స్కైలాబ్

దీని పాసుగల..స్కైల్యాబ్ పడి అందరం సచ్చిపోతాం అంట😨. అందరిని ఎంత బెదరగొట్టేస్తోందో ఈ స్కైలాబ్. ఏమా స్కైలాబ్ కథా..కమామీషు..స్కైలాబ్ మందల తెలియాలంటే ఈ నెల విశాలాక్షిలో బుజ్జమ్మ చెప్పే స్కైలాబ్ కథ చూడాల్సిందే. శ్రీ ఈతకోటసుబ్బారావు గారికి ధన్యవాదాలతో🙏🌹…

“పాండు రంగడే మనకు తోడుగా పండారిపురమున ఉన్నాడుగా. రంగయ్య..పాండు రంగయ్య”. బడి కాడ నించి నాలుగడుగులు వేసానో లేదో పెద్దగా పాట ఇనిపిస్తా ఉండాది.
“ఐ… ఇంటి ముందర సెంటర్ కాడికి పండరి భజన వొళ్ళు వొచ్చినట్లు ఉండారు” అనుకుంటా ఇంటికాడికి లగెత్తుకుంటా పోయినాను.
మా ఇంటికి ముందరనే చిన్న, పెద్ద, ఆడ, మొగ అంతా కలగలిసి ఉరామరికి[దాదాపు] ముప్పై మంది దాక కాషాయ రంగు గుడ్డలు కట్టుకోని ఉండారు. కొంత మంది చేతుల్లో తంబూరలూ, కంజిరా,తాళాలు ఉండాయి. ఇంకొంతమంది చేతుల్లో భజన చిడతలు, హార్మోనియం ఉండాయి. అందరి కాళ్ళకు గజ్జెలు ఉండాయి. వోల్ల గురువు మధ్యలో నిలబడి పసుపుపచ్చని జెండాని తలకి కట్టుకోని ఉండాడు. ఆయన చేతిలో మద్దెల ఉండాది. ఆయన చుట్టూతా మిగిలిన వోల్లందరూ పాటకి అనుగుణంగా తిరగతా లయబద్దంగా చేతులు, కాళ్ళు కదుపుతూ గజ్జెలు గల్లు గల్లు మనేటట్లు చుట్టూ తిరగతా ఆడతా ఉండారు.
ఒక పాట అయిపోగానే వాళ్ళ గురువు పెద్దగా ” పాండు రంగ స్వామికి జై… కదిరి నరసింహస్వామికి జై… అరకొండ ఆంజనేయస్వామికి జై..” అంటా అందరిచేత జై కొట్టించాడు.
అమిన ” మురళి మోహన గరుడ వాహనా..మోక్షమొసగుము జనార్ధన ” అనే పాటను ఎత్తుకున్నారు. ఇక ఆపకుండా వరుసగా ఐదారు పాటలకు ఆడారు.
చుట్టూ ఏమి జరగతా ఉందో కూడా తెలియనంతగా లీనమై పోయాను నేను ఆ పండరి భజన కోలాటం చూస్తా.
” మేయ్..చీకటి పడతా ఉండాది. నువ్వు బడి కాడ్నించి వొచ్చి ఎంతసేపు అయింది..? భజన చూసింది చాల్లే..ఇంట్లోకి రామే” అమ్మ అరుపులతో ఈ లోకంలోకి వొచ్చి తేలు కుట్టిన దొంగలా గమ్మున ఇంట్లోకి పోయిన నేను.
“మా..నేను కూడా పండరి భజన నేర్చుకుంటాను. వాళ్ళతో కలిసి పోతాను ” అన్నాను కోలాటం ఆడుతున్నట్లు కాళ్ళు,చేతులు కదిలిస్తా. వాళ్ళతో పొతే హాయిగా భజన, కోలాటం చేసుకోవచ్చు. ఈ కష్టమైన లెక్కలు చేసే బాధ తప్పుతుంది అనుకుంటూ.
” అదొక్కటే తక్కువమే నీకా..పోయి లెక్కల పుస్తకం తీసి గుణకారాలు నేర్చుకోపో” అంటా పెద్దగా అరిచింది అమ్మ.
” మీ పాసుగాల.. రవ్వంత సేపు గమ్మునుండకుండా మీ గోల ఏంది మీ ..? ఈడ వార్తల్లో చాల ముఖ్యమైన విషయం చెప్తా ఉండరు. విననీకుండా మీ అరుపులేంది..? అంటా నాయన చిన్న సైజు ట్రంక్ పెట్ట అంత ఉన్న రేడియోకి చెవు ఆనించి ఉన్నాడు.
“ఎన్ని తూర్లు ఇంటాడో ఈయన వార్తలు ” అమ్మ విసుక్కుంటా వంటింట్లోకి పోయింది గోధుమ రొట్టెలు చేయడానికి
టైం ఏడు గంటలైంది. రేడియోలో మళ్ళా వార్తలు మొదలైనాయి.
“ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సూర్య నారాయణ. ఈ రోజు ముఖ్యమైన సమాచారం.అమెరికా వారి అంతరిక్ష కేంద్రం స్కైలాబ్. 1973 మే 14 వ తేదీన ప్రయోగించిన ఈ కేంద్రం అంతరిక్షంలో 24వారాలపాటు పనిచేసిన తర్వాత, కక్ష్య క్షిణించి భూవాతావరణంలోకి ప్రవేశించి విచ్చిన్నమై పోయింది. అలా విడిపోయిన స్కైలాబ్ శకలాలు ఇప్పుడు ఏ క్షణంలోనైనా భూమి మీద ఎక్కడైనా పడవచ్చు. ముఖ్యంగా శకలాలు నేరుగా వచ్చి భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉంది. దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగవచ్చు. కాబట్టి దేశ ప్రజలందరూ జాగ్రత్తగా, కొన్ని రోజులు బయట తిరగకుండా, అనుక్షణం అపప్రమత్తంగా ఉండాలని మన దేశ ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ ఆదేశించారు.
అంతే. ఇకనేముండాదే..! ఆ వార్త విన్నది మొదలుకొని ఆ క్షణం నుంచి ప్రతిరోజూ ఇహ ఏడ చూసిన స్కైలాబ్ మాటలే.. ఇళ్ళల్లో, వాకిళ్ళల్లో,నలుగురు జనాలు ఒకచోట కూడి స్కైలాబ్ గురించి చెప్పుకుంటా ఉండారు. వీర బ్రహ్మం స్వామి కాలజ్ఞానం లో చెప్పినట్లు కలియూగాంతం అవబోతున్నది. స్కైలాబ్ నేరుగా వొచ్చి భూమిని ఢీ కొంటుంది. అప్పుడు మహా ప్రళయం వస్తుంది. అంటా రోజుకొక పుకార్లు పుట్టిస్తున్నారు జనాలు. అందరికి దినపత్రిక అందుబాటులేక వార్తలకు రేడియో ఒకటే ఆధారం అయింది. రేడియో కూడా వీధికి ఒకరింట్లో ఉండేదైపాయ. వార్తల సమయానికి మా ఇంట్లో రేడియో ముందర పది మందికి తగ్గకుండా జనాలు వస్తా ఉండారు స్కైలాబ్ గురించి సమాచారం తెలుసుకోవడానికి.
“అదిగో పులి అంటే ఇదిగో తోక ” అన్నట్లు స్కైలాబ్ గురించి సూదంత సమాచారం తెలిస్తే దాన్ని దబ్బనమంతా సాగదీసి చిలవలు, పలవలుగా చెప్పుకుంటా ఉండారు.
నాయన కాలేజీకి వారం రోజులు సెలవు పెట్టేసాడు. అమ్మ నన్ను బడికి పోనీలా. రేడియోలో వార్తలు వినేదానికి మా ఇంటికి వొచ్చే వాళ్ళ వాళ్ళ మాకు రకరకాల విషయాలు తెలస్తా ఉండాయి.
స్కైలాబ్ పడి అందరం చచ్చిపోతాం అని అందరికి భయం పట్టుకుంది. ఎట్టా పోయేవాళ్లమే కాబట్టి ఈ బతికిన నాలుగు రోజులు బాగా తినాలి అని అబ్బయ్య రెడ్డి ఇంట్లో రోజు కోడిని కోస్తా ఉండారట. పక్క వీధిలో ఉండే కెమిస్ట్రీ లెక్చరర్ సుబ్బరాయడుకి తిండి పిచ్చి ఎక్కువ. పాపం ఇప్పుడు వాళ్ళ ఇంటావిడ సుబ్బలక్షమ్మ చేత మణుగుబూలు[మురుకులు], నిప్పట్లు , కజ్జికాయలు, సున్నుండలు రోజుకోరకం పిండివంటలు చేయించుకుని తింటున్నాడంట. వాళ్ళ పక్కింటి మునస్వామి మా ఇంటికి వార్తలు వినడానికి వచ్చినప్పుడు చెప్పాడు.
మా వీధి చివర ఉండే పిచ్చయ్య శాస్త్రి పాపం రోజు ఇంట్లో దేవుడి పటాల ముందర కూర్చుని స్కైలాబ్ వల్ల జనాలకి ఏ ప్రమాదం జరగకూడదు అని ఉపవాసం ఉంటా దేవుడికి జపం చేస్తా ఉండాడంట.
ఉస్మాన్సాహెబ్ పేట లో ఉండే తండలు రాధయ్య రోజు బాకీలు దండుకోవడానికి మా వీధిలోకి రావడం మానేసాడు. వారం, పది రోజుల్లో స్కైలాబ్ పడి అందరం చచ్చి పోతావుంటే ఇంకేం తండలు వ్యాపారం అంటా విరక్తిగా ఇంట్లో ముసుగేసుకుని కూర్చోని ఉన్నాడంట. వనం తోపు సెంటర్లో చీరల వ్యాపారం చేసే సరోజనమ్మ బేరాల్లేక చతికిల పడి కూర్చోని ఉన్నదంట. బారకాసు దెగ్గర చీటీలు కట్టించుకునే శకుంతలమ్మ డబ్బు వసూలు కాక కుదేలైపోతా ఉన్నాదంట.
ఏ.బి.ఎం.స్కూల్ వెనక కాబాడిపాలెంలో పిలకాయలకు డిస్కో డాన్సులు నేర్పించే డిస్కో డేవిడ్ బృందావనం లో ఉండే జయరామిరెడ్డి కూతురు మనోరమకు ప్రేమలేఖలు రాసాడని డిస్కో డేవిడ్నిరౌడీలతో కొట్టించాలనుకున్నాడట. ఇప్పుడేమో” స్కైలాబ్ పడి అందరం చచ్చి పోతా ఉంటే ఇంకా ఈ కులమతాల పట్టింపులు ఎందుకు. మనం కానీ ఈ స్కైలాబ్ ప్రమాదం నుంచి తప్పించుకుంటే మా మనోరమను నీకే ఇచ్చి పెళ్ళిచేస్తాను” అని డిస్కో డేవిడ్ కి చెప్పినాడంట జయరామిరెడ్డి. ఔరా..! స్కైలాబా..జనాల్లో ఎన్ని విచిత్రమైన మార్పులు తెస్తావుండావే అనిపిస్తా ఉండాది.
ఎవురు వీధుల్లో తిరగడం లేదు. వారం రోజులు భారంగా, భయంగా గడిచినాయి. రేడియోలో రోజుకొక కొత్తవార్త దడ పుట్టిస్తా ఉండాది.
స్కైలాబ్ ముఖ్యంగా తెలుగు నేల మీద పడే అవకాశం ఉందని మళ్ళా పెద్ద పుకారు పుట్టి నెల్లూరు అంతా పాకింది. తెలంగాణ తీరా ప్రాంతం నుంచి కోస్తా ఆంధ్ర వరకు ఎక్కడైనా స్కైలాబ్ శకలాలు పడవచ్చు అనే వార్త ఊపందుకోవడంతో జనాలు ప్రాణం మీద తీపి వదులుకోసాగారు.
చచ్చాక ఇక చేసేదేమి ఉండదు. బతికిన ఈ నాలుగు రోజులు అందరితో మంచిగా ఉండాల అని నిర్ణయాలు తీస్కుంటా ఉండారు.. వోల్ల పెద్దోళ్ళని గెవనానికి తెచ్చుకుంటా ఉండారు.
నేను కూడా మా తరగతిలో గొడవపడి ఇంతవరకు మాట్లాడకుండా ఉన్న మా ఫ్రెండ్ కామాక్షి తో మాట్లాడాలి అనుకున్నాను. ఇంకో వారం, పది రోజుల్లో స్కైలాబ్ పడి అందరం చనిపోతాం అని తలచుకుంటేనే నాకు వెన్నులో ఒణుకు పుడతా ఉండాది. రవంత పెద్ద శబ్దమైనా చాలు ఉలిక్కిపడి పైకి చూస్తా ఉండాను. ఏడ స్కైలాబ్ పడుతుందో అని సరిగా నిద్రకూడా పట్టడంలేదు నాకు. అమ్మ కూడా భయపడతా ఉండాది. నాయన మాత్రం
“భయపడితే ఎట్ట. నలుగురికి ఎట్ట జరిగితే మనకు అట్టే కదా ” అంటా మాకు ధైర్నం చెప్పేటోడు.
ఆ రోజు పొద్దన ఇంట్లో ఏమి తోచక వాకిట్లోకి వొచ్చా. అట్టా ఇంటి బైటకు వొచ్చానో లేదో “ఢమ ఢమ” మంటా శబ్దం వొచ్చింది. వీధిలో జనాలు కూడా పెద్దగా లేరు. నాయిరు బంకు కాడ ఒకరిద్దరు బీడీలు కలుస్తా కనిపించారు. నాయరు అంగడి పక్కన చిన్న బంకులో ఉప్పుశెనగలు, కమ్మరకట్టులు అమ్ముకునే సుబ్బయ్య తాత దీనంగా కూర్చొని ఉన్నట్లు కనబడతా ఉండాడు. అబ్బా..కమ్మరకట్టు కొనుక్కొని తిని ఎన్ని రోజులైంది నేను.
ఉండుండి శబ్దం ఎక్కువ అవతా ఉండాది. ” ఓర్నాయనో.. ఇహనేం ఉండాదా..! స్కైలాబ్ ఆకాశంలో నుంచి వొచ్చి నేరుగా మా విజయమహల్ సెంటర్ లో పడేటట్టు ఉండాది. ” అంతే కాళ్ళల్లో ఒణుకుపుట్టి ఇంట్లోకి లగెత్తి లోపల గదిలో ఉన్న నులక మంచం మీద దుప్పటి ముసుగేసుకుని గట్టిగా కళ్ళు మూసుకోని పడుకోనుండాను. ఒళ్ళంతా ఒణుకు పుట్టి చెమటలు కారతా ఉన్నాయి నాకు. ఇంటి బయట శబ్దం ఎక్కువ అవతా ఉండాది. చెవులు చిల్లులు పడేటట్లు ఉండాది. ఈ రోజు ఇక మాకు చావు తప్పదు అనుకున్నాను నేను. నాయన బయటకి పోయి ఉండాడు. అమ్మ సందులో ఉండాది. మోహనన్న ఏడ ఉన్నాడో నాకు తెలీడం లేదు. ” మాలక్ష్మమా.. సాయి బాబా.. సుబ్రమణ్యసామే..మూలాపేటా శివయ్య..వేణుగోపాల సామే.. అందరు మమ్మలని కాపాడండి” అని మొక్కతా ఉండాను.
“మీ..బుజ్జమ్మా..ఏడ ఉండావు మీ నువ్వు.. పిలుస్తా ఉంటే ఉలకవు, పలకవు ఏంది మీ నువ్వా.” అమ్మ అరస్తా ఉండాది.
దుప్పట్లో ఒనకతా ఉన్న నా కాడికొచ్చి ఒక్కతూరిగా ముసుకు లాగేసింది.
” అమ్మోవ్..స్కైలాబ్ పడతా ఉండాది కదా. నాయన యాడికి పోయినాడుమా. ఈ రోజు మనమంతా చచ్చిపోతాం కదా మా ” అన్నాను
” మీ..స్కైలాబ్ లేదు, గెయిలాబ్ లేదు. ఇంటి బయట గారడీవిద్య వొళ్ళు వొచ్చి ఉండారు లేమే” అన్నాది అమ్మ.
“అమ్మో.. అంటే నడుంకి నల్ల బెల్ట్ కట్టుకుని, పొడవైన జుట్టుని విరబోసుకుని , చర్నాకోల తో ఒళ్ళంతా రక్తం వొచ్చేటట్లు కొట్టుకునే పర్వతం లాంటి మనిషి బయట ఉన్నాడన్నమాట. స్కైలాబ్ ని మించిన భయం పుట్టింది నాకు. సైకిల్ చైన్ కి డబ్బా రేకు కట్టి వీధిలో పుల్లయ్య డాక్టర్ ఇంటికాడ నించి, రైలుగేటు వరకు పెద్ద శబ్దం చేసుకుంటా పోతారు గారడీవిద్య వొళ్ళు ముందర. వొళ్ళు వొచ్చారని జనాలకి తెలిసేదానికి. ఆ శబ్దం ని నేను స్కైలాబ్ పడుతున్న శబ్దం అనుకున్న.
” డుర్రుమ్.. డుర్రుమ్..డుర్రుమ్..డుష్ ” డప్పు మీద కర్రతో రుద్ది రుద్ది డుర్రుమ్ అని శబ్దం చేస్తుంది ఒకామె. ఆ శబ్దం ఆగినవెంటనే టప టప మని పెద్ద శబ్దం వొచ్చేటట్లు ఒంటిమీద చర్నాకోల తో కొట్టుకుంటాడు ఆ మనిషి.
నాకు ఆ శబ్దం విన్నా, ఆ మనిషిని చూసినా గుండెల్లో దడ పుడతాది. ఇక ఆ రోజు సాయంత్రం వరకు నేను వాకిలి ముఖం చూడలే. మధ్యాన్నం అన్నం తిన్నపాట కూడా దుప్పటిలో ముసుగుతన్ని పడుకున్నా. ఆ డుర్రుమ్ డుర్రుమ్ శబ్దం ఇనపడకుండా చెవుల్లో బూరగ దూది గట్టిగా పెట్టుకున్న.
పొద్దుపోయేదాకా గారడీవిద్య వొళ్ళు మా ఇంటికాడనే ఉండారు. శబ్దాలు ఆగిపోయినాక చిన్నగా ముసుగు తీసి పంచలో ఉన్న అమ్మ కాడికి పోయినాను. ఆడ ఆ పర్వతం లాంటి మనిషి, అతని భార్యకి అమ్మ బాదమాకుల ఇస్తట్లో పులుసన్నం పెడతా ఉండాది.
” కొండయ్య..! అందరు స్కైలాబ్ కి భయపడి ఇళ్ళల్లోనుంచి బయటకు రాకుండా ఉంటే మీరేంది..ఇట్టా వీధుల్లో తిరగతా ఉండారు ” అన్నాది అమ్మ
” సర్కార్ కొలువులు, దుడ్లు ఉన్నోళ్లు ఎన్ని దినాలు ఇండ్ల కాడ ఉన్నా గడిచిపోతాది. మేము ఒక్క దినం గారడీ విద్దె చేయకుంటే మా బతుకులెట్ల గడుస్తాయి ఆదెక్క” అన్నాడతను
అంత దగ్గరగా అతన్ని చూడడం అదే తొలి తూరి నాకు. కాస్త బెదురు తగ్గింది.
” అట్టా ఒంటి మీద దెబ్బలు కొట్టుకుంటే చానా నొప్పి పుట్టదా నీకా” అన్నాను.
” బతుకు బండి లాగడానికి ఆ మాత్రం నొప్పిని భరించాలి కదా బుజ్జమ్మా ” అంటా నా బుగ్గ చిన్నగా గిల్లాడు కొండయ్య.
మొదటిసారి అతనంటే భయం పోయి జాలి కలిగింది నాకు. వాళ్ళ కూతురు జిమ్మి, నేను వాళ్ళతో ఉండే కోతిపిల్లతో కాసేపు ఆడుకున్నాం. వాళ్ళు వెళ్లి పోయారు.
ఏడు గంటల వార్తల్లో స్కైలాబ్ శకలాలు దక్షిణ హిందూ మహాసముద్రంలో, పశ్చిమ ఆస్ట్రేలియాలో పడిపోయాయని, ఇక ఎవరికీ ఏ ప్రమాదం లేదని చెప్పడం తో అందరం పెద్ద గండం గడిచినట్లు ఊపిరి పీల్చుకున్నాం.
నేను బలపాల డబ్బాలోనించి ఐదు పైసలు తీసి కమ్మరకట్టు కొనుక్కునే దానికి సుబ్బయ్యతాత బంకు కాడికి లాగెత్తినా అమ్మ పిలస్తా ఉన్నా ఇనకుండా.

10 thoughts on “స్కైలాబ్”

  1. నాకు కాస్త గుర్తు,మా ఊరి పంచాయతీ రేడియోలో ఈ వార్త సాయంత్రం పూట విన్న పెద్దలందరూ,మా ఊరి రావి చెట్టు దగ్గర సమావేశం ఏర్పాటు చేసారు.

    దాదాపు గా అందరూ మా ఊరు పాఠశాల ఆవరణంలో వంటావార్పు కార్యక్రమంతో ,చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ అక్కడే తొలి దాచుకున్న రోజులు.

    భయం భయంగా గడిపిన రోజులు,ఎప్పుడు పుడుతుందో ఎక్కడ పుడుతుందో,అసలు మనం బ్రతికి ఉంటామో లేదో అని,చూస్తూ బ్రతికిన రోజులు.

    కొందరు నేల బొరియలం చేసుకుని అందులోనే నివాసం ఏర్పరుచుకున్న పరిస్థితి.
    తలుచుకుంటే ఇంకా వెంటాడిన వేదనలు.

    మరోసారి మీ కథతో గుర్తు చేసారు.సోదరి.

  2. కాత్యాయని గరిమెళ్ల

    నాకు కమ్మరకట్ట కావాలి రోహిణి. కథ బాగుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు అవీ మన స్కూల్ అది గుర్తుకొచ్చింది. థాంక్యూ.

Comments are closed.