విమల సాహితి ఎడిటోరియల్ 62 – పద్మం డాక్టర్ కత్తి పద్మారావు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి 🌹🌹

అడవిలో దుప్పి, జింకల్లాంటి సాధుజంతువులతో పాటు క్రూర మృగాలైన పులి, సింహంలాటివి కూడా ఉంటాయి. నక్క, తోడేళ్లలాంటి జిత్తులమారి జంతువులూ ఉంటాయి. అటువంటి అడవిలో జీవులు మనుగడ సాగించడం ఎలా? నీటి కొలనులో అరవిరిసిన కలువలు, ఎర్ర తామరలే కాకుండా, నెత్తురు తాగే మొసళ్ళు, ప్రాణాలు తీసే పాములు కూడా ఉంటాయి. అక్కడే చేపలు, ఎర్రలు, పీతలు లాంటి చిన్న జీవులు నివసిస్తాయి. మరి ఆ కొలను ఆవరణంలో మొసళ్ల బారిన పడకుండా చిన్న ప్రాణులు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడమెలా? అడవుల్లో, తటాకాల్లో జీవుల స్థితిగతులకు, వాటి మనుగడకు ప్రతి జీవికి స్వీయరక్షణ పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి. మనుగడ కోసం పోరాటం ఉంటుంది. సరిగ్గా అటువంటిదే మానవ సమాజము. ఇక్కడ కూడా బలవంతులు బలహీనులను అణచి వేసి, సామాజిక వనరులను [అక్షరాస్యత, ఉపాధి, సుఖవంతమైన జీవనం ] అంది పుచ్చుకుని అనుభవించే సమాజంలో కొందరు మనుషుల్లో మానవత్వపు దివిటీల్లాంటి వారు వెలుగులా ఉదయిస్తారు. ప్రశ్నలా ఎదుగుతారు. సమ న్యాయం కోసం పోరాటం చేస్తారు. మానవ జాతికి మణిపూసలా దీపదారులవుతారు. సరిగ్గా అటువంటి కోవకు చెందినవారే దళితోద్యమ కవి పుంగవుడు, వెనుకబడిన వర్గాల అస్తిత్వ పోరాట నాయకులు డాక్టర్ కత్తి పద్మారావు.

తరతరాలుగా మనుషులను మనుషులుగా కాక, కులం, మతాల వారిగా విడకొట్టబడ్డ నిచ్చెన మెట్ల సమాజంలో దళిత కుటుంబంలో జన్మించారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. మూతికి ముంత, ముడ్డికి చీపురు తగిలించిన వివక్షను చిన్నతం నుంచి ఎరిగిన వారు. ఎన్నోచోట్ల కుల వివక్ష ఎదుర్కున్నవారు. అయినప్పటికీ ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు వారు పుట్టుకతోనే మేధోసంపన్నులు అయినారు. తెలుగు, సంసృతం బాషలలో ప్రావీణ్యతను సంపాదించారు. అధ్యాపకులు, కవులు, పండితులుగా బహుముఖాలుగా తమ సేవలను సమాజానికి అందించారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల దాస్యవిముక్తికి, అభివృద్ధికి కృషి చేసారు. ముఖ్యంగా 1985లో మాదిగ దళితులపై జరిగిన కారంచేడు ఊచకోత కి కదిలిపోయారు. కులతత్వాన్ని ఎండగడుతూ, కులపరంగా జరిగే దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలను సమీకరించి, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సంస్థకు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా తమ సేవలు అందించారు. పద్మారావు గారు హేతువాదిగా కులమతాలను నిరసించారు. హేతువాదం అనే పత్రికను నడిపారు. తమ సంతానానికి కులాంతర వివాహం చేసి, మాటలలో కాదు ఆదర్శం చూపాల్సింది ఆచరణలో అని నిరూపించారు. డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ అడుగుజాడల్లో నడచి, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసినవారు. మతం ఏదైనా అందులో హేతువాద దృష్టి ఉండాలన్నారు. తాను బ్రాహ్మణులకు వ్యతిరేకిని కాదు. బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకినని చెప్పుకున్నారు. దళితుల్లో కూడా కొందరు అభివృద్ధి సాధించాక, బ్రాహ్మణవాదుల్లా, మనువాదుల్లా ప్రవర్తించేవారు ఉన్నారు. అటువంటి వారిని కూడా నేను నిరసిస్తాను అని చెప్పారు.

మహాత్మా పూలే, అంబెడ్కర్, పెరియార్, వేమన, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా వంటి సంఘసంస్కర్తల మార్గంలో వర్తమాన సాహిత్యాన్ని, చరిత్రని సుసంపన్నం చేస్తున్న మహాకవులు డాక్టర్ కత్తి పద్మారావు గారు. ‘కులం పునాదుల మీద ఒక జాతిని, ఒక నీటిని నిర్మించలేరన్న’ అంబెడ్కర్ వాక్కులు కత్తి పద్మారావు గారి కవితా ఝరి. ‘సత్యవాక్యంబెవ్వడుల్లంగింపడో వాడేపో నరుడిద్దరా మండలిన్’ అనే జాషువా మహాకవి మాటా కత్తిపద్మారావు గారి కవిత్వానికి ఊపిరి. చిన్ననాటి నుంచి, తన తల్లి తనకి నేర్పిన ఆదర్శాలు, కుల వివక్ష వల్ల ఎంత దుఃఖితులైనది తెలిపి, కుల, మత నిర్మూలనే ధ్యేయంగా సమాజానికి ఆదర్శవంతమైన కవిగా ఎదగాలని తన తల్లి ఇచ్చిన దీవెనలతోనే తాను దళిత కవితా దీపదారి అయ్యానని చెప్పారు. ఇప్పటికీ సమాజంలో రెండో తరగతిగా చూడబడుతున్న స్త్రీల అభ్యుదయం కోసం వారు ఎన్నో రచనలు చేసారు. దళిత జీవితాల్లోని శ్రమ సౌందర్యాన్ని, తాత్వికతని అద్భుతంగా కవిత్వీకరించారు. 46 పైన అనేక గొప్ప రచనలు చేసి, కవిత్వ, వ్యాస సంపుటాలను వెలువరించారు. తన రచనల్లో ఎక్కువ అంబెడ్కర్ వాదాన్ని, జాషువా మార్గాన్ని అనుసరించారు. జనకవిత్వ సృజనా శిఖరం గా పేరు గడించారు. పిడికెడు ప్రేమ, ఆదరణ, మానవా స్వేచ్చా, సమానత్వాల కోసం పరితపించారు.

డాక్టర్ కత్తి పద్మారావు గారి సజీవ వాస్తవిక మానవ సంఘర్షణల మాహాకావ్యం ‘అస్పృశ్యుని యుద్ధ గాథ’. వారు కులవివక్షకు గురైన పనికులాల పక్షం వహించిన ప్రజాకవి. వారి సేవలకు ‘భోయి భీమన్న’ పురస్కారం, లోకనాయక్ ఫౌండేషన్ వంటి సంస్థలు, సేవా సంస్థల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

కులం పునాదులపై నిర్మింపబడిన ఏ సమాజమైనా, దేశమైనా కుప్ప కూలుతుందని, సమతా, మమతా, స్వేచ్చా, సమానత్వ, మానవతా పునాదులమీద నిర్మించబడితేనే భారత ఖండం అభివృద్ధి ప్రగతిపథంలో పురోగమిస్తుందని బలంగా విశ్వసించి, ఆ దిశగా తన కవిత్వంతో జనాన్ని చైతన్యవంతం చేస్తున్న డాక్టర్ కత్తి పద్మారావు గారి 71 వ జన్మదినం [ 27-07-2024] సందర్భంగా వారికి విమల సాహితీ పత్రిక తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

రోహిణి వంజారి

సంపాదకీయం

30-07-2024