శుభోదయం. ఈ వారం “విమల సాహితీ ” మీ కోసం సర్వాంగ సుందరంగా మిమ్ములను అలరించడానికి మీ ముందుకు వచ్చేసింది. నిప్పు లాంటి నిజాలు, ఆలోచింపచేసే వ్యాసాలు, హృదయాన్ని ఆహ్లాదపరిచే కవితలు, కళ్ళు చెమ్మగిల్లించే కథలు, చవలలనిపించే సమీక్షలు ఇంకా ఎన్నో విషయాలతో ఈ ఆదివారం మీ కోసం ఇస్తున్న అక్షర కానుక ఈ విమల సాహితీ. పత్రిక ఆసాంతం చదివి మీ విలువైన అభిప్రాయాలు తెలపాలని కోరుకుంటూ.. దీనిలో అనేకానేక లైంగిక వివక్షలపై నా సంపాదకీయ వ్యాసం ఇక్కడ..
“నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది”
అన్నారు శ్రీ దేవుల పల్లి కృష్ణశాస్త్రి ఓ సినిమా పాటలో. అదే పాటలో “సమభావం సమధర్మం లేనిదే సహజీవనమనివార్యం” అని కూడా రాసారు. తాకడం కాదుకదా, మాటలతో కూడా ఆమెని వేధించడం సరికాదు అంటోంది చట్టం. స్త్రీ, పురుషులు ఇద్దరూ అన్నింటిలోనూ సమానమే. స్త్రీ, పురుషులు ఇద్దరూ ఈ విషయం తెలుసుకోవాలి.” స్త్రీ కి శరీరమే కాదు, మనసు కూడా ఉంది. దానికి గౌరవం ఇవ్వండి” అన్నారు చలం తన “స్త్రీ” వ్యాసాలలో. స్త్రీ ని భోగ వస్తువుగా, వంటకి, పడకకి మాత్రమే పనికి వచ్చే యంత్రంలా, పురుషుడు ఆడించే ఆటబొమ్మగా చూడడం అనేది ఇప్పుడు కొత్త కాదు. ప్రాచీన యుగం, మధ్య యుగం, రాజరిక, జమిందారీ వ్యవస్థల్లో ఆనాడు స్త్రీ ల పట్ల ఉన్న చిన్న చూపు నేటికీ కొనసాగుతుండడం కడు శోచనీయం. స్త్రీ కూడా పురుషునిలాగే శరీరము, మనస్సుల కలయికతో భౌతిక,మనో ధర్మాలను ఆచరించే మనిషి అని సమాజం గుర్తించాలి.
ఒక్కప్పుడు ఇంటికే పరిమితమైన స్త్రీలు ఎన్నోరకాలుగా పితృస్వామ్య వ్యవస్థలో బానిసలుగా, వ్యవస్థ ఉక్కు పాదాల కింద నలిగిపోయి, ఎన్నో తరాలు మగ్గిపోయి, ఎన్నో పోరాటాల అనంతరం పరదాలు, తెరలు దాటుకుని ఇప్పుడిప్పుడే బయటి సమాజంలోకి వచ్చి, తాము ఏ విషయంలోనూ, ఏ రంగంలోనూ పురుషులకంటే తక్కువ కాదు, ఇంటిని చక్కదిద్దుకున్నంత తేలికగానే అంతరీక్షంలోకి కూడా దూసుకుపోగలం అని నిరూపించబడిన దృష్టాంతాలు ఇటీవలి కాలంలో కోకొల్లలు.
అటువంటి స్త్రీలు తాము ఎన్నుకున్న రంగంలో తమని తాము నిరూపించుకోవడానికి ఇంటా, బయట కూడా ఏంతో శ్రమిస్తారు. ఆమె ఆఫీసులో పెద్ద ఉద్యోగి కావచ్చు. దినసరి కూలి కావచ్చు. పొలంలో పనిచేసే మహిళ కావచ్చు. ఏ రంగంలో అయినా స్త్రీ లు పని చేసే చోట పురుషుని నుంచి లైంగిక వేధింపులు సర్వసాధారణం అయిపోయాయి. భౌతికంగా తాకితేనే కాదు. వెకిలి చూపులతో సైగలు చేసినా, అశ్లీలపు మాటలతో మనసుని గాయపరచడం కూడా లైంగిక వేధింపు కిందికే వస్తుంది. ఉదాహరణకు : మీ ఫిగర్ సూపర్, పిటపిటలాడిపోతున్నావ్, నాతో డేట్ కి వస్తావా..ఇలాంటి మాటలు స్త్రీలను ఎంతగానో బాధిస్తాయి. తన రూపం, అలంకరణలకన్నా, తన ప్రతిభకు విలువ, గౌరవం ఇవ్వాలని ప్రతి ఆధునిక మహిళ కోరుకుంటుంది ఇప్పుడు.
మరి ఉద్యోగాలు, పనులు చేసేచోట మహిళలు ఎదుర్కొనే వివక్ష, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా పలు చట్టాలు, నిబంధనలు ఇప్పుడు తీసుకోరాబడ్డాయి. అయినా సరే ఏదో ఒక సాకుతో కొందరు మహిళలను వేధింపులకు గురిచేస్తుంటారు. చూపులతో, మాటలతో ఇబ్బంది పెడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఆఫీసులో తన సహోద్యోగుల కారణంగా వేధింపులకు గురైన ఓ మహిళ.. సహనం నశించి పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ ఘటనపై కోర్టు విచారణ జరిపిన అనంతరం కీలక తీర్పును ఇచ్చింది. ఏ రంగంలో అయినా, ఏ సంస్థలో పనిచేసే మహిళా సహోద్యోగినిని ఉద్దేశించి “ఫిగర్ బాగుంది, నువ్వు సూపర్ గా ఉన్నావు” అని చెప్పడం కూడా వేధింపులగానే పరిగణించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. “బాగా మెయింటైన్ చేస్తున్నావు అనడం, డేటింగ్ కు రమ్మనడం కూడా ఆమె గౌరవానికి భంగం కలిగించే అశ్లీల పదజాలం కిందకే వస్తాయని..ఇటువంటి వ్యాఖ్యలు చేసినవారు ముందుస్తు బెయిల్ కు అర్హులు కారని కోర్టు తేల్చి చెప్పింది. నిందితులను కస్టడీలోనే విచారించాల్సి ఉంటుందని సెషన్స్ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
కనుక తమ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, కూతురు లాంటి వారే పరాయి మహిళలు కూడా. ఇప్పుడిప్పుడే స్వేచ్చా ఫలాలు అందుకుంటున్న మహిళలను వీలైతే గౌరవించండి. వారి ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వండి. అంతే కానీ, వారిని మాటలతో, చేతలతో గాయపరచకండి. ఒక వేళ నోరు జారితే ఎలాగూ మిమ్మలను శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ ని ఆటబొమ్మ గా చూసే మగవారికి ఇది హెచ్చరిక.
మంచి సంపాదకీయం రాశారు మేడం. మీరు మంచి రచయిత్రి. మీ నల్ల సూరీడు కథలు చదవాలి.