88. ప్రేమ వంతెన

ఏకం నుంచి అనేకం

అక్కడే కదా భిన్నత్వం

అకారమో అభిరుచో వేరైతే

నువ్వు నేను ఒకటి కదా..?

నింగికి నేల ఎంత దూరమని

వాన బొట్ల వంతెనేసి

హరివిల్లును కిందికి దించి

నింగి నేలకు ప్రేమ కానుకను

అందిస్తోంది కదా..

నింగిలో కిరణం పుడితేనే కదా

నేల మీద వెలుతురు పండగ..

పగలు రాత్రి ఒక్కసారైనా కలవకున్నా

నీ వెంటే నేను నీ వెనుకే నేను

ఎప్పుడైనా గతి తప్పామా

అంటున్నాయి..

పగలు రాత్రి లేకుంటే

రోజు అసంపూర్ణమే కదా..

వేప చేదు మామిడి పులుపు

ఆరు రుచులకు

ఏడో రుచి ప్రేమను కలపకుంటే

నెల బాలుడు చిన్నబుచ్చుకుని

మబ్బుల వెనుక దాగుతాడు..

చందమామ కనపడితేనే కదా

నెల రోజుల ఉపవాస దీక్షకు ముగింపు..

ప్రకృతి అంతా ఋతువులు రంగులు

పచ్చని గాలులు వెచ్చని ప్రేమలు..

నీకు నాకు మధ్య కూడా

ఏవేవో అడ్డుగొడలేందుకు..

ద్వేషం యుద్దం

ఏం మిగుల్చుతుంది నేస్తం..!

శూన్యపు దుఃఖం తప్ప

ఓ సారి ప్రేమించి చూడు

ఎంత తీపి అందుతుందో..

బతుకు ఉత్సవమై సాగాలంటే

నువ్వు నేను ఉంటేనే మనం

మనమిద్దరం ఒకటైతేనే

ప్రేమ సంపూర్ణం..

రోహిణి వంజారి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *