రోజు కి 200 భోజనాలు జరిగే హోటల్ కి హఠాత్తుగా జనాలు రావడం తగ్గించేసారు. హోటల్ యజమాని చంద్రం ఏం తప్పు చేశాడు? మరలా ఆ హోటల్ కి జనాలు వచ్చారా?
మార్చి నెల “ఉషా మాసపత్రిక” ఉగాది ప్రత్యేక సంచిక లో నా కథ ” చిరునవ్వు వెల..!” కథ చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి


ఆ రోజు ఉదయం పది గంటలకే ఎండ మిడిమాలంగా చిరచిరలాడిస్తోంది.
“ఈ రోజు ఏం వండమంటారన్నా?” లుంగీ ఎగ్గట్టుకుని మాసిన తుండుగుడ్డతో ముఖం తుడుచుకుంటూ అడిగాడు అంకయ్య. వంట మాస్టరతను ఆ హోటల్లో. క్యాష్ కౌంటర్లో లెక్కలు చూసుకుంటున్న చంద్రం తలెత్తి చూసాడు. హోటల్లో ఇంకా ఒకరిద్దరు టిఫిన్ తింటున్నారు
“నిన్న మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చారు..? పద” అంటూనే క్యాష్ కౌంటర్ టేబుల్ డ్రా కి తాళం వేసి, అంకయ్య తో పాటు మిద్దె మీదకు వచ్చాడు. లోపల పెద్ద గదిలో గోడకు వారగా, గోతాల మీద ఆరబోసివున్నాయి కడిగి శుభ్రం చేసిన కూరగాయలు. అన్నింటినీ ఓసారి చూసి “ఇంకేముంది కొబ్బరి మసాలా రుబ్బిపోసి మునక్కాయ సాంబారు, కూరపొడేసి నూనెవంకాయ, దోసకాయ పచ్చడి, పందిరి చిక్కుడు, టమేటాలు, ఎరగడ్డలేసి పచ్చిపులుసు చేయండి. ముందు ఐదు కేజీలు అన్నం వండండి. తర్వాత చూసుకుందాం” అని కిందికి వచ్చి మళ్ళీ క్యాష్ కౌంటర్ లో కూర్చున్నాడు చంద్రం. ఎందుకో ఈమధ్య అతని మాటల్లో నిరాశ పొడజూపుతోంది.
“వచుండాయి పీలింగ్సు.. వచుండాయి పీలింగ్స్..” మెల్లగా పాడుకుంటూ తడిగుడ్డతో చకచకా టేబుళ్ళని తుడుస్తున్నాడు శీనడు. “అబ్బయ్యా..శీనా .. నరేష్ ఏడిరా..? ఇంకా ఊరి కాడ్నించి రాలేదా?” హఠాత్తుగా చంద్రం అడిగేసరికి పొలమారింది వాడికి. “అన్నా.. చుట్టాలింట్లో పెళ్ళికి పోతుండాను అన్నాడు. ఇంకా వొచ్చినట్లు లేదన్నా”. అతి వినయంగా మొహం పెట్టాడు. తను పాడినపాట విన్నాడేమో అని భయంగా చూస్తూ. “సరేలేరా..సాయంత్రం నువ్వు ఇంటికి పోయేటప్పుడు, నరేష్ వచ్చాడేమో కనుక్కో” అన్నాడు. “అట్నే అన్నా” అంటూ టిఫిన్ ప్లేట్లు కడిగేదానికి పోయినాడు శీనడు. సన్న చిల్లర డబ్బులు సంచిలో వేసుకుని వచ్చింది శారద. చంద్రం భార్య. ఆమె రాగానే కాష్ కౌంటర్లో కూర్చోమని చెప్పి, ఇంటికెళ్ళి స్నానం చేసి, అరగంట తర్వాత హోటలికొచ్చాడు చంద్రం. శారద మిద్దె మీదకు పోయింది. వండినవన్నీ పెద్ద పెద్ద డీసుల్లో వేసి కిందకి తెచ్చి బల్ల మీదపెట్టారు పనివాళ్ళు. అరిటాకులో అంత అన్నం, వండినవన్నీ కొద్దికొద్దిగా వేసి క్యాష్ కౌంటర్ టేబుల్ వెనక గోడకున్న అల్మారాలో దేవుడి పటాల ముందు పెట్టి దణ్ణం పెట్టుకుని, టేబుల్ మీదుండే కంప్యూటర్ని ఓపెన్ చేసాడు. పాతకాలపు గోడగడియారం పన్నెండు గంటలు కొట్టింది. బైట ఎండ నిప్పుల కొలిమిలా ఉంది.
రోజు క్రమం తప్పకుండా భోజనానికొచ్చే రమణయ్య, బాలు వచ్చి బోణి చేసి తిని, “సాంబారు అద్భుతంగా ఉంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. చంద్రం హోటల్లో భోజనమంటే పెళ్ళి భోజనమే” అనుకుంటూ వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి మొదలైంది చంద్రానికి ఎదురు చూపుల ప్రహసనం. ఎదురుచూపులు కావవి. ఆశకు నిరాశకు మధ్య నలిగిపోయే త్రిశంకు దృక్కులు. “వండిన అన్నమైనా మిగలకుంటే చాలు” అనుకున్నాడు. ఆ వీధిలో చంద్రం హోటల్ పెట్టి రెండేళ్ళు కావస్తోంది. మొదట్లో చాలామంది వచ్చేవాళ్ళు భోజనం సమయానికి. ఇటీవల జనాలు రావడం తగ్గించారు. ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నాకారణం తెలియలేదు. భోజనాల సమయానికి టేబుల్స్ ఖాళీగా ఉండడం చూసి మనసులో దిగులు పెరిగిపోతోంది. హోటల్ ప్రారంభించిన ఏడాది దాకా రోజుకి రెండొందల పైనే భోజనాలు జరిగేవి. ఇప్పుడు రోజుకి యాభై మీల్స్ టికెట్స్ పొతే చాల గొప్ప అనిపిస్తోంది చంద్రానికి.
“చంద్రన్నా” హఠాత్తుగా కేకలా వినపడేసరికి ఉలిక్కిపడి ఆలోచనల ప్రవాహం నుంచి బయటకి వచ్చాడు. “ఫుల్ మీల్సుకు బిల్లీయన్నా.. ఎన్ని తూర్లు పిల్చినా పలకవు. ఏమైందన్నా?” కిళ్ళీ అంగడి మస్తానయ్య అడిగేసరికి, కంగారుగా సిస్టమ్లో బిల్ కొట్టి, అతనికిచ్చాడు. గూగుల్ పే లేదని, వంద రూపాయల నోటు ఇచ్చాడతను. నోటు గల్లాపెట్టాలో వేసి బిల్లు, చిల్లర డబ్బులు అతనిచేతికిచ్చాడు చంద్రం. అరగంట తర్వాత ఇంకో ఇద్దరు భోజనానికి వచ్చారు. శారద కూడా వడ్డిస్తోంది పని కుర్రాళ్ళోతో కలసి.
వీధిలో జనాలు హోటల్ వైపు చూసుకుంటూ వెళుతున్నారు. మనిషి వెళ్ళినప్పుడల్లా హోటల్లోకి వస్తారేమో అని ఆశగా చూస్తున్నాడు చంద్రం. చుట్టుపక్కల వీధుల్లో చాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అక్కడ పనిచేసే కూలీలు, మిగతా పనివాళ్ళు అందరూ మీల్స్ కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళంతా ఇప్పుడెందుకు రావడంలేదో..! పై రోడ్డులో ఇంకెవరో హోటల్ పెట్టారని విన్నాడు. బహుశా అందరూ అటు వెళుతున్నారేమో. ఇప్పుడేం చేయాలి..! ఆలోచనలతో తల పగిలిపోతోంది చంద్రానికి. “నరేష్ ఈ రోజు కూడా రానట్లుంది”. వాకిట్లోకి చూస్తూ చంద్రం పక్కన కూర్చుంది శారద, చీర చెంగుతో చెయి తుడుచుకుంటూ. “అవును శారద. వాడు హోటల్ బయట నిలబడి పిలుస్తుంటే కొంతమందైనా వొచ్చేవాళ్ళు. ఇప్పుడు రావడం మరీ తగ్గించేశారు” తల విదిల్చాడు చంద్రం.
మనసునిండా దిగులుమబ్బులు కమ్ముకున్నప్పుడు ఉపశమనం కోసం శివయ్య దర్శనానికి వెళుతుంటాడు చంద్రం. ఆ రోజు పొద్దున ఆరింటికే లేచి తయారై, హోటల్లో చేయాల్సిన టిఫిన్లు, వంటల గురించి శారదకు చెప్పి, కారులో శ్రీశైలం బయలుదేరాడు. ఎనిమిది గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్కి వెళ్ళాడు. జాతర్లో మాదిరి జనాలతో టేబుల్స్ అన్నీ నిండిపోయి, కూర్చోను స్థలం చాలక, పొద్దున్నే అడ్డా మీద కూలి కోసం నిలబడ్డట్లు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు జనం. ఒక్కసారి తమ హోటల్ పరిస్థితి గుర్తుకు వచ్చి ఓ చిన్న విషాదపు నవ్వు కదలాడింది అతని పెదవులపైనా.
జనాలను తప్పించుకుని ప్లేట్ ఇడ్లి, వడకి బిల్లు వేయించుకుని టిఫిన్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాడు. టిఫిన్ ప్లేటు తీసుకునిరాగానే ఒక కుర్చీ ఖాళీగా కనిపించింది. అదృష్టం బాగుంది అనుకుని కూర్చున్నాడు. ఇడ్లి ముక్క తుంచి చట్నీ అద్దుకుని నోట్లో పెట్టుకున్నాడు. పుట్నాలపప్పు చట్నీ పుల్లగా ఉంది. ఎప్పుడో ఏకోజామునో చేసిఉంటారు. పులిసిపోయింది. సాంబారులో ఉప్పెక్కువగా ఉంది. వడ నిండా నూనె. ఏరకంగా చూసినా తమ హోటల్లో టిఫిన్ల రుచితో పోల్చుకుంటే ఇక్కడ రుచీ, శుచీ చాలా తక్కువనిపించింది. కానీ జనాల గుంపులు చూస్తే ఆశ్చర్యం. స్థల ప్రభావమో, విధిరాతో ఏంటో. ఒక్కొక్కరి జీవితం పూల తివాచి మీద పయనంలా ఉంటుంది. కొందరి జీవితాలేమో ముళ్ళు, రాళ్ళున్న బాటలో చెప్పుల్లేని ఉత్తకాళ్ళతో నడకలా సాగుతాయి. ఎంత జాగ్రత్తగా అడుగేసినా ఒక్కోసారి అడుగు తడబడుతుంది. ఇదీ అనిచెప్పలేని బాధతో టిఫిన్ సరిగా తినలేకపోయాడు. చేయి కడుక్కుని కారు ఎక్కేసాడు.
మధ్యాన్నం ఒంటిగంటదాకా ప్రయాణం చేసాడు. పొద్దున టిఫిన్ సరిగా తినకపోవడంతో, డ్రైవింగ్ చేస్తుంటే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. కళ్ళముందు బూజర్లుబూజర్లుగా చీకటి ఆవరించినట్లై, ముందున్న దారి కనపడలేదు లేదు చంద్రానికి. మరోపక్క ఆకలికి పేగులు అరుస్తున్నాయి. ఇక లాభం లేదని కాస్త దూరం పోనిచ్చి. కారుని రోడ్ పక్కకు తిప్పి, ఎప్పుడూ భోజనానికి ఆగే “మల్లికార్జున” హోటల్ దగ్గర కారు నిలిపాడు.
కారు తాళం వేసి రెండడుగులు వేశాడో లేదో “రండి రండి చంద్రం సర్. నమస్కారం. బాగున్నారా. శివయ్య దర్శనానికేనా? ఈమధ్య ఇటుపక్కకు వచ్చినట్లు లేరు మీరు. ఈ రోజు చెమగడ్డల మజ్జిగపులుసు స్పెషల్” హోటల్ బయట నిలబడిన అతని ఆత్మీయమైన పిలుపుకి సగం కడుపు నిండిపోయింది చంద్రానికి. బాగున్నానన్నట్లు తలూపి, అతన్నిపలకరించాడు. అతని పలకరింపులో ఎటువంటి నటనా లేదు. స్వచ్ఛమైన మనసులోనుంచి వచ్చిన మాటలుగా అనిపించాయి. అతని మాటల్లో ఏదో ఆకర్షణ ఉందనిపించింది. తరచుగా ఇటువైపు వస్తూ ఉండడంతో తన పేరు అడిగి గుర్తుపెట్టుకుని మరీ హోటల్లోకి ఆహ్వానించే అతనంటే ఏదో తెలియని అభిమానం చంద్రానికి. నిప్పులు చెరిగే ఎండ తలని మాడుస్తున్నా, చెక్కు చెదరని చిరునవ్వుతో హోటల్ వైపు వచ్చే వాళ్ళని రమ్మని పిలుస్తున్నాడు.
కాస్త మంచి బట్టలు కట్టుకుని, నవ్వుతూ పలకరించే అతన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది చంద్రానికి. యాభై ఏళ్ళు పైబడే ఉంటాయతనికి. పాపం బతికి చెడిన వాడిలా కనిపిస్తున్నాడు. జీవితంలో ఎన్ని కష్టాల ఉలి దెబ్బలు అతన్ని ఈ స్థితికి తెచ్చాయో ఏమో..” ఎర్రటి ఎండలో నిలబడే ఈ పనికి కుదురుకున్నాడు. ఆలోచిస్తూ హోటల్లోకి అడుగేసాడు. లోపల పెద్ద హాల్లో టేబుల్స్, కుర్చీలు క్రమపద్ధతిలో అమర్చివుంటాయక్కడ. పనివాళ్ళు కూడా ఎంతో నిబద్దతతో పని చేస్తున్నారు. కూరలు, సాంబారు, రసం అన్నీ చాల రుచిగా, శుచిగా అనిపించాయి. చామగడ్డల మజ్జిగ పులుసు రుచి అదిరిపోయింది. అక్కడకి నాలుగైదు సార్లు వచ్చాడు. లంచ్ సమయానికి ఇదే హోటల్ కి వచ్చేవాడు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆ బయట నిలబడిన వ్యక్తి నవ్వుతూ “కడుపునిండా తిన్నారా సర్” అన్నాడు. కడుపులో ఎక్కడైనా కాస్త వెలితి ఉంటే అతని పలకరింపుతో అది నిండిపోయింది అనిపించి, నవ్వుతూ తృప్తిగా తల ఊపి, అతని చేతిలో ఇరవై రూపాయలు పెట్టి కారులో కూర్చున్నాడు. చిరునవ్వుతో చూసాడతను.
సాయంత్రానికి శ్రీశైలం చేరుకున్నాడు. రెండు గంటల్లో దర్శనం చేసుకుని, తిరుగుప్రయాణం అయినాడు. భూమి గుండ్రంగా ఉంది అనేదానికి సాక్షిగా, మళ్ళీ ఆలోచనలు తమ హోటల్ వైపు మళ్ళాయి చంద్రానికి. తాను కూడా హోటల్లో రుచి, శుభ్రత పాటిస్తాడు. అయినా జనాలు రావడం ఎందుకు తగ్గిపోయిందో, లోపం ఎక్కడ ఉందో తెలియడంలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో, అసలు సంగతి దేవుడెరుగు వడ్డీలు కట్టడానికి సరిపోయే ఆదాయమైనా వస్తే చాలు అని మదన పడుతూ ఇంటికి చేరాడు. వారం రోజులు నిరసమొచ్చిన నత్త నడకలా సాగిపోయినాయి.
ఎప్పటిలాగే ఆ రోజు క్యాష్ కౌంటర్లో కూర్చోనున్నాడు చంద్రం. షరా మాములే అన్నట్లు ఒంటిగంట సమయంలో రమణయ్య, బాలు వచ్చి భోం చేసి వెళ్ళారు. చంద్రం చూస్తుండగానే హోటల్ దాటుకుని జనాలు వెళుతున్నారు. నరేష్ పనిలోకి రావడం మానేసాడు. ఏం చేయడానికి పాలుపోలేదు. ఆలోచిస్తుంటే హఠాత్తుగా శ్రీశైలం వెళ్ళే దారిలో హోటల్ దగ్గర బయట నిలబడి పిలిచే అతను గుర్తుకు వచ్చాడు చంద్రానికి. అతని మాటతీరు, చిరునవ్వు కూడా గుర్తుకు వచ్చాయి. ఏదో పనున్నట్లు శారదను పిలిచి కాష్ కౌంటర్లో కూర్చోమన్నాడు. “బయట ఎండ చుర్రుమంటోంది. ఇప్పుడెక్కడికండీ మీరు?” శారద మాట వినిపించుకోకుండా హోటల్ బయటకొచ్చి నాలుగడుగులు వేసి రోడ్డు మీద నిలబడ్డాడు. రెండు నిమిషాల తర్వాత స్టీల్ సామాను అంగడి దామోదరయ్య వస్తూ కనపడ్డాడు. “దామోదరన్నా..భోజనానికేనా? హోటల్ లోకి పదన్నా” అన్నాడు నవ్వుతూ.
“ఒరెఒరెఒరెఒరే..అబ్బయ్యా..చంద్రం..నువ్వెందిక్కడ..! పని కుర్రాడేడి..? హోటల్ ఓనర్వి అయుండి ఈడ తలకాయ మాడిపోతా ఉంటే ఎండలో నిలబడే కర్మ నీకేంది..పద..పద” అంటూ హోటల్లోకి వచ్చాడు. కొన్ని రోజులుగా అతను తమ హోటల్ దాటుకుని పోవడం గమనించాడు చంద్రం. అతని మాట వినగానే ఒక్క క్షణం అహం అడ్డొచ్చింది. మరుక్షణమే ఎవరేమనుకున్నా తాను చేస్తున్న పని ఎంతమాత్రం తప్పుకాదు అనిపించి “పని కుర్రాడు రాలేదన్నా. నువ్వు కూర్చో” అంటూ నవ్వుతూ అరిటాకు వేసాడు. అతనికి భోజనం వడ్డించమని శారదకు సైగ చేసాడు. అతను తినడం ప్రారంభించాక మళ్ళీ రోడ్డు మీదకు వచ్చినిలబడ్డాడు. కాలేజీ కుర్రాళ్ళు నలుగురు వెళుతుంటే వాళ్ళను చిరునవ్వుతో హోటల్ కి రమ్మని పిలిచాడు. వాళ్ళు చంద్రాన్ని ఎగాదిగా వింతగా చూసి, హోటల్లోకి వెళ్ళారు.
దామోదరయ్య భోజనం చేసి, కిళ్ళీ వేసుకుని “భోజనం చాల బాగుందయ్యా చంద్రం. ఏదేమైనా నువ్వు కష్టపడే తత్వం గలవాడివి. పైకొస్తావు” అంటూ భుజం తట్టి వెళ్ళిపోయాడు. లోపలకు రమ్మని పిలుస్తున్న చంద్రాన్ని చూసి ప్రింటింగ్ ప్రెస్ సుధాకర్ నవ్వుతూ హోటల్లోకి వెళ్ళాడు. ఇళ్ళు కట్టిచ్చే మేస్త్రీలు, కూలివాళ్ళు పదిహేను మంది చంద్రాన్ని చూసి, బిలబిలమంటూ హోటల్లోకి వచ్చారు. రెండు గంటలు గడిచాయి. ఎండలో నిలబడ్డానన్న ధ్యాసే లేదు. రోజు నిప్పులు చెరిగే ఎండ ఈ రోజు ముంచుముక్కలతో కలిసిన పూలవాన కురుస్తునట్లు అనిపించింది చంద్రానికి. కొత్తకొత్త వాళ్ళు హోటల్లోకి రావడంతో శారదకి, వడ్డించే కుర్రాళ్ళకి చేతి నిండా పని దొరికిందారోజు . చంద్రం చేస్తున్న పని మొదట వింతగా అనిపించింది శారదకు. క్రమంగా భర్త మనసు అర్ధం చేసుకుంది. వచ్చే జనాలను చూసుకుని గబగబా బియ్యం వార్చడానికి మిద్దెపైకి పోయాడు అంకయ్య. అందరి మనసుల్లో విరబూస్తున్న ఆశల తోరణాలు. రెండు గంటలు దాటే సరికి దాదాపు నూటయాభై భోజనాలు అయినాయి. చాల రోజులకు హోటల్ జనాలతో కళకళలాడుతూ, మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అందరికీ ఆనందం కలిగింది. మనసులోనే ఒకసారి శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్న హోటల్ ముందు నిలబడి రమ్మని పిలిచే అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు చంద్రం.
నిరాశ మనిషిని కృంగదీస్తే, ఒక ఉత్తేజకరమైన మార్పు మనిషిలోని నిరాశను, స్తబ్దతను మాయం చేస్తుందేమో. సాయంత్రం పనంతా ముగియగానే కుర్రాళ్లతో హోటల్ అంతా శుభ్రం చేయించాడు. హోటల్ ముందు కట్టిన దిష్టి బొమ్మ తీయించేసాడు. గాజు గ్లాసులో నీళ్ళల్లో వేసిన నిమ్మకాయను కూడా తీయించేసాడు. వాటన్నింటికన్నాతన చిరునవ్వు విలువైనదని తెలుసుకున్నాడు. ఆ రోజు మొదలుకుని ఏ రోజు తన చిరునవ్వులను వదులుకోలేదు చంద్రం. అతన్ని విడిచిపెట్టి ఎవరూ వెళ్ళలేదు. మూడు నెలలు గునగునా నడుచుకుంటూ వెళ్ళే గిన్నెకోడిపిల్లల్లా ముందుకు పోయినాయి. క్రమంగా వ్యాపారం ఓ కొలిక్కి వచ్చింది.
మనసుకు చీకటి కమ్ముకున్నప్పుడే కాదు. జీవితం పట్ల నమ్మకం, భరోసా కలిగి హృదయం ఉత్తేజంతో ఉప్పొంగినప్పుడు కూడా శివయ్యని మర్చిపోలేదు చంద్రం. శ్రీశైలం వెళ్ళాలని ఆ రోజు ప్రయాణం కట్టాడు చంద్రం. శివయ్య కంటే ముందు దారిలో ఉన్న హోటల్ బయట నిలబడే అతన్ని కలసి, తమ హోటల్ గురించి, తనకి అతని ద్వారా కలిగిన స్ఫూర్తి గురించి చెప్పి, అతనికి కృతఙ్ఞతలు తెలపాలని మనసు ఉవ్విళ్ళూరింది చంద్రానికి. తను లేని రోజు శారదని బయట నిలబడమన్నాడు.
మధ్యాన్నం ఒంటిగంట సమయంలో కారు ఆ హోటల్ని సమీపిస్తుంటే ఆత్రుత ఎక్కువైంది చంద్రానికి. తన బతుకులో ఇంతమంచి మార్పు రావడానికి కారణమైన అతనంటే తెలియని గౌరవం ఏర్పడింది. హోటల్ పక్కన కారు పార్కింగ్ చేసాడు. కారు దిగి నడుస్తున్నాడన్న మాటే కానీ, చంద్రం కళ్ళు అతనికోసం చూస్తున్నాయి. తనెప్పుడు వచ్చినా చిరునవ్వుతో పలకరించే వ్యక్తి ఆ రోజు లేడక్కడ. ఒక్క క్షణం నిరాశ ఆవరించింది చంద్రాన్ని. చుట్టుపక్కల ఎక్కడికైనా వేళ్ళాడేమోనని కాసేపు హోటల్ బయటే నిలబడి ఎదురుచూశాడు. నిముషాలు గడుస్తున్నాయిగానీ , అతని జాడ లేదు. నిస్తేజంగా హోటల్ లోపలకి వెళ్ళాడు. ప్రతి టేబుల్ దగ్గరా జనాలు దండిగానే ఉన్నారు. అనాసక్తంగా మీల్స్ బిల్ తీసుకోవడానికి క్యాష్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాడు.
ఆశ్చర్యం! అతను క్యాష్ కౌంటర్ లో కూర్చుని బిల్స్ ఇస్తున్నాడు. చంద్రాన్ని చూసి ఎప్పటిలా చిరునవ్వుతో “రండి చంద్రం సర్” అన్నాడు.
చంద్రం విస్మయంగా చేయి చూపుతూ “నువ్వు..మీరు..బయట ..!” అన్నాడు.”
ఓ..అదా. ఈ రోజు మా అబ్బాయి ఊరికి వెళ్ళాడు. అందుకని కాష్ కౌంటర్లో డ్యూటీ నాకు పడింది చంద్రం గారు” అదే నవ్వుతో అన్నాడతను. “అంటే మీరు ..!” సంశయంగా చూస్తున్న చంద్రం మనసులోని మాటను అతను చదివినట్లు,
“అవునండీ. ఈ హోటల్ ఓనర్ని నేనే” అన్నాడతను. నమ్మశక్యంకాని అద్భుతం ఎదురుగా ఉన్నట్లు అమితమైన ఆశ్చర్యం, ఆనందం మేళవించిన దృక్కులతో అతనివంకే చూస్తుండిపోయాడు చంద్రం చిత్తరువులా. అతను కూర్చున్న టేబుల్ వెనుక గోడకి కాస్త ఎత్తులో “చేసే పనియే దైవం” అనే స్లోగన్ రాసున్న పటం తగిలించి ఉంది.