ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “పసుపు ముద్ద – గాజులు”, చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
“హు..! శత్రువులను చూసి సమరానికి కాలు దువ్వకుండా పిరికి పందలా వెన్ను చూపి వస్తివా..అదిగో అక్కడ మంచం చాటున పసుపు ముద్ద, గాజులు పెట్టాను. పోయి పసుపు పూసుకుని, గాజులు వేసుకో పో” యుద్దానికి భయపడి లేదా యుద్ధంలో ఓడిపోయి తిరిగి వచ్చిన రాజులను చూసి ఓ వీర మాత, ఓ వీర పత్ని మాటలతో అవహేళన చేసేవారు రాచరిక కాలంలో.
అప్పటి కాలంలో మహిళల పట్ల ఉన్న బానిసత్వం, స్వేచ్ఛ, సాధికారతల పైన అవగాహన లేని కలం. స్త్రీలను బానిసలుగా, విలాస వస్తువులుగా చూసేకాలం అది. పసుపు, గాజులు స్త్రీల పిరికి తనానికి, బానిసత్వానికి చిహ్నాలుగా పరిగణింపబడే రోజులు. స్త్రీలను, స్త్రీలే కించపరచుకునే రోజులు. కాలం చేసిన గారడీలో ఆ రాచరికాలు గతంలోకి కొట్టుకుపోయినాయి.
ఆ తర్వాత మాత్రం ఏ ఇద్దరు మగవాళ్ళు గొడవలు పడినా మధ్యలో “మేమేమి ఇక్కడ గాజులు తొడుక్కుని కూర్చోలేదు” అని తిట్టుకుంటారు. అంటే గాజులు సహజంగా ధరించేది స్త్రీలే కదా. మరి గాజులు తొడుక్కుని కూర్చోలేదు అంటే, గాజులు వేసుకున్న స్త్రీలు అసమర్థులనా..? పిరికి పందాలనా..?
స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్రాల గురించి వేదికలమీద ప్రసంగాలు చేసే మగవాళ్ళు, పాలకులతో సహా అడుగడుగునా స్త్రీల స్వేచ్ఛకు అడ్డుపడుతున్నారు. ఇంకెక్కడ సమానత్వం..? “న స్త్రీ స్వతంత్రమర్హతి” అన్న ఆనాటి మనువు ల నుండి “మహిళలు స్వేచ్ఛ , స్వాతంత్య్రాలు ఇవ్వదగిన వారు కాదు. వారి శక్తిసామర్ధ్యాలను నియంత్రించాల్సి ఉంటుంది. లేకపోతే అవి వృధా అవ్వడమే కాక, విధ్వంసకర రూపం తీసుకోవచ్చు” అంటున్న ఈనాటి ఆధునిక మనువు ల వరకు స్త్రీల పట్ల ఉండే చులకన భావం, నీచమైన ప్రవృత్తి బయటపడుతోంది.శతాబ్దాల తరబడి వంటిళ్లలో మగ్రి, మగవాడి చెప్పుచేతల్లో బానిసలుగా బతుకుతూ, తమను తాము కోల్పోయి, చీకట్లో ఉన్న మహిళలకు అక్షరాస్యతని పరిచయం చేసి, విధ్యాదానం చేసారు జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు.
అంతకుముందే సతి, బాల్యవివాహాల వంటి మూడాఛారాలను రూపుమాపడానికి ఎందరో మహనీయులు కృషి చేసారు. ఎటువంటి లింగ వివక్షత లేకుండా మనుషులు అందరూ సమానంగా స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అనుభవించే హక్కు ఉంది అని మన రాజ్యాంగం తెలిపింది. చట్ట పరంగా ఎన్నో హక్కులు ఉన్నా, అవన్నీ కాగితాల మీద రాతలకే పనికి వస్తున్నాయి కానీ, స్త్రీల జీవితాలలో ఎటువంటి ప్రగతిని తీసుకురాలేకపోతున్నాయి. సమాజంలో స్త్రీల పట్ల ఉండే అభిప్రాయాలు ఇంకా మారాల్సి ఉంది. ఆడపిల్ల పుట్టిందంటే చాలు అడుగడుగునా ఆంక్షలే. కన్న తల్లి గర్భంలోనే ఆడపిల్లని అంతం చేయాలనుకునే కుట్రలకు కొదవలేదు. ఆడపిల్ల పుడితే మైనస్ పుట్టింది అని కొందరి చెత్త అభిప్రాయం. పెరిగే క్రమంలో ఏది ఆడపిల్ల ఇష్టప్రకారం జరగకూడదు. ఆడపిల్ల తిండి మీద ఆంక్షలు, కట్టుకునే బట్టల మీద ఆంక్షలు, నవ్వు మీద ఆంక్షలు, నడత మీద ఆంక్షలు. ఆడపిల్ల బతుకంతా ఇతరుల ఆంక్షల వలయంలోనే సాగాలి. ఏ మాత్రం ఎవరో ఒక ఆడపిల్ల ముందుకు అడుగువేస్తే , సూటిగా ప్రశ్నలు సంధిస్తే మాత్రం బరితెగించింది, ఎదిరిస్తోంది అంటూ ట్రోలింగ్ లు.
ఇటీవలే ఓ పేరుమోసిన కవయిత్రి స్త్రీ స్వేచ్ఛ గురించి ఓ కవిత రాసారు. కట్టు, బొట్టు అన్ని నా ఇష్టం. నాకు ఇష్టమైతే ఏదైనా చేస్తాను. నా మీద మీ ఆంక్షలు వద్దు. మీ శల్య పరీక్షలు వద్దు. నా బతుకు నాది” అంటూ సాగిన కవిత కొందరు మనువాదులకు కంటగింపుగా మారింది. ఇక ఆమె మీద ట్రోలింగ్, బెదిరింపులు మొదలైనాయి.
ఇది చాల విచారకరమైన విషయం. చదువుకున్న స్త్రీలు, ఇంటిని చక్కదిద్దుకునే స్త్రీలు, బిడ్డలకు జన్మనిచ్చే మాతృమూర్తులు, చట్టసభల్లో పరిపాలించే నారీమణులు. వారికి తెలియదా వారు ఎలా ఉండాలో. ఇంకా ఈ మనువాదుల దుష్ట, మూఢ పన్నాగాలను స్త్రీల పైన రుద్దాలని చూస్తే, వారికి వినాశనం తప్పదు. స్త్రీని ప్రకృతితో పోలుస్తారు. మరి ప్రకృతి ప్రకోపించి తన విశ్వరూపాన్ని చూపిస్తే సునామీలు, తుఫానులు, కరువులు, కార్చిచ్చులు వంటి ఎన్నెన్ని భౌతిక తీవ్ర పరిణామాలు మనుషులు ఎదుర్కోవాల్సివస్తుందో ఒక్కసారి గుర్తు చేసుకుంటే, స్త్రీలు కూడా తమ స్వేచ్ఛకు, తమ బతుకులకు, తమ భవిష్యత్ కు అవరోధం కలిగించే దుష్ట శక్తులపైనా స్త్రీ శక్తి కన్నెర్ర చేస్తే ఆ మంటల్లో దుష్ట శక్తులన్నీ కాలి బూడిద కావాల్సిందే.
మాతృమూర్తులందరిని గౌరవిద్దాం. అడపిల్లను ఆమెకు నచ్చినట్లు ఎదగనిద్దాం.
రోహిణి వంజరి
సంపాదకీయం
9000594630