కరోనా కరోనా అంటూ ఎప్పుడూ భయపడడం, బాధ పడడమేనా. ధైర్యమే మన ఆయుధం. కాస్త రిలాక్స్ కోసం ఈ రోజు నా కథ “అందమైన గాజులు” చదవండి మిత్రులారా. ఈ నెల [మే 2021] విశాలాక్షి మాసపత్రికలో.
బడి కాడనించి వస్తానే పుస్తకాల పెట్టిని మంచం మీదకు ఇసిరేసి అమ్మ ఇచ్చిన మురుకులు తింటా ఉన్నాను. కానీ నా మనసంతా వీధిలోనే ఉంది. ఆడుకునేదానికి వస్తామన్నారు సునీతా, రాధా. గబా గబా తినేసి అమ్మ పిలస్తా ఉన్నా ఆగకుండా ఇంటి వాకిలి తలుపు తీసుకుని ప్రహరీ గోడకు వారగా ఆనించి వుండే పాత రిక్షా ఎక్కి కూర్చున్నాను.
మా ఇంటి పెరటినానుకుని ఉండే రెండు కొట్లలో ఒకదాన్లో రిక్షా అంగడి బాడుగకు తీసుకోనుండే కరీముల్లా బాబాయ్ రిక్షాలు తెచ్చిన వాళ్ళ కాడ బాడుగ డబ్బులు దండుకుంటా ఉండాడు. ఇంకో కొట్టులో టైలర్ సుబ్రహ్మణ్యం కుట్టుమిషన్ ను టక టకలాడిస్తా ఉండాడు.
స్వామిదాసు కాన్వెంట్ బస్సు వచ్చి రోడ్డు వారగా ఆగింది. ఆ అమ్మి అనిత బస్సు దిగి ఎదురింట్లోకి తిప్పుకుంటా వెళ్ళింది. ఆ అమ్మి వెనకనే కృష్ణ కూడా బస్సు దిగాడు. వాడు మూడవ తరగతే చదివేది. మా ఇంటికి మూడిళ్ళ అవతల వాడి ఇల్లు ఉంది. మూడంతస్థుల పెద్ద భవంతి.
వాడు భుజాలకి పుస్తకాల బ్యాగు తగిలించుకోని, మధ్యాన్నం తినేదానికి అన్నం బాక్స్, నీళ్ళ సీసా ఉన్న బులుగు రంగు బుట్టని పట్టుకుని, బూట్స్ టకాటకా లాడించుకుంటా పోతాఉండాడు. నేనుండుకోని
” అబ్బాయి కృష్ణ.. దాగుడుమూతల ఆట ఆడుకుందాం వస్తావా” అన్నాను.
రిక్షాలో కూర్చోనున్న నన్ను చూసి వాడు ” నాకు హోమ్ వర్క్ ఉంది. మా డాడి అరుస్తాడు” అంటా బింకంగా మూతి పెట్టి వెళ్ళిపోయాడు.
” నీకు హోమ్ వర్క్ ఉందని కాదులే కృష్ణ..నేను వీధి బడిలో చదువుతానని నాతో ఆడడం నీకు ఇష్టం లేదులే” అనుకుని వాడు వెళుతుంటే మూతి మూడు వంకరలు తిప్పాను. కాన్వెంట్ బస్సు హారన్ కొట్టుకుంటా వెళ్ళిపోయింది. రోడ్డు మీది ఎర్రమట్టి గాల్లోకి ఇసురుగా లెగిసింది . నాకు విసుకు పుడతా ఉండాది.
ఎంతసేపు ఎదురు చూసినా సునీత, రాధా రానేలేదు . వాళ్ళ మీద కోపం వస్తావుంది నాకు. వాళ్ళు రాలేదుగాని కాసేపటికి రోజాపూలు, మల్లె పూలు కలగలిపిన గుమ గుమ లాడే సెంటు వాసన నా ముక్కులకు కమ్మగా తగిలింది. వెంటనే నా కళ్ళు నాకు తెలీకుండానే ఎదురింటి వైపు మళ్ళాయి. ఆడ “అందమైన గాజులు” అని రాసుండే బోర్డు సాయంత్రపు నీరెండలో ఎర్రటి రంగులో మరిగింత అందంగా ఔపడింది నాకు.
గాజులంగడి తెరిచినట్లు ఉండాడు సుగుణా. అంటే టైం ఆరు కావస్తా ఉందన్నమాట. అంగడి ముందర మా సుబ్బి సందె కళ్ళాపి చల్లి నిలువు గీతల ముగ్గు యాస్తా ఉన్నాది. అంతే నా కోపం ఎగిరిపోయింది. రిక్షా దిగి గబా గబా ఇంట్లోకి పోయి
” మ్మో..నాయన తెల్లచొక్కాకి గుండీలు ఊడిపోయాయట. నన్ను సుగుణా అంగడికి పోయి తీసుకురమ్మని పొద్దన చెప్పాడు. డబ్బులీ..”అన్నాను.
“ఇంకా అడగలేదేమే ఈ అమ్మి అనుకుంట ఉన్నాను. రోజూ తేపకోసారి ఆ సుగుణా గాజులంగడికి పోకుంటే నీకు పొద్దు పొయ్యేటట్లు లేదే..” అనింది అమ్మ అప్పుడే కోసిన గోరింటాకు రోట్లో ఏస్తా. మా ఉమక్క గోరింటాకులో రెండు వక్కపలుకులు, రవ్వన్నీ మజ్జిగ ఏసింది. నీరజక్క గోరింటాకు రుబ్బతా ఉంది.
” నా కోసం కాదు మా , నాయన చొక్కా గుండీలు తెమ్మన్నాడు ” ఉడుక్కుంటా అన్నా. “
“రవంత సేపు ఆగమే ” అనింది అమ్మ.
ఇంతలో సుబ్బి ఇంటిలోపలికి వొచ్చి ” ఆమ్మో..! ఆ గాజులంగడి సుగుణా, రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో పని చేసే నర్సు మాలక్ష్మిని పెట్టుకోనుండా డంట ” అనింది అమ్మతో.
“వాళ్ళ సంగతి మనకెందుకులే సుబ్బే, పిలకాయల ముందర అటుంటివి చెప్పమాక” అంటా ఇంట్లోకి పోయి ఒక రూపాయి తెచ్చి ఇచ్చింది నాకు.
” మా పెట్టుకోనుండడం అంటే ఏంది మా ” అన్నాను. మరి మూడో తరగతి చదివే నా బుర్ర నిండా సందేహాలే.
” పెద్దోళ్ల మాటలు నీకెందుకు మే. గుండీలు తెచ్చి, అక్క కాడికి పోయి చదువుకో పో” అనింది అమ్మ విసుగ్గా. ఆ తర్వాత రోజుల్లో కదా నాకు తెలిసింది ” పెట్టుకోనుండడం “అంటే సహజీవనం చేయడం అని.
అమ్మ డబ్బులిచ్చిందే చాలని తుర్రుమని రోడ్డు దాటి అంగడికాడికి పోయినాను నేను. అప్పటికే సుగుణా సాంబ్రాణి కడ్డీలు ఎలిగిచ్చి దేవుడి పటాల చుట్టూ తిప్పతా ఉండాడు.
కడ్డీల వాసన, సెంటు వాసన, అంగట్లో ఉండే ప్లాస్టిక్ సామానుల వాసనా కలగలసి వచ్చే వింత పరిమళం కోసం, ఇంకా నాకు ఇష్టమైన మెరిసే రంగు రంగు గాజులు, గోళ్ళ రంగులను చూడడం కోసం రోజూ నాకు సుగుణా అంగడికి పోవాలనిపిస్తుంది.
సుగుణా పూర్తిపేరు ఎవరికీ తెలీదు. మా సెంటర్లో అందురు ఆయన్ని “అందమైన గాజుల సుగుణా” అంటారు. మా ఇంటినించి నాలుగిళ్ళ అవతల కామాక్షమ్మ మిద్ది ఉండాది. చానా పెద్ద భవంతి అది. దాని వెనక తావులో నాలుగిళ్ళు చిన్నవిగా ఉండేవి. వాటిల్లో ఒక ఇంట్లో సుగుణా బాడుగకు ఉండేటోడు. మహాలక్ష్మి కూడా ఆడ్నే ఉండేది. అటు బాలాజీనగర్ కాడనుంచి, ఇటు హరనాధపురం , మా వీధి వెనుక ఉన్న జేమ్స్ గార్డెన్ నుంచి ఆడోళ్ళంతా సుగుణా కాడికి వొచ్చి గాజులు, బొట్టు బిళ్ళలు అన్ని కొనుక్కునేవారు. ఎంత బిర్రుగా ఉన్న గాజులనైనా సరే సుగుణా ఆడోళ్ళ చేయిపట్టుకుని సుతారంగా నొప్పి తెలీకుండా ఎక్కించేటోడు. సుగుణా అంగడి తెరిచాడంటే చాలు. ఆడోళ్ళంతా అంగడికి పోయి ” సుగుణా..నాకు గాజులు చూపించు. నాకు గోళ్ళ రంగులు చూపించు. నాకు చీర ఫాల్స్ ఇవ్వు ” అంటా అందరూ సుగుణాని గుక్కతిప్పుకోనీకుండా చుట్టూ చేరతారు. పండగలప్పుడుడైతే రాత్రి పన్నిండుదాకా కూడా సుగుణా అంగట్లో సందడిగా ఉండేది.
ఎరుపు, బులుగు రంగు రంగులతో తళ తళా మెరిసే చొక్కాలు, పూల పూల లుంగీలు ఏసుకుంటాడు సుగుణా. ఆయన మాట్లాడతా ఉంటే ఒత్తైన క్రాఫ్ ముఖం మీద పడతా ఉంటుంది. ఈ సుగుణా ని పెళ్ళి చేసుకుంటే ఎంచక్కా డబ్బులు పెట్టి కొనకుండా గాజులు, గోళ్ళ రంగులు రోజుకో కొత్త రకం ఏసుకోవచ్చు కదా అనుకున్నా నేను. అయితే సుగుణ మాట్లాడతా ఉన్నప్పుడు నోటినుంచి వచ్చే సిగరెట్టు వాసన అంటే మాత్రం నాకు చాల చిరాకుగా ఉండేది.
“ఏంది మే.. అంగడి తీసితీయక ముందే వచ్చేసావు. ఏం కావాలి” అన్నాడు క్రాఫ్ సర్దుకుంటా
” మా నాయన చొక్కాకి తెల్ల గుండీలు కావాలి ” అంటా రూపాయ సుగుణా చేతికిచ్చాను.
గుండ్రటి పెట్టలోనుంచి ఐదు తెల్ల గుండీలు తీసి చిన్న కాయితం పొట్లంలో వేసి నా చేతికిచ్చాడు సుగుణా. ఆ రోజుకి ఇక గాజులు చూడడం అయిపోయిందని నిట్టురుస్తూ వెనుతిరిగాను నేను.
“ఇదిగో ఉండు మే. నీకు గోళ్ళ రంగులు ఇష్టం కదా. ఈ రోజే మద్రాస్ నుంచి తిరుపాలు చేత కొత్త రకం గోళ్ళ రంగులు తెప్పించా. ముందు నువ్వే బోణి చెయ్యాలి” అంటా అట్ట పెట్టి ఇప్పి గోళ్లరంగు సీసాలు నా ముందర బల్ల మీద పెట్టాడు సుగుణా.
అబ్బా..అన్ని రంగుల సీసాలు మెరస్తా ఉన్నాయ్. మెరూన్ కలర్ సీసా తీసి చూస్తుంటే.. ఆ సీసా మెరుపుల్లో నా కంటి మెరుపులు కలిసిపోయాయి. అంతలోనే గుర్తుకు వచ్చి ” సుగుణా..నా కాడ డబ్బులు లేవు. ఈ సీసా ఎంత” అన్నాను కళ్ళల్లో నిరాశ నింపుకొని.
“ఐదు రూపాయలు. ఇప్పుడు సీసాని ఎత్తకపో. ఈ తూరి అంగడికాడికి వొచ్చినప్పుడు డబ్బులు ఇద్డులే” అన్నాడు. గుండీల కవర్లోనే గోళ్లరంగు సీసా కూడా యేసి.
నాయిన తిట్టినా, అమ్మ కొట్టినా సరే గోళ్లరంగు కోసం డబ్బులు అడగాలని గట్టిగా అనుకుని ఇంటికొచ్చాను.
ఆ రోజు ఆదివారం. బడి సెలవు. ఉదయం పదిగంటలకే ఎండ మండతా ఉండాది . అమ్మ ఇడ్లీలు, మిరప్పొడి గుంటగా చేసి మధ్యలో నెయ్యి యేసి పళ్ళెం నా చేతికి ఇచ్చి తినమనింది. ఓ పక్క ఇడ్లీలు తింటానే, ఆడుకునేదానికి బైటికి ఎట్టా పోవాలా అని ఆలోచిస్తా ఉండాను.
మా ఇంటి పక్క ఇల్లు రమణారెడ్డి వోళ్ళది. కింద నాలుగు రూంలు బాడుగకు ఇచ్చి, మిద్దె మీద ఇంట్లో రమణారెడ్డి, బుజ్జమ్మ వాళ్ళు ఉండారు. ఆ రూముల్లో ఒక దాంట్లో మా పెద్ద అత్తా వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంటికి అమ్మిడిగానే మా శమంతక మణి అత్తా వాళ్ళ ఇల్లు ఉండేది. మూడు ఇళ్లకు ఉమ్మడి బావి ఉంది. ఇళ్ల మధ్య ప్రహరీ గోడలు కూడా లేవు. బావికి యదాళంగా ఉండే రూములో ముఖర్జీ అనే ఆయన బాడుగకు ఉండాడు. ఆయన ఏదో పెద్ద వ్యాపారం చేస్తా ఉండాడంట. ఊర్లు తిరగతానే ఉంటాడు. గాజుల సుగుణా, ముఖర్జీ మంచి దోస్తులు. ముఖర్జీ రూంలో ఉంటే మాత్రం రాత్రి ,పగలు సుగుణా మకాం ఆడనే ఇక.
ఇడ్లీలు తినేసాను. పళ్ళెం కుళాయి కాడ అంట్లు కడగతా ఉన్న సుబ్బి దెగ్గర యేసేసి
“మో..నేను రేవతితో ఆడుకోనుపోతన్నా” తిరిగి చూడకుండా చెప్పి మా పెరట్లో గుబురుగా పెరిగి ఉన్న గోరింటాకు చెట్టు దాటుకుని బావి కాడికి మెల్లగా పొయినా రేవతిని పిలుద్దామని. ముఖర్జీ ఇంటి తలుపు వారగా తెరిచి ఉండాది. గమ్ముగుండడం మనకి చేతకాదాయే. మెల్లగా తలుపు నెట్టి లోపలకు చూసిన.
గుండ్రంగా ఉన్న బల్లకి ఆ పక్క, ఈ పక్క కుర్చీల్లో సుగుణా, ముఖర్జీ కూర్చొని గాజు లోటాల్లో ఏదో ఎర్ర రంగులో ఉండే జ్యూస్ తాగతా ఉన్నారు. బల్ల మీద పెద్ద సీసాలో ఎర్ర రంగు జ్యూస్ ఉండాది . పక్కన పళ్లెంలో పకోడిలు ఉన్నాయి. పకోడీలు చూడగానే నోరూరింది నాకు. ఏదో మాట్లాడుకుంటా ఉండారు వాళ్ళిద్దురు. వాళ్ళు తాగేది ఏంది. నేనెప్పుడూ తాగలేదే అనుకుంటా ఉన్నా. తలుపు తెరిచి వాళ్ళ చాయ చూస్తా ఉన్న నన్ను సుగుణా చూసాడు. బల్ల మీద నుంచి లేచి వొచ్చి ” అమ్మేయ్..నీకు ఏం పని ఈడ. మీ ఇంటికాడికి పో” అంటా అరిచాడు. సుగుణా కళ్ళు జాతరలో పోతురాజు కళ్ళలాగా ఎర్రటి నిప్పుల మాదిరి మెరస్తా ఉన్నాయి. మనిషి కాస్త తూలతా ఉన్నట్లున్నాడు. ఎప్పటిలాగా సుగుణా దగ్గర నుంచి సెంటు వాసనా, సిగరెట్టు వాసనా కాకుండా ఇంకేదో ఛండాలపు కంపు వస్తోంది. సుగుణా అరుపుతో. ముక్కు మూసుకొని మా ఇంట్లోకి పరిగెత్తినా. అమ్మ వంట చేస్తా ఉంది.
” అమ్మోవ్.. రూంలో సుగుణా వోళ్ళు ఎర్రగా తాగేది ఏంది మా. మనమెప్పుడు ఆ జ్యూస్ తాగలేదే” అన్నాను
అంతే..నా ఈపు మీద ఇమానం మోత మోగింది.” నిన్ను ఆ ముఖర్జీ వాళ్ళ రూము కాడికి పోవద్దని ఎన్ని తూర్లు చెప్పాను. నోరు మూసుకొని పోయి చదువుకో పో ” అంటా నా మీద తాడెత్తున లేచి అరిచింది అమ్మ.
నేను ఏడస్తా, ఈపు తడుముకుంటా పోయి తెలుగు వాచకం తెరిచాను.
ఒంటి గంటకు అందరం అన్నాలు తిన్నాం. నాయన పడకుర్చిలో కునుకు తీస్తా ఉండాడు . అమ్మ మంచం మీద పండుకొని ఉండాది. మా ఉమక్కా, మా అత్త కూతురు నీరజ ఇంటి ముందరి రేకుల పంచలో దాయాలట ఆడుకుంటా ఉండారు.
అప్పుడే వీధిలో మైకు బండిలో నుంచి కిష్టయ్య గొంతు ఇనపడతా ఉంది. మునిసిపాలిటీ ట్యాంకులు కడగతా ఉండారు . అందుకని రెండురోజులు కొళాయిలల్లో నీళ్లు రావు అని పెద్దగా అరిచి చెప్తా ఉండాడు కిష్టయ్య.
ఆ మాటలు అమ్మ విని ” మీ ఉమా.. మీరు ఆడింది చాలు. ఈ రోజు, రేపు కొళాయిలో నీళ్లు రావంట. నాకు నడుం నొప్పిగా ఉంది. మీరిద్దరూ బావి కాడికి పోయి నీళ్లు చేది తీసుకొచ్చి మన తొట్టిలో పోయండి” అనింది.
వాళ్లిద్దరూ విసుక్కుంటా బొక్కన, చాంతాడు తీసుకుని బావి కాడికి పోయినారు. అమ్మ మళ్ళీ నడుం వాల్చింది. గోడ గడియారంలో అలారం మూడు కొట్టింది. అమ్మ పడుకోవడం చూసి నేను మెల్లగా లేచి పిల్లిలాగా నడుచుకుంటా గోరింటాకు చెట్టు కాడికి పోయినాను.
ఉమక్కా, నీరజ బావిలో నించి నీళ్ళు చేది బొక్కెనలో పోస్తా ఉండారు . ఇద్దరు పదవ తరగతి చదవతా ఉండారు . నడుం కింద వరకు పొడుగ్గా ఉన్న రెండు జడలతో తెల్లగా ఉంటారు ఇద్దరు. ఎండకి తలకాయ మాడిపోతా ఉంది. నేను చెట్టు చాటు నుంచి తొంగి చూస్తా ఉండాను.
ఉన్నట్లుండి బావి యదాళంగా ఉన్న గది తలుపు తెరుచుకుంది. ముఖర్జీ బైటికి వొచ్చి బావి కాడ నీళ్లు తోడతా ఉన్న నీరజక్క చేయి పట్టుకున్నాడు. ” మీ..నీరజా..మా బొక్కెనలో కూడా నీళ్లు పొద్దురు కానీ ఓ తూరి మీరిద్దరూ రూంలోకి రాండి” అన్నాడు. అతని మాట ముద్దముద్దగా వస్తా ఉంది. లోపలనుంచి సుగుణా కూడా బయటకు వొచ్చాడు .
అక్కోళ్ళు ఇద్దరు బిత్తర పోయి, ముఖర్జీ చేతిని ఇడిపించుకుని ఎనక్కి చూడకుండా లగెత్తుకుంటా ఇంట్లోకి పరుగెత్తారు. నేను వాళ్ళ వెనకనే ఇంట్లోకి పోయాను.
ఇద్దరు ఒణికిపోతా ఉన్నారు. వాళ్ళ ఒంటిమీద నుంచి చెమటలు కారిపోతా ఉండాయి.
” మీ..నీరజా.. ఎందుకు అట్టా ఒణికి పోతున్నారు మీరిద్దురూ..? ఆ ముఖర్జీ ఎందుకు నీ చేయి అంత గట్టిగా పట్టుకున్నాడు ” నా మాట పూర్తి కాక ముందే గట్టిగా నా నోరు మూసేసింది ఉమక్క.
” మేయ్.. ముఖర్జీ నా చేయి పట్టుకున్న సంగతి అమ్మకి చెప్పాబాక ” అనింది నీరజ
“చెప్తే ఏం..? ” అన్నాను నేను.
రవంతసేపు ఆలోచించి ” చెప్తే ఇంక నిన్ను సుగుణా గాజులంగడికి పోనీదు అమ్మ” అనింది.
ఎందుకు పోనీదు అని అడగాలనుకున్నా. కానీ ఇప్పుడు నాకు మంచి ఛాన్స్ దొరికింది. ఆ మాట అడగకుండా ” అయితే మీరు నాకు గాజులు, గోళ్ళ రంగులు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలి. సరేనా..లేకుంటే ఈ సంగతి అమ్మకు చెప్తా ” అన్నాను.
“అట్నే ఇస్తాం లే మీ” ఇద్దరూ ఒకే తూరి అన్నారు. వాళ్ళ ఒణుకు ఇంకా తగ్గలా.
అట్టా నేను వాళ్ళ కాడినుంచి డబ్బులు తీసుకుని సుగుణాకి ఇవ్వాల్సిన గోళ్లరంగు బాకీ తీర్చేసాను. అది మొదలుకొని నాకు ఇష్టమైన గాజులు , గోళ్లరంగుల కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేదాన్ని ముఖర్జీ సంగతి అమ్మకు చెప్తానని…
good
Thank you
ఊ ళ్ళల్లో జరిగే సహజ మైన విషయాన్ని అందంగా ఆ
విషయం చిన్నదే..అందంగా ఆర్ద్రంగా ఆకర్షణీయం గా చెప్పారు
ధన్యవాదాలు అండి
great story, baga vrasaru, anduke bahumatulu vachhai
Thank you andi
Story bagundi
Thank you
అందమైన అమ్మాయి కథే
అందమైన గాజులు
కధనం చాలా బాగుంది. ఏకబిగిన చదివించింది.
ఇంత కంటే ఏముంటుంది కథ యొక్క ప్రయోజనం ?
Excellent Expressions
Wonderful Narration
Hats off to you dear friend
ధన్యవాదాలు అండి