విమల సాహితి ఎడిటోరియల్ 69 – చెరకు తీపి – చేదు విషం

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “చెరుకు తీపి – చేదు విషం” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

ఈమధ్యన ఒక ప్రముఖ సాహితీవేత్తలు తమ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ఎవరో ఒక కథా రచయిత వీరికి పిడిఎఫ్ లో తను రాసిన కథను పంపి, ఆ కథ ఎలా ఉంది చదివి చెప్పమని వారిని పదేపదే ఫోన్ చేసి అడిగారట. అనేక పనుల ఒత్తిడి వల్ల కథని చదవలేకపోతే, ఆ రచయిత మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి అడగడంతో, ఇక బాగుండదని సమయం మిగుల్చుకుని కథను ఆసాంతం చదివి, కథలో మార్చవలసిన కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుని, ఆ మార్పులు చేసినట్లేతే కథ ఇంకా బాగుంటుందని చెప్పాలనుకుని, ఆ రచయితకు ఫోన్ చేశారట ఎట్టకేలకు. అయితే ఫోన్ చేసినవెంటనే అవతల నుంచి “సార్.. కథ చదివారా ?” అని అడిగారట. వీరు “చదివాను. అయితే ” అంటూ తన మాట పూర్తి చేయక ముందే “కథ చాలా బాగుంది కదా సార్. ఏం మార్చబల్లేదు కదా” అన్నారట. వీరు నొచ్చుకొని ఇక చెప్పేది ఏముంది అనుకుని “చాలా బాగుంది. అల్ ది బెస్ట్” అని ఫోన్ పెట్టేశారట. అంటే ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఒక ముఖ్య విషయం ఉంది. అందరూ అని కాదు కానీ, కొందరు రచయితలు తాము రాసిన కథ గురించి ఎటువంటి నెగటివ్ కామెంట్ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు అని అర్థమవుతుంది. కథ బాగుందని పొగిడితే సంతోషం. కథ గురించి లేదా రచనా శైలి గురించి చిన్న విమర్శ చేసినా ఓర్చుకోలేని మనఃతత్వంతో ఉన్నారు కొందరు రచయితలు. అసలే తెలుగు సాహిత్యంలో విమర్శకారులు తక్కువ అనే అపవాదు ఉంది. ఇక సద్విమర్శను కూడా తట్టుకోలేకపోతే మంచి సాహిత్యం ఎక్కడనుంచి వస్తుందని అందరూ ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు.

చైల్డ్ సైకాలజీ ప్రముఖులుగా పేర్కొన్న మనఃతత్వ శాస్త్రవేత్తలు స్టాన్లీ హాల్, సిగ్మన్డ్ ప్రాయిడ్ లాంటి వారు పసి పిల్లల ఎదుగుదల, వికాసం కోసం పొగడ్త – నింద లేదా బహుమతి – దండనము వంటి ప్రయోగాలు పిల్లల మీద జరిపి, అంటే వారు చేసిన పనుల గురించి పొగిడినప్పుడు లేదా బహుమతి ఇచ్చినప్పుడు పిల్లల ఎదుగుదల ఎలా ఉంది, అదే సమయంలో వారు చేసిన పని బాగా లేదని తిట్టడం లేదా శిక్షించడం చేసినప్పుడు వారి అభివృద్ధి ఎలా ఉంది అని గమనిస్తూ, తద్వారా పిల్లల మనోవికాసానికీ, బుద్ధి కుశలతకు దోహదం చేసే కొత్త సిద్ధాంతాలు కనిపెట్టారు. కానీ ఇక్కడ సాహితీ ప్రపంచంలో ఉన్నది పసిపిల్లలు కాదు. ఒక కథ, లేదా కవితా లేదా సమీక్ష వ్యాసం ఏదో ఒకటి రాస్తున్నారంటే వారు కాస్తా పరిణితి చెందిన మనసు కలవారై ఉంటారు. అటువంటి వారు చిన్న విమర్శను కూడా అంగీకరించ లేకపోతే ఎలా? నాణ్యమైన సాహిత్యం ఎలా పురుడు పోసుకుంటుంది.

మన తెలుగు ప్రాచీన యుగ సాహిత్యం లో అనేక మంది నిష్ణాతులైన విమర్శకులు ఉన్నారు. వీరేశింగం పంతులు, విశ్వనాధ సత్యనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి, నాచన సోమన లాంటి చాలా మంది విమర్శకులు ఉన్నారు. ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య యన్. గోపి, నామిని వంటి ఆధునిక సాహితీ విమర్శకులు కూడా ఉన్నారు. అయితే రాను రాను తెలుగు సాహిత్యం లో విమర్శ పాత్ర తగ్గిపోతుందా అనిపిస్తోంది ఇప్పటి సాహిత్యాన్ని చూస్తుంటే. ” రాజు మెచ్చింది రంభ” అన్నట్లు ఎవరి కవిత్వం లేదా కథ, నవల వారికి ముద్దు అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో నాలుగు వచనాలను కోత కోసి రెండు వాక్యాలను కలిపి కవిత అని అంటున్నారు. ప్రపంచ స్థాయి కథల పోటీలు అని చెప్పి, బూతు కథలు రాసిన వారికి బహుమతులు ఇస్తున్నారు. సాటి రచయితలు కథ గురించి చిన్న విమర్శ చేస్తే కోపంతో విరుచుకుపడుతున్నారు. ఇది సాహితీ లోకంలో ఆరోగ్యకరమైన మార్పు కాదు.

సాహిత్యానికి తగిన విమర్శ లేకపోతే రచయితలకు, పాఠకులకు మధ్య సామాజిక బాధ్యతను ఎరుకపరచే సంధాన క్రియ లోపిస్తుంది. ఈ రోజుల్లో విమర్శ రాసే విమర్శకులు వాదాల మార్గాల్లోకి దిగి అధ్యయనం చేసి గతం సాహిత్య విమర్శ చరిత్ర లోతెరిగి ఉండడం కూడా అవసరం. నిజమైన, నిష్కర్షతో చేసే విమర్శను భరించే ఆత్మవిశ్వాసం రచయితలు కలిగి ఉండాలి. అప్పుడే సాహిత్య విమర్శ ఎదుగుతుంది., పదునెక్కుతుంది. తద్వారా అసలు సిసలైన అమృత భాండం లాంటి సాహిత్యం పాఠకులకు అందుతుంది.

రోహిణి వంజారి

సంపాదకీయం

20-10-2014.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *