ఎవరో నీ స్నేహం వద్దన్నారని గుబులేల
ఎవరో నిన్ను ద్వేషించారని బాధ ఎందుకు
మరెవరో నిన్ను చూసి అసూయపడ్డారని
విచారపడనేల ..
మరెవరో నీ ఉన్నతిని ఓర్వలేరని చింత నీకేల..?
ఇంకెరితోనో బంధం భారమని దిగులేల..?
వాళ్ళెవరో నీగురించి ఏమనుకుంటే నీకేమి..
అన్నీ పట్టించుకున్నావా.. నిన్ను నువ్వు కోల్పోయావే
నీలో నువ్వు లేనప్పుడు ఇక మిగిలింది శూన్యమే
పూలతో నువ్వెప్పుడైనా చెలిమి చేసావా..?
ఏనాడైనా నిన్ను ద్వేషించాయా అవి..
రంగులను నీ కళ్ళల్లో పులుముకోవద్దని అడ్డు చెప్తాయా పూలు.
పరిమళాలను ఆస్వాదించవద్దని నీ నుంచి దూరంగా పోతాయా అవి..
పూలతో ఓ సారి చెలిమి చేసి చూడు..
ద్వేషం అసూయ అనుమానం అవమానం
ఇవేమీ తెలియని పూలను ప్రేమించు..
కాసిన్ని నీళ్ళు పోస్తే చాలు .. గుప్పెడు గుప్పెడు
పూలను కానుకగానీకిచ్చేస్తాయి..
నువ్వేం మాట్లాడకపోయినా సరే..
పూలు మాత్రం నీకు బోలెడన్ని ఊసులు చెప్తాయి..
నీటి బుడగ లాంటి బతుకులో
ఒక రోజైనా ఎంత ఆనందంగా బతకచ్చో
నీకు నేర్పించి మరీ నేలరాలతాయి..


రోహిణి వంజారి
7-11-2022

Leave a Comment