పందేరం

మిత్రులకు సంక్రాతి కానుక. విశాలాంధ్ర పత్రికలో ఈ రోజు మీకోసం “పందేరం“. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో..

వరికుప్పల నడుమ వడివడిగా తిరుగుతూ
ఈ తూరికి ఎన్ని పుట్ల ఒడ్లు వస్తాయోనని
లెక్కలు గట్టే నాయన కళ్ళు
చీకట్లో గడ్డివాముల చుట్టూ తిరిగే
మిణుగురుల్లా ఆశగా మెరుస్తున్నాయి..

కుప్ప నూర్పిడి చేసి వొడ్లను తూర్పారబడుతూ
అలిసిసొలిసిన కూలోళ్ళకు నడుమ నడుమ
తాటాకుల దొన్నెలో శాంతమ్మ అందించే కల్లు
అమృతపు చుక్కల్లా గొంతుల్లోకి దిగుతోంది..

ఊర్లోని పిలకాయలకోసం తెగలు తంపటేస్తూ
బురగుంజు తీస్తూ, తాటిముంజలు కొడుతూ
కరతుమ్మ పుల్లల మంటమీద తాటిపండ్లు కాలుస్తూ
వీరయ్య తాత చేసే హడావిడి
పోతరాజు జాతరలో వీరంగం ఆడినట్లు ఉండాది..
పిల్లకాయలు ఎగరేసే గాలిపటాల్లో
మాంజీపొడి రంగురంగుల కాయితాలతో పాటు
వాటిని తయారు చేసిన నజీరు తాత
చేతివేళ్ళ నైపుణ్యం కూడా పైపైకెగబాకుతోంది

పెంకులింటి పంచ చూరుకు ఏలాడగట్టిన వరికంకులు
తింటూ తింటూ కిచకిచమని అరుపులతో పిచుకలు చేసే సందడి
తిండి పెట్టినోళ్ల కడుపు చల్లగుండమని
ఆశీస్సులు అందిస్తున్నట్లు అబ్బురమనిపిస్తోంది

పేడనీళ్ళ కల్లాపిజల్లి ఇంటిముందర
కాక్క వేసిన రంగురంగుల ముగ్గు
హరివిల్లుతో పోటీపడుతూ వెలుగులు చిమ్ముతోంది

ముగ్గునడుమ పేడముద్దమీద గుమ్మడి,తంగేడు పూలు
పసుపుకుంకమలతో ప్రాణప్రతిష్ట చేసిన గౌరమ్మ
గొబ్బియలో గొబ్బియని పాడారమ్మా
కరుణించవే మము కాపాడవే గొబ్బెమ్మ తల్లో..

ఇంటింటిముందర ఆడపిల్లల గొబ్బిపాటలు
తట్టలో పడిన చిల్లర నాణాలు
మోములో విరిసిన దరహాసపు సిరులు ..

హరిదాసు వేషంలో మురిపించిన వెంకటయ్య చిందులు
గంగిరెద్దుతో ఆశీస్సులు ఇప్పించి పాతబట్టలు తీసుకుని
చీనిచీనాంబరాలు పొందినంత ఆనందంలో
యాదమ్మ, రమణయ్య దంపతుల సంబరం..

మంచు దుప్పటి కప్పుకున్న ఊరిమధ్యలో
మాతమ్మ వంతెన పక్కన రచ్చబండ రావిడిలో
చిరుచీకట్లలోనే చలిమంట కాస్తూ
ఊరుఊరంతా చేరి

పండగ రోజున పొసే దోసెలు
నోరుతీపి చేసే నిప్పట్లు, పాలకాయలు
మణుగుపూలు, కజ్జికాయలు..

కోళ్ళ పందాలు, బారాకట్ట ఆటలు
గాలిపటాల ఎగరేతలు
పశువుకొమ్ములకు పూసే రంగులు
ఎన్ని చెప్పుకున్నా ఎంతకూ తీరని ముచ్చట్లు ..

అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు
సావాసగత్తెలతో కలసి
వరికోతలైన కయ్యల్లో పరుగులు పెడుతూ
పోటీలుపడి పరిగ ఏరుతూ
బుజాలమీదికి మోపు నెత్తుకుని పరుగో అంటూ

శ్రీరాములు శెట్టి అంగటికెళ్ళి తక్కెటలో తూయించి
వొచ్చిన చిన్డబ్బులు పండుగకోసం
అమ్మ కొన్న బుంగరెట్టల గౌనుకి సరిపడే
బులుగు రంగు రిబ్బన్లకు సొంతంగా
డబ్బు సంపాదించానని జంబాలు పడే నా ఆనందం ..

కేరింతలు తుళ్ళింతలు కొత్త అల్లుడికోసం చేసిన పిండివంటలు
దానధర్మాలు దయార్ద్ర హృదయాలు
బోగిమంటల వెచ్చదనంతో తొలగుతున్న మంచు దుప్పట్లు
గడపగడపకు రాసిన పసుపుకుంకాలు ..

మతాలు మరచి మంచిని పెంచుకుని
పండగ మాధ్యుర్యాన్ని పంచుకుని
మమతలదారంతో ముడి వేసుకుని
ఐక్యతా రాగాన్ని ఆలపించి
మనమంతా ఒకటనే ప్రేమమూర్తులు ..

మల్లెలు జాజులు బంతి చామంతి పూల రాసులు
ఊరుఊరంతా సంక్రాతి లక్ష్మికి కట్టిన స్వాగత తోరణాలు
పండగంటే పలకరింపే కదా
పండగంటే పలువురికి ప్రేమ పందేరమే కదా..