మా నాయన ఊరు

పొగడ దొరువు కండ్రిగ
నాయన పుట్టిన ఊరు
మా నాయన పుట్టిన ఊరు
చిన్నప్పుడు ఊపిరులూదిన గాలి
పచ్చగా పలకరించే చేను
చెంత చేరి నిమరగానే కళ్ళనిండా ప్రేమను
కురిపించే లేగ దూడలు..
గడ్డివాము ఎక్కి అన్నతో ఆడిన ఆటలు
తంపటేసిన తేగలకోసం పడిన గొడవలు
లెక్క తెలియకుండా జుర్రుకున్న తాటిముంజలు..
గడ్డిలో కాల్చిన తాటిపండు తీపి రుచి
ముంత దించగానే పాలేరును ఏమార్చి
నాలుకపై వేసుకున్న కల్లు చుక్కలు..
కోతలైన చేలో పోటిపడి ఏరుకున్న పరిగెలు
దోటీతో లాగి ఒడిలో దాచుకున్న సీమచింత గుబ్బలు..
దిగుడు బావిలో జలకాలాటలు
గున గున తిరిగే గిన్నె కోళ్ళ అరుపులు
ఈత పళ్ళు, కాలెక్కాయల వేటలో
గుచ్చుకున్న ముళ్ళు..
ఎన్నని చెప్పను జ్ఞాపకాల ట్రంకు పెట్టెలో
దాచుకున్న పసిదనాల ఊసులు..
ఇన్నాళ్ళకు మళ్ళీ ఊరిలోకి చేనులోకి
పల్లె పగడాల నవ్వులను తనివితీరా ఏరుకుని
పచ్చటి పైరగాలిని ఊపిరుల నిండా నింపుకొని
నా బాల్య జ్ఞాపకాల ట్రంకు పెట్టెని
మీ కోసం తెరిచాను మళ్ళీ ఇక్కడ..


వంజారి రోహిణి
11-7-2022