మనసు ఎందుకు, ఎక్కడికి వెళ్ళకూడదు? ఈనాటి ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం స్నేహ బుక్ లో నా కథ “మనసు వెళ్ళని చోటు” చదవండి. స్నేహ సంపాదక బృందానికి, Santhi Sri Madam కు ధన్యవాదాలతో..


‘ఇప్పుడిక అంతా అయిపోయింది. వాడు నా దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నాడు. వద్దు వద్దు.. ఎట్టి పరిస్థితిలోను వాడిప్పుడు నా దగ్గరకు రావడానికి వీల్లేదు. వాడ్ని నా దగ్గరకు రాకుండా ఎలా ఆపాలి? ఇప్పుడు నేనేం చేయగలనని..?’ ఆ రోజు నాయినమ్మ చెప్తానే ఉంది. “ఒరే నారాయణా..పిల్ల ముద్దుగా ఉందని మరీ గారం చేయకురా. అది అడిగిందని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వెళ్ళి దానికి ఐస్ క్రీం కొని తెచ్చిచ్చావు. రేపు కొండమీది కోతిని తెచ్చి ఇమ్మంటుంది. ఆ తర్వాత ఇంకేదో అడగరానిది అడుగుతుంది. అప్పుడేం చేస్తావురా?”
అప్పుడు నాన్న నన్నెత్తుకుని, “నా బంగారు తల్లి, నా వరాల మూట, నా ఒక్కగానొక్క గారాలపట్టి కూతురు ముచ్చట పడి అడిగింది కాదంటే నేనసలు దానికి నాన్నని కానట్టే” అంటూ నాన్న ఐస్ క్రీం ని నాకు ప్రేమగా తినిపించినప్పుడు తెలియలేదు నెమ్ము చేసి, జ్వరం తో వారం రోజులు పడకేసి, బడి మానేయాల్సివస్తుందని. ‘మొక్కై వంగనిది మానైవంగుతుందా’ మొక్కగా ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా పెరిగితే కొమ్మలు వంచి, అనవసరమైన చోట కత్తిరించి, మంచి ఎరువులు వేసి పద్దతిగా పెంచితేనే మొక్క సక్రమమైన రీతిలో పెరిగి మంచి చెట్టు అవుతుంది. లేకుంటే అడ్డుఅదుపులేక పెరిగిన మాను మొద్దులా మారుతుంది. మొక్కైనా అంతే. పెద్దవాళ్ళ అదుపాజ్ఞలు లేకుండా పెరిగిన బిడ్డయినా అంతే” అంటూ నాయనమ్మ ఎన్ని సార్లు నాన్నకు చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లే అయింది నాన్న తరహా. మరి అటువంటి నాన్న నీడలో నేను ఎలా పెరిగానో మీకు ఇట్టే అర్ధమై ఉంటుంది.
నేనప్పుడు పదో తరగతి. పదహారేళ్ళకు ఒక్కేడు తక్కువ. విడిచి పెడుతున్న బాల్యపు చివరి రోజులవి. పాల బుగ్గలు కాస్త ఎర్రటి రోజా మొగ్గలుగా మారి, మొటిమలు పొడచూపే తొలి తొలి యవ్వన కాలం. పచ్చి కాయలు పదునుదేలి పాలు కారుతున్నట్లు ఎదుగుతున్న పరువాలు. రెండు కాళ్ళు ఒక్క చోట నిలిస్తేనా నాకు.
ఆ రోజేమయిందనుకున్నారు. మార్చి నెల. ఎండలు నిప్పులు చెరిగే కాలం. ఇంకో పది రోజుల్లో పదవతరగతి పబ్లిక్ పరీక్షలు. నాయనమ్మ నోటికి దండిగా పనిచెప్పే సమయం వచ్చింది. ఇంతవరకు కలిసి ఆడిపాడుకున్న స్నేహితులం, పరీక్షల తర్వాత, అందరం ఒకే కాలేజీలో చేరుతామో లేక చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయి ఎక్కడెక్కడికి పోతామో ఏమో. మరి పరీక్షల ముందు అందరం సరదాగా గడపొద్దూ! స్కూల్ లో పిక్నిక్ కి తీసుకువెళతామని టీచర్స్ అటు అన్నారో లేదో ఇటు నేను ఎగురుకుంటూ వచ్చి నాన్నకు చెప్పాను. నాన్న ఎప్పుడైనా నా మాట కాదన్నాడా! “నీ ఇష్టం రా బంగారు. ఎంత డబ్బు కావాలో చెప్పు” అన్నాడు.
“అది తానా అంటే మీరు తందానా అంటారు. అది వెళతానంటే మీరెలా ఒప్పుకుంటారు. వాళ్ళు తీసుకువెళ్లేది ఎక్కడికనుకున్నారు. కృష్ణపక్షపు రోజుల్లో పోటు మీద ఉండే సముద్రానికి. బడి టీచర్స్ ఉన్నా సరే ఎదిగిన ఆడపిల్లను వెనుకాముందు ఆలోచించకుండా బీచికి పంపుతారా బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనా ..! అక్కడేదైనా జరగరానిది జరిగితే ఎవరు దిక్కు. అయినా నా మాటంటే ఇంట్లో ఎవరికి లెక్కగనుక ” చీర కొంగును చుట్టి కళ్ళు ఒత్తుకుంటోంది అమ్మ. ఇక నాయనమ్మ ఎత్తుకుంది. “నా మాటినరా నారాయణా..ఈడొచ్చిన పిల్లను బయటకి పోనీబాకరా..అది అడిగినవాటికంతా సరే అంటూ తలూపితే , ఏదో ఒక రోజు బాధ పడాల్సివస్తుందిరా నారాయణా”
“నువ్వుండమ్మా. అన్నింటికీ అడ్డుపుల్ల వేస్తావు. పరీక్షలని రోజు కష్టపడి చదువుతోంది కదా. ఏదో ఒక్క పూట ఫ్రెండ్స్ తో సరదాగా బీచికి వెళ్ళి వస్తుంది. అంతేగదా. అమెరికాకి గాని పోతానని ఏమైనా ఆనిందా నా చిట్టి తల్లి. ఊరికి పది మైళ్ళ దూరంలోనే కదా బీచి ఉండేది. అంతదానికే మిన్ను విరిగి మీద పడ్డట్టు గోల చేస్తావు” అని నానమ్మను విసుక్కున్నాడు నాన్న. నాకు అప్పటికే నాన్న మీద ఉన్న కొండంత ప్రేమ అమాంతం కోటి రేట్లు పెరిగిపోయింది. ఇంట్లో అమ్మ, నాయనమ్మ ఒక జట్టు. నేను, నాన్న ఒక జట్టు. ఎవరెంత వాదించినా చివరకు నా మాటే చెల్లుతుంది ఇంట్లో. పాపం అమ్మ అటు నాన్న మాటకు ఎదురుచెప్పలేక, ఇటు నాయనమ్మకు సర్దిచెప్పలేక ఎంత నలిగిపోయిందో..! ఇక అమ్మ నన్నేమి అడ్డుకోగలదు! కానీ నాయనమ్మ మాటల్లోని యదార్థం అర్థమైయేసరికి జరగరాని నష్టం జరిగిపోయింది కదా.
ఆదివారం. అమావాస్య. ఉదయం పదిగంటలైనా చీకటి దుప్పటి కప్పుకుని బయటకి రానంటూ పసి పిల్లాడిలా మారాం చేస్తున్నాడు సూర్యుడు. చుట్టూ చిరు చీకట్లు. రూతమ్మ టీచర్, కమలమ్మ టీచర్, సుశీలమ్మ టీచర్, ఆఫీస్ గుమస్తా దేవదానం తో పాటు మేము పదవతరగతి ఆడపిల్లం ఇరవై మందిమి. బీచిలో సముద్రపు అలలు పరవళ్లు తొక్కుతున్నాయి. వాటితో పోటీ పడుతూ పరువపు వయసు తుళ్ళింతలతో మేము బీచి ఒడ్డున కేరింతలు కొడుతున్నాము. ఇసక లో గవ్వలు ఏరుకుంటున్నాం. కాస్త పెద్ద గవ్వ దొరికితే చాలు. వజ్రం దొరికినంత సంబరం మాలో. సముద్రం ఒడ్డున ఉన్న తడి ఇసకలో పరిగెడుతూ వంతులు పడి మరి వెతుకుతున్నాం. ఎగిసి వస్తున్న అలలనుంచి గుప్పెటతో నీళ్ళు పట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళం చల్లుకుంటున్నాం. సముద్రం నీళ్ళల్లో పిక్కలు తడిసేంత లోపలకి వెళ్ళాం. రూతమ్మ టీచర్ కర్ర పట్టుకుని నీళ్ళోకి దిగొద్దని మమ్మల్ని అదిలిస్తూనే ఉంది. అల్లంత దూరం నుంచి ఆకాశంపైకెగసి వేగంగా వస్తూ చప్పున కిందికి దూకే కెరటాలు ఒడ్డుకు చేరినప్పుడల్లా చల్లటి నీళ్ళు జల్లుల్లా మమ్మల్ని ఆపాదమస్తకం తడిపేసిపోతుంటే ఒళ్ళు జల్లుమనిపించింది.
ఆ రోజు బీచికి చాలామంది వచ్చారు. ఒడ్డు వెంబడి జనాలు గుంపులు గుంపులుగా నీళ్ళల్లో దిగి ప్రపంచాన్ని మరచిపోయి ఎవరి ఆనందంలో వారు చిందులు వేస్తున్నారు సముద్రపు నీళ్ళల్లో. మా టీచర్స్ ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నారు. మాకేమో ఇంకాస్త లోతు నీళ్ళలోకి పోవాలనుంది. ఇంకాస్త లోపలి దిగుదాము అని నేను వాళ్ళిద్దరిని రెచ్చగొట్టాను. కాస్త భయంగా ముగ్గురం ఒకరిచేతులు ఒకరం పట్టుకున్నాం. మెల్లగా నీళ్లలో ముందుకు పోతున్నాం. నీళ్ళు ఒంటికి తగులుతుంటే ఎంత గమ్మత్తుగా ఉందో. నీళ్ళు మోకాళ్ళు దాటి నడుమును తడిపేసాయి. ఎంత సరదాగా, హాయిగా ఉందో ఆ క్షణం మాకు. మరుక్షణం ఏం జరిగిందో తెలియలేదు. గండ భేరుండ పక్షి రెక్కలు చాచి మీదకు వస్తున్నట్లు శరవేగంతో ముందుకు వచ్చిన ఓ కెరటం మమ్మల్ని సముద్రం తన లోపలికి లాగేసుకుంది . కాళ్ళ కింద ఇసక కదిలిపోయింది. కళ్ళు కనపడ్డం లేదు. ముక్కు, నోట్లోకి ఇసక, ఉప్పటి నీరు వెళుతున్నాయి. ఉత్తర, మాధవి చేతులు నా చేతుల్లోనుంచి ఎప్పుడో జారిపోయినాయి. నీళ్ళల్లో మునిగిపోతున్నాను నేను.
మెల్లగా కళ్ళు తెరిచాను. ఎవరో నా పొట్ట మీద ఒత్తుతున్నారు. నా నోట్లోనించి నీళ్ళు బయటకి వస్తున్నాయి. దగ్గొస్తోంది నాకు. కాస్త తేరుకుని కళ్ళు తెరిచేసరికి, ఒడ్డున అంతా గోలగోలగా ఉంది. అరుపులు. పెడబొబ్బలు. ఏడుపులు. మాధవిని లాగిపెట్టి కొడుతోంది రూతమ్మ టీచర్. నీళ్ళల్లోకి ఎందుకు దిగారని. నీళ్ళల్లో ఎవరో మునిగిపోయారని సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు సముద్రంలోకి దూకారు. అప్పటికే మా పెద్దవాళ్ళు కొందరు ఒడ్డు దగ్గరకు వచ్చి మా టీచర్లను బండ బూతులు తిడుతున్నారు. ఏది ఎలా జరిగితే ఏమి. నా ప్రాణ స్నేహితురాలు ఉత్తర మూడు రోజుల తర్వాత ఉబ్బి పాలిపోయి అక్కడక్కడా చేపలు కొరికి, వికృతమైన దేహంతో శవమై తేలి మరో చోట సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఎంత నరకమనుకున్నారు..!, సముద్రం లోలోపలికి వెళదాం అని వాళ్ళిద్దరిని బలవంతం చేసింది నేను. అప్పుడు నన్నెవరూ ఏమీ అనకున్నా, ఉత్తర మరణానికి పరోక్షంగా నేనే కారణమని, అపరాధ భావంతో సగం చచ్చిపోయాను. చాల రోజులు కృంగిపోయాను. చాల కానీ మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ తర్వాతైనా నాయనమ్మ మాట వినుంటే ఈ రోజు నాకీగతి పట్టుండేది కాదు. ‘మనిషి వెనకటి గుణమేల మాను వినరా సుమతి’ అని సుమతి శతకంలో చెప్పినట్లు మెల్లగా నా పూర్వపు ప్రవర్తన నాతోనే ప్రయాణిస్తోంది అని అప్పుడు తెలియలేదు నాకు.
‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి తోసిందట.’ మా నాన్న కంటే నాలుగాకులెక్కువ ప్రేమ, గారాబం చూపించే భర్త దొరికాడు నాకు. పెళ్ళై, ఇద్దరు పిల్లలు పుట్టాక అయినా నా బుద్ధి మారొద్దా. ఉహు..కంటికి నచ్చినవన్నీ కావాలని నేను అడగడం ఆలస్యం, మరుక్షణం నేను కోరింది తెచ్చి నా చేతిలో పెట్టేవాడు. మా నాయన్ను మించిపోయాడు నా భర్త. అమ్మ గుణాలే పిల్లలకు వస్తాయో లేక అమ్మను చూసి తాము తండ్రి దగ్గర గారాలు పోవడం నేర్చుకున్నారో కానీ నా పిల్లలు కూడా నాలాగే తండ్రి దగ్గర గారాలు పోవడం నేర్చారు. వాళ్ళు ఏదైనా కావాలని అడగడం ఆలస్యం, మరు క్షణం వాళ్ళు కోరింది వాళ్ళ కంటిముందుకు వచ్చేది. అంతేనా నేను, పిల్లలు ఎక్కడికి పోదామంటే అక్కడికి ముందు వెనుక ఆలోచించకుండా తీసుకెళ్ళేవాడు ఆయన. అంత ప్రేమకు నేను అర్హురాలిని కాదేమో..!
నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటాను. నా అభిమాన హీరో సినిమాకి మొదటిరోజు, మొదటి ఆట కోసం పొద్దున్నే ఫ్రెండ్స్ తో కలిసి సినిమా హాలు క్యూలో నిలబడి, తొక్కుకుంటూ, తోసుకుంటూ, జుట్టు రేపుకుని, బట్టలు చింపుకొని టికెట్స్ ఎట్టకేలకు టికెట్స్ సాధించి ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో, ఘన విజయం సాధించినట్లు సినిమా చూడడం. ఆ కథలన్నీ నేను పిల్లలకు వివరించి చెప్తుంటే చప్పట్లు కొడుతూ విన్న నా పిల్లలు కూడా నన్ను అనుసరిస్తారని తెలియకపోయనే నాకు.
ఆ రోజు పొద్దున్నే మా అభిమాన హీరో సినిమాకి పోవాలనుకున్నాము. పిల్లలకు కూడా ఆ హీరో అన్నా, అతడు వేసే డాన్సులన్నా చాల చాల ఇష్టం. పెద్ద హీరో సినిమాకి మొదటి రోజు మొదటి షో అంటే జనాలు ఎక్కువ ఉంటారు అని భయపడి, ‘రెండు రోజుల తర్వాత పోదాము’ అని ఆయన బతిమాలినా మేము ససేమిరా అన్నాము. మొదటిరోజు మొదటి షో చూస్తేనే కిక్కు. ఎవరో మనకి కథ చెప్తే ఏం బాగుంటుందని ! ఇలా తప్ప ఇంకో ఆలోచనే లేదే ఆ సమయంలో నాకు. ఇప్పుడు ఓటీటీ లు, వెబ్ సిరీస్ ల కాలంలో కొత్త సినిమాకి నాలుగురోజులు ఆగివేళితే వచ్చిన నష్టమేమీలేదని ఓపిక పడితే ఎంత బాగుండేది. అసలు ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఇప్పుడు వారం రోజులు ఆడితే గొప్ప. నెల రోజులు ఆడితే సెంచరీ చేసినట్లే. ఆ తర్వాత ఎట్లా ఇంట్లో దర్జాగా కూర్చుని హోమ్ థియేటర్ అంత స్క్రీన్ లో సినిమా చూడవచ్చు. కానీ ఇందాక మీకు చెప్పాను కదా బుద్ధి బురదలోకి నెడితే ఎవరు ఏమి చేయలేరని. మా తెంపరి పనులకు అడ్డుకట్ట వేసేదానికి నాయనమ్మ లాంటి వాళ్ళెవరూ ఇప్పుడు లేరు కదా. ఎవరిలోకం వారిది. ఏకో నారాయణా అయిన బతుకులు.
మేము వెళ్ళేటప్పటికే జనం క్రిక్కిరిసి ఉన్నారు. ఇసకేస్తే రాలనట్లు ఉందక్కడ. అప్పుడైనా మేము వెనుతిరిగి ఇంటికి వెళ్ళుంటే ఎంత బాగుండేది. అంత అదృష్టం మాకెక్కడిదీ..!జనాల మధ్యలోకి వెళ్ళిపోయాము తోసుకుంటూ సినిమా చూడాలన్న ఉత్సాహంతో. ఈలోగా ఆ సినిమా హీరో హాలుకి వస్తున్నాడని జనాలు అరిచారు. అతడి మీద అభిమానమే కదా మమల్ని ఇంతదూరం తీసుకువచ్చింది. ఇంకేముంది. పెద్దగా ఈలలు, కేకలు , గోలగోలగా చెవులు తూట్లు పడుతున్నాయి. ఎప్పుడూ తెర మీద కనిపించే అభిమాన హీరో కళ్ళముందుకు వస్తున్నాడంటే ఎంత సంబరమని. మా అభిమాన హీరోని చూడాలని, కళ్ళేలు తెంచుకున్న గుర్రాల్లా మేము కూడా జనాలతో కల్సి పరుగులు తీసాము. బాబు నా చెయ్యి పట్టుకున్నాడు. పాప,ఆయన మాకు కాస్త దూరంగా ఉన్నారు. మా మధ్యలోకి కొందరు దూసుకువచ్చారు. మమ్మల్ని నెట్టేస్తున్నారు. ఊపిరాడడం లేదు నాకు. జనసందోహంలోనుంచి ఎలా బయటపడాలో తెలియక కంగారుగా బాబు చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాను. హీరో హాలు దగ్గరకి వచ్చేసాడని తొక్కిసలాట ప్రారంభం అయింది. దేవుడు ప్రత్యక్షం అయినా అంతగా తోసుకుంటూ చూడరేమో. నచ్చిన హీరో అంటే ఎంత ప్రేమ..! తెర మీద కనిపించి సాహసాలు చేసే హీరోని ప్రత్యక్షంగా చూడాలని ఎంత ఆత్రుత..! ఎంత అభిమానం..! నిజమే ప్రాణాలు ఇచ్చేంత అభిమానం!
సునామీలా దూసుకొచ్చిన జన ప్రవాహానికి నేను కింద పడిపోయాను. బాబు చెయ్యి ఎప్పుడో నా చేతినుంచి జారిపోయింది. ఎవరు కనపడడం లేదు. బాబు కోసం అరుస్తున్నాను. మా వారిని పిలిచాను. పాప కోసం గట్టిగా అరిచాను. నా పిలుపులు, అరుపులు అభిమాన జనారణ్యంలో ఎవరికీ పట్టని గోడు అయింది. నన్ను తొక్కుకుంటూ వెళుతున్నారు. చెప్పులు, బూట్ల కాళ్ళు బలంగా నామీద పడుతున్నాయి. ఊపిరి ఆగిపోతున్నట్లు చెమటలు కారుతున్నాయి. గొంతు తడి ఆరిపొతోంది. ఆ క్షణం చెప్పలేని దిగులు పుట్టింది. ఈ జన జాతర నుంచి బయట పడగలనా అని. బాబు, పాప, ఆయన ఎక్కడున్నారో ఏమిటో తెలియలేదు నాకు. అభిమానమా..ఎంత పని చేస్తివే! తమాయించుకుని అతికష్టం మీద లేచి కూర్చుని , గట్టిగా ఊపిరిపీల్చుకుని చుట్టూ చూసాను. జనాలు గుంపులు గుంపులుగా పరిగెడుతూనే ఉన్నారు. అదిగో బాబు అక్కడ కాస్త దూరంలో పడిపోయి ఉన్నాడు. అయ్యో.. అయ్యో.. బిడ్డను ఎవరో తొక్కుకుంటూ వెళుతున్నారు. దేవుడా..! వాడిని ఎలా చేరాలి నేను. అయ్యో.. ఎవరైనా కాపాడండి నా బిడ్డను. వాడిమీదే నా ప్రాణాలు అన్నీ పెట్టుకొని ఉన్నాను. పెళ్ళైన ఐదేళ్లకు పుట్టాడు నా బిడ్డ. ఎదురుచూసి ఎదురుచూసి, తల్లినవ్వాలని తపించిపోతే పుట్టిన బిడ్డ వీడు. నేను ఎక్కని గుడిమెట్టు లేదు. నోచని నోము లేదు వీడికోసం. తొమ్మిది నెలలు వాడిని కడుపులో మోస్తుంటే ఎప్పుడెప్పుడు వాడు భూమి మీద పడతాడా, ఎప్పుడెప్పుడు వాడిని నా పొత్తిళ్ళల్లోకి తీసుకుని ముద్దాడాలా అని ఆశపడ్డానని!
కానీ ఈ రోజు నాకు సాధ్యమైతే వాడిని మళ్ళీ నా కడుపులోకి తీసుకుని దాచుకోవాలని ఉంది. నా చిన్నారి బిడ్డను ఈ జనారణ్యం నుంచి రక్షించుకోవాలని ఉంది. అయ్యో. తొక్కేస్తున్నారు వాడిని. ఎంత అపురూపంగా పెంచుకున్నాను వాడిని. నేల మీద నడిస్తే వాడి లేత పాదాలు కందిపోతాయని, నా అరచేతుల్లో నడిపించాను వాడిని. ఇప్పుడు దిక్కులేని వాడిలా నేల మీద పడిపోయి ఉన్నాడు. ఆయన, పాప ఎటు పక్క ఉన్నారో. ఎలా ఉన్నారో..! కళ్ళ నిండా జనాల కాళ్ళ దుమ్ము పడుతోంది. కళ్ళు సరిగా తెరచి చూడలేకపోతున్నాను. జీవితంలో ఎప్పడూ కన్నీళ్ళు ఎరగని కళ్ళు నావి. ఇప్పుడు నా బిడ్డ కోసం దిగులు నిండిన సరోవరాలు అయినాయి నా కళ్ళు. ‘కళ్ళు వెళ్ళిన చోటికల్లా కాళ్ళు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు. మనిషి ఎప్పుడూ మనసు వెళ్ళని చోట ఉంటేనే క్షేమం ‘. నాయనమ్మ ఎన్ని లక్షల సార్లు చెప్పిఉంటుందో ఈ మాటలు. అప్పుడు నాయనమ్మ మాటలు పెడ చెవిన పెట్టాను. కాళ్ళు, మనసు వెళ్ళకూడని చోట ఉన్నానిప్పుడు. అనుభవిస్తున్నాను. ఇక ఇప్పుడు నాకు ఏమి వద్దు. నా బిడ్డ బాగుంటే చాలు. నా ఊపిరి కూడా పోసుకుని వాడు నిండు నూరేళ్లు బతకాలి.
అబ్బా.. ఎవరో అమాంతం మీద పడి తోయడంతో కింద పడిపోయాను. లేవలేకపోతున్నాను. జనాలు నన్ను తొక్కుకుంటూ పరిగిస్తున్నారు. వెల్లకిలా పడిపోయాను. అమ్మ్మ్మ్మ్…….! చేతి మీద తొక్కేసి వెళ్ళారు. చెయి విరిగినట్లు నొప్పి. నాపనైపోతోంది. బలవంతంగా పక్కకు తిరిగి బాబు వైపుకు చూసాను. వాడు చలనం లేనట్లు కదలకుండా పడివున్నాడు. అయ్యో..ఏమైంది నా బిడ్డకు. ఏడుపు వస్తోంది. గుండెలవిసి పోతున్నాయి. నా రోదన, వేదన వినేవారు ఎవరూ లేరు. ఎవరి లోకం వారిది. నా వెర్రి కోరిక, అభిమానం ఎంత పని చేసింది. అయినా చేతులు కాలాక, ఆకులు పట్టుకుని రోదిస్తే ఏం లాభం ? వాడు నా కొడుకు, నా బంగారు కొండ, నా మురిపాల బిడ్డ. నా ఉయ్యాల బిడ్డ. నా జంపాల బిడ్డ. నా జోలాలి బిడ్డ . వాడు చల్లగా ఉండాలి. వాడిని అందరూ దీవించండి.
అబ్బ్బ్బా..! ఎవరిదో బలిష్టమైన బూటు కాలు నా గొంతును గట్టిగా నొక్కేసింది. నా కళ్ళముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. శరీరం అచేతనమవుతోంది. నా ఊపిరి ఆగిపోతోంది….