“బహుళ” పత్రిక ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలో నా కవిత “సినాప్సెస్”. జ్వలిత మేడం కి ధన్యవాదాలతో. చిన్న కవిత చదవండి. బాధతో వ్రాసిన కవిత. అభినందనలు కాదు మీ అభిప్రాయం తెలుపండి
నీ జన్మస్థానం ఎక్కడో ఎరుకైననాడు
ఆకులలమలతో ఒంటిని కప్పుకున్న
రాతిగుహల నుంచి బయటపడి
చాల కాలమైంది నువ్వు
కాళ్ళు చేతులు చెవులు కళ్ళు
లాంటి రెండు సాధారణ అవయవాలే
మా దేహాల్లో ఇమిడి ఉన్న రెండు రొమ్ములు
ఎదురుపడిన స్త్రీ రొమ్ములను చూసిన నీకు
కామ వికారపు అవకరం కలిగిందంటే
నీ బుద్ధి పాతాళపు బురదలో కూరుకుపోయినట్లే
ఇక నీ భావికి నువ్వు బావి తొవ్వుకున్నట్లే
హిజాబ్ లను నడిరోడ్డు మీద తగులబెట్టే కాలం ఇది
బానిస పంజరాలను బద్దలుకొట్టి
సమాభివృధికి సమాయత్తమైన కాలం ఇది
నీలో ఇంకా ఈ దృష్టి అవకరం
విషప్పురుగు కాటుకన్నా అతి ప్రమాదం
సత్వర చికిత్స కావాలి ఇక నీ ఒంటినిండా
కామపు రసిని కార్చుతున్ననీ ఙ్ఞానేంద్రియాలకు
మదపు కుళ్లుతో దుర్గంధం వెదజల్లుతున్న
నీ నరాలను సెరిబ్రమ్ చేరకుండా కత్తిరించాలి
నీ మెదడులోని దుర్మార్గపు సినాప్సెస్ ని
ఏ రాతి బండకేసి బద్దలు కొట్టుకుంటావో
నీ విజ్ఞతకే వదులుతున్నాం
గుండెలపై చున్నీ కప్పుకోవాల్సింది మేము కాదు
నీ మనోనేత్రాన్ని కప్పియున్న కామపు శుక్లాలను
తొలగించుకోవాల్సింది నువ్వే ఇక.
రోహిణి వంజారి
9000594630