వొజ్రం ఇలువ

“వొజ్రం ఇలువ ” విజయమహల్ సెంటర్ కథల్లో మొదటికథ మన విశాలాక్షి ఏప్రిల్ 2021 సంచికలో వచ్చేసిందండి. మీరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ని తెలుపుతారుగా.

స్టీలు పెట్టెలో పుస్తకాలు సర్దుకుంటా ఉన్నా. కాస్త చిరుగులు ఉన్న పడక కుర్చీ పట్టను దబ్బనం, పురికోస తాడుతో కుడతాఉన్నాడు నాయన. పంచ లో కొళాయి గుంట కాడ అంట్లు తోమతా ఉండాది సుబ్బి.
“లోకాలయ్య.. ఇదిగో ఈ ఇడ్లీలు తీనేసి బడికి పో”
అన్నాది అమ్మ సిబ్బిరేకులో మూడు ఇడ్లీలు, ఇంత టెంకాయ చట్నీ యేసి నా చేతికిస్తా..లోకాలయ్య మన ముద్దు పేరు లేండి. క్షణం ఓ చోట కాలు నిలపకుండా తిరగతా ఉంటానని మా అమ్మ ఎప్పుడూ నన్ను లోకాలయ్య అంటుంది. గబా గబా ఇడ్లీలు తీనేసి సిబ్బిరేకు సుబ్బి కాడ ఇచ్చేసి చేయికడుక్కోని తడి చేతిని గౌనుకి తుడుచుకుని ” నాయన..నేను బడికి పోతున్నా ” అన్నాను పుస్తకాల పెట్టే తీసుకుని.
నాయన ఉండుకొని ” ఆగమే.. ” అంట ఖద్దరు బనీను జోబీలోనుంచి పావలా తీసి
” బడికి పోగానే ఈ పావలాని మోహన రావు అయివారికి ఇచ్చి ఇది పోయిన నెల ఫీజు, ఈ నెలది వచ్చే వారం ఇస్తానన్నాడు మా నాయన అని చెప్పు” అని పావలా నా చేతికి ఇచ్చాడు నాయన.
గౌనుకి ఉన్న జోబీలో పావలా వేసుకున్నాను. నాయన జోబీలో ఇంకా డబ్బులు ఉన్నట్లున్నాయి. ఆశగా చూస్తూ ” నాయన.. ఐదు పైసలు ఈవా.. ఒంటేలు గంట అప్పుడు బడి దగ్గడ పిలకాయలందరు రోజు పుల్లైసు కొనుక్కుంటున్నారు. నేను కూడా కొనుక్కొని తింటా ” అన్నాను.
ఐదు పైసలు అంటే మాటలా..? ఊరకనే నీకు డబ్బులు రోజు ఎక్కడ వస్తాయి. ఈ అర్ధణా తీస్కో. ఉప్పుశెనగలు కొనుక్కుని తిను” అన్నాడు.
ఈ నాయన ఎప్పుడూ ఇంతే, ఐదు పైసలు ఈడానికి కూడా ఇంత నస పెడతాడు. సరేలే….అర్ధణానో,చిండబ్బో ఎంతో ఒకంత చేతికి రావడమే గొప్ప అనుకుంటా తీసుకుని నీరసంగా బడికి కదిలాను . మా ఇంటి కాడ నుంచి రవ్వంత దూరంలోనే మా బడి. విజయమహల్ రైల్వే గేటుకి అవతల పక్క చిన్న బడిలో మా అక్క, అన్న చదవతా ఉండారు. నేను చిన్న పిల్లనని రైలు గేటుకి ఇవతల తూరుపక్క యెద్దలరేవు సంఘంలో ఉన్న పెద్దబడిలో నన్ను చేర్పించాడు మా నాయన. యెద్దలరేవు సంఘం మొదట్లో” చిట్టెమ్మ సారాయి అంగడి ” ఉండాది. దాని ఎనక నాలుగు గుడిసె ఇళ్ళు, వాటికి అమ్మిడిగానే మా బడి “శ్రీనివాస విద్యాలయం” ఉండేది. మా బడి కూడా కాస్త పొడుగ్గా ఉండే గుడిసే. దాంట్లోనే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాక ఉండేది.
నేను బడికి పోయేటప్పటికే అనురాధ వొచ్చి ఉండాది. ఆ అమ్మి నన్ను చూస్తానే
” మే.. ఇంకా లోపలి గంట కొట్టలేదు. పెట్ట లోపల పెట్టేసిరా. గంట కొట్టేవరకు ఆడుకుందాం” అనింది.
నేను గబా గబా పుస్తకాల పెట్టి బెంచి మీద పెట్టేసి లగెత్తుకుంటా అనురాధ కాడికి వచ్చిన. మా బడి ముందరే పెద్ద సైడు కాలవ ఉండాది. అది దాటుకొని బడిలోకి పోతాం మేం రోజు. కాలవ నిండా నల్లగా మురుగు నీరు పారతా ఉంటది. ఒంటేలు గంటపుడు అందరం ఉచ్చలు పోసేది ఆడనే. ఎవురికైనా అర్జెంటుగా దొడ్డికి వస్తే కూడా ఆడనే కూర్చునేది.
నేను, అనురాధ ఆ సైడు కాలవ కి ఆ పక్క, ఈ పక్క నిలబడి ” ఏపాకు సై, ఎన్న ముద్ద సై ” అంటా పాడుకుంటా కాలవ కి ఆ పక్కనుంచి ఆ అమ్మి దూకితే, ఈ పక్క నుంచి నేను దూకతా ఉన్నా. పిల్లకాయలు చానా మంది ఆడుకుంటా ఉన్నారు. కొంత మంది బడి యదాళంగా ఉన్న రంగుల రాట్నంలో పెట్టెల్లో కూర్చుని తిరగతా ఉండారు. పుల్లైసు బండి నజీరు తాతా నేను వచ్చేసాను అని చెప్పేదానికి మాటిమాటికి ఐసు బండి గంట కొడతా ఉన్నాడు. ఎదురు బుట్టలో రేగిపళ్ళు, కలెక్కాయలు, పచ్చి వెలక్కాయలు, తేగలు పెట్టుకుని బడి ముందర కూర్చున్న ఎంకవ్వ చుట్టూతా పిలకాయలు మూగినారు.
“యాపాకు సై అంట నేను కాలవ గబ్బుక్కున దూకగానే గౌను జోబులో నుంచి పావలా యెగిరి కాలవలో పడింది. అంతే గుండె గుబేలైపోయింది నాకు. కాలవలో మురుగునీరు పారతా ఉంది. ఆ నీళ్ళళ్ళో పావలా నా కళ్ళముందరే కొట్టుకుపోతా ఉంది. కాలవ నుంచి గబ్బు వాసన వస్తా ఉంది.
“మె..అనురాధ.. నా పావలా కాలవలో కొట్టుకపోతా ఉండాది. ఎట్టమే..” అన్నా నేను యాడస్తా.
“ఏడనుంచి అయినా కర్ర తెచ్చి తీద్దాం. కాలవ మురుగు గబ్బు కొడతా ఉంది ” అనింది ఆ అమ్మి ముక్కు మూసుకుంటా.
ఇంతలో మా బడి హెడ్ మాస్టర్ రాంమూర్తి అయివోరు బడి కాడికి రావడంతో బడి లీడర్, ఐదో తరగతి చదివే నాగరాజా లోపలి గంట కొట్టాడు. అనురాధ “ఆమ్మో..పెద్దైవారు..నేను పోతన్న అంటా బడిలోపలకి ఉరుక్కుంటా పోయింది ఆయమ్మి .పావలా అయివోరికి ఈకుండా కాలవలో పారేశానంటే నాయన నా ఈపు ఈమానంమోత మోగిస్తాడు. ఏమి చేయడానికి నా కాళ్ళు, చేతులు ఆడలే. యాడస్తా ఇంటికాడికి లగెత్తుకుంటా పోయిన.
ఇంటికాడ నాయన నీళ్ళుపోసుకోవడానికి సందులో ఉన్న స్నానాల దొడ్డిలోకి పోబోతా నన్ను చూసి
“ఏందిమె..బడికి పోకండా ఇంటికాడికెందుకు వొచ్చినావు..?” అన్నాడు
అనుమానంగా చూస్తా. నేను ఏం చెప్పకుండా నిలబడుకోనుండాను. కళ్ళలో నుంచి నీళ్ళు కారతా ఉండాయి.
” ఆ..పుస్తకాలో, పేనానో పారేసుకొచ్చిఉంటుంది” అనింది అమ్మ
“మరే..నాయినా.. నువ్వు అయివోరికి ఇవ్వమని ఇచ్చిన పావలా బడి ముందర కాలవలో పడి పోయింది”. భయం భయంగా చెప్పినా.
లక్ష రూపాయలు పారేసినట్లు మొఖం పెట్టి ” ఏందిమే నువ్వు చెప్పేది. పావలా కాలవలో పారనూకినావా..?..! ఒళ్ళు దగ్గరిపెట్టుకొని ఉండావా లేదా నువ్వు. పా.. పోదాం బడి కాడికి ” అంటా స్నానానికి పోకండా పంచ ఎగట్టి, చినిగిపోయిన ఖద్దరు బనీను మీదనే వీధిలోకి వొచ్చినాడు.
మా ఇంటికి యదాళంగా రోడ్డుకి వారగా స్వామిదాసు కాన్వెంట్ బస్సు వొచ్చి ఉండాది. మా ఎదురింటి నూని గమళ్ళ గోవిందమ్మ కూతురు అనిత ని వాళ్ళ నాయన రత్నయ్య బస్సు ఎక్కిస్తా ఉండాడు. ఆ యమ్మి తెల్ల చొక్కా, ఎర్రటి నిక్కరు ఏసుకుని, టై,బెల్టు కట్టుకుని, బూట్సులు వేసుకుని మిస్సమ్మ మాదిరి దర్జాగా వాళ్ళ నాయనకి టాటా చెప్తా చేయి ఉపతా ఉంది బస్సులో నుంచి.
ఈడ నా చేయి పట్టుకుని బడికాడికి లాక్కుపోతా ఉండాడు మా నాయినా. బస్సు లో నుంచి ఆ అమ్మి నన్ను ఎగతాళిగా చూసి నవ్వినట్లు అనిపించింది నాకు. భలే ఎచ్చులు ఆ అమ్మికి కాన్వెంట్ బడికి పోతుందని. నా తెల్ల గౌను ఛాయపోయి పసుపు రంగులోకి మారుండాది. ఒక పక్క రెట్ట బుంగ ఊడిపోయి ఏలాడతా ఉంది. నా గౌను మీద నాకే అసహ్యం పుట్టింది. మా బడిలో యూనిఫారం లేదు. నాకు ఉండేది రంగయ్య టైలర్ కుట్టిన ఐదు గౌనులే. రోజు అవే మార్చి మార్చి బడికి వేసుకునిపోతాను నేను. బూట్సులు లేవు నాకు. మాములు రబ్బరు చెప్పులే.
బడి కాడికి పోగానే నాయన కాలవలోకి చూస్తా ” ఏడమే నువ్వు పావలా పారేసింది” అన్నాడు.
” నాయిన అది ఈడ పడి నీళ్ళల్లో రవంత దూరం కొట్టకపోయింది. అపట నాకు ఔపడలేదు” అన్నాను.
” ఆ వంతన పావలా బిళ్ళ కొట్టకపోతే ఉంటే తీయకుండ గమ్మున చూస్తా ఉండావా..? డబ్బులంటే లెక్క లేకుండా పోయింది మీ నీక” అంటా నల్లగా ఉన్న ఆ మురుగు నీళ్ళ కాలవలో చేయి పెట్టి లోడసాగాడు.
మా నాయన అట్టా కాలవలో లోడతా ఉంటే బడి పక్కన ఉన్న గుడిసె లోనుంచి రిక్షా చెలమయ్య వొచ్చి ” సామె.. ఏందిది.. నువ్వు కాలవలో చేయిపెట్టి లోడతా ఉన్నావు. ఏం పడింది కాలవలో ” అన్నాడు.
“అమ్మికి బడి ఫీజు కట్టమని పావలా ఇస్తే కాలవలో పడేసిందట. దాని కోసం నేను ఏతకత ఉండేది “
అంటూ చేయి కాలవలో నుంచి తీకుండా మురుగు మట్టిని ఎత్తి పోస్తానే ఉండాడు నాయన.ఇంతలో కాలవలో గాజు పెంకు ఉన్నట్లునాది. సరక్కున నాయన చేయి తెగి నెత్తురు కారతా ఉండాది. అది చూసి చెలమయ్య
” నువ్వుండు సామే.. నేను చూస్తా. చేయికి నెత్తురు వస్తా ఉంది. కట్టు కట్టుకో అన్నాడు.
నాయన అది లెక్క చేయకుండా ఈ తూరి కుడి చేయి పెట్టి కాలవలో లోడుతున్నాడు. కాస్త దూరంలో చెలమయ్య కూడా కాలవలో రెండు చేతులు పెట్టి లోడసాగాడు.
ఒకరిద్దరు పిల్లకాయలు ఒంటేలు పోసుకోవడానికి కాలవ కాడికి వొచ్చి నాసాయి , మా నాయన, చలమయ్యసాయి ఇచిత్రంగా చూస్తా ఉంటే నాకు తల కొట్టేసినట్లు అయింది. ఒంటేలు గంట అప్పుడే కాకూడదు. గంట కొడితే పిల్లకాయలు అందరు బైటికి వొచ్చి మమ్మలిని చూసి ఎగతాళి చేస్తారు దేవుడా అనుకుంటున్నాను నేను. నజీరు తాత, పుల్లవ్వ కూడా కాలవ కాడికొచ్చి నిలబడి చూస్తా ఉన్నారు.
ఎట్టకేలకు నాయన అన్వేషణ ఫలించి మురుగు నీటి మట్టిలో దూరుకోనున్న పావలా తళుక్కున మెరస్తా నాయనకి కనపడింది. పారేసుకున్న కోహినూర్ వజ్రం దొరికినట్లు నాయన ముఖం వెలిగి పోయింది. పావలా తీసి
” చెలమయ్య..పావలా దొరికింది” అంటా తీసి చూపించాడు.
” నువ్వు కష్ట పడి సంపాయించిన డబ్బు సామే అది. యాడికి పోదు, వొజ్రం మాదిరి ఇలువైంది” అన్నాడు చెలమయ్య.
నాయన నవ్వతా “అంతే గదైతే..చలమయ్య.. ” అని నా తట్టు చూసి
” మే..ఇక ఈ పూట బడికి వద్దులే ఇంటికి పోదాం పా. రేపు నేను బడికి వొచ్చి అయివారికి ఫీజు డబ్బు ఇస్తాలే..”అంటా చలమయ్య సాయి చూసి “నువ్వు కూడా ఇంటికి రా చెలమయ్య.. నాస్తా తిని పోదువు గానీ” అన్నాడు.
ఇంటికి వొచ్చి అమ్మకి పావలా దొరికిన సంగతి చెప్పాడు నాయన. అమ్మ ఉండుకొని ” పావలా కోసం గంట సేపు కాలవలో చేతులు పెట్టి వెతికారా..! పొతే పోయింది అనుకోకుండా. అయ్యో.. వేలు తెగిందా ఎట్టా. నెత్తురు వస్తా ఉండాది” అంటా గుడ్డ పీలిక కట్టు కట్టింది నాయన చేతి వెలికి.
” ఈ రోజు పావలా అని వొదిలేస్తే రేపు పదిరూపాయలు పోగొట్టుకుంటుంది. మన లాంటి చిన్న జీతగాళ్లకు పావలా అంటే పదిరూపాయలతో సమానమే. నెలంతా కష్ట పడితేనే వొచ్చే డబ్బు ఇలా అజాగ్రత్తగా పారేసుకుంటే ఎలా. దానికి డబ్బు విలువ తెలియాలనే ఇంతసేపు వెతికాను. ఆ పావలా ఫీజుకి ఓ నెల రోజులు దానికి చదువు చెప్తారు బడిలో అయివోర్లు” అన్నాడు. నాయన.
అప్పుడనిపించింది నాకు “అయ్యో. నాయన మా కోసం ఎంత కష్ట పడతా ఉన్నాడో అని. అది మొదలు నేను ఇంకెప్పుడూ డబ్బులు అజాగ్రత్తగా పారేసుకోలేదు.
నాయన చేతులు గంట సేపు లైఫ్బోయ్ సబ్బు వేసి తోమితే కానీ మురికి పోలె. గబ్బు మాత్రం వారం రోజులకు కానీ పోలె..

18 thoughts on “వొజ్రం ఇలువ”

  1. Krishna kopparapu

    Really so nice Rohini garu it’s really heart touching story keep it up and looking so many stories from you

  2. డబ్బు విలువ తెలిపే అమూల్యమైన కధ..
    బాగా రాసారండి..అలాగే కష్టపడి సంపాదించిన ప్రతీ రూపాయి వజ్రంతో సమానం…
    పావలా పోగుట్టకోన్నవాడు రేపు పది వేలు కూడా పోగోట్టకోగలడు…
    చక్కని సందేశాన్ని అందించారు..
    ఇక మాండలిక సోగసు అదనపు అందాన్ని చేకూర్చింది…
    గుడ్ ఒన్ అండి..
    అభినందనలు ….

  3. LOLAA రవికుమార్ KOSURI

    చక్కటి వ్యక్తీకరణ..
    డబ్బు విలువ తెలియజెప్పేప్రయత్నం చేసే నాయన లు చాలా మందికి ఉండారు..గుర్తు చేశారు రోహిణి గారూ…అభినందనలు

  4. ఆనంద్ కుమార్

    నిజంగావోజ్రం విలువ పిలక పారేసుకున్న పావలా విలువ. చాలా బాగారసారు రోహిణి గారు.. చదువుతుంటే మా బాల్యం గుర్తుకు వొచింది.. ఇంకా నయం ఆ ఎమ్మి ని అబ్బా అమ్మ ఇద్దరు బడితే పూజ చెయ్యక ఆ తండ్రి అనే ఆశా జీవి బిడ్డను వెంటబెట్టుకుని వొచ్చి ఆ అమూల్య మైన పావలా నాణెం ను ఆ గబ్బులో కెలికి వెతికి ఇచ్చి ఆ అమ్మి బడి రుసుము కట్టమని ఇవ్వడం.. అబ్బా ఏమి ఆ మీరు ప్రయోగించిన ఆ భాష కడు రమ్యం.. అందుకోండి నా అభినందన మందార మాల మీ రచన శైలికి..

    ఆనంద్ కుమార్

  5. డా : రాచపాళెం రఘు

    ” నీవు కష్టపడి సంపాదించిన సొమ్ము అది సామే ! యాడికి పోదు. వొజ్రం మాదిరి ఇలువైంది ”
    అన్నాడు చలమయ్య.
    మరి * పావలా విలువ * కష్ట జీవులకేగా తెలిసేది.
    బడుగు జీవుల ఓడు బతుకులకు అద్దం పడుతూ రాసిన ” వొజ్రం ఇలువ ” కథ నాకు చాలా చాలా నచ్చింది.
    రచయిత్రి వంజారి రోహిణి గారికి హృదయపూర్వక అభినందనలు
    Excellent
    Wonderful
    Hats off to you dear friend

  6. ఆనంద్ కుమార్

    నిజంగావోజ్రం విలువ పాపా పారేసుకున్న పావలా విలువ. చాలా బాగా వ్రాసారు రోహిణి గారు.. చదువుతుంటే మా బాల్యం గుర్తుకు వొచింది.. ఇంకా నయం ఆ ఎమ్మి ని అబ్బా అమ్మ ఇద్దరు బడితే పూజ చెయ్యక ఆ తండ్రి అనే ఆశా జీవి బిడ్డను వెంటబెట్టుకుని వొచ్చి ఆ అమూల్య మైన పావలా నాణెం ను ఆ గబ్బులో కెలికి వెతికి ఇచ్చి ఆ అమ్మి బడి రుసుము కట్టమని ఇవ్వడం.. అబ్బా ఏమి ఆ మీరు ప్రయోగించిన ఆ భాష కడు రమ్యం.. అందుకోండి నా అభినందన మందార మాల మీ రచన శైలికి..

    ఆనంద్ కుమార్

  7. చాల బావుంది రోహిణి గారు ప్రతి ఒక్కరు డబ్బు విలువ తెలుసుకోవాలి అనే విషయాన్ని చాల బాగా మనసులో నిలిచిపోయేలా వ్రాసారు కళ్ళ ముందు జరుగుతున్న భావన కలిగింది చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి హృదయపూర్వక అభినందనలు నాకు బాగా నచ్చింది

  8. Ch. Mallikarjun

    నిరు పేదలకు ప్రతి పైసా ఎంతవిలువైందో మీ కథలో తెలియజేశారు.చాలా బాగుంది. ధన్యవాదములు.

  9. నిజమే, పావలా, లేక రూపాయా అని కాదు. దాని సమొఆడించుకున్న వాడి శ్రమ, ఆ శ్రమకు అది నల్లటి బొగ్గులో నుండి వచ్చే వజ్రం అంత వాల్యూ.

    ఇలాంటి అనేక సంఘటనలు చాలా దగ్గరగా చూసిన అనుభవం ఉంది.

Comments are closed.