింద పడింది. ముందుకు వంగి ఆకును చేతిలోకి తీసుకుని, చుట్టుపక్కల పరికించి చూసాను. ఏ చెట్టు నుంచి రాలిపడిందా అని! ఉహు. ఇక్కడి చెట్ల ఆకు కాదు. ఈదురు గాలికి ఎక్కడినుంచో ఎగిరొచ్చి పడినట్లుంది. నాలాగే దానికీ చిరునామా లేదేమో. ముదురు గోధుమ రంగులోకి మారిపోయి ఉందా ఆకు. ముందుకు, వెనక్కి తిప్పి చూసాను. ఆకుపచ్చగా ఉన్నప్పుడు ఎంత ప్రాణవాయువుని మన కోసం వదిలిందో. ముదిరి, పండి, వడలి చెట్టు నుంచి వేరుపడి ఒంటరిదైపోయింది. అచ్చంగా నాలాగే.
ఎంతసేపని ఆ పక్కనుంచి ఈ పక్కకు నడవను. ఇంకాస్త పొడవుగా కట్టుంటే బాగుండేదేమో ఈ వాకర్సు పార్కు. ఈదురు గాలి దుమారం ఎక్కువైంది. సన్నగా తుంపరలు మొదలైనాయి. గంట ఐదయినట్లుంది. రోజూ ఇదే సమయానికి అలవాటుగా చప్పుడు చేసే అలారం గంటలు మ్రోగాయి. గోడ గడియారంలో కాదులేండి. నా కడుపులో మోగిన ఆకలి పేగులు చేసిన చప్పుళ్ళవి. పార్కు ఎదురుగా ఉన్న ఇరానీ చాయ్ హోటల్లోకి అడుగులు పడ్డాయి నా ప్రమేయం లేకండానే. ప్యాంటు వెనుక జేబులో చేయిపెట్టాను. చీకటి గదిలో ఉన్న భోషాణం పెట్టెలో నిధులకోసం శోధించినట్లు వెతగ్గా వెతగ్గా, పనికిరాని ఏవో కాగితాల మధ్య నలిగిపోయి ఫ్లోరోసెంట్ బ్లూ కలర్లో ఉన్న కాగితం బయటకు వచ్చింది. నాకది ఆనంద్ కలర్ అనిపిస్తుంది. ఈ రోజు నా ఆకలితీర్చి, నా ఆనందానికి కారణం అవుతోంది మరి. పాపం ఎన్ని చేతులు మారిందో ఏమో. ఈనాటితో నాకు, దానికి ఋణం తీరిపోతోంది.
“రెండు సాల్టు బిస్కట్లు, ఒక టీ” అన్నాను. నలిగిపోయి రూపం మారున్న ఆ యాభై రూపాయల కాగితాన్ని ఒక్కసారి నిరసనగా చూసి, “చిల్లర పైసలు లేవా?” అన్నాడతను. తల అడ్డంగా ఊపాను. గల్లా పెట్టాలో వెతికి మధ్యలో టేప్ వేసి ఉన్న ఓ ఇరవై కాగితం చేతిలో పెట్టాడు.
అక్కడంతా సందడిగా ఉంది. ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా ఎవరి గోలలో వారున్నారు. రకరకాల మనుషులతో ఓ చిన్న సైజు ప్రపంచం కనబడుతోందక్కడ. చిన్నగా బయటకి నడిచాను. తుంపర వాన ఆగింది. ఈదురుగాలి కూడా తగ్గింది. ఎక్కడో కాసింత ఉనికిని మిగుల్చుకున్న నగరపు మట్టి తడిసినట్లుంది. గాలిలోకి వ్యాపిస్తోంది మట్టి పరిమళం. కమ్మటి వాసన. గుండెలనిండుగా పీల్చుకున్నాను. అప్పుడెప్పుడో ఏ భవబంధాలు బాధించని, ఏ బాధ్యతలు బంధించని బాల్యంలో స్నేహితులతో ఆడుతూ, పాడుతూ వర్షంలో తడిసి ఇంటికి వెళితే, జలుబు చేస్తుందని కోప్పడి, బట్టలు మార్చి వెచ్చని తన ఒడిలోకి తీసుకుని, తుండు గుడ్డతో తల తుడిచే అమ్మ ప్రేమ వాసన కూడా లీలగా స్ఫురణకొచ్చింది. ఒకచోట ఉనికిని కోల్పోయిన మనిషి, మరెక్కడో వెతుక్కోవాలి. తెరచాప లేని నావ సముద్రంలో దిక్కు తెలియక కొట్టుకుపోతున్నట్లు, నిలకడ లేని ఆలోచనలతో ఎటుపోవడానికీ ఉబుసుపోక గదికొచ్చి పడ్డాను. శంకరం గాడు ఊరెళ్ళి నెల పైనే అయింది. చిన్నప్పటి నుంచి దోస్తులం వాడు నేను.
పేరుకదొక గదనే కానీ, ఒక మంచం పడితే ఇక నిల్చుకోవడానికి కూడా తావులేదక్కడ. నేను తెగిన గాలిపటం లాంటి వాడినైతే, వాడు తాడుబొంగరం లేనివాడు. గిరగిరమని ఎక్కడ తిరిగినా అడిగేవారెవరు లేరు వాడికి. ఈ గది, వెనుక ఉండే పెద్ద స్థలం. శంకరం గాడి మేనమామది. అతనూ ఒంటరి పక్షే. తెగిన గాలిపటం గాలివాటానికి ఎగిరిపోయినట్లు, ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. ఈ స్థలాన్నిశంకరం పేరున రాసిచ్చి, దేశాలు పట్టి తిరుగుతూ వెళ్ళి వారణాసిలో ఆరునెల్లగా ఉంటున్నాడట. అక్కడే శివైక్యం పొందాడని కబురు తెలియడంతో హుటాహుటిన వెళ్ళాడు. ఎప్పుడొస్తాడో ఏంటో. ఎంతసేపని నాతో నేనే, నాలో నేనే కాలక్షేపం చేయను? చేతిలో ఉన్న చిల్లిగవ్వలు అయిపోతూ ఉన్నాయి. వీడు వచ్చేలోగా ఏమైపోతానో ఏంటో! ఆలోచనలు చిమ్మచీకటిలా కమ్ముకుంటున్నాయి.
గది తలుపు తెరిచే ఉంచాను. జల్లులు పడే కాలం కావడంతో, సంధ్య చీకట్లు కాస్తా ముదిరి అప్పుడే నిశిరాత్రిని తలపిస్తోంది వాతావరణం. నవారు మంచం మీద వాలాను. హోటల్లో తిన్న బిస్కట్లు, తాగిన టీ రేప్పొద్దున దాకా నీ ఆకలికి భరోసాగా ఉంటామన్నాయి. కంటి మీదకే రెప్పే వాలకుండా ఉన్నాది, నిద్రకు మాత్రం నేను భరోసా ఇవ్వలేనని. వాకిలి వైపు చూసాను. అక్కడంతా చీకటి. ఏదో అనుమానమొచ్చి, మంచం మీద నుంచే కాస్త తలెత్తి చూసాను. చిమ్మచీకట్లోనుంచి పచ్చగా మిణుగురు పురుగుల మాదిరిగా మెరుస్తూ రెండు కళ్ళు. కదలకుండా తీక్షణంగా నా వంకే చూస్తున్నట్లనిపించింది. ఒక్క క్షణం కంగారు పుట్టింది. లేచి కూర్చున్నాను. ఏందిది వింతగా అనిపించి చెవులు రిక్కించి, ఆ వైపు చూస్తూ కూర్చున్నాను. ఐదు నిముషాల అనంతరం మిణుగురు పురుగులు కదిలి ముందుకు వచ్చాయి. చూస్తుండగానే గదిలోకి వచ్చేసింది అతి మెల్లగా సుతిమెత్తని పాదాలతో అడుగులో అడుగు వేస్తూ.
గోధుమ రంగు మీద అక్కడక్కడా తెల్ల మచ్చలు ఉన్న పిల్లి. బక్క చిక్కి ఉంది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. కాస్త భయంగా నా వంక చూసింది. నా కళ్ళల్లో ఏ భావం కనపడినట్లులేదు దానికి. వీడో బికారిలా ఉన్నాడు అనుకుందేమో, భయం పోయి మంచం కింద కాసేపు అటూఇటూ తిరిగింది. మూలకు పోయి, బిందె వాసన చూసింది. అక్కడే కాసేపు తాచ్చాడి, నా వంక చూస్తూ కూర్చుంది. నా దగ్గర ఏముందే నీకు తినడానికి. ఎందుకో! ఆ క్షణం ఆ పిల్లి మీద విపరీతమైన ఆపేక్ష కలిగింది. నిశిరాత్రి ఊరవతల గుడిసెలో ఎవరికీ కాకుండా ఉన్న తన దగ్గరికి వచ్చిన గబ్బిలం తో తన వేదన చెప్పుకున్న కవి గుర్రం జాషువా చటుక్కున గుర్తొచ్చాడు. ఇప్పుడు ఎవరికీ కాకుండా ఒంటరినైన నన్ను వెతుక్కుంటూ ఈ పిల్లి వచ్చింది. బాధలోనూ నవ్వొచ్చింది. తినడానికి ఏమి దొరక్క పిల్లి వెళ్ళిపోయింది. లోటా తీసి బిందెలో నీళ్ళు ముంచుకున్నాను. తాగేసి మళ్ళీ మంచం మీద వాలా. సెల్ ఛార్జింగ్ ఐపోయినట్లుంది. మెసేజ్ వచ్చిన శబ్దం కూడా రావడంలా. అయినా నాకెవరు ఫోన్ చేస్తారు! ఇప్పుడు నేను ఎవరికి అవసరమని?
ఆలోచనలు కందిరీగలా ముసురుకుంటున్నాయి. పెద్దగా చదువుకొని నేను చిన్న ప్రైవేట్ ఉద్యోగంతో సరిపెట్టుకోవాలివచ్చింది. తిండికి లోటు లేని ఇంట్లో పిల్లనిస్తే చాలని, కమలను నాకు కట్టబెట్టారు వాళ్ళ పుట్టింటివాళ్ళు. అమ్మ, నాన్న ఒకరి వెనుక ఒకరు వెళ్లిపోయారు. అప్పుడు వాళ్ళకి నేనొక్కడినే. నాకు మాత్రం ఇద్దరు కొడుకులు. తిని, తినక, ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ఆఫీసుకి అరిగిపోయిన చెప్పులతోనే నడుచుకుంటూ వెళ్ళాను. ఏనాడు ఆటో ఎక్కలేదు. ఆ డబ్బుతో పిల్లల అవసరాలు తీర్చాను. ఇద్దరికీ డిగ్రీలు చేతికి వచ్చాయి. చుట్టుపక్కల వాళ్ళ స్థాయితో తమను పోల్చుకోనంత వరకు ఇంట్లో ప్రశాంతత ఉండింది. ప్రైవేట్ ఉద్యోగం అయినా బల్లకింద చేతులు పెట్టి సంపాదించవచ్చు అనే ఎరుక కమలకి, పిల్లలకి కలిగిగాక మా సిద్ధాంతాలు, విలువలు, వాటితో పాటు మా మనసులు వేరవుతూవచ్చాయి.
నిశ్చలంగా ఉన్న తటాకంలో గులక రాయి పడి నీళ్ళు చెదిరిపోయినట్లు ఇంట్లో ప్రశాంతత చెదిరిపోతూ వచ్చింది. నైతిక విలువలకు ప్రాణం ఇచ్చే నేనో వెర్రివాడిలా కనిపించాను ఇంట్లోవాళ్ళకి. నా ఉనికి భరింపరానిది అయింది నా వాళ్ళకు. ప్రైవేట్ ఉద్యోగం రిటైర్ అయినాక, నాకు పెన్షన్ రాదనీ తెలిసింది వాళ్ళకి . రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి, పొదుపు చేసిన చీటీ డబ్బులు పది లక్షలు వస్తాయిలే, రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో కలిపి ఎక్కడైనా ప్లాటో, ఇల్లో తీసుకుందాం అనుకున్నా. చీటీ కంపెనీ వాళ్ళు చీటీ తిప్పేసి, మోసం చేసి పరారైపోయారు. ఇక ఇంట్లో పురుగు కంటే హీనమైపోయాను. నాకు తిండి పెట్టడం దండగ అనుకున్నారు.
“ఎటైనా పడి పోకూడదా, దేంట్లో అయినా దూకి చావకూడదా” కొడుకులతో పాటు కమల సణుగుడు కూడా ఎక్కువైంది. “అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం. డబ్బు కోసం మనుషులు ఆడే వింత నాటకం” అని తేలిపోయింది. ఇక ఇంట్లో ఉండాలనిపించలేదు. శంకరంని వెతుక్కుంటూ వచ్చేసాను. ఎడతెగని ఆలోచనలు కుమ్మరి పురుగులా తొలుస్తున్నాయి. బయట నుంచి గాలి విసురుగా కొడుతోంది. లేచి తలుపు మూసి, మళ్ళీ మంచం మీద వాలిపోయాను.
సూటిగా కళ్ళకు తగిలింది ఎండవేడిమి. బలవంతంగా కళ్ళు తెరిచాను. చిన్న గది. గదిలో మంచం. దానిమీద ఒంటరి మదితో నేను. ఒక్కక్షణం నిరాశ చుట్టుముట్టినది కొండశిలువలా. గది మూలగా విరిగిన పైకప్పు రేకు సందులోనుంచి ఏటవాలుగా పడిన ఎండకి ముఖం చుర్రుమంది. రాత్రి ఏ జాముకి నిద్రాదేవి నన్ను కరుణించిందో చెప్పడం కష్టం. లేచి తలుపుతీసాను. వేకువజామున వానపడినట్లు ఉంది. లేచి గది వెనక్కి వెళ్ళాను. అక్కడ గుబురుగా అల్లుకుని ఉన్న కర్రతుమ్మ, పేరు తెలియని పిచ్చి చెట్లు, వాటికి అల్లుకున్న ఆకుపచ్చటి తీగల మీద నీటి బిందువులు రాత్రి పడిన వానకి సాక్షిగా ఆకులు, కొమ్మలమీద మెరుస్తున్నాయి. నీటిబిందువుల మీద సూర్యరశ్మి పడి, ఇంద్రధనస్సు ఏడువర్ణాలు తళుక్కున మెరిసి, అంతలోనే కిందికి జారిపోతున్నాయి. మనిషి జీవితం నీటి బుడగలాంటిదే అనే సత్యాన్ని తెలుపుతూ.
తొట్టిలో ఉన్న నీళ్ళతో ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నా. గదిలోకొచ్చి, పంచె తీసి మంచం మీద వేసి, ప్యాంటు తొడుక్కున్నా. కాళ్ళు ఇరానీ హోటల్ వైపుకి మళ్ళాయి. ఎప్పుడూ ఒకటే మెనూ. రెండు సాల్టు బిస్కెట్లు, టీ చెప్పాను. రాత్రున్నతను లేడు కౌంటర్లో. టీ తాగేసి గదిలోకొచ్చాను. తలుపు గొళ్ళెం తీయగానే, నా కాలికి రాసుకుంటూ వచ్చి, మంచం కిందికి దూరింది గోధుమ రంగు పిల్లి. అప్పుడప్పుడు నన్ను పలకరించడానికి వచ్చే ఏకైక బంధువు అది. గది మూలన ఎప్పుడో పందికొక్కులు తవ్వేసినట్లు ఉన్నాయి. గదిలోనించి బయటకు చిన్న రంధ్రం కనిపిస్తూ ఉంది. అక్కడ మట్టిలో ఓ ఎలుకని పట్టింది. అప్పటి నుంచి రోజుకొకసారైనా గది మూలకెళ్ళి శోధిస్తుంటుంది.
సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను. ఎన్నాళ్ళు పనిచేస్తుందో ఇది. నేనైతే ఎవరికి ఫోన్ చేయను. నాకు చేసేవాళ్ళు కూడా లేరు. చేతిలో డబ్బున్నప్పుడే మనం మనిషిగా గుర్తుంటాం ఎవరికైనా. మళ్ళీ మనసు ఖాళీ అయింది. ఆలోచనలు మళ్ళా చెద పురుగుల్లా మనసుని తొలిచేస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బు బలవంతంగా తన అకౌంట్ లో వేయించుకున్నాడు పెద్దాడు. ఇక నీతోపని లేదు పొమ్మంది కమల. ఇప్పుడు డబ్బు లేదు, ఏదైనా పనిలో చేరదాం అంటే ఒంట్లో శక్తి కూడా నన్ను విడిచి పారిపోతోంది రోజురోజుకి. అయినా అరవై పైబడ్డ నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారని! అనాధశ్రమంలో చేరే ఉద్దేశ్యం లేదు. అక్కడ కూడా పిండికొద్దీ రొట్టెనే. డబ్బు కట్టేవాళ్ళకి మంచి గదులు. నాలాంటి బికారి గాళ్ళకి ఒకటే పెద్ద హాలు. అక్కడంతా రోగాల వాసన. మందుల వాసన. మురుగు వాసన. రెండు మూడు చోట్ల ఇదే తంతు. ఇక ఎక్కడ బతకాలి? ఎవరికీ కానీ నేను అసలెందుకు బతకాలి? సమాధానం లేని ప్రశ్నలు నాకునేనే వేసుకున్నాను. సాలీడు గూడు అల్లుతున్నట్లు ఆలోచనలు చిక్కబడుతున్నాయి. ఆ ఇరానీ హోటల్ పక్కన ఉన్న మెడికల్ షాప్ వాళ్ళని బతిమాలి, మత్తు మాత్రలు తెచ్చుకుని వేసుకుంటే చాలు. లేదా ఏ ఎండ్రిన్ సీసానో సంపాదించి తాగేస్తే చాలు. ఈ దేహపు గూటిలో నుంచి ప్రాణం చిలక ఎగిరిపోవడం ఎంతసేపని. కుళ్ళి, కృశించిపోయిన నా శవం ఎప్పుడో, ఎవరి కంటో పడక మానదు. ఏ కార్పొరేషన్ బండో వచ్చి, నా శవాన్ని ఈడ్చుకుపోయి తగలబెట్టక మానరు. అక్కడితో స్వస్తి వ్యాక్యం ఈ అనామక జీవితానికి.
తలుపుకి గొళ్ళెం పెట్టి తుప్పలు, పిచ్చిచెట్లు తప్పించుకుంటూ ప్రహరీ గేటు తీసాను. రోడ్డుకవతల పక్క, ఎదురుగా ఇరానీ హోటల్. దానికి ముందే వాకర్స్ పార్కు. అంత రద్దీ ప్రదేశంలో దిష్టిబొమ్మలా ఈ స్థలం. ఈ గది. దానికి ఇప్పుడు ఈ అనామకుడి కాపలా. నవ్వొచ్చింది. నాలుగడుగులు ముందుకు వేసాను. ఎదురుగా రోడ్డు మీద దృశ్యం చూసి అదిరిపడ్డాను. గోధుమ రంగు పిల్లి రక్తం మడుగులో మ్యావ్ మ్యావ్ మంటూ దీనంగా అరుస్తోంది.
ఒక్క అంగలో రోడ్డు మధ్యకు పోయి, దాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. వేగంగా వెళ్ళే వాహనమేదో కొట్టేసి వెళ్ళినట్లుంది. అదృష్టం. దాని ప్రాణం పోలేదు. కాలు దగ్గర పెద్ద గాయమై రక్తం వస్తోంది. దాన్ని అట్లే రెండు చేతులతో పట్టుకుని గదివైపు గబగబా అడుగులు వేసాను. నా వంక జాలిగా చూస్తూ, సహాయం అర్థిస్తున్నట్లు నా చేతుల్లో తూలిపోయిందది. మెల్లగా మంచం మీద పడుకోబెట్టాను. బయటి తొట్లోనుంచి నీళ్ళు తెచ్చి దాని కాలికి గాయమైనచోట కారుతున్న రక్తాన్ని శుభ్రంగా కడిగాను. పంచె చింపి, ఓ పేలికతో దాని తడికాలు శుభ్రంగా తుడిచి, ఇంకో పేలికతో రక్తం కారకుండా మూడు, నాలుగు చుట్లు చుట్టి కట్టుకట్టాను. కదల్లేక పక్కకి పడుకుని నొప్పిని ఓర్చుకుంటూ, నా వంక కృతజ్ఞతగా చూస్తోందది. ఎందుకో ఆ క్షణంలో కూడా మళ్ళీ అమితమైన అపేక్ష కలిగింది ఆ చిన్ని ప్రాణి మీద. ఈ రోజు నా ప్రాణం పోకుండా ఆపిందది. చనిపోవాలనుకున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది. దానిమెడ మీద మెల్లగా నిమురుతూ, పక్కనే పడుకున్నాను నీకు నేను భరోసా అన్నట్లు. చుట్టుపక్కల ఎక్కడైనా వెటర్నరీ హాస్పిటల్ ఉందేమో కనుక్కొని దీన్ని తీసుకెళ్ళి చూపించాలి. లేచి ప్లాస్కులో పోయించుకున్న ‘టీ’ ని గ్లాస్లో పోసుకున్నాను. పిల్లికి కూడా పాలు పోయించుకు రావాలి. రస్కు ఒకటి టీ లో ముంచి నోట్లో పెట్టుకున్నా. సెల్ మ్రోగింది. ఏదో తెలియని నెంబర్. నిరాసక్తంగా హలో అన్నాను. అవతలనుంచి “రమణ అంటే మీరేనా” అన్నారెవరో. నా పేరు వారికెలా తెలుసో..!
“అవును నేనే రమణని. మీరెవరు” అన్నాను ఆసక్తిని అణుచుకుంటూ. “నేను మీ స్నేహితుడు శంకరం లాయర్ని. నా పేరు సుందరమణి. మీ స్నేహితుడు శంకరం వారణాసిలో చనిపోయాడు” ఆ మాట వినగానే నా గుండె జారిపోయింది. కళ్ళముందు చీకట్లు కమ్ముకున్నాయి. “అయ్యో. మీరు చెప్పేది నిజమేనా..! నమ్మలేక పోతున్నాను” మంచమ్మీద కూలబడ్డాను.
” నిజమే..వారం రోజులుగా అస్మా పెరిగిపోయిందని, హాస్పిటల్లో చేరాడట. నాలుగురోజుల క్రితం చనిపోయాడు. కాశీలోనే అంత్యక్రియలు జరిగాయి. పది రోజుల ముందు నాకు ఫోన్ చేసి, ఒంట్లో సుస్తీగా ఉంటోందని చెప్పి, హైద్రాబాద్లో తన పేర ఉన్న స్థలానికి మిమ్మల్ని గార్డియన్ గా రాయమని చెప్పాడు. వారం రోజుల్లో మీకు ఆ డాక్యుమెంట్ తయారు చేసి పంపుతాను. ఉంటాను మరి” అని లాయర్ ఫోన్ పెట్టేసాడు.
నాకున్న ఒకే ఒక్క స్నేహబంధం నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయింది. మేనమామ అంత్యక్రియల తర్వాత, కొన్ని రోజులు కాశీలో ఉండొస్తానని వెళ్ళిన శంకరం అక్కడే ఆ శంకరుడిలో లయమైనాడు. గుప్పెడు బూడిదై గంగమ్మ తల్లి ఒడిలో కలిసిపోయాడు అదృష్టవంతుడు. చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చాను. ఆ క్షణం నన్ను నేనే కోల్పోయాను. ఈ లోకంతో నాకింకేమి పనిలేదనిపించింది.
మ్యావ్..మియావ్..చట్టుక్కున లేచాను పిల్లి అరుపుకి. గదిని చిమ్మ చీకటి కమ్మి ఉంది. మెల్లగా లేచి లైట్ వేసాను. కాలు కదపలేకపోయినా తలతిప్పి నావైపే చూస్తోంది. పాపం ఆకలేమో. ఒక్కసారి బుర్ర గిర్రున తిరిగింది. పొద్దున లేచిన దగ్గరనుంచి జరిగినతంతా గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసాను. నేను చావాలని నిర్ణయించుకుని బయటకు వెళ్ళడం, వాహనం కొట్టేసి గాయపడ్డ పిల్లి, ఫోన్ రావడం. శంకరం లేడనే చేదు నిజాన్ని నమ్మాల్సిరావడం. భూమి గుండ్రంగా తిరిగినట్లు, బుర్ర గిర్రున తిరిగింది. మళ్ళీ నా రెండు కళ్ళు గంగా ప్రవాహాలు అయినాయి.
మంచం మీద కూర్చున్నాను. “ఒరే రమణా..! మా మేనమామ నా పేరున రాసిన ఈ స్థలం నేనేం చేసుకుంటాను. ఎప్పటికైనా మనం, మనలాంటి దిక్కుమొక్కు లేని మరో నలుగురిని కలుపుకుని, ఒకరికొకరం ఆసరాగా ఓ చిన్న సదనం నిర్మించుకుందాంరా. వాడొకడు మనం పదో తరగతిలో ఉన్నప్పుడు చర్చ్ వీధి నుంచి వచ్చేవాడు దయానిధి. బాగా చదివేవాడు. నీకు గుర్తుందా? వాడిప్పుడు దిక్కుమొక్కు లేకుండా కార్మికనగర్లో రేకుల షెడ్డులో ఒంటరిగా ఉంటున్నాడు. ముందు వాడిని మనదగ్గరకు తీసుకురావాలి”. శంకరం నాతో అన్న మాటలు ఒక్కొక్కటీ గుర్తుకు వచ్చాయి. పక్కకు చూసాను. నా కళ్ళల్లోకే చూస్తోంది జాలిగా ఆ గోధుమ రంగు పిల్లి. ‘నువ్వు లేకుంటే నాకిక దిక్కెవరు’ అన్నట్లున్నాయి దాని చూపులు.
చిక్కుముళ్ళు పడిన దారపుండలాంటి నా ఆలోచనలు క్రమంగా మారుతూ వచ్చి, మబ్బులు వీడిన ఆకాశంలా తేటగా మారి, గోధుమ రంగు పిల్లి ప్రేమ దగ్గర ఆగిపోయినాయి. పక్కకు తిరిగి పిల్లి మీద అపేక్షగా చేయి వేసాను. ఇకనుంచి నీకు నేను భరోసా అని. కన్నార్పకుండా నావంకే చూస్తోందది ప్రేమగా.
కళ్ళు మూసుకున్నాను. నా మనో ఫలకంలో కర్తవ్యం బోధ పడింది. “శంకర సదన్” నా మనోనేత్రంలో కదలాడింది.
రోహిణి వంజారి
9000594630