86. బ్రహ్మమెుక్కటేనా..?

పైనేని మునెమ్మ స్మారక కథల పోటీ లో ప్రథమ బహుమతి పొందిన కథ “బ్రహ్మమెుక్కటేనా..?” కథ”అమ్మ కోసం.. కొన్ని మంచి కథలు” సంకలనంలో ప్రచురితమైంది. కథని చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

పైనేని తులసినాథం నాయుడు గారికి ధన్యవాదాలతో

తాను కొనుక్కున్న చొక్కా కాదిది..

ఈ చొక్కానే తనను కొనుక్కుంది..!

నవ్వొచ్చింది, చేతకానితనాన్ని కప్పెట్టేస్తున్నట్టు. ఎంతకి అమ్ముడుపోయాడు తను? దేనికి? ఋణం ఎంత సేపో, అంతసేపు తాను దానిని తొడుక్కుంటాడు. అది తనతో ఆడుకుంటుంది. తనను వాడుకుంటుంది. ఛఛ.. పిచ్చిగా అనిపించి తల విదిలించాడు. ఒళ్ళు కదిలి, చొక్కా అటు ఇటు ఊగింది. అంత వదులుగా ఉందది.

డైనింగ్ హల్లో మూల బిగించిన అద్దంలో చూసుకున్నాడు. ఎరుపు రంగు చొక్కాకి పొడవు చేతుల అంచుల్లో తెలుపు రంగు పట్టీలు. తనకి తానే బఫున్లా అనిపించాడు. ఒక్క క్షణం చొక్కా విప్పేసి తన చొక్కా వేసుకోవాలనుకున్నాడు. మళ్ళీ ఇందాకటి నర్సింగన్న చిరాకు చూపులు భయపెట్టి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. నెల క్రితం అన్నకి, తనకి జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.

వేరే దారి లేదు అప్పుడు తనకి. నర్సింగన్నకి ఫోన్ చెయ్యాల్సిందే. ఎన్నిసార్లు ఆలోచించినా మార్గాంతరం కనపడడం లేదు. సందేహిస్తూనే ఫోన్ చేసాడు . నాలుగు సార్లు ఫోన్ చేసినా అన్న ఫోన్ ఎత్తలేదు . అప్పటిదాకా ఉన్న ఒక్క ఆశ ఆవిరై నిరాశ పొగమంచులా ఆవరించింది మనసునిండా.

మసక చీకట్లు ఇంకా వీడలేదు. ఫోన్ పక్కన పెట్టి గుడిసె మధ్యలో అలికిన నేల మీదనే నడుం వాల్చాడు. కాస్త మూలకి ఈతాకుల చాపమీద భార్య, కొడుకు గాఢనిద్రలో ఉన్నారు.

తను ఉన్నాననేదే నిశ్చింత వాళ్ళ ముఖాల్లో. మరి తనకో..! తను ఉండడం అనేదే తన భయం!

ఆలోచనలు తెగిన గాలిపటాల్లా చెదిరిపోతున్నాయి నిలకడ లేకుండా. అదిగో అప్పుడు మోగింది ఫోన్. ఆత్రంగా ఫోన్ తీసాడు.

“ఏంది యాదగిరి..! ఈ టైంల ఫోనుజేసినవ్” అన్న గొంతులో చిరాకు. తన మనసులో బెరుకు.

“నర్శింగన్నా…. మంచిగున్నావ..? నీతో కొంచెం మాట్లాడాలి. మీ ఇంటికొస్త” అతని స్వరంలో అభ్యర్ధన.

“నాకిప్పుడు అర్జెంట్ పనివుండే. బయటకు వెళుతున్న. నువ్వు సాయంత్రం అమీర్పేట్ సత్యం దగ్గరికి వచ్చేయి” ఫోన్ కట్ చేసాడు నర్సింగ్ . సమాధానం కూడా వినకుండా. తనకి తప్పదు. కొన్నిటికి ఆత్మాభిమానం చంపుకోవాలి.

సాయంత్రం ఐదు గంటలు. అమీర్పేట్ సత్యం సినిమా హాల్ ప్రాంతమంతా పెళ్లి ఇల్లులాగా జనాలతో కళకళలాడుతోంది. సినిమా హాల్ ఎదురుగా ఉండే పురాతన ఇరానీ హోటలది. టేబుల్ మీద గాజు గ్లాసుల్లో ఇరానీ స్పెషల్ మసాలా చాయ్ పొగలు కక్కుతోంది.

“ఆ.. ఇప్పుడు చెప్పు యాదగిరి..ఎట్లున్నావ్. నీ వ్యాపారం మంచిగ నడుస్తోందా.” ఓ చేతిలో టీ గ్లాసు, మరో చేతి వాచీ చూసుకుంటూ నర్సింగ్.

“ఇంకెక్కడి వ్యాపారం అన్నా..ఐదు నెల్లు కిరాయి కట్టలేదని షట్టర్ మూయించేసాడు ఓనర్. బస్టాండ్లో పెట్టుకుని అమ్ముదామన్నా పూల ధరలు మస్తు పెరిగినై. చటాకు బంతి పూలు ముప్పై రూపాయలు అంటే, తిరిగి చూడకుండా వెళ్లిపోతున్నారు జనాలు. అంత రేటు పెట్టి పూలు కొనడానికి జనాలు అప్పట్లా వస్తలేరు. లాభం కాదు కదా పూలు కొన్న పైసలు కూడా జమైతలేదన్నా..!. ప్రవాహంలా మొదలైన మాటలు వేదనగా మారి యాదగిరి ముఖంలో లో బాధ ప్రస్ఫుటమైంది.

“సరే..సరే..చెప్పు.నాకెందుకు ఫోన్జేసినవు” వాచీ మూడోసారి చూసుకున్నాడు నర్శింగ్ కాస్త అసహనంగా.

“అదే అన్నా ..! నువ్విప్పుడు పెద్ద పెద్ద అపార్టుమెంట్లల ఈవెంట్ మేనేజర్‌గా చేస్తున్నవని నాకు సాయిలు చెప్పిండు. వ్యాపారం లేదు. పని దొరుకుతా లేదు. ఇల్లు గడవడం మస్తు కష్టంగా ఉందన్నా. నన్ను కూడా నీతోని తీస్కపోరాదు.నువ్వు చెప్పిన పని చేస్తా. నువ్వు ఎన్ని పైసలిస్తే అన్నే తీస్కుంటా..ఇవి నీ కాళ్ళు అనుకో అన్నా” నర్సింగ్ చేతులు పట్టుకున్నాడు యాదగిరి.

“ఎక్కడ యాదగిరి. నెలకు ఒకటి, రెండు తప్ప నాగ్గాని ఎక్కువ పనులు దొరుకుతలేదు”

” గట్లనకన్నా.. నిన్నే నమ్ముకున్న గిప్పుడు. నువ్వే నాకు ఏదో ఓ దారి చూపాలి” యాదగిరి మాటలు బుర్రకెక్కుత లేదు. మనసింకెక్కడో ఉంది. పరాధాన్యంలో “ఉ ” కొడుతున్నాడు.

అప్పుడు మోగింది నర్సింగ్ సెల్. వెంటనే ఆతృతగా ఫోన్ తీసి “ఆ.. ఆ ..అట్లనే సర్. అర్ధగంటలో వచ్చేస్తా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్..! అట్లనే సర్” అవతలిపక్క ఫోన్ పెట్టేసారు. జేబులో నించి చిన్న పుస్తకం తీసి అడ్రస్ రాసుకున్నాడు.

గ్లాసులో టీ ఇంకా పూర్తి కాలేదు. ” యాదగిరి..నాకు అర్జెంటు పనివుండే. ఇప్పుడు బంజారా హిల్స్ దాక పోవాలి. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను.నేను పనికి పిలిచినప్పుడు రా నువ్వు” మాట సగంలో ఉండగానే బయటకి వచ్చి పాత మోపెడు బండి మీద ఆగమాగంగా వెళ్ళిపోయాడు నర్సింగ్.

అప్పటి సంది నర్సింగన్న ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే ఇదిగో ఈ రోజు పొద్దున అన్న నుంచి ఫోన్. ఆటో కిరాయికి పైసలులేక ఇంటి నుంచి ఐదు కిలోమీటర్లు బంగారాహిల్స్ దాకా నడిచి వచ్చాడు తను.

“యాదగిరి..ఎక్కడున్నవు. జల్దీ రా. టిప్పర్ లో నించి కుర్చీలు దింపాలి”.

నర్సింగ్ కేకతో ఉలిక్కిపడి, వదులు చొక్కాని సరిచేసుకుని డైనింగ్ హాల్ నుంచి బయటపడ్డాడు. అక్కడ తనలాంటి వర్కర్స్ చాల మంది. యూనిఫామ్ డ్రెస్, ఎర్ర టోపీల్లో. ఎవరో ఇచ్చిన టోపీ పెట్టుకున్నాడు యాదగిరి. తెనాలి నుంచి వచ్చే బ్యాండ్ మేళగాళ్ళ ఉంది తన వేషం. అయినా తప్పదు. కూటికోసం కోటి విద్యలు అన్నట్లు అన్నట్లు కూటి కోసం కోటి వేషాలు కూడా.. తెలియని నవ్వు తెరలు తెరలుగా యాదగిరి పెదాలమీద నాట్యమాడింది.

***

బంజారా హిల్స్ లో బాగా పేరున్న గేటెడ్ కమ్యూనిటీ అది. సామాన్యులకు అది అందని స్వర్గం. కల్లో కూడా ఊహించుకోలేని ధనవంతుల లోగిలి. మొత్తం పన్నెండు బ్లాకులు ఉన్న ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి అడుగు పెట్టిన యాదగిరికి ఆకాశానికి అంటుతున్నట్లున్న భవనాలను చూసి భూలోకం నుంచి ఇంద్రలోకంలోకి అడుగుపెట్టినట్లు ఉంది.

పెద్ద పెద్ద అపార్టుమెంట్ల పక్కన, వెనుకా చెత్త చెదారం, భవన నిర్మాణ కార్మికుల రేకులపైకప్పు ఉండే గుడారం లాంటి ఇళ్ళు, గల్లీల్లో పారుతున్న మురుగునీరు, ఆ మురుగునీటిలో జలకాలాడుతున్న పందుల సంబరం ఇవే తెలుసు యాదగిరికి.

కానీ ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. విరగ పూసిన రంగురంగుల రోజాపూలు, రకరకాల క్రోటన్ పూల చెట్లు, ఆకుపచ్చని తివాసీ పరచిన వాకింగ్ ఏరియా, బ్లాకులకు మధ్య మధ్యలో వాటర్ ఫౌంటన్స్, క్రీడా మైదానాలు చూస్తుంటే స్వర్గం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. పట్టపగలు అయినా రంగురంగుల నియాన్ కాంతి వెలుగుల్లో మెరిసిపోతోంది ఆ ప్రదేశమంతా. భూతలస్వర్గం అంటే ఇదేనేమో అన్నట్లు కళ్ళు తిరిగినై యాదగిరికి. కో అంటే తనలాంటి వాళ్ళు కోటి మంది వచ్చి తలవంచి సలాములు చేస్తారు. పనులు చేస్తారు. అంతా పైసల మహిమ.

“ధనం మూలం ఇదం జగత్ “. ప్రపంచాన్ని నడిపించే ఇంధనం డబ్బే అని అనుభవంలోకి వచ్చే యాదగిరికి.

కిరాయికి తెచ్చిన పెద్ద పెద్ద కుర్చీలు లెక్కబెట్టుకుంటూ అన్నింటిని ఫంక్షన్ హాల్లో వేయించాడు యాదగిరి. ఆ తర్వాత స్టేజి మీద ఫ్లవర్ డెకరేషన్ చేసారు. లైటింగ్ ఆరంజిమెంట్స్ అన్నీ చేయించారు. డైనింగ్ హాల్లో గుండ్రటి టేబుల్స్, కుర్చీలు వేశారు. టేబుల్స్ మధ్యలో రంగురంగుల ఫ్లవర్ వాజ్లు పెట్టారు. మధ్యాహ్నం విందులోకి ఒక ప్లేటుకి వెయ్యి రూపాయల చొప్పున వెజ్-నాన్వెజ్ వంటకాలు, బిర్యానీ, పది రకాల స్వీట్స్, నార్త్ ఇండియన్, పంజాబ్ డిషెస్ తో పాటు విదేశీ వంటకాలు, అన్నీ రకాల చాట్స్, పిజ్జాలు, నూడిల్స్ మొత్తం యాభై రకాల ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. తిన్న వాళ్ళకి తిన్నంత.

రిసెప్షన్ పొద్దున, సాయంత్రం కూడా ఉంది. పొద్దున వచ్చే అతిధుల రాక మొదలైంది. సంగీత విభావరి మొదలైంది. “వాతాపి గణపతిం భజే” విఘ్నేశ్వర గీతంతో మొదలై, భక్తి పాటలు పాడుతున్నారు సిటీలో ప్రముఖ ఆర్కెస్ట్రా వాళ్ళు.

ఏం.ఎల్. ఏ లు, ఏం.పి లు, సినీప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు, అంతకన్నా పెద్ద పెద్ద కార్లలో వస్తున్నారు. ఫంక్షన్ కి వచ్చే ఆడవాళ్ళు పాతిక వేలకు తక్కువ కానీ చీరలు, డ్రెస్సులతో దేవ కన్యల్లా మెరిసిపోతున్నారు. కొత్త దంపతులు స్టేజి మీదకి వచ్చి ఖరీదైన కుర్చీల్లో కూర్చున్నారు. అతిధులు స్టేజి మీదకి వెళ్లి కొత్త దంపతులకు గిఫ్ట్స్, ఆశీస్సులు అందజేస్తున్నారు.

వర్కర్స్ కొంతమంది వెళ్లిపోయారు. లక్ష్మణ్ ఫంక్షన్ కి వచ్చిన పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదగిరి, మరి కొద్ది మంది వర్కర్స్ అతిధులకు కూల్ డ్రింక్స్ సరఫరా చేస్తున్నారు. సమయం పావు తక్కువ పన్నెండు అయింది. పొద్దున లేచి చాయ బొట్టు కూడా తాగని యాదగిరికి కడుపులో ఆకలికి పేగులు లుంగచుట్టుకుపోతున్నాయి. మరో పక్క విపరీతమైన దాహం. మంచి నీళ్ళు తాగనీకి కూడా సమయం చిక్కడంలేదు. ఇంకాసేపు అట్లనే ఉంటె షక్కరొచ్చి పడిపోతానేమో అనిపించింది. పనిలో తేడా వస్తే అన్న దగ్గర మాట పడాలి. లేని ఓపిక తెచ్చుకుని కూల్ డ్రింక్ బాటిల్స్ అందరికి సప్లై చేస్తున్నాడు యాదగిరి.

పాతిక వేలకు తగ్గని జరీ అంచుల పట్టుచీర, ఒళ్ళంతా నగలతో ఉన్న ఒక మేడం యాదగిరి దగ్గరికి వచ్చి , “మా మమ్మీకి చాల ఆకలిగా ఉంది. ప్లేటులో రైస్, సాంబార్, కర్రీ, వడ, ఏదో ఒక స్వీటు పెట్టి తీసుకురా ” దర్పంగా యాదగిరి వంక నిర్లక్ష్యంగా చూస్తూ

“గట్లనే మేడం ” అంటూ కిచెన్ రూంలోకి వెళ్ళాడు యాదగిరి. ఆ మేడం చెప్పిన ఐటమ్స్ అన్ని ప్లేటులో పెట్టాడు . ప్లేట్ తీసుకుని వస్తూ.. ఒక్క క్షణం ఆగాడు. ఖాళీ పొట్ట తో ఉన్న అతనికి అక్కడి వంటకాలను చూడగానే ఆకలి ఎగదన్నుకొచ్చింది. ఒక్క క్షణం మనసు అతని మాట వినడం మానేసింది. ఆకలి మా చెడ్డది. ఆకలి ఆశని పెంచింది. ఆకలి ఇవాళ్టికి తనను ఆ చొక్కాకి అమ్మేసింది!

ప్లేటుని టేబుల్ మీద పెట్టి వెనక్కి వచ్చాడు. హాట్ బాక్స్ నిండా ఉన్న వడలు అతని నోట్లో నీటిని ఊరించి, కడుపులో ఎలుకలను పరిగెత్తించాయి. చుట్టూ చూసాడు. వర్కర్లు ఎవరిపనిలో వారు ఉన్నారు. ఒకేఒక్క వడని తీసి చిన్న ముక్క తుంచి నోట్లో పెట్టుకోబోయాడు.

అంతలోనే ఓ భీకరమైన కేక. అదిరిపడ్డాడు. చేతిలో వడ ముక్క కిందపడిపోయింది. పట్టుబడిన దోషిలా నిలబడిపోయాడు చేష్టలుడిగి.

“ఎంత ధైర్యం నీకు. గెస్ట్స్ ఎవరు తినకుండానే నువ్వు ఎంగిలి చేస్తావా. కల్చర్లెస్ బ్రూట్” మేడం ఆవేశంగా ముక్కుపుటాలు అదురుతుండగా.

ఆమె ఆరుపుకు అక్కడ ఉన్న ఇంకో పెద్దాయన అగర్వాల్ వచ్చి విషయం తెల్సుకుని “పెద్ధ వాళ్ళ ఫంక్షన్ కి ఇలాంటి చిల్లర బుద్దులు ఉన్న లేబర్ గాడిని పనికి తీసుకువచ్చింది ఎవరు. ఆ ఈవెంట్ మేనేజర్ ని పిలవండి”.

అతని అరుపులకు కాస్తదూరంగా ఫోటోగ్రాఫర్తో మాట్లాడుతున్న నర్సింగ్ పరుగున అక్కడికి వచ్చాడు. అప్పటికే యాదగిరి చుట్టూ చేరి తలోక మాట అంటున్నారు. మధ్యలో నేరస్తుడిలా యాదగిరి. నర్సింగ్‌ని చూసి ” అన్నా..ఆకలి కి ఓర్చుకోలేక వడ తినబోయాను. తప్పైపోయింది. మన్నించన్నా”.

“ధూ ..నీ..బట్టెబాజ్ ” నర్సింగ్ కోపం

పెళ్ళికొడుకు బాబాయ్ “నువ్వు మంచి ఈవెంట్ మేనేజర్ వి అనుకున్నా. ఇలాంటి కల్చర్ లెస్ లేబర్ లని నీ వెంట తీసుకువస్తావని తెలీదు. నీ పెర్ఫార్మన్స్ షీట్లో నెగటివ్ రిపోర్ట్ రాస్తాను ” ఆవేశంగా అన్నాడు నర్సింగ్ వైపు కోపంగా చూస్తూ..!

“సారి సర్. వీడు ఇలాంటి వాడని తెలియదు. ఇప్పుడే వీడిని బయటకు పంపేస్తా. సర్ ప్లీజ్ నెగటివ్ రిపోర్ట్ రాయకండి. మీరు అలా రాస్తే ఇక నాకు పార్టీలు రావు. నా నోటివద్ద కూడు లాగేయకండి. సర్ ప్లీజ్ మీ కాల్మొక్కుత” బతిమాలుతూ ఆయన వెనుకే పోయిండు నర్సింగ్.

తోటి వర్కర్ల జాలిచూపులు భరించలేకపోయాడు యాదగిరి. ఇక ఒక్క క్షణం అక్కడ నిలబడలేక, ఒక్క మాట అనలేక తలవంచుకుని బయటకు వచ్చేసాడు.

ఆ పెద్దామె ఆకలి, తన ఆకలి ఒకటి కాదా ..? ధనవంతుల ఆకలికి, పేదవాడి ఆకలికి తేడా ఉంటుందా..? ఆకలి ఓర్చుకోలేక పొరపాటున ఒక వడ తినాలి అనుకోవడం క్షమించరాని నేరమా.. ? సమాధానం లేని ప్రశ్నలు వేసుకుంటూ నడుస్తున్నాడు.

కడుపులోని ఆకలి మంట కంటే జరిగిన అవమానానికి మనసులో రేగిన మంటలు అగ్ని శిఖల్లా ఎగసిపడుతున్నాయి. అయినా తను పేదవాడు. నిస్సహాయుడు. తన ఆకలికైనా, తన ఆవేదనకైనా విలువ లేదు. పేదవాని ఏ మాటైనా పెదవికి చేటే.

విరక్తిగా నవ్వుకున్నాడు. బఫున్ చొక్కాతోనే కొంత దూరం నడుచుకుంటూ పోయాడు.గేటెడ్ కమ్యూనిటీ నుంచి కాస్త దూరం వెళ్ళగానే బండ రాళ్ళతో వాలుగా ఉన్న గల్లీలో కొన్ని చిన్న చిన్న టీ, టిఫిన్ దుకాణాలు కనిపించాయి యాదగిరికి. తనలాంటి పేదవారి కోసం గల్లీల పక్క వెలిసిన దుకాణాలు అవి. ప్యాంటు జేబులో చేయి పెట్టి చాలాసేపు తడుముకుంటే జేబులో ఓ మూల బాగా నలిగిపోయిన పదిరూపాయలు కాగితం చేతిలోకి వచ్చింది.

దుకాణం ముందు బెంచి మీద కూర్చుని వేడివేడి అల్లం చాయ చుక్క చుక్క తాగుతున్నాడు. కొన్ని కన్నీటి చుక్కలు కూడా ఛాయలో కలుస్తున్నాయి. నీళ్ళు నిండిన కళ్ళు మసకబారినాయి. దూరం నుంచి నర్సింగ్ రావడం అస్పష్టంగా కనిపించింది. చొక్కాతో కళ్ళు తుడుచుకున్నాడు.

దగ్గరికి వచ్చేసాడు నర్సింగ్. మనిషి ఆగమాగంగా కనపడ్డాడు. పెదాలు వణుకుతున్నాయి నర్సింగ్ కి.

“అన్నా” యాదగిరి

“యాదగిరీ..! నాకు ఓ ‘ టీ’ చెప్పు”

“అన్నా” అయోమయంగా జేబు తడుముకున్నాడు యాదగిరి

నర్సింగ్ కూడా జేబు తడుముకుంటున్నాడు. హఠాత్తుగా యాదగిరిని హత్తుకున్నాడు.

” నిన్నను బయటకు పంపకపోతే, నీ వెనుకే నన్ను కూడా బయటకు పంపేస్తారు వాళ్ళు”

నర్సింగ్ కళ్ళ నిండా నీళ్ళు.

” నర్సింగ్ అన్నా” మరింత గట్టిగా హత్తుకున్నాడు యాదగిరి.

“కందువగు హీనాధికమిందు లేవు

అందరికి శ్రీహరే అంతరాత్మ !

బ్రహ్మమొక్కటే..పరబ్రహ్మమొక్కటే “

దూరంగా ఎక్కడనుంచో లీలగా వినిపిస్తుండె అన్నమాచార్య కీర్తన

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *