‘ ఇంకాసేపట్లో ఈ ముసలాడిని చంపేస్తాను‘ అనుకోగానే అతని మనసు శాంతించింది. ఎవరతను? ఎందుకు ముసలివాడు అనే జాలి లేకుండా చంపాలి అనుకున్నాడు? “మల్లె తీగ ” మాస పత్రిక కథల పోటీ లో ఎంపిక అయిన నా కథ @దయామయులు చదవండి.
ఇంకో విశేషమేమిటంటే ఈ కథ నెల్లూరులోని ఒక ప్రముఖ హాస్పిటల్లో జరిగిన యధార్థ గాధ కి అక్షర రూపం .
మీ మిత్రులకు షేర్ చేస్తే కథ ఎక్కువ మంది కి చేరుతుంది. చదివాక మీ స్పందన తెలుపడం మరచిపోకండి….. ఫోటో కేవలం అటెన్షన్ కోసమే.





ఒళ్ళంతా చెమటతో తడిసిపోయిందతడికి. ‘ఒక్క క్షణం. ఒకే ఒక్క క్షణం. ఆక్సిజన్ మాస్క్ ఇతని ముక్కు నుండి వేరు చేస్తే..! గుండెలో రగిలే జ్వాలలు ఆరిపోతాయి. అయినా ఈ ముసలాడు నాకేమవుతాడని. వీడి ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇప్పుడే వీడిని చంపేస్తాను’ అనుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. బెడ్ మీద అచేతనంగా పడుకుని ఉన్నాడు ముసలాయన. అతని చెయ్యి ముసలాయన ముక్కుకి తగిలించి ఉన్న మాస్కు మీద పెట్టగానే బయట ఏదో కలకలం.
గబుక్కున చేతిని వెనక్కి తీసుకుని బయటకు వచ్చాడు. డ్యూటీ నర్సుతో పెద్దపెద్దగా అరిచి ఏదో చెప్తోంది ఒకామె. చాల కలిమి కలిగిన మనిషని ఆమె కట్టిన చీర, వేసుకున్న నగలు చెప్పకనే చెప్తున్నాయి. డ్యూటీ డాక్టర్ కూడా వచ్చాడక్కడికి.
“మేడం..ఈ పెద్దాయన మీకేమవుతాడు” డాక్టర్ ప్రశ్న.
“మా నాన్నలేండి” నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది చాల తేలికైన విషయాన్నిఅనాసక్తంగా చెప్తున్నట్లు.
“మేడం ..ఈయనకు నాడి చాలాబలహీనంగా కొట్టుకుంటోంది. ఆక్సిజన్ లెవెల్సు కూడా బాడీలో తక్కువగా ఉన్నాయి. ఇతనికి..
డాక్టర్ మాటలను మధ్యలోనే అడ్డుకుని “చూడండి డాక్టర్.. ఈయనకి ఇంట్లో శ్వాస తీసుకోవడం కష్టమైందని ఇక్కడికి తీసుకువచ్చాను. వయసైపోయిన ముసలాడు కదా. పెద్దగా ట్రీట్మెంట్ అవసరం లేదు. జనరల్ ట్రీట్మెంట్ చేయండి చాలు. రేపు ఉదయం నాకు ఢిల్లీలో అర్జెంటు మీటింగ్ ఉంది. తర్వాత యూ.ఎస్. వెళ్ళాలి. ఇంట్లో ఇతన్ని చూసే కంపౌండర్ వెళ్ళిపోయాడు. ఎంత డబ్బు కావాలో ఈ చెక్ మీద రాసుకోండి.” హ్యాండ్ బ్యాగ్ లో నుంచి చెక్ బుక్ తీసి ఖాళీ చెక్ మీద సంతకం చేసి, డాక్టర్ చేతిలో పెట్టింది విసిరేసినట్లు. వాళ్ళు తేరుకునేలోగానే ఆమె లిఫ్టులో వెళ్ళిపోయింది.
“డాక్టర్.. చూసారా ఆమె ఏమందో..! మనిషి మనిషితో బంధాన్ని తెంచుకుని, డబ్బుతో బంధాన్ని పెంచుకుంటున్నాడు అంటే ఏమో అనుకున్న. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా. అవసానదశలో ఉన్న కన్నవాళ్ళను గాలికొదిలేసిపోయిన కసాయి కొడుకులను చూసాను. కనికరం లేని కూతుర్ని ఇప్పుడే చూస్తున్నాను. కన్న తండ్రిని అలా వదిలేసిపోవడానికి మనసెలా ఒప్పిందో ఆమెకు.” నర్సు మాటలు వినలేకపోయాడతడు. గిరుక్కున వెనుతిరిగాడు. అతను డాక్టర్ నవీన్. గుండె జబ్బులకు వైద్యం చేసే కార్డియాలజిస్టు. పాతికేళ్ళు కూడా నిండని యువ వైద్య నిపుణుడు. అతని గుండెకు గాయమైందిప్పుడు.
హాస్పిటల్ అంతా ఆ రాత్రి చీకట్లో నిద్రలోకి జారుకుంది. రేపనేది ఆనందాన్ని పంచుతుందో, విషాదాన్ని నింపుతుందో ఎవరికి తెలుసు? ఎదురు చూడాల్సిందే. ఐసీయూలో డ్యూటీ నర్సు నాలుగో బెడ్ దగ్గర పేషంట్ కాలిమీది గాయానికి డ్రెస్సింగ్ చేస్తోంది. డాక్టరు నవీన్ ముసలాయన బెడ్ ముందు కూర్చుని చూస్తున్నాడు. అతని మనసు తుఫాను వచ్చిన సముద్రపు కెరటాల్లా కల్లోలంగా ఉంది. ఎవరితో పంచుకోలేని అవ్యక్త ఆవేదనతనిది. ఆలోచనల్లోనించి దూరంగా పోవాలని అతను చేసే ప్రయత్నాలు అన్నీ విఫలమైనాయి. తల పగిలిపోతోంది. నరాలు చిట్లుతాయేమో అన్నంత తీవ్రమైన బాధ. ఆ పెద్దాయన కళ్ళు మూసుకుని ఉన్నాడు మరోలోకంలో. ఛాతీ కదులుతుంటే తెలుస్తోంది ఆయన ఊపిరితో ఉన్నాడని.
‘వారం తర్వాత ఇతనికి తను గుండె ఆపరేషన్ చేయాలి. తన చేతులతో ఇతనికి ఆపరేషన్ చేయగలనా?’ అనుకోగానే తీవ్రమైన నిర్లిప్తత ఆవరించిందతన్ని. నైట్ డ్యూటీ డాక్టరు ఐసీయూలోకి వచ్చి పేషంట్లను చూస్తున్నాడు. అతని వెంటే నర్సు. కింది అంతస్తులో ఉన్న తన రెస్టు రూముకు వచ్చేసాడు డాక్టరు నవీన్. ప్లాస్కులో అడుగున ఉన్న కాసిన్ని కాఫీని డిస్పోజబుల్ గ్లాసులో పోసుకుని తాగాడు. టేబుల్ డ్రాలో చేయి పెట్టి తడిమాడు. ఎప్పుడో కంపౌండర్ మాల్యాద్రి తెచ్చిన గోల్డు ఫ్లేక్ సిగరెట్టు పాకెట్ తగిలింది. సిగరెట్టు తాగే అలవాటు పెద్దగా లేదతనికి. ఒక సిగరెట్టు బయటకి తీసాడు. లైటర్‌తో వెలిగించి గుప్పుగుప్పున పొగ వదిలాడు. మండుతున్న అతని గుండెలకి సిగరెట్టు పొగ తోడై మరింత వుక్కిరిబిక్కరి అయ్యాడు. దగ్గు వచ్చింది తెరలుతెరలుగా. సిగరెట్టు తీసి అవతలపడేసాడు. ఆలోచనలు అగ్నిపర్వతాల్లా విస్ఫోటమవుతూ అతని మనసును కాల్చేస్తున్నాయి. రెండు గంటల ముందు హాస్పిటల్ హెడ్ డాక్టర్ శేషారెడ్డి తన ఛాంబర్ కి వచ్చాడు.
“కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా సర్ మీ దగ్గరికి. కూర్చోండి” తను లేచి నిలబడ్డాడు డాక్టర్ నవీన్ వినయంగా ఆయనవంక చూస్తూ. ఆయన ఇదివరకెన్నడూ చూడనంత చిత్రమైన రీతిలో చూసి “డాక్టర్ నవీన్.. మై లవ్లీ బాయ్. నీకో ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను. ఈ మాటలు నీకు చెప్పే రోజు ఒకటొస్తుందని నేనింతవరకు ఊహించలేదు” చేతిలో ఉన్న ఏదో పాత రికార్డు బుక్ వంక చూస్తూ అన్నాడు.
‘చిత్రంగా ఉందే..! ఇంత రాత్రి పూట నాతో ఏం చెప్పాలని వచ్చాడు ఈయన’ ఆశ్చర్యం, అనుమానం కలగలిసి, డాక్టర్ శేషారెడ్డి వంక చూసాడతను. “ఐసీయూ లో నువ్వు ఆపరేషన్ చేయాల్సిన ఆ పెద్దాయన ఎవరో తెలుసా నీకు ” అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ డాక్టర్ శేషారెడ్డి.
“ఎవరు..ఆ జనార్దన్ అనే పేషంటు గురించేనా మీరడిగేది”
“అవును. ఎలా ఉందతని హెల్త్ కండిషన్” డాక్టర్ శేషారెడ్డి ప్రశ్న.
“హార్టు నుంచి వెళ్ళే కొన్ని బ్లడ్ వాల్వులు మూసుకుపోయాయి. ముఖ్యంగా మెదడుకి వెళ్లే నరాలు చాల దెబ్బతిని ఉన్నాయి. సర్జరీ చేయకపోతే అతను కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది సర్. అతను మీకు తెలుసా” డాక్టరు నవీన్ ప్రశ్నించాడు క్యూరియాసిటీ నిండిన స్వరంతో.
“తెలుసు”
“ఎవరతను”
“నా ప్రశ్న నాకే వేసావా నవీన్. అతను నీ కన్న తండ్రి”
అదిరిపడ్డాడతను. “వాట్ డాక్టర్” పెద్దగా అరిచాడు.
“ఎస్, నువ్వు విన్నది కరెక్టే నవీన్” నిర్లిప్తంగా శేషారెడ్డి డాక్టర్. రూంలోని ఏసీ చల్లదనం నవీన్ నుదిటినుంచి కారే చెమటని ఆపలేకపోతోంది. టేబుల్ మీద ఉన్న బాటిల్ మూత తీసి గటగటా నీళ్లన్నీ తాగేశాడు.
“డాక్టర్ ఇది నిజమా”
“నికార్సైన నిజం”
“మరి మా నాన్నవెంకయ్య..?”
“నిన్ను పెంచిన తండ్రి” నమ్మకం లేని అతని కళ్ళు రెప్పవేయడం మానేశాయి. ఉరికే కన్నీళ్ళు అతని చెంపలమీది నుంచి జారి చొక్కాని తడిపేస్తున్నాయి. తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు. “కూల్ నవీన్” అనునయంగా భుజమ్మీద చేయి వేసాడాయన.
“ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు డాక్టర్.”
“ఈ నిజం నీకు చెప్పాల్సిన రోజొకటి వస్తుందని ఇంతవరకు నాకే తెలియదు నవీన్ “
“మరి నేనెందుకు వెంకయ్య దగ్గర..”
“అది చెప్పాలనే వచ్చాను నవీన్. పాతికేళ్ల కిందట నువ్వు ఈ హాస్పిటల్ లో పుట్టిన రోజు ఏం జరిగిందో చెప్తాను.”
ఆ రోజు..
“డాక్టర్ బాబు నేను విన్నది నిజమేనా. పురిటి గుడ్డునొదిలేసి పోయినారంట కదా ఆ కసాయి మనుషులు” పై గుడ్డతో ముఖం తుడుచుకుంటూ డాక్టర్ శేషారెడ్డి గదిలోకి వచ్చాడు వెంకయ్య.
“నేను ఊహించలేదురా..! వైద్య పరీక్షల్లో పుట్టిన బిడ్డకి క్యాన్సరు జబ్బు ఉందని తెలిసింది. ఆ మాట చెప్పగానే బిడ్డ తండ్రి ముఖం పాలిపోయింది. వైద్యం చేయిస్తే నయమయ్యే అవకాశముందని కూడా చెప్పాను. ఎవరికీ తెలియకుండా ఆ భార్యాభర్తలు నిన్న రాత్రికిరాత్రే హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. బిడ్డని ఉయ్యాల్లో వదిలేసి. పసివాడి ఏడుపు విన్నాక తెలిసింది వాళ్ళు వెళ్లిపోయారని. డ్యూటీ నర్సులను ఏమార్చి ఎప్పుడు వెళ్ళారో” సాలోచనగా శేషారెడ్డి డాక్టర్
“బిడ్డకి ఇప్పుడు ఎట్ట ఉండాది డాక్టర్” వెంకయ్య కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.
“చికిత్స వెంటనే ప్రారంభంచాలి. అది కూడా మన హాస్పిటల్లో సాధ్యం కాదు. బిడ్డ తండ్రి జనార్దన్ నాకు మిత్రుడే. కానీ ఈ మధ్యకాలంలో కలవలేదు. కాన్పుకోసం ఇక్కడకి వచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఫోనుకి అందడం లేదు. బహుశా జబ్బుతో ఉన్న బిడ్డని వదిలించుకోవాలని వెళ్లిపోయారేమో” శేషారెడ్డి డాక్టర్ స్వరం వణికింది బాధగా.
“అయితే ఇప్పుడు ఆ పసిగుడ్డు గతేంది డాక్టర్ బాబు”
“అదే అర్ధం కావడం లేదు రా”
వెంకయ్య ఆ హాస్పిటల్ లో స్వీపర్. హాస్పిటల్ హెడ్ గా డాక్టర్ శేషారెడ్డి చేరిన రోజే వెంకయ్య కూడా హాస్పిటల్లో స్వీపర్ గా చేరాడు. శేషారెడ్డి డాక్టరుకు నమ్మినబంటు.
“డాక్టర్ బాబు..నాదో విన్నపం” ” ఏందీ వెంకయ్యా”
“ఆ పసి గుడ్డుని నేను పెంచుకుంటాను. నర్సులు ఇంక్యూబేటర్లో పెట్టే ముందర చూసాను. బిడ్డ ఎంత బాగుండాడో”
“జబ్బుతో ఉన్న బిడ్డని తీసుకుని పోయి నువ్వెట్టా పెంచుతావు వెంకయ్య” డాక్టర్ శేషారెడ్డి గొంతు జీరపోయింది.
“తొమ్మిది నెల్లు కడుపులో మోసి చచ్చిన బిడ్డని కనింది మా ఆడది. బాలింతయి గూడా గొడ్డుబోతుది అనిపించుకునింది. బిడ్డ ఆకలి తీర్చేదానికోసం దాని రొమ్ములనిండా పాలూరి, బిడ్డ నోరు తగలకపోయేతలికి, అన్నీపాలు కారిపోయి, దాని గుడ్డలు తడిపేస్తుంటే చచ్చిపోయిన బిడ్డని తల్చుకుని ఎక్కెక్కి ఏడ్చేటిది ఆ పిచ్చి తల్లి. దాని కడుపుకోత చూడలేకున్నాను బాబు. ఆ రోజు తమరే కదా బిడ్డకి మన్నుకప్పడానికి నాకూడా వచ్చింది. ఆసుపత్రి వెనక్కి పోయినప్పుడల్లా గుండె కలుక్కు మంటుంది పురిటిగుడ్డుని కప్పెట్టిన తావుని చూస్తే” కన్నీళ్లు వరద కట్టాయి వెంకయ్య కళ్ళల్లో.
“నిజమే వెంకయ్యా. అప్పుడు ఆ బిడ్డ దక్కలేదు నీకు. ఇప్పుడు ఈ జబ్బుతో ఉన్న బిడ్డ ఎందుకురా”
“బిడ్డని తీసుకుని పోయి నా పెళ్ళాం చేతిలో పెడతాను బాబు. వాడికి వైద్యం చేయిస్తాను”
“కాన్సర్ చికిత్స అంటే మాటలు కాదు. చాల డబ్బు అవుతుంది. హాస్పిటల్లో చిమ్ముకునే పనిచేసే నీకు అంత డబ్బు ఎక్కడనించి వస్తుంది చెప్పు? కన్నవాళ్ళే బిడ్డని కాదనుకుని వదిలెళ్ళిపోతే, నీకు పట్టిందా ఆ బిడ్డ గురించి” డాక్టర్ గొంతులో నిర్లిప్తత.
“అప్పోసొప్పో చేస్తాను. నా తల తాకట్టు పెట్టైనా వైద్యానికి డబ్బు తెస్తాను. తమరే బిడ్డని బతికించాలి” వెంకయ్య శేషారెడ్డి డాక్టర్ కాళ్ళమీద పడిపోయాడు.
“లేలే వెంకయ్యా. ఎవరో కాదని వదిలేసుకున్న బిడ్డని నువ్వు కావాలనుకుంటున్నావు. నీ దయ గల హృదయం నాకు దేవాలయంలా కనిపిస్తోందిరా. బిడ్డ వైద్యానికి నేను కొంత సాయం చేస్తాను. మద్రాసులో అడయార్ కాన్సర్ ఆసుపత్రి ఉంది. బిడ్డకి అక్కడ వైద్యం జరిగేలా నేను ఎర్పాటు చేస్తాను.”
“అలా వెంకయ్య దంపతులు నిన్ను మద్రాస్ అడయార్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రెండేళ్లు నీకోసం తిండి, నిద్రలు మానుకుని అష్టకష్టాలు పడి నిన్ను దక్కించుకున్నారు. చెప్పడం ఆపాడు శేషారెడ్డి డాక్టర్. ఆయన కళ్ళు కూడా చెమ్మతో తడిసాయి.
అప్పటికే రెండు చేతుల్లో ముఖాన్నిదాచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు నవీన్. గుండెల్లో ఘనీభవించి ఉన్న బాధ కన్నీటి రూపంలో బయటపడుతోంది అతనిలో.
“ఈ విషయాలు నీకు చెప్పేరోజు అసలు రాకూడదు అనుకున్నాను, మొన్న మీ నాన్నజనార్దన్ హాస్పిటల్ కి వచ్చి నన్ను కలిసేవరకు. పుట్టుకతోనే కాన్సర్ జబ్బుతో ఉన్న నిన్ను వదిలించుకువెళ్ళిన శాపం వాళ్ళను వెంటాడిందన్నాడు. మీ అమ్మకి ఇక బిడ్డలు కలగలేదట. మీ నాన్న బలవంతం మీద నిన్ను వదిలి వెళ్ళినా, నీ మీద దిగులు, కడుపుకోతతో అనుక్షణం నరకం అనుభవించి చనిపోయిందట. ఆస్తులు, డబ్బు ఆప్యాయతలు, అనురాగాలను పంచలేవని తెలుసుకున్న మీ నాన్న ఇప్పుడు తనకి గుండె జబ్బు అని తెలిసిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా దగ్గరికి. నేనింకా నువెవ్వరో చెప్పలేదు తనకి. నువ్వు ఉన్నావని తెలిస్తే తన ఆస్తి మొత్తం నీకు ఇచ్చేసి తను వెళ్ళిపోతాడట. ఈలోగానే తనకి సీరియస్ అయింది.” డాక్టర్ నవీన్ మనసుని మెలితిప్పుతున్నాయి శేషారెడ్డి డాక్టర్ చెప్పిన మాటలు. కాసేపు నిశ్శబ్దం ఇద్దరి మధ్యన. చిన్నగా గొంతు విప్పాడు డాక్టర్ నవీన్.
“వద్దు డాక్టర్. అతను నా కన్నతండ్రి అనే ఊహనే భరించలేకపోతున్నాను. దయచేసి ఆ నీచుడికి నేనెవరో తెలుపకండి. నేను స్వీపర్ వెంకయ్య కొడుకుగానే గర్వపడుతున్నాను. నన్ను స్వీపర్ వెంకయ్య కొడుకుగానే బతకనివ్వండి.” శేషారెడ్డి డాక్టర్ పిలుస్తున్నా ఆగకుండా వేగంగా బయటకి పరుగుతీసాడతను.
వారం రోజులు ఆసుపత్రికి సెలవు పెట్టాడు డాక్టర్ నవీన్. ఎందుకని తండ్రి వెంకయ్య అడిగినా ఏం చెప్పలేకపోయాడు. ఎడతెగని ఆలోచనలతో మౌనముని అయినాడు. ఇంటిలో ఒంటరిగా గదిలో కూర్చుని నరకం అనుభవించాడు. నవీన్ బాధకు కారణం తెలియక వెంకయ్య దంపతులు అతనికోసం తల్లడిల్లారు.
వారం రోజుల తర్వాత ఆ రాత్రి మళ్ళీ హాస్పిటల్ కి వచ్చాడు డాక్టర్ నవీన్. ఐసీయూలో ఎప్పటిలాగే స్పృహ లేకుండా పడుకొని ఉన్న ముసలాయన దగ్గరకు వచ్చాడు. అతని గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. నెత్తుటి గుడ్డని చూడకుండా వదిలివెళ్లారు. పక్షి తన పిల్లలకు రెక్కలు వచ్చేవరకైనా గూటిలో పెట్టుకుని సాకుతుంది. కనీసం పిల్లి, కుక్క కూడా తమ కూనలు ఎదిగేవరకు పాలిచ్చి పెంచుతాయి. పురిటి బిడ్డని వదిలి వెళ్లిన వీళ్ళు మనుషులు కాదు. జంతువుల కన్నా హీనం. బెడ్ మీద ఉన్న ముసలాయన ముఖాన్ని చూడడానికి కూడా మనసొప్పలేదతనికి. ‘రేపు ఇతనికి తను ఆపరేషన్ చేయడు. తన చేతులతోనే ఇతన్ని చంపేస్తాడు.’ ఎర్రబారిన కళ్ళనరాల్లోనించి కన్నీటిబొట్లు రాలుతుంటే కసిగా అనుకున్నాడు.
ఐసీయూ బయట ఎవరివో మాటలు. బయటకు వచ్చి చూసాడు.
డ్యూటీ నర్సులు. వారి మధ్యలో వీల్ చైర్ మీద ఓ పెద్దాయన. వారం క్రితం ఒకామె వదిలివెళ్లిన ఆయన కోలుకున్నాడట. తన కూతురు తన కోసం ఇక రాదు. తనని వదిలించుకోవడానికే హాస్పిటల్లో వదిలి వెళ్ళింది అని చెప్పాడట. హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందట. ఆమె ఎక్కడుందో తెలియదట. కట్టుకథలు చెప్పి ఈయన్ని వదిలించుకుని వెళ్లిపోయిందట” నర్సు బాలమ్మ చెప్తోంది.
“మరి ఈ పెద్దాయన పరిస్థితి ఏంటి ఇప్పుడు” ఎవరో అడిగారామెని.
“మా ఇంటికి తీసుకువెళ్ళుతున్నాను” నర్సు బాలమ్మ అంది పెద్దాయన వంక ఆప్యాయంగా చూస్తూ.
” బాలమ్మ..నువ్వు తీసుకువెళతావా?” వాళ్ళ మాటలు విన్న నవీన్ ఆమె వంక చూస్తూ అచ్చెరువొందుతూ.
“నాకు నాన్న లేడు డాక్టర్. ఈ పెద్దాయనను ఆమె ఇక్కడ వదిలివెళ్ళి నాకు గొప్ప సాయం చేసింది. ఈయనను నాకు దేవుడు ఇచ్చిన తండ్రిగా చూసుకుంటాను” కన్నీళ్లతో పెద్దాయనని పొదివిపట్టుకుంది హెడ్ నర్సు బాలమ్మ. అందరు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.
ఇక అక్కడ ఉండలేక తన రూంకి వచ్చేసాడు డాక్టర్ నవీన్.
‘ఎవరో వదిలివెళ్లిన ముసలాయనని తను అక్కున చేర్చుకుంది నర్సు బాలమ్మ. కన్నబిడ్డ అని చూడకుండా జబ్బుతో ఉన్న తనని పేగు బంధం ఉన్నవాళ్లు వదిలివెళితే, ఏ బంధం లేని వెంకయ్య దంపతులు తనని చేరదీసి, ఆదరించి తనకి అమ్మ,నాన్నలు అయినారు. తనకి పునర్జన్మనిచ్చారు. తన కోసం ఎన్ని త్యాగాలు చేసారో ఈ పుణ్యమూర్తులు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లు ఒకవైపు ద్వేషం, నిర్లక్ష్యం, సొంతవారిని కూడా తమ స్వార్ధం కోసం వదిలించుకునే తత్వం ఉన్నమనుషులు, మరో వైపు తమకి ఏ సంబంధం లేకపోయినా తమలో ఉన్నకరుణ, జాలి, మానవత్వం అనే సుగుణాలతో అభాగ్యులను అక్కున చేర్చుకునే ప్రేమ మూర్తులు. కన్న తండ్రి పట్ల ద్వేషంతో మంచు గడ్డలా మారిన అతని మనసు మెల్లగా కరుగుతోంది. ఎదుటి వారి పట్ల కరుణ, దయ, జాలి, మానత్వం ఉన్న మనుషుల్లో దేవుళ్ళలాంటి దయామయులు వెంకయ్య దంపతుల దగ్గర పెరిగాడతను. రేపు అతను తీసుకునే నిర్ణయం దయో..పగో.. ఎటువైపో..!
వారం రోజుల తర్వాత హాస్పిటల్లో స్పెషల్ వార్డులోని గదులకు రౌండ్స్ కి వెళుతూ, ఓ గదిలోకి తొంగి చూసాడు డాక్టర్ శేషారెడ్డి. తన తండ్రికి పళ్ళ రసం తాగిస్తూ కనిపించాడు డాక్టర్ నవీన్. చప్పుడు చేయకుండా నవ్వుకుంటూ ముందుకు సాగిపోయాడు డాక్టర్ శేషారెడ్డి తేలికైన మనసుతో