విమల సాహితి ఎడిటోరియల్ 68 – అనువాద సాహిత్యం అనుసరణీయమేనా ?

అనువాదకుల లిస్ట్ చాంతాడంత ఉంది తెలుగులో. కానీ తెలుగు భాష లోని సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించేవారు వారు మాత్రం కరువైనారు. తెలుగు సాహిత్యానికి ఎందుకీ దుస్థితి. ఈ నాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

మన ఇంటి మంచి కూర ఎంత రుచిగా ఉన్నా పొరుగింటి పుల్లకూర మీదే మక్కువ ఎక్కువ’ ఈ నానుడి అందరికీ తెలిసినదే. మనవాళ్ళు ఎన్ని విజయాలు సాధించినా, మనలో ఎంత గొప్పదనం ఉన్నా ఒక్క ప్రశంస, ఒక్క ప్రోత్సాహం ఇవ్వలేరు మన అనుకునే వాళ్ళు. అదే ఇతరుల పట్ల ఆరాధనా భావం మాటల్లో చెప్పలేము. అన్నీ రంగాల్లో కనబడినట్లే, సాహితీ రంగంలో కూడా ఈ మార్పు ఇటీవలి కాలంలో స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు సాహితీ లోకంలో అనువాద సాహిత్యం గురించి చాల రకాల చర్చలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అసలు అనువాదం అంటే ఏమిటి? అనువాదం అనుసరణ ఒకటేనా ? అనువాదాల ఆత్మ ఏమిటి ?

దేవనాగరి లిపిని అనుసరించి అనువాదం అంటే పునఃకథనం అని అర్ధం. ఒకరు చెప్పినదానిని మరొకరు చెప్పడం అనే అర్ధంతో ఆధునిక యుగంలో ఒక భాషలో చెప్పిన విషయాన్ని మరొక భాషలో చెప్పడం అనే ప్రక్రియకు “అనువాదం” అనే పేరు స్థిరపడింది. స్థూలంగా మన అనువాదాలు రెండురకాలుగా విభజిస్తే భారతీయ సాహిత్యం నుంచి తెలుగు భాషలోకి అనువాదాలు ఒక రకం అయితే, విదేశీ భాషా సాహిత్యం నుంచి తెలుగులోకి అనువదించబడడం మరొక రకం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగు భాషలోకి అనువాదం అయినట్లుగా, తెలుగు నుండి ఇతర భాషలలోకి అనువదించబడిన రచనలు తక్కువ అని చెప్పడం కాదనలేని చేదు వాస్తవం

మొట్టమొదట సంస్కృత భాష నుంచి తెలుగులోకి అనువదించబడిన గ్రంథం “మహా భారతం”. ప్రాచీన సాహితీ యుగంలో అనేక గ్రంథాలు సంస్కృతం నుంచి తెనుగీకరించబడ్డాయి. ఆధునిక యుగంలో వీరేశలింగం పంతులుగారి ‘రాజశేఖర చరిత్ర’ కన్నడంలోకి అనువదించబడింది. గురజాడ అప్పారావు గారి ‘కన్యాశుల్కం’ కూడా కన్నడ భాషలోకి అనువదించబడింది. బ్రిటిష్ పాలకుల హయాంలో ఆంగ్ల భాష నుంచి అనేక గ్రంధాలు తెలుగులోకి అనువదించబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా గ్రీకు, పార్శి, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ ఇలా ఎన్నో రకాల భాషల్లో చేసిన రచనలు ఇతర భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. మన భారత ఉపఖండంలో ముఖ్యంగా దక్షిణ భారత ప్రాంతంలోని తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు వంటి భాషల్లో ఏంటో లబ్దప్రతిష్టులైన సాహితీకారులు ఎన్నో గ్రంథాలు రాశారు. నాటకాలు, కథానికలు, నవలలు, గేయాలు రాసారు. వాటిలో కొన్ని రచనలు ఇతర భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. అనువాదం ఇప్పుడు కొత్తగా వచ్చినదేమీ కాదు.

అనువాద రచనల గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవడం కాస్త హాస్యాస్పదంగా మరికొంత విచారకరంగా ఉంది. అనువాదం అంటే మనకి తెలుసు మూల రచనలోని ఆత్మ చెడకుండా ఇతర భాషల్లోకి అనువదించడం. ఇటీవల కొందరి సంభాషణల్లో ‘అది ఇతర భాష రచన అయినా తెలుగులోకి అనువదింపబడితే అచ్చం తెలుగులో రాసినట్లే ఉంది. పర భాష అని అసలు తెలియడం లేదు’ అనుకుంటునారు. కానీ అది సరైనది కాదు. ఇతర భాషల్లోకి అనువాదం చేసేపప్పుడు అనువాదకులు మూల భాషలోని భావం మారిపోకుండా చూడాలి. అనువాదాలు ఇతర బాషానువాదాల నుంచి కాకుండా మూల భాష నుంచి చేసుకోవడం వాంఛనీయం. సోవియెట్ యూనియన్ లో ఇదే విస్తృతమైన స్థాయిలో అనుసరింపబడుతుండడం మనకందరికీ తెలిసినదే.

అనువాదాల గురించి చెప్తూ శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు “నేను సొంతంగా రాశాను. అనువాదాలు చేశాను. అయితే నా అనుభవంలో సొంత రచనకన్నా అనువాదాలు నాలుగింతలు కష్టం” అన్నారు. అనువాదం చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. మూల భాషలోని భావం చెదరకుండా, అనువాద భాషలో అర్ధం మారకుండా, సరైన పదాలు ఎన్నుకోవడం చాల కష్టంతో కూడుకున్న పని. మూల భాష, అనువదించే భాష రెండింటి మీద మంచి పట్టు ఉన్న అనువాద సవ్యసాచులే తమ కౌశల్యాన్ని ప్రావీణ్యాన్ని అనువాదంలో ప్రదర్శించగలరు.

ఇటీవల బెంగుళూరులో జరిగిన “బుక్ బ్రహ్మ ఫెస్ట్ “లో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీ కారులు కలవడం జరిగింది. అయితే అక్కడ తమిళ, మలయాళం లాంటి ఇతర భాష రచయితలకు లభించిన గౌరవం, గుర్తింపు తెలుగు భాషా రచయితలకు లభించలేదు అని విచారం వ్యక్తం చేశారు అక్కడికి వెళ్లి వచ్చిన మన తెలుగు రచయితలు. ఇది నిజంగానే శోచనీయం. ఇతర భాషల్లో పుస్తకాలు చదివే పాఠకులు ఎక్కువ. అక్కడ రచయితలకు ప్రోత్సాహం కూడా ఎక్కువ. అక్కడ కుటుంబం గడవడానికి ఇతర కార్యకలాపాలు ఏమి జరపకుండా కేవలం రచనల ద్వారా, పుస్తకాల అమ్మకం ద్వారా ఉపాధి పొందే వారు ఉన్నారు. మన తెలుగులో రచయితలకు ప్రోత్సాహం చాల తక్కువ. పుస్తకాలు చదివే పాఠకుల సంఖ్య ఇంకా తక్కువ. రీల్స్, యూ ట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్, ఓ. టీ. టీలో సినిమాలు చూసేవారు ఉన్నారు కానీ పుస్తకాలు కొనేవారు, చదివేవారు తక్కువే. సాహితీకారులు, స్వచ్ఛంద సంస్థలు, పాలకులు కూడా ఈ విషయాలు గమనించాలి. ఇతర బాషల నుంచి తెలుగులోకి అనువదించినట్లే, తెలుగు భాషలో వచ్చిన ఉత్తమ రచనలను ఇతర భాషల్లోకి అనువదించడానికి అనువాదకులు ఆసక్తి చూపాలి. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాంతీయ విబేధాలు మరచి, తెలుగు భాషాభిమానులంతా తెలుగు రచనలు ఇతర భాషల్లోకి అనువాదం జరపడానికి నడుం బిగించాలి. తెలుగులో మనకు అత్యుత్తమ సాహిత్యాన్ని రచించే వారు ఉన్నారు.వారికి తగిన ప్రోత్సాహాకాలు అందించాలిన బాధ్యత మన ఇరు తెలుగు రాష్ట్రాల పాలకులది ప్రజలది కూడానూ.

ప్రస్తుత కాలంలో తెలుగు రచయితలలో ఎల్ ఆర్ స్వామి, రంగనాథ రామచంద్రరావు, ఎలనాగ, ప్రొఫెసర్ జివి రత్నాకర్, ముకుంద రామారావు, స్వర్ణ కిలారీ, ఉమా నూతక్కి, అవినేని భాస్కర్, శ్రీనివాస్ గౌడ్ లాంటి ప్రముఖ అనువాదకులు ఉన్నారు. తెలుగు భాషను భారతీయ భాషల్లో ఒకటిగా, ప్రత్యేకంగా చూపాలన్నా, ప్రపంచ బాషల సరసన నిలపాలన్నా, తెలుగు భాష అజరామరం కావాలన్నా ఈ అనువాదకుల అనువాద నైపుణ్యం మీదనే తెలుగు భాష ఆధారపడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు .

రోహిణి వంజారి

సంపాదకీయం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *