విమల సాహితి ఎడిటోరియల్ 48 – కరిగే మంచు కొండ

ఫాథర్స్ డే సందర్భంగా ఈ రోజు విమలసాహితి ఆన్లైన్ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం “కరిగే మంచు కొండ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి.

మాతృదేవోభవ..పితృదేవోభవ.. లోకంలో తల్లిదండ్రులను, చదువు నేర్పిన గురువులను, ఇంటికి వచ్చిన అతిధులను దేవునితో సమానంగా పూజించాలి అనేది మనకు తెలిసిన నిత్యసత్యం. అంటే మనిషి జీవితంలో ప్రాధాన్యతల క్రమం తీసుకుంటే తల్లిదండ్రుల పాత్ర అతి ప్రాముఖ్యత కలిగింది. ఓ సృష్టి జరగాలంటే, తల్లిగర్భంలో ఓ పిండం ఏర్పడాలంటే తల్లిదండ్రుల ఇద్దరిపాత్ర చాల ముఖ్యం. విజ్ఞాన శాస్త్ర పరంగా స్త్రీ, పురుషుల కలయిక వల్ల స్త్రీ గర్భాశయంలో సంయుక్త బీజం ఏర్పడుతుంది. శిశువు జన్మ వరకు సంబంధించి ఇక్కడితో తండ్రి పాత్ర తాత్కాలికంగా ముగుస్తుంది. సంయుక్తబీజం క్రమంగా దినదిన ప్రవర్ధమానం జరుగుతూ తల్లి గర్భంలో సంపూర్ణ శిశువుగా ఎదిగాక, ప్రసవవేదన అనుభవించి, తల్లి శిశువుకు జన్మనిస్తుంది. తల్లి ప్రపంచానికి శిశువుని పరిచయం చేస్తే, తండ్రి బిడ్డలకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు.
తల్లితండ్రి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న రావాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా మనిషి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాల గొప్పది. ఆర్ధికంగా, సామాజికంగా సమాజం ఎదగని ప్రాచీన కాలంలో స్త్రీల పాత్ర ఇంటికే పరిమితమై, ఇంటి ఇల్లాలుగా కుటుంబసభ్యుల అవసరాలు గమనిస్తూ, ఇంటిని తీర్చిదిద్దుకుంటూ, పిల్లల పెంపకం, వారి చదువుసంధ్యలు, బాగోగులు చూసుకుంటే, మగవారు బయటకు వెళ్ళి ఉద్యోగ్యం, వ్యవసాయం, వ్యాపారం ఏదో ఒక ఉపాధి ప్రక్రియను నిర్వహిస్తూ, కుటుంబ సభ్యుల ఆర్ధిక అవసరాలు తీర్చడం కోసం, వారి ఆనందకర జీవితానికి ఎన్నో త్యాగాలు చేస్తూ, తాను కర్పూరంలా కరుగుతూ, భార్యాబిడ్డల బాగుకోసం పరితపించే తండ్రులు ఎందరో ఉన్నారు. తల్లే త్యాగమయి అనుకుంటారు సహజంగా. నాన్న చేసే త్యాగాలు ఒక్కోసారి లెక్కలోకి రావుకాని కానీ, ‘నాన్న పచ్చి అబద్ధాలకోరు ‘ అంటూ కవులు సురేంద్ర, బట్టల కొట్టులో నాకు పట్టుబట్టలు కొని/తనకి నూలుబట్టలు కొన్నప్పుడు తెలియదు నాన్న అబద్ధమాడుతున్నాడని/ఉన్న ఒక్క పరుపును నాకు పరచి/నడుము నొప్పికి నేలపడకే మంచిదన్నప్పుడు/నాకు తెలియదు నాన్న అబద్ధమాడుతున్నదని/నన్ను ఆటో ఎక్కించి/షుగరుకు తనకు నడక మంచిది అన్నప్పుడు/ నాకు అన్నింటినీ ఇవ్వడానికి తను ఎన్నింటిని కోల్ఫోయాడో/ నాన్న డైరీ చదివేదాకా నాకు తెలియలేదు/ నాన్న అబద్ధమాడుతున్నాడని” అంటూ నాన్న గొప్పతనాన్ని అద్భుతమైన కవితలో తెలిపారు.
మనోవైజ్ఞానిక శాస్త్రంలో ‘ఎడిపస్ కాంప్లెక్స్’ అనే నిర్వచనాన్ని పరిశీలిస్తే సహజంగా నాన్నలకు తమ కూతురు అంటే చాల ఇష్టం, ప్రేమ ఉంటాయి అని తెలుస్తుంది. ఆడపిల్లలకు తల్లికంటే తండ్రి దగ్గరే ఎక్కువ చనువు ఉంటుందనేది కూడా చాలా కుటుంబాల్లో కనిపిస్తుంటుంది. తల్లి బిడ్డల పెంపకంకోసం తపిస్తే, తండ్రి బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యడం కోసం అనుక్షణం తపిస్తాడు. పిల్లలకి చదువు, సంస్కారం నేర్పించడంలో తండ్రి పాత్ర చాల ఉంటుంది. తాను తిని, తినక పిల్లల చదువులకోసం, తన అవసరాలు ఎన్నో త్యాగం చేసి, పొదుపు చేసి వారికి అత్యుత్తమ జీవితాన్ని ఇవ్వాలనే తపనలో తాను ఎన్నో కోల్పోతాడు నాన్న. అయినా నాన్నకెప్పుడు కాస్త విలువ తక్కువే. అందుకే ఓ సందర్భంలో ‘నాన్నెందుకో వెనుక బడ్డాడు’ అంటారు తనికెళ్ళ భరణి గారు.
అయితే ఇప్పటి ఆధునిక జీవన స్రవంతిలో మగవారితో పాటు మహిళలు కూడా ఉద్యోగాలకోసం, ఉపాధి కోసం, తమ కుటుంబ ఆర్ధిక అవసరాలు తీర్చడం కోసం, లేదా తాను కూడా ఇష్టమైన వృత్తి చేపట్టి, ఆత్మ విశ్వాసంతో ఇటు కుటుంబ భాద్యతలు, అటు ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ సామాజికంగా కూడా మహిళల పాత్ర ఎంతో అభివృద్ధిని సాధించింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇటువంటి తరుణంలోనే ఇంటి నిర్వహణ, పిల్లల పెంపకంలో మగవారి పాత్ర కూడా అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ కుటుంబ సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడే రోజులు ఇవి. తల్లి తన పిల్లలను, కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంది. మరి పాతకాలపు తండ్రులైనా, ఆధునిక తండ్రులైనా ‘నాన్నలు పెద్ద వ్యసనపరులు. అవును కుటుంబం పట్ల ప్రేమ…నాన్నకు పెద్ద వ్యసనం. దానికోసం ఎన్నో ఎన్నో బాధలు ఓర్చుకుంటాడు. . ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు. నిత్యం ప్రతికూల పరిస్థితులతో పోరాడుతూనే ఉంటాడు బిడ్డల కలలను సాకారం చేసేందుకు. నిరంతరం పరుగులు పెడుతూనే ఉంటాడు పిల్లల భవిష్యతు కోసం. కుటుంబానికి సమయమివ్వలేదనే నిందలు మోస్తూనే ఉంటాడు బిడ్డలను అందలం ఎక్కించడానికి తాను ఓవర్ డ్యూటీలు చేస్తూ.
కష్టాలను సైతం చిరునవ్వుతో స్వీకరిస్తాడు. కొండంత ఓర్పు, సముద్రమంత గాంభీర్యం, పాతాళమంతా లోతు నాన్న మనసు. బిడ్డల ప్రేమకోసం కరిగిపోయే మంచు కొండ నాన్న. బిడ్డల ప్రగతికి నిచ్చెన మెట్టు నాన్న. కుటుంబం ఆనందానికి నాన్న పునాది రాయి. నాన్న అనే గొడుగు నీడ కింద నిశ్చంతగా గడుపుదాం. అలనాడు పసిబిడ్డలుగా నాన్న గుండెలమీద చిట్టిపాదాలతో తంతే మురిసిపోతాడు నాన్న. తాను గుర్రమై, బిడ్డను వీపున ఉప్పు మూటల మోసే గాడిదై, బిడ్డను తిప్పే చక్రాల బండై ఆనాడు నాన్న మురిసిపోతే, ఈనాడు వృద్ధాప్యం నాన్న రెక్కలు విరిచేస్తే, కుప్పకూలిన పక్షిలా దేహపు సత్తువను కోల్పోయి మూలాన పడిన నాన్నకు కావాల్సింది కాసింత ప్రేమ, ఆదరణ. తండ్రికి తగిన బిడ్డలుగా ఉందాం. నాన్నకు మన ప్రేమను పంచుదాం.
జూన్ 16 న “ఇంటర్నేషనల్ ఫాథర్స్ డే ” సందర్భంగా బిడ్డలను అమితంగా ప్రేమించే నాన్నలకు ఈ వ్యాసం అంకితం.
రోహిణి వంజారి
సంపాదకీయం