“ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు”. ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. డాక్టర్ బి.అర్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్
“నేలతో నీడ అన్నది నను తాకరాదని – పగటితో రేయి అన్నది నను తాకరాదని”. ఇక్కడ కవి చమత్కారం ఎలా ఉన్నా ఎన్నో శతాబ్దాలుగా, ఎన్నో తరాలుగా అంటరానితనమనే ఒక అమానవీయ వైఖరి మనిషిని మనిషి తాకకుండా కట్టడి చేస్తోంది. కులాలు, మతాలు, దైవ సృష్టి వంటివాటిని పక్కనపెట్టి ముందు యుగాలను పరిశీలిస్తే ప్రకృతి, పంచభూతాలతో పాటు ఈ భూమిపైన మానవుని ఆవిర్భావం జరిగి ఎన్నో లక్షల సంవత్సరాలు అయింది. ఎన్నో యుగాలు గడిచాయి. ఎన్నో కాలాలు గడిచాయి. అడవుల్లో, కొండల్లో, పర్వత శ్రేణుల్లో, నదీలోయల్లో, మైదానాల్లో తిరుగాడే మనుషులకు కులాలు తెలియదు. ఒంటిమీద బట్టలు కట్టుకోవడం కూడా తెలియని ఆదిమానవుల్లో మతాలు లేవు.
అప్పుడందరూ ఒకటే. జంతువుల్లాగే వేటాడి పచ్చిమాంసం తినడం, ఆకులు ఒంటికి చుట్టుకోవడం, క్రూరమృగాల నుంచి తప్పించుకోవడం కోసం కొండగుహల్లో తలదాచుకోవడం. సృష్టి ఏర్పడినప్పుడు అతి ఉష్ణ ప్రాంతాల్లో పుట్టినవారి చర్మాలు నల్లగా, శీతల ప్రాంతాల్లో పుట్టిన వారి ఒంటిరంగు తెల్లగా వచ్చింది. పుట్టుక మాత్రం అందరిదీ ఒకటే. అందరు ఒకటే. కాలక్రమేణా విజ్ఞానం సంపాదించి, నాగరికతలను మొదలుపెట్టిన ఆధునిక మానవుల మధ్య విభేదాలు పొడచూపడం అనేది మానవ చరిత్రలోనే ప్రారంభం అయిన తొలి అవకరం. వేరుకు పట్టిన చిన్న చీడ పురుగు చెట్టు మొత్తాన్ని నాశనం చేసినట్లు, మనుషుల మనసుల్లోకి చొచ్చుకుని వచ్చిన అస్పృశ్యత అనే చీడ పురుగు మానవత్వాన్ని సమాధి చేసి, మనుషుల మెదళ్లను తొలుస్తూ, సమాజంలోని మనుషులను వేరుచేస్తూ, కులం, మతం, జాతి పేరుతో విడదీసి, మానవత్వపు సమాధిమీద కూర్చుని వికటాట్టహాసం చేస్తోంది ఇప్పటికీ.
జాత్యహంకారంతో అగ్ర కులాలు, నిమ్న కులాలుగా సమాజం విడగొట్టబడి, నిమ్న కులాల వారిని అంటరానివారుగా చూచే నీచ సంస్కృతి సమాజంలో వికృతంగా రెక్కలు విప్పింది. ఎన్నో యుగాలుగా, తరాలుగా, ఇప్పటికీ ఈ దుష్టత్వం కొనసాగుతుండడం విచారకరం. చదువుకునే బడిలో దాహమేసి కుండలో నీళ్లు తాగాడని, కుండ మైలపడ్డదని పసివాడిని చావు దెబ్బలు కొట్టడం, తోటలో చిన్న మామిడి కాయ కోశాడని ఓ దళిత బాలుడిని కొట్టి చంపడం, అగ్రకులం పిల్లను ప్రేమించాడని దళిత యువకుడిని నరికి చంపడం, చూస్తూనే ఉన్నాం అందరం మన కన్నులతోనే. మనసులో మాత్రం కుల,మత గుదిబండలను మోస్తూ, కనీసపు మానవత్వం కూడా చూపలేని అమనుషులం అయినాం అందరం. అగ్రకులపు వాళ్లకు ఎదురుపకూడదు. వారికి తమ గాలి సోకకూడదు. అందుకోసం మూతికొక గుడ్డ కట్టుకోవాలి. దళితుడు వస్తున్నాడు, తమకు ఎదురుపడకూడదు అని పాపం అగ్రకులం పెద్దలు దళితుడి ముడ్డికి చీపురు కట్టను కట్టుకోమన్నారు. అతను నడిచిన నేల అపవిత్రం ఆయిందని, దాన్ని అతనే శుద్ధి చేయాలని. ఇంతకంటే అమానవీయ దుశ్చర్య ఇంకొకటి ఉంటుందా..? అగ్ర కులపు ఇళ్లకు వెళ్ళకూడదు. ఊరిబావుల్లో నీళ్లు తాగకూడదు. ఆఖరికి గుడిలోని దేవుడు కూడా దళితుడికి దూరమే.
ఇన్ని అవకరాలు ఉన్న సమాజంలో మహర్ వంశంలో 1891 ఏప్రిల్ 14 న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ‘మౌ’ అనే గ్రామంలో రాంజీ మలోజి సాక్వాల్, భీమాబాయ్ అనే దళిత దంపతులకు ఒక పసిబిడ్డ పుట్టాడు. అంటరానివాడుగానే పెరిగాడు. తరగతి గదిలో అగ్రకులపు పిల్లలకు దూరంగా ఓ మూలన కూర్చోబెట్టబడ్డాడు. నీళ్ళు కావాలంటే కుండని తాకకూడదు. బడి నౌకరు వచ్చి చేతిలో పోస్తేనే తాగాలి. అతడు రాకుంటే రోజంతా నీళ్ళు ఉండవు. పెద్ద వాన వస్తుంటే అగ్రకులపు ఇంటిపంచలో తలదాచుకోవడానికి వెళ్లిన పసి పిల్లవాడు నిర్ధాక్షిణ్యంగా వానలోకి తరమబడిన అవమానపు కన్నీటి ధారను వాననీటితో కప్పిపుచ్చుకున్నాడు. జీవితం పట్ల కసిని పెంచుకున్నాడు. చదువు పట్ల మక్కువని కలిగించుకున్నాడు. అక్షరాస్యతే అన్నీ జాడ్యాలను నివారించే ఔషధం అని గ్రహింపుకి వచ్చాడు. పట్టుదలతో చదివి, ముంబై విశ్వవిద్యాలం నుంచి బి.ఎ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో పి. హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలం నుంచి డి.ఎస్. సి. లాంటి ఉన్నత చదువులు అభ్యసించాడు. అడుగడుగునా అవమానించి తనపై విసిరిన నిరసన రాళ్ళను పువ్వులుగా స్వీకరించాడు. మేధావులందరు ఉలిక్కిపడేంత గొప్ప మేధస్సును సంపాదించాడు. అతడే తన చూపుడు వేలును బాణంలా మలచి సమాజాన్ని ప్రశ్నించే మహా మేధావి డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్.
ఎన్నో అవమానాలను సహనంతో ఎదుర్కొని, తన జీవితకాలమంతా కుల నిర్మూలన, అస్పృశ్యత నివారణల కోసం శ్రమించాడు. ఉన్నత మేధోవర్గానికి చెందిన వాడిగా దేశనాయకుల చేత ప్రశంసించబడ్డాడు. మేధావులతో కలిసి భారత దేశ అత్యున్నత రాజ్యాంగంలో సవరణలు జరిపాడు. వంటింటి కుందేళ్ళుగా పరిగణింపబడుతూ, పితృస్వామ్య బానిస పంజరాల్లో బతుకీడుస్తున్న మహిళల విద్యకు, ప్రగతికి తోడ్పడే విధంగా రాజ్యంగంలో, చట్టాల్లో అనేక సవరణలు జరిపి, మహిళల జీవితాల్లో వెలుగులు నింపాడు. నిరంతర కృషితో సాగిన అంబేద్కర్ జీవితం ఎన్నో ఉద్యమాలకు దారితీసింది. సాంఘిక సంస్కరణలకు ఊపిరిపోసింది. ‘ది ప్రాబ్లెమ్ ఆఫ్ ది రూపీ’, ‘ది బుద్ధా అండ్ కార్ల్ మార్క్స్’ ది అన్ టచుబుల్స్, యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్, లాంటి ఎన్నో అద్భుత గ్రంథాలను రాసారు. జవహర్లాల్ నెహ్రు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన తొలి స్వతంత్ర భారత కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసారు. ఆర్ధికవేత్తగా, సంఘసంస్కర్తగా దళితుల సామాజిక, రాజకీయ హక్కులు, భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం నిరంతరం కృషి చేసాడు. 1956 లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. 56 వ ఏట బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారద కబీర్ ను వివాహం చేసుకున్నాడు. 1990 లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ను అంబేద్కర్ మరణాంతరం ప్రకటించింది.
ఈనాటి మహిళల, దళితుల ప్రగతికి పునాదిగా, మూలస్తంభంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నిలిచాడు. డాక్టర్ అంబేద్కర్ జయంతి ఈ ఏప్రిల్ 14 న. ఆయన జయంతిని దేశం జరుపుకునే పెద్ద పండుగలా భావించాలి అందరం. మనుషులంతా ఒకటే అన్న ఆ మహనీయునికి శిరస్సు వంచి ప్రణామాలు చేయాలి మనుషులంతా. జై భీం. ఏప్రిల్ 14 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా విమల సాహితీ పాఠకులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
రోహిణి వంజారి
సంపాదకీయం