విమల సాహితి ఎడిటోరియల్ 58 – రెండో మెట్టు

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “రెండో మెట్టు” చదవండి . మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

దేనినైనా జయించాలంటే నిరంతర సాధన, అధ్యయనం చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఏకాగ్రచిత్తం కలిగివుంటేనే విజయం సాధ్యం అవుతుంది. ఇతరములైన బాహ్యవిషయాలపై పట్టు సాధించడానికి కూడా ఏకాగ్రత అవసరమే. అదే ఎవరి మనసును వారు జయించాలంటే? మన మనసు మన ఆధీనంలో ఉండాలంటే? ఆ మనసును సన్మార్గంలో నడిపించేందుకు ఓ మాధ్యమం కావాలి. ఆ మాధ్యమం పేరు దైవం కావచ్చు. లేదా మానవత్వం కావచ్చు. మరి దైవత్వం అంటే ఏమిటి? అసలు దైవం ఎవరు? ఎందుకు మనం పూజించాలి లేదా ప్రార్ధించాలి? ఒకవేళ దైవాన్ని పూజించకుంటే దేవుడు శపిస్తాడా?

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావించబడడం దైవత్వం అంటారు కొందరు. సాయమందించే చేతుల్లో దైవత్వం ఉంది అంటారు మరికొందరు. ప్రేమ, దయ, కరుణ ,సేవా ఇవన్నీ దైవత్వ గుణాలు అంటారు ఇంకొందరు. అసలు దైవానిది ఏ రూపం ? దైవానికి రకరకాల పేర్లు, రూపాలు ఎందుకు ఉన్నాయి. దైవత్వం ఒకటే అయితే ఇన్ని మతాలు ఎందుకు? ఇన్ని కొట్లాటలు ఎందుకు? యుద్దాలు, అస్తిత్వ పోరాటాలు, రక్తపాతాలు ఎందుకు? పసి బిడ్డల ఉసురు తీసిన విజయం మనకి అవసరమా? మందిరాలు, మసీదుల ద్వంసం అవసరమా? మత కలహాల్లో మారణహోమంలో పారే పసిబిడ్డల నెత్తుటిలో తడిసిన ఇటుకలతో పునాదులు నిర్మిస్తే, అది ఎవరికి శాంతిని ఇస్తుంది? మరి దైవాన్ని కాదనుకుంటామా అనే ప్రశ్న రావచ్చు?

నిశ్చయంగా దైవం అవసరమే. దైవత్వం అవసరమే. జీవితమంతా కరుడు కట్టిన నాస్తిక వాదులుగా పేరు తెచ్చుకున్న ప్రముఖులు, వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటాచలం, కె. సభా, త్రిపురనేని గోపీచంద్, మహాస్వప్న, భైరవయ్య, గోరా గార్లు మొదలైన వారు కొన్ని విపత్కర పరిస్థితుల్లో, తమ సమస్యలను తొలగించమని దైవాన్ని ప్రార్ధించారని బోగట్టా. చలం వంటి నాస్తిక ప్రముఖులు వారి అవసాన దశలో మనఃశాంతి కోసం రమణాశ్రమంలో చేరి చివరికి ఆస్తికులుగా మారిన విషయాలు కూడా మనకి తెలుసు. అయితే దైవాన్ని కానీ దైవత్వాన్ని కానీ విశ్వసించేవారు రెండు రకాలుగా ఉంటారు.సగుణోపాసకులు. నిర్గుణోపాసకులు. మనిషి చిత్తం అతి చంచలమైనది. ఒక్క క్షణం కూడా ఒక్క చోట స్థిమితంగా మనసును నిలుపలేము. ఇది మానవసహాజం. ఒక పక్క దైవ ప్రార్ధన చేస్తుంటే శరీరం, వాక్కు దైవనామాన్ని జపిస్తుంటే, మనసు మాత్రం మరెక్కడో సంచరిస్తుంది. అందుకే దైవానికి ఒక రూపం, పేరు పెట్టి, అలంకారాలు చేసి, ఆ రూపం ప్రతిరూపాలైన విగ్రహాలు, పటాలు ఎదుట కూర్చుని ఆ రూపాన్నే చూస్తూ, ఆ దైవ నామాన్ని జపిస్తూ ఉంటే, కనీసం ఇంద్రియాలన్నిటినీ కాసేపు కట్టడి చేయగలిగితే ఏకాగ్రత కుదురుతుంది. ఇలాంటి వారు సగుణోపాసకులు. అలా పూజలు చెస్తేనే దేవుడు కరుణిస్తాడని, తమ కష్టాలు తీరుస్తాడని సగుణోపాసకుల నమ్మకం.ఇది దైవత్వాన్ని చేరడంలో మొదటి మెట్టు.

ఇంకొందరు దైవం నామ, రూప రహితం. కాబట్టి ఎటువంటి విగ్రహాలు, పటాల ముందర కూర్చొని పూలు, పసుపు, కుంకాలతో పూజలు చేయనక్కరలేదు. నైవేద్యాలు నివేదించబడనవసరం లేదు. దైవత్వాన్ని విశ్వసించి మనకు మంచి జరగాలని ప్రార్థిస్తే చాలు అనుకునేవారు నిర్గుణోపాసకులు. వీరికి దైవ రూపం, నామంతో పని లేదు. కానీ ఇటువంటి సాధన చేయడం అనేది చాల కష్టతరం. ఇవి రెండు కాక మనకు ఏవి సాయం చేస్తాయో అవన్నీ దైవాలే. ఎవరు సాయం చేస్తారో వారంతా దైవాలే. మనం ఏకాగ్ర చిత్తంతో చేసే ఏ మంచి పని అయినా దైవమే అనే వారు ఉన్నారు. అందుకే వృత్తులు చేసేవాళ్ళు “చేసే పనియే దైవం” అనే రాసుకుని ఉంటారు. ప్రకృతిలో చెట్టు, పుట్ట, జంతుజాలం, పంచభూతాలు అయిన భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు, ఇవన్నీ కూడా మనిషికి సాయపడతాయి. మనిషి ఆకలి తీరుస్తాయి, దాహార్తిని తీరుస్తాయి, ప్రాణవాయువుని అందించి ఊపిరులూదుతాయి. మరి ఇన్ని సాయాలు చేసే ఇవన్నీ దైవరూపాలే కదా.

వీటితో పాటు కష్టంలో ఉన్న ఎదుటి మనిషిని ఆదుకునే ప్రతిమనిషిలో కూడా దైవత్వం ఉంది, “మానవ సేవే దైవ సేవ” అనే మథర్ తెరెసా లాంటి మానవతావాదులు ఉన్నారు. సగుణోపాసన అయినా, నిర్గుణోపాసన అయినా దైవత్వం యొక్క తత్వం తెలిస్తే చాలు. ఇక ప్రత్యేకంగా దైవాన్ని పూజించాల్సిసిన అవసరం లేదు. ప్రార్ధన చేయవలసిన ఆవశ్యకత అంతకన్నా లేదు. నువ్వు నేను ఒకటే. నీ కష్టానికి నేను సాయముంటా. నా బాధలకు నువ్వు ఔషధంగా మారు అనే భరోసా మనుషులకు ఉంటే మనిషికి, సాటి మనిషిని మించిన దైవం వేరే ఎవరు అవసరం లేదు. ఈ తత్వాన్ని గుర్తించడమే రెండవ మెట్టు. దైవం అంటే రూపం, మతం, నామం, పూజ, ప్రార్ధనలు మాత్రమే అనే మొదటి మెట్టు నుంచి దైవత్వం వైపు మనిషి చేరడానికి చేసే ప్రయత్నమే రెండవ మెట్టు.

రోహిణి వంజారి

సంపాదకీయం