తలవంచని సుమధాత్రి నేటి మహిళ

తెలంగాణ రాష్ట్ర పోలీస్ పత్రిక “తెలంగాణ సురక్ష” మార్చి నెల సంచికలో “నేటి మహిళ” వ్యాసం చదవండి

“యుగయుగాల చరిత్రలో- పగబట్టిన ధరిత్రి లో – తలవంచని సుమధాత్రి స్త్రీ – కరుణామృత నేత్రి స్త్రీ” మహిళల స్థితిగతులను ప్రస్తావిస్తూ ఓ కవి రాసిన పలుకులు ఇవి. మార్చి నెలను తల్చుకున్నా, మార్చి 8 వ తేదీ దగ్గర పడుతోంది అనుకున్నా మహిళల్లో ఒక ఉత్తేజం కనబడుతుంది. పెల్లుబికిన ఉత్సాహం మగువ మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సభలు, సమావేశాలు, సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు..ఆహా..! ఆ ఒక్క రోజుకి మహిళ ప్రపంచానికి రాణి అవుతుంది. పురుష ప్రపంచం అంతా మహిళల పాదాక్రాంతం అవుతారు. “సాటిరారు నీకెవ్వరూ ఓ మహిళా..నీకు అసాధ్యమైనది ఏది లేదు” అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతారు. పొగడ్తల మత్తు వీడకముందే తేదీ మారుతుంది. ఇక షరా మాములే. అస్తిత్వ మనుగడ కోసం ప్రతి స్త్రీ పోరాటం చేయాల్సిందే.

ఒక్కసారి ప్రాచీన కాలంనాటి మహిళల పరిస్థితిని అవలోకనం చేసుకుంటే యుగాల తరబడి స్త్రీలు రకరకాల పంజరం బతుకులు అనుభవించారు. “న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి”. ఆడపిల్ల పుట్టినప్పుడు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలి తప్పితే స్త్రీలకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు అంటూ ఎన్నో ఆంక్షలు విధించారు. పితృస్వామ్య పెత్తనంలో మహిళలను వంటిల్లు, పడకటిళ్లకే పరిమితం చేశారు. ఎన్నో తరాల మహిళలు బానిస బతుకుల్లో తమ అస్తిత్వాన్ని కోల్పోయి నిరాశ నిస్తేజలకు లోనైనారని మనకు చరిత్ర చెప్తోంది. అయితే కాలం ఎప్పుడూ ఒకటిగా ఉండదు కదా. మార్పు దాని సహజ గుణం. స్వతంత్ర భారత దేశ చట్టాల్లో, రాజ్యంగంలో స్త్రీల కోసం అనేక సవరణలు, సంస్కరణలు చేయబడ్డాయి అని మనకి తెలుసు. ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఇప్పుడు ఆధునిక మహిళలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు. ప్రపంచ మహిళల పరిస్థితితో పోల్చుకుంటే కొన్ని దేశాల్లో స్త్రీలు యథేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకుంటూ, స్వేచ్చా వాయువులను పీల్చుకుంటుంటే, మరికొన్ని దేశాల్లో స్త్రీలు ఇంకా పరదాల మాటున బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ధిక్కరించిన మహిళలు పాలకుల నియంతృత్వానికి బలవుతున్నారు. మన దేశంలో మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు చాల వరకు మెరుగుపడినాయి అని చెప్పవచ్చు. సాంఘిక, సామాజిక, రాజకీయ, పాలనా వ్యవస్థల్లో మహిళలు కీలక పాత్ర వహిస్తున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగాలు, పెద్ద వ్యాపార సంస్థలకు అధిపతులుగా రాణిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో మహిళలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే తరుణం ఇంకా రాలేదనే చెప్పవచ్చు.

మహిళల వస్త్ర ధారణ పైన చిల్లర వ్యాఖ్యలు, చర్చలు, ప్రతి రంగంలో కనిపించే కాస్టింగ్ కౌచ్ వంటి దురాగతాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని కృంగదీసేవిధంగా ఉన్నాయి. ఇటువంటి విషయాల పట్ల పాలకులు, సేవా సంస్థలు పూనుకుని మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. మార్పు ఇంటినుంచి ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు అడ, మగ అనే తేడా లేకుండా పిల్లలకు విద్య, నైతిక విలువలు నేర్పించాలి. ముఖ్యంగా మగ పిల్లలకు సాటి మహిళల పట్ల ఏవిధంగా వ్యవహరించాలి. గౌరవించాలి అనే విషయాలను చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలి. అప్పుడే బాధ్యత గల పౌరులుగా పురుషులు సాటి స్త్రీలను గౌరవ దృష్టితో చూడగలరు. ఆధునిక సమాజం, సోషల్ మీడియా వంటి సామాజిక మాధ్యమాల విప్లవం, మహిళలకు చట్టాల్లో ఇచ్చిన అనేకానేక వెసులుబాట్లను ఒక్కోసారి దుర్వినియోగం చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి.

ఎంతవేగంగా పురోగమనం సాధిస్తున్నామో, అంతే వేగంగా మహిళల అభివృద్ధిని, అస్తిత్వాన్ని దెబ్బతీసే సంఘటనలు నిరంతరం జరుగుతుండడం విచారకరం. మహిళల పట్ల సమాజం వ్యవహరించే తీరు మారుతున్నప్పటికీ, లైంగిక దాడులు, పరువుహత్యలు, గృహ హింస, ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా వ్యక్తి దూషణలు, బ్లాక్ మెయిలింగ్, సైబర్ మోసాలు లాంటి ఎన్నో నేరాలకు బలవుతున్నారు ఈనాటి మహిళలు. మొత్తానికైతే మన దేశంలో స్త్రీల పరిస్థితి చాల వరకు మెరుగైందని చెప్పవచ్చు. సాధించినదానితో తృప్తి పడితే చాలదు.

ఉన్నతస్థాయి లక్ష్యాలను ఏర్పరచుకుని, నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే మహిళలు కోరుకున్న గమ్యాలను చేరుకోగలరు. శారీరక, మానసిక దృఢత్వాన్ని పదిలం చేసుకోవడానికి ప్రతిమహిళా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉన్నత స్థాయి పదవుల్లో ఉండే మహిళలు, ఉద్యోగ్యం చేసే మహిళలతో పాటు, మన సమాజంలో కార్మికులుగా రోజు కూలి చేసుకునే మహిళలు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలు ఎందరో ఉన్నారు. వారికి పోషకాహార సరఫరా, వైద్యం, ఉపాధి వంటివి లభించాలి. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన మహిళలు తమ హక్కులను వినియోగించుకుంటూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ, మహిళలు అనే జాలిచూపుల ‘విమెన్ కార్డు’ ఆశించకుండా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటే, గెలుపు శిఖరాగ్రం పైన నిలిచే తరుణం ఎంతో దూరం లేదు.

మహిళల రక్షణకు భరోసా ఇస్తున్న పోలీస్ శాఖకు, షీ టీమ్స్ అధికారులకు మహిళలు రుణపడి ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న “సురక్ష” పత్రిక ద్వారా ఎన్నో అవగాహనా కార్యక్రమాల వివరాలు అందిస్తూ, సాహితీ సేవ చేస్తున్న సంపాదకులకు “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” సందర్భంగా ధన్యవాదాలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

వ్యాసకర్త: రోహిణి వంజారి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *