నక్క- రాబందు

ఈనాటి ప్రజాశక్తి పత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ” లో నా బాలల కథ “నక్క- రాబందు” చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. సంపాదకులకు ధన్యవాదాలతో 🌹🙏

తమ గుడిసె లోకి తలవంచుకుని పార్టీ నాయకులు రావడం చూసి కంగారు పడిపోయింది రంగి. గుడిసె ముందర మట్టిలో ఆడుకుంటున్నారు ఆమె ఇద్దరు కొడుకులు.

“దండాలు సారు. మీరు మా ఇంటికి రావడం ఏందో కలగా ఉన్నాది. మీరు కుర్చునేదానికి మంచి చాప కూడా లేకపాయనే” నొచ్చుకుంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు రంగి మొగుడు.

” అది సరే నీపేరు ఏమిటన్నావు?” నెత్తి మీది ఖద్దరు టోపీ సవరించుకుంటూ నాయకుడు

“ఓబులేసు సారు” అన్నాడు తల గోక్కుంటూ.

గుడిసె బైటకి వచ్చి ఆడుకుంటున్న పిల్లలను దగ్గరకు పిలిచాడు నాయకుడు. ముక్కు చీమిడి కారుతున్న చిన్న పిల్లాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, చేతి గుడ్డతో వాడి ముక్కు తుడిచాడు. నాయకుడి సహాయ కార్యకర్త ఇచ్చిన సబ్బు బిళ్ళ తీసుకుని, గుడిసె ముందర ఉన్న బొక్కెనలోనించి చెంబుతో నీళ్ళు తీసుకుని పిల్లవాడిమీద పోసాడు. తర్వాత సబ్బుతో వాడి ఒళ్ళు రుద్దాడు. పిల్లాడి ఒంటి నించి మురికి నీళ్ళు కారి గుడిసె ముందు కాలవ కట్టాయి. తాము తెచ్చిన తుండుగుడ్డతో వాడి ఒళ్ళు తుడిచి కొత్తబట్టలు వేసాడు నాయకుడు.

ఐదవ తరగతి చదువుతున్న సురేష్ కి ఈ నాయకుని ప్రవర్తన వింతగా అనిపించింది. వాడికి కూడా కొత్తబట్టలు ఇచ్చారు.

ఓబులేసు చేతికి ఐదు వందల నోటు ఇచ్చి “రేపు వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ‘నక్క’ గుర్తుకి మీ ఓటు వేయండి. మీ జీవితాలు మార్చేస్తాను” అంటూ వెళ్లిపోయారు పార్టీ నాయకులు.

ఓబులేసుకు పరమానందంగా ఉంది. ఈ సారి తప్పకుండా ‘నక్క’ గుర్తు పార్టీకే ఓటు వేయాలనుకున్నాడు.

పుట్టి బుద్దెరిగాక ఒక్కరు కూడా తమకి కొత్త బట్టలు ఇవ్వలేదు. ఆ బట్టలు వేసుకుని సంబరంగా తమ్ముడితో ఆడుతూ ఈ విషయం తమ రహీం మాస్టారికి చెప్పాలనుకున్నాడు సురేష్. ఓ గంట తర్వాత మరో పార్టీ నాయకురాలు వాళ్ళ గుడిసెలోకి వచ్చింది కార్యకర్తలతో. ఈ సారి వాళ్ళు రంగికి కొత్త చీర ఇచ్చారు. కట్టెల పొయ్య మీద పెనం పెట్టి, రంగిని పక్కకు తప్పుకోమని, నాయకురాలు దోశలు పోసింది. పిల్లలకు తినిపించమని చెప్పింది. వెళుతూ వెళుతూ రంగి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి తమ పార్టీ గుర్తు ‘రాబందు’ మీద మీ ఓటు ముద్ర వేయండి అని చెప్పి పోయారు వాళ్ళు.

పనిచేసే ఇళ్లల్లో వాళ్ళు ఇచ్చిన పాతచీరలు తప్ప కొత్త చీర ఎరగని రంగికి ఆ కొత్త తళుకుల ఎర్ర చీరని చూడగానే ఏనుగుని ఎక్కినంత సంబరంగా ఉంది. ఆ నాయకురాలు రంగి కంటికి దేవతలా కనపడింది.

“తప్పకుండా ‘రాబందు’ గుర్తుకి ఓటు వేయాలి మనం” అని ఓబులేసుతో చెప్పింది.

“కాదు మనం ‘నక్క’ గుర్తుకే ఓటెయ్యాలి” అన్నాడు ఓబులేసు పిల్లల తట్టు చూస్తా. నక్క, రాబందు అనుకుంటూ ఇద్దరూ వాదించుకున్నారు. కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. అప్పటిదాకా బాగున్న అమ్మ, అయ్యలు, పార్టీ వాళ్ళు తమ గుడిసెకి వచ్చిపోయాక పడుతున్న గొడవలకి భయమేసింది. తమ్ముడిని గుడిసె బైట వదిలి పక్కవీధికి పరుగు తీసాడు.

గుడిసెలోకి రహీం మాస్టారు అడుగుపెట్టడంతో అప్పటిదాకా పాము,కప్పల మాదిరి గొడవపడుతున్న రంగి, ఓబులేసు ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయారు. మాస్టారి వెనుకే సురేష్ నిలబడ్డాడు.

“సురేష్ నాతో చెప్పింది నిజమేనా? ఎందుకు మీరిద్దరూ గొడవలు పడుతున్నారట? సౌమ్యంగా రంగి తట్టు చూసాడు.

“చూడండి సారు. ఆ నాయకురాలు ఎప్పుడు లేంది మా ఇంటికి వచ్చి, నాకు కొత్త కోక ఇచ్చింది. బుడ్డోళ్లకు పెట్టమని దోశలు పోసింది. ఆమె ఎంత మంచిదో కదా. వాళ్ళ పార్టీకి ఓటు వేస్తే మంచిది అంటుంటే, వద్దంటాడు” మాస్టారికి ఓబుళేసుమీద పిర్యాదు చేసింది రంగి.

పిల్లోళ్లకు స్తానం పోసినాడు. కొత్త బట్టలు, డబ్బులు ఇచ్చినారు సారు. ఇంతమంచి వోళ్లకు కదా ఓటు వేయాల్సింది” ఓబులేసు కూడా ఎదురు పిర్యాదు చేసాడు రంగి మీద.

మరి ఇద్దరూ ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు? మాస్టారి ప్రశ్నకు

“అదే తేలడంలేదు.ఎవరికి ఓటు ఏయాలో తమరే చెప్పింది సారు” ఇద్దరూ ఒకసారి కూడబలుకున్నట్లు అడిగారు చేతులు కట్టుకుని.

“చూడండి..! సురేష్ నా దగ్గరకి వచ్చి మీ గొడవ గురించి చెప్పడం మంచిదైంది. ఎన్నికల సమయంలో ఓట్లకోసం, అధికారం కోసం నాయకులు వింత వింత చేష్టలు చేస్తారు. బహుమతులు, డబ్బు ఇచ్చి, ప్రలోభపెడతారు. తీరా అధికారం చేజిక్కించుకున్నాక, ఇంకో ఐదేళ్లవరకు మీ ముఖం కూడా చూడరు కొందరు నాయకులు. అలాంటి వారిని నమ్మి, మీ విలువైన ఓటుని అసమర్థులకోసం, స్వార్థపరుల కోసం వృథాచేయకండి” మాస్టారు

“మరి మేము ఎవరికి ఓటు వేయాలి సారు” బిక్క ముఖాలతో రంగి, ఓబులేసు.

“అదే చెప్తున్నా. పని, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదరికాన్ని రూపుమాపడం, పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య, ఉన్నత చదువులకి అవకాశాలు కల్పించడం, కులమత ద్వేషాలు లేకుండా దేశ ప్రజలందరినీ సమానంగా చూసే ఉన్నతమైన ఆదర్శాలు గల నాయకులను ఎన్నుకోండి. దాని కోసం ఆ నాయకులు చేసే పనులను గురించి తెలుసుకోండి. మంచి, చెడ్డలు తెలిసిన వ్యక్తులను కలిసి, వారి నుంచి సలహాలు పొందండి. ప్రజలకు మంచి చేసేవారికే అధికారాన్ని కట్టబెడదాం. మన బ్రతుకులు, మన పిల్లల భవిష్యత్ కు భరోసా ఇచ్చే నాయకులనే అధికారపు కుర్చీలో కుర్చోపెడదాం. ఐదేళ్లకు ఒక్కసారి మన గడపలు తొక్కి, బహుమతులు ఇచ్చి, ప్రలోభ పెట్టి, రంగులు మార్చే ఊసరవెల్లిలా క్షణానికో పథకమంటూ మాటలు మార్చి, అధికార పీఠం ఎక్కగానే ప్రజలను మరచి, తమ తరతరాల కోసం ఆస్తులు కూడబెట్టుకునే నాయకులకు మీరు బుద్ధి చెప్పాలి”

మంచి, చెడులు తెలిసిన రహీం మాస్టారి మాటలు మంత్రదండంలా పనిచేసాయి రంగి,ఓబులేసులమీద.

రహీం మాస్టారు దగ్గర తమ పిల్లలే కాదు, తాము కూడా మంచి పాఠం నేర్చుకున్నాం ఈ రోజు అని ఇద్దరూ మాస్టారికి మాట ఇచ్చారు మంచి నాయకుల గురించి తెలుసుకుని ఓటు వేస్తామని.

రోహిణి వంజారి

2-6-2024