ఏప్రిల్ నెల “సాహో మాసపత్రికలో” పాదాల అందం, ఆరోగ్యానికి చాల తేలికైన చిట్కాలు అండి. మీరు చదివి, అవి మీకు ఉపయోగపడితే నాకు చాల ఆనందమే కదా..🙏🙏🌹🌹
“ఈ పాదం ఇలలోనే నాట్య వేదం” “నీ చరణం కమలం మృదులం,నీ పాదాలే రస వేదాలు”. పాదాల గురించి, కాళ్ళ గురించి ఎన్నో మధురగీతాలు విన్నాం కదండీ. పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటేనే మనం పదుగురిలో హుందాగా నిలబడగలం. మరి మనల్ని నిటారుగా నిలబెట్టే పాదాల అందం, ఆరోగ్యం గురించి ఈ మాసం “సాహూ..అందమే ఆనందం” లో తెలుసుకుందాం.
- మనలో ప్రతిఒక్కరు ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత పాదాలకు ఇవ్వరు. నిజానికి ఎక్కువ శ్రద్ధ చూపాల్సింది పాదాలకే. ఈ చలికాలంలో మరీ పాదాల్లో పగుళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మన శరీరంలో తేమ శాతం తక్కువగా ఉండడమే. వాతావరణం చల్లగా ఉండడంతో ఎక్కువ దాహం కాదు. దాంతో సరిపడినంత నీరు తాగం. దీనివల్ల చర్మంలో తేమ శాతం తక్కువై, ముఖ్యంగా పాదాల అంచులు పగిలి పొట్టు రాలుతుంది. పనిచేసేటప్పుడు పాదాలను ఎక్కువగా తడిగా ఉంచుకుంటే పగుళ్ళల్లో పాచి పట్టి, పాదాల్లో మంటలు రావడం లాంటి సమస్యలు రాత్రి పూట ఎక్కువై నిద్ర పోనీకుండా
చికాకు పరుస్తాయి. అందువల్ల ఏ కాలమైనా సరే, దాహం వేసినా, వేయకపోయినా రోజుకి నాలుగు లీటర్లు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి. - నిద్రపోవడానికి ముందు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా నువ్వుల నూనెలో చిటికెడు పసుపువేసి రోజు ఓ ఐదు నిముషాలు పాదాలకు మర్దనా చేసుకుంటే కాళ్ళ పగుళ్లు మెత్తబడి, క్రమంగా పగుళ్ళ పొట్టు రాలిపోయి పాదాలు నునుపుదేలుతాయి. పాదాల్లో పగుళ్ళ వల్ల వొచ్చే మంటలు కూడా తగ్గుతాయి.
- “పెడిక్యూర్” అని బ్యూటీ పార్లర్లలో పాదాలు శుభ్రం చేస్తారు. చాల డబ్బు, సమయం అక్కడ వెచ్చిస్తారు. కాస్త ఓపిక చేసుకుంటే ఇంట్లోనే పాదాలను చక్కగా శుభ్రపరచుకోవచ్చు.
- పాదాలు మునిగేంత టబ్ లో గోరువెచ్చని నీళ్ళు పోసి, కాస్త ఉప్పు వేసి పాదాలను ట్టుబ లో పెట్టి ఓ పావు గంట కూర్చుంటే అలిసిన దేహానికీ, పాదాలకు చక్కని సాంత్వన లభిస్తుంది.
- పావుగంట తర్వాత పాదాలను పొడిగుడ్డతో తుడిచి, నెయిల్ కట్టర్ తో కాలివేళ్ళ గోర్లను కత్తిరించి, గోర్లలో ఉండే మట్టినికూడా నెయిల్ కట్టర్ శుభ్రం చేసుకోవాలి. గోర్ల భాగం చాల సున్నితమైనది కాబట్టి శుభ్రం చేసేటప్పుడు గోర్ల కింది చర్మం తెగకుండా జాగ్రత్త పడాలి.
- గోర్లు కత్తిరించాక మల్లి గోరువెచ్చని నీటిలో కాస్త సుబ్బు నీరు లేదా షాంపూ కలిపి పదాలు ఓ ఐదు నిముషాలు ఉంచాలి. తర్వాత పాదాలు శుభ్రపరచుకునే బ్రష్ తో సున్నితంగా రుద్దుతూ ఉంటే పాదపు చర్మంలో ఉన్న మృతకణాలు, మురికి అన్నీ వదిలిపోతాయి.
- పాదాలను తడి లేకుంటా తుడుచుకుని ఏదైనా నూనె లేదా ఫుట్ క్రీముతో మర్దన చేసుకోవాలి. ఇష్టం ఉంటే కాలి గోర్లకు నెయిల్ పోలిష్ రెండు కోటింగులు వేసుకోవచ్చు.
- వీలైనప్పుడు కాలివేర్లకు, పాదాలకు గోరింటాకు రుబ్బి పెట్టుకుంటుంటే అందం మరియు ఆరోగ్యం వెంట వెంట వస్తూ ఉంటాయి.
- పాదాలకు అప్పుడప్పుడు పసుపు రాసుకున్నా మంచిదే. పసుపు ఆంటిసెప్టిక్ గా పాదాలకు సూక్ష్మ క్రిములనుండి రక్షణ కల్పిస్తుంది.
- ఈ చిట్కాలతో పాటు తగినంత నీరు, పోషకాహారం, తగినంత వ్యాయామం, తగినంత విశ్రాంతి కూడా అందానికి, ఆరోగ్యానికి చాల అవసరం.
చిట్కాలు తెలిసాయి కదండీ. మరి మీదే ఆలస్యం. ఆర్యోగ్యం, అందం, ఆనందం పొందడానికి ఆశావహ దృక్పధంతో పోటీ పడదాం అందరం. సెలవు.