2. “దిగులు వర్ణం” – ఒక ఆధునిక ప్రయోగశాల

#diguluvarnam#poetryreview ఈనాటి “మహా” సాహితీ పత్రికలో నా “దిగులు వర్ణం” కవిత్వం గురించి ప్రముఖ కవులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారి సమీక్ష చదవండి. నా కవిత్వంలో నేను ఎరగని ఎన్నో కోణాలను వెలికి తీసి, నా దిగులుకి అసలు సిసలైన భాష్యం ను బహిర్గతం చేశారు Wilson Rao Kommavarapu విల్సన్ రావు గారు. వారికి ప్రేమాత్మక ధన్యవాదాలతో🌈💝

04.01.2026 “మహా’ లో ప్రచురితం

వచన కవిత్వం ఒక స్వతంత్ర కవితా రూపమే కాదు.. ఆధునిక మనిషి ఎదుర్కొంటున్న సామాజిక, వ్యక్తిగత, తాత్విక సంఘర్షణలను ఏకకాలంలో ఎలాంటి పరిమితులు లేకుండా వ్యక్తీకరించగల శక్తిమంతమైన సృజనాత్మక ప్రక్రియ. మనిషి ఉనికి, దైవం పాత్ర, ప్రకృతితో అతనికి ఉన్న సంబంధం, మరణం యొక్క అనివార్యత వంటి మౌలిక ప్రశ్నలపై వచన కవిత్వం లోతైన తాత్విక చర్చను ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరణతో జీవన సత్యాన్ని, తాత్విక భావాలను సరికొత్త రూపకాలతో (New Metaphors) సృజనాత్మకంగా ఆవిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. అటువంటి ప్రయత్నంగానే వంజారి రోహిణి తన కవిత్వాన్ని “దిగులు వర్ణం” పేరుతో సాహితీ లోకానికి సమర్పించారు.

‘నల్ల సూరీడు’ కథా సంపుటి, ‘విజయ మహల్ సెంటర్ కథలు’ వంటి రచనల ద్వారా పాఠకులకు సుపరిచితులైన వంజారి రోహిణి తాజా కవితా సంపుటి ‘దిగులు వర్ణం’. ఈ శీర్షిక కేవలం “బాధ” లేదా “విచారం” అనే సరళార్థాన్ని మించి, జీవితాన్ని, సమాజాన్ని చూడటానికి ఒక నిర్దిష్ట దృష్టికోణాన్ని—అంటే ‘దిగులు’ అనే భావాత్మక ఫిల్టర్‌ను—సూచిస్తుంది. అందువల్ల ఈ సంపుటిలోని అధిక భాగం కవితలలో నిరంతర విచారం, అంతుచిక్కని బాధ, తీరని ఏకాంతపు అనుభూతి (Melancholy) కేవలం కనిపించడమే కాక, భావోద్వేగాత్మకంగా ఆవిష్కృతమవుతుంది.

ఈ సంపుటిలోని ‘కన్నీటి జలధి’, ‘ఉనికి’, ‘దుఃఖపు వాగు మా నాయన’, ‘పహారా’, ‘సమాయత్తం’, ‘కాక్టెయిల్’ వంటి కవితా శీర్షికలు తీవ్రమైన బాధను, నిరాశను, వ్యవస్థాత్మక దోపిడీని వ్యక్తపరుస్తూనే, ఆ బాధను కేవలం వ్యక్తిగత వేదన స్థాయిలో ఆపకుండా ఒక స్పష్టమైన భావోద్వేగ దృశ్యంగా (Visual Emotion) మలుస్తాయి. పై కవితలలో భావం వర్ణనగా కాక, అనుభూతిగా పాఠకుని ముందుకు వస్తుంది

పైన పేర్కొన్న ఆరు కవితలలోని సామాజిక, వ్యక్తిగత వేదనల సారాంశం ‘దిగులు వర్ణం’ అనే శీర్షికలో ఒకే కేంద్రంగా ఏకీకృతమవడం ఈ సంపుటికి అంతర్గత ఏకత్వాన్ని అందిస్తుంది. అందువల్ల ఈ కవితలు విడివిడిగా చదివినా, ఒక సమగ్ర భావ ప్రవాహంలో భాగాలుగా అనిపిస్తాయి. ఇదే ఈ సంపుటి పాఠకుడిని ఆకర్షించే ప్రధాన కారణాలలో ఒకటి.

పై ఆరు కవితలు మొదట డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ (“…”)తో ప్రారంభమై, చివర్లో వాటితోనే ముగియడం గమనార్హం. ఇది కవయిత్రి ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక కవితా ప్రయోగంగా భావించవచ్చు. తన సాధారణ శైలి కాకుండా, తాను ఎంచుకున్న వేరొక దృక్పథం నుంచే ఈ కవితలు చెప్పబడుతున్నాయనే సంకేతాన్ని ఇది ఇస్తుంది. సాహిత్యపరంగా, ముఖ్యంగా కవిత్వంలో, ఒక కవిత మొత్తాన్ని ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉంచడం భావానికి ఒక విమర్శాత్మక దూరాన్ని కల్పిస్తుంది.

సాహిత్యంలో ఈ విధమైన నిర్మాణానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. మొదటిది — ప్రత్యక్ష ఉటంకింపు (Direct Quote). అంటే ఆ కవిత మొత్తం మరొక వ్యక్తి లేదా పాత్ర యొక్క అంతరంగ స్వరంగా పాఠకుడికి వినిపించాలనే ప్రయత్నం. రెండవది — వ్యంగ్యం లేదా ఎత్తిచూపడం (Irony / Highlighting). సమాజం అంగీకరించిన ఒక సత్యాన్ని లేదా అబద్ధాన్ని యథాతథంగా ఉటంకిస్తూ, దానిపై విమర్శను నిర్మించడం. ఈ ఆరు కవితలలో కవయిత్రి కేవలం పాత్రల గొంతుకగా మాత్రమే కాక, వాటి ద్వారా సమాజాన్ని నిలదీసే విమర్శకురాలిగా నిలుస్తుంది.

ముఖ్యంగా తన గొంతు ద్వారా ఉటంకించబడిన మాట అనే అర్థం బలంగా ఉంటుంది. కవితా రూపంలో ఉంటే, ఆ భావాలు లేదా మాటల ఎంపిక మాత్రం కవయిత్రిదే అవుతుంది.

పైన ఉదహరించిన ఆరు కవితలలో ఏముందో చూద్దాం.

కన్నీటి జలధి’ (పే.30) కవిత కులం, మతం, నైతికత లేని సమాజం పట్ల ఒక సున్నితమైన మనస్తత్వపు ఆవేదనను వ్యక్తం చేస్తుంది. “మనిషి జాడ మాత్రం జాడే లేదు” అనే వాక్యం నేటి సామాజిక సంక్షోభాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది. అయితే చివర్లో కనిపించే “మానవత్వపు మనిషి” పట్ల ఉన్న ఆశ ఈ కవితకు పునరుద్ధరణ(Restoration) భావాన్ని అందిస్తుంది.

ఇందులో పదునైన వ్యంగ్యం కనిపిస్తుంది. మనుషుల కొట్లాటలను ‘కాట్లకుక్కల’తో పోల్చడం ద్వారా, మనిషి తన నైతిక విలువలను ఎంతగా దిగజార్చుకున్నాడో రచయిత్రి ఉద్వేగ పూరితంగా వ్యక్తం చేశారు. కవిత మొదటిలో ఆక్రోశం ఉన్నా, చివరికి “మానవత్వపు మనిషి నెత్తిపై కన్నీటిని, పన్నీటిని కలిపిపోస్తాను” అనడం ఈ కవితలో మంచి అభివ్యక్తికి నిదర్శనంగా భావించవచ్చు

‘ఉనికి’ (పే.57) కవితలో మాటలకన్నా మౌనంగా, చర్యల ద్వారా వ్యక్తమయ్యే నిస్వార్థమైన దాంపత్య ప్రేమ చిత్రితమవుతుంది. ఖరీదైన ప్రేమ చిహ్నాలను తిరస్కరించి, గృహ జీవితంలోని సాధారణ అంశాల ద్వారానే అసాధారణమైన ప్రేమను వ్యక్తం చేయడం ఈ కవిత ప్రత్యేకత. “మా ప్రేమ భాష మౌనం” అనే ముగింపు వాక్యం ఈ బంధంలోని లోతును ప్రతిబింబిస్తుంది

‘అడుగుల సవ్వడే హిందోళరాగం’ (శవ్ర్య రూపకం), ఇల్లంతా రంగులద్దుకునేవి’ (దృశ్య రూపకం), వంటలోని రుచిని ‘అనురాగమేమో’ అనడం (భావోద్వేగ రూపకం) వంటి సున్నితమైన ఉపమానాలు/ రూపకాలు కవితకు సౌందర్యాన్నిచ్చాయి. ఈ కవిత ‘యాంటీ-రొమాంటిక్’ ధోరణిని అనుసరిస్తుంది. ‘ఖరీదైన హోటల్’, ‘గులాబీలు’, ‘ఐ లవ్ యు’ వంటి ఆధునిక ప్రేమ చిహ్నాలను తిరస్కరించి, గృహ జీవితంలోని సాధారణ అంశాల ద్వారా అసాధారణమైన ప్రేమను వ్యక్తం చేసి మంచి అభివ్యక్తిని సాధించారు. ‘మా ప్రేమ భాష మౌనం’ అనే మాటలు, ఈ బంధంలోని లోతును, పరస్పర అవగాహనను, మరియు అపారమైన నమ్మకాన్ని ఒకే వాక్యంలో నిక్షిప్తం చేసి, కవితకు మంచి ముగింపునిచ్చారు.

‘దుఃఖపు వాగు మా నాయన’(67) కవిత భారతీయ రైతు జీవితంలోని శ్రమ, ఆశ, నిరాశల విషాదాన్ని వ్యవస్థాత్మక దోపిడీ నేపథ్యంతో ఆవిష్కరిస్తుంది. ‘నెత్తుటి శిల’, ‘దుఃఖపు వాగు’ వంటి రూపకాలు అణచివేయబడిన రైతు ఆక్రోశాన్ని ప్రతిబింబిస్తాయి.

దేవుడికి తొలిమొక్కు చెల్లించినా, రెప్పకొట్టకుండా పంటను కాచినా, చివరికి ‘ఏలినోళ్ళ చీలికలు’, ‘దళారుల దందాలు’ ఆశల మీద అగ్నివర్షం కురిపించడం వ్యవస్థాత్మక దోపిడీపై తీవ్రమైన విమర్శ చేశారు కవయిత్రి. ఈ కవితలో కొంత వ్యంగ్యాత్మకం కూడా వుంది. ఆశలు ‘ధాన్యపు రాశులతో పోటీపడటం’ అనేది రైతు జీవితపు అత్యంత సహజమైన లక్ష్యాన్ని సూచిస్తుంది. కన్నీరు ‘దుఃఖపు వాగులో శోకపు మడుగులు కడుతూనే ఉంది’ అనే రూపకం రైతు విషాదానికి అనంతమైన దృశ్యాన్నిస్తుంది. రచయిత్రి రైతును బేతాళ కథల్లోని ఆశ చావని విక్రమార్కునితో పోల్చినా ‘విక్రమార్కుడు’ అనే ధైర్యం కూడా, వరదలు, కరువు, చీడపీడల చితిమంటలు అనే నిరంతర వైఫల్యాల పైనే ఆధారపడి ఉంటుంది. వైఫల్యాలు లేకపోతే ఈ గొప్ప ఆశకు విలువే లేదు. అదే ఈ కవితలోని లోతైన విషాద సత్యం.

‘పహారా’ (పే.70) కవితలో రైతును దేశ సరిహద్దుల్లో పహారా కాసే జవానుతో పోల్చడం ద్వారా అతని త్యాగాన్ని, అభద్రతను తీవ్రంగా ఎత్తిచూపారు. ‘పచ్చని పొలం- నా ప్రార్ధన మందిరం’ అనేది రైతు యొక్క వృత్తి పట్ల ఉన్న భక్తిని, దైవత్వాన్ని ప్రతీకగా చూపించారు. రైతు పాత్రను సైనికుడి పాత్రతో పోల్చడం ఈ కవితలోని శక్తివంతమైన ఉపమానం. రైతును ప్రకృతి శక్తులు, ‘వ్యవస్థలోని విధ్వంసక కుశక్తులు’ అనే రెండు శక్తులు నిలువరించడం వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా ప్రశ్నిస్తుంది.

‘ఆవేదనతో చిల్లులు పడ్డ నా ఆకలి పేగులకు మళ్ళీ మళ్ళీ మాచికలు వేసి కుట్టుకుంటూ..మీ ఆకలి తీర్చడానికి శ్రమిస్తాను’ అనే వ్యక్తీకరణ రైతుల ఆత్మ త్యాగాన్ని, నిరంతర పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపడంలోని కవయిత్రి అభివ్యక్తిని అభినందించకుండా వుండలేము.

కవయిత్రి రోహిణి, ఈ కవితలో, రైతు యొక్క పనిని ‘పహారా’ (రక్షణ) అనే కేంద్రీకృత భావనతో సమానం చేశారు. అయితే, జవాను తుపాకీతో సరిహద్దులో నిలబడగా, రైతు ‘ఉండేలు తిప్పుతూ’ కంచె వేసిన చేలో ఉంటాడు. జవాను రక్షణ స్పష్టంగా, గుర్తించదగినది అయితే, రైతు రక్షణ ‘ఆశ, నిరాశల త్రిశంకు స్వర్గం’ లో ఊగిసలాడే అభదత్రతో కూడుకొని ఉంటుంది.

‘సమాయత్తం’ (పే.98) కవితలో, ప్రకృతిలోని జీవన చక్రాన్ని, సృష్టికి మూలమైన ప్రేమ తత్వాన్ని ఆరాధించడం, జగత్తు ఆకలి తీర్చడానికి ప్రకృతి సిద్ధమవుతున్న విధానమే ఈ కవితలోని వస్తువు. ‘నింగి… నీటి బొట్లతో ప్రేమ వంతెనేసింది’ అనే రూపకం వర్షాన్ని ప్రేమ రూపంగా చూపి, ప్రకృతిని ఒక సంయోగ దృశ్యంగా వర్ణించారు. ‘హరిత కిరణాలు..అక్షయపాత్ర కావటానికి సమాయత్తమవుతున్నాయి’ అనేది ప్రకృతి యొక్క అపార దాతృత్వానికి ప్రతీకగా ఈ కవితలో చూపబడింది. కవిత మొత్తం ఒక శాంతమైన, ఆశాజనకమైన ధ్వనితో ప్రవహిస్తుంది. ‘పుడమి గుండె పులకించి’, ‘ప్రేమ చెమ్మతో తడుపుకుంది’ వంటి వ్యక్తీకరణలు ప్రకృతికి, జీవనానికి మధ్య ఉండే ఆర్ద్రమైన అనుబంధాన్ని నొక్కి చెబుతాయి. ‘జయహో హరితం, జయహో కిరణం’ అనే పంక్తులు ప్రకృతి ఆరాధనతో ముగిసి, కవితకు మంచి ముగింపుతో శోభనిచ్చాయి.

‘కాక్టెయిల్’( పే.100) కవిత మరణం పట్ల మనుషుల వైవిధ్యమైన, కొన్నిసార్లు కృత్రిమమైన ప్రతిస్పందనలను వ్యంగ్యంగా ఆవిష్కరిస్తుంది. “మనుషులంతా రకరకాల కాక్టెయిల్‌లా” అనే ఆధునిక రూపకం ఈ కవితకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ‘మంచు గడ్డలా మారతారు’ అనే వాక్యం ద్వారా, కొందరు తమ దుఃఖాన్ని లోపలే

స్తంభింపజేసుకుంటారని సూచించడం లోతైన మానసిక విశ్లేషణ. ఇది మంచి సిమిలీగా చెప్పవచ్చు . ఈ కవిత..ఆప్తుల మరణంలో కూడా రెండు కన్నీటి బొట్లు రాల్చని కఠిన శిలల ఉనికిని ప్రశ్నిస్తూ, దుఃఖంలో ప్రదర్శన కన్నా నిజాయితీ ముఖ్యం అనే సందేశాన్నిస్తుంది. కవయిత్రి జాలితో, వేదనతో ఈ విమర్శనాత్మక దృశ్యాన్ని చాలా భావ తీవ్రతతో ఆవిష్కరించారు. మనుషుల భావోద్వేగాలు అంతుచిక్కని ముగింపు, మరణం పట్ల మనుషుల ప్రతిస్పందనను మనం కేవలం చూడటం తప్ప, దానిని నిర్ణయించడం సాధ్యం కాదనే తాత్వికతను అందిస్తుంది. అర్థాన్ని (నిజాయితీని) కనుగొనే భారాన్ని పాఠకుడిపై ఉంచుతుంది.

వచన కవిత్వంలో నిత్యం వాడుకలో ఉన్న భాషను ఉపయోగించడం వల్ల, కవి/ కవయిత్రి యొక్క వ్యక్తిగత గొంతు (Unique Voice) మరియు తన ప్రాంతపు మాండలికం (Dialect) సులభంగా ప్రతిఫలిస్తాయి. పై ఆరు కవితలలో ‘ఉనికి’ కవితలోని మౌన ప్రేమ యొక్క వ్యక్తీకరణ ఈ కోవలోనిదే. పై విశ్లేషణలోని ‘కాక్టెయిల్’ కవితలోని మరణం పట్ల మనుషుల వైవిధ్యం, ‘సమాయత్తం’ కవితలోని పక్రృతి ప్రేమతత్వం తాత్విక కోణాన్ని చూపిస్తాయి.

జీవితానుభవాలు, సామాజిక పరిశీలనలు, వ్యక్తిగత భావోద్వేగాల మేళవింపే వంజారి రోహిణిగారి కవిత్వం. ఆమె కవిత్వం ఒక నిజాయితీతో కూడిన గొంతు. అది జీవితంలోని మాధుర్యాన్ని, కష్టాలను, ఆనందాలను… అన్నింటినీ సమతుల్యంగా పంచుకుంటూనే..స్త్రీల అణగారిన వర్గాల అంతరంగ భావాలను శక్తివంతంగా, సున్నితంగా వ్యక్తం చేస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే, ‘దిగులు వర్ణం’ ఒక కవితా సంపుటి మాత్రమే కాదు—నేటి మనిషి, సమాజం ఎదుర్కొంటున్న అంతర్మథనాలకు ఒక సున్నితమైన అద్దం. వంజారి రోహిణి కవిత్వంలో కనిపించే నిజాయితీ, అనుభవసారత, తాత్విక లోతు ఆమెను ఆధునిక తెలుగు వచన కవిత్వంలో ప్రత్యేకంగా నిలబెడతాయి.

— కొమ్మవరపు విల్సన్ రావు