70. ప్రవర

ఈ పక్షం “సారంగ” పత్రికలో నా కవిత “ప్రవర”. మిత్రులు చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. Afsar Mohammed గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో🌹🙏

నువ్వెవరంటే ఏం చెప్పను మిత్రమా

యుగయుగాలుగా చెప్పి చెప్పి అలిసిపోయాను..

అల్లంత దూరంలో నేను అస్పష్టంగా కనిపించినా

ముందు నీచూపు పడేది నా కనుబొమ్మల మధ్యనే కదా..

అక్కడ బొట్టు ఉందా లేదా అని చూస్తున్నావా?

లేదంటే చూపు కిందకి దింపి గడ్డంకేసి చూస్తున్నావా ?

అయినా నేనెవరో నీకు తెలియడంలేదు కదా

మనిద్దరం కలిసి బతికిన సమయాలను ఎన్నని గుర్తు చేయను చెప్పు!

ప్రాచీన శిలాయుగంలో నువ్వు నేను ఒకటిగానే ఉన్నాంగదా

ఆస్ట్రాలోపితెకస్ నుంచి హోమోసేపియన్ గా మారేంతవరకు

పచ్చిమాంసాన్నే పరబ్రహ్మ స్వరూపంగా తిన్నాం కదా మనిద్దరం..

బొట్లు గడ్డాలు తెలుసా మనకప్పుడు

ఆకులని కప్పుకుని చీకటి గుహల్లో

తలదాచుకున్నాం కదా..

అయినా నాకు నువ్వు నీకు నేను భరోసా అనుకున్నామానాడు

మరి ఈ రోజెందుకు నన్ను గుర్తించడం లేదు నువ్వు..

ఇప్పుడెందుకు నీకు నామీదింత ద్వేషం

నన్ను చూడగానే విషాన్నెందుకు చిమ్ముతున్నావు పగబట్టిన పాములా..

జీవన పరమపద సోపానపటంలో

కులమతాల నిచ్చెన మెట్ల వరుస మనకవసరమా ఇప్పుడు..

అడవిలో జంతువులకు ఆకలొక్కటే తెలుసు

నీకు నాకు ప్రేమ ద్వేషం రెండూ తెలుసు..

ద్వేషానికి ఫలితం వినాశనమే కదా

కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కోవడమే కదా..

చెలిమితో చాచిన నా చేయి అందుకోలేవా మిత్రమా

ఇన్ని ప్రవరలు చెప్పినా నేనెవరో నీకు తెలియడం లేదా?

ఆదిమానవుని వంశమే మనిద్దరిదని మరచిపోయావా?

ఆధునికమానవులుగా మనమేం సాధించామని?

జాతుల విద్వేషంతో సర్వం కోల్పోవడం తప్ప..

ఒక్కసారి కాలచక్రాన్ని వెనక్కి తిప్పి చూడు నేస్తమా

నువ్వు నేను ఒకటిగానే కనబడతాము..

అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వూ నేను

ఇద్దరం ఒకటనే ఇంగితం మనకి కలిగేంతవరకు కాలచక్రాన్ని వెనక్కి తిప్పుతూనే ఉందాం..

రోహిణి వంజారి

9000594630

15-07-2024