మకరందం

ఈ నెల[జూన్] విశాలాక్షి మాసపత్రికలో నా కవిత “మకరందం” ప్రచురితం అయింది. శ్రీ ఈత కోట సుబ్బారావు గారికి ధన్యవాదాలు. “మకరందం” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపండి.

ఎర్ర చందనపు చెక్కలు కావు
సుగంధం వెదజల్లలేవు
మల్లెపూల పరిమళాలు కావు
మైమరపించలేవు
దేహపు విసర్జితాలన్నీ దుర్గందాలే
నీలో నాలో అందరిలో
కానీ ..
పెదవి దాటి వచ్చే మాటొక్కటే మకరందం
మాట్లాడితే మనసు తేలికవ్వాలి
మాట హృదయ వీణను మీటాలి
కరువు నేలను వాననీటి చుక్క తడిపినట్లు
మాట గుండె బరువును దింపేయాలి
మాట వెన్నెల్లో జాబిలి అవ్వాలి
జాజిపూల పరిమళంలా మనసును చుట్టేయాలి
మాట మంచి గంధపు పూతలా సేదదీర్చాలి
పెదవి దాటిన మాట ఊరు దాటుతుంది
అన్యాయమైన చోట మాటని ఆయుధంలా వాడాలి
అవసరమైన చోట మాట సాయం అందించాలి
ఎడారిగా మారిన జీవితానికి మాట తేనెల ఊట కావాలి
మధురిమల జల్లులను హృదయం నిండా కురిపించాలి
మాట మల్లెపూల తోట కావాలి
బతుకునిండా ఉల్లాసపు పరిమళాలను నింపాలి
మాటకి విలువ లేని చోట
మౌనమే నీవు విసరాల్సిన తూటా

రోహిణి వంజారి
9000594630