విమల సాహితి ఎడిటోరియల్ 54 – ప్రకృతి ఒడిలో మమేకం

ఈ వారంలో విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి 🌹🙏

ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఇక ఫలితాలకోసం ఎదురుచూపు ప్రహసనం మొదలైంది. ఈసారి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో, ఎవరిని ఇంట్లో కూర్చోబెడతారో కాలమే సమాధానం చెప్తుంది జూన్ 4న.

కాలం అంటే గుర్తుకు వచ్చింది, ఇప్పటిదాకా నిప్పులు చెరిగిన గ్రీష్మ కాల ప్రచండ మార్తాండుడి ప్రతాపం కూడా ముగిసింది. అంతటా తొలకరి జల్లులు. ఎండ వేడిమికి నెర్రలు బారిన నేలలోకి నింగి అమృతపు చుక్కలను జారవిడిచింది. నేల పరవశించింది. మట్టి ఆనందంగా పరిమళాలను వెదజల్లింది. నింగికి ఆ నీటి ధారలు ఎక్కడివని..! సూర్యుని ఆ వేడిమి కిరణాలు సముద్రపు నీటిమీద పడి, నీరు ఆవిరై నింగిలోకి వెళితే ఆ నీటి ఆవిరిని ఒడిసిపట్టుకుని, నీటి సంచుల రూపంలో తమలో దాచుకున్న నీలి మేఘాలు ఆకాశ మార్గంలో విహరిస్తూ, చల్లగాలులు తమని తాకితే, ఆనంద పరవశంతో తమలో దాచుకున్న నీటి ధారాలను తిరిగి నేలమీదకు వాన జల్లుల్లా వదులుతాయి. సముద్రపు నీటిలో ఉప్పదనం ఉన్నా, ఒక్క వాననీటి చుక్కకి కూడా ఉప్పదనం ఉండదు. ఎంత విచిత్రమైనది ప్రకృతిలో ఈ జల చక్రం.

అంతేనా వాననీరు భూమిని తాకిన వెంటనే వాగులు, వంకలు, చెరువులు, దొరువులు నిండుతాయి. పదును వాన పడినా రైతులకు పండగే. కయ్యలు దున్ని విత్తు జల్లడానికి అనువైన సమయం కదా ఈ తొలకర్ల కాలం. నీటి చెమ్మ తగలగానే తన చుట్టూ గట్టిగా ఉన్న కవచాన్ని బద్దలు కొట్టుకుని విత్తులు మొలకెత్తుతాయి.. మొక్కలుగా ఎదుగుతాయి. ఆకులు,పుష్పాలు, ఫలాలు, విత్తనాలు ఎన్నింటిని ఇస్తాయని మన ఆకలి తీర్చడానికి. నిస్వార్ధ త్యాగం వాటిది. ఆహార వలయంలో చెట్లు, జంతువులు ఉత్పత్తి దారులు అయితే, మనిషి ఎప్పుడూ వినియోగదారుడే. బాక్టీరియా వంటి పరాన్నజీవులు కూడా విచ్చిన్నకారులుగా ఉపయోగపడతాయి. చెట్లు, జంతువులు ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయి.

జీవ సామ్రాజ్యంలో అత్యున్నతంగా ఎదిగిన మెదడు, తెలివితేటలు, భాష, భావ వ్యక్తీకరణ కలిగిన ఏకైక జీవులు మనుషులు. తమ తెలివి తేటలతో, అనుక్షణం ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ఇతర జీవులన్నిటినీ తన అదుపాజ్ఞలోకి తీసుకునేది కూడా మానవుడే. అయితే పరిమితమైన జ్ఞానం ఉన్న ప్రకృతిలోని జీవులన్నీ తమతమ జీవ ధర్మాలను ఏనాడు అతిక్రమించవు. అపరిమితమైన జ్ఞానం కలిగి ఉన్న మనిషి మాత్రం ఎప్పుడూ తన స్వార్ధం కోసమే బతుకుతాడు. చెట్లను నరుకుతాడు. జంతువులను అవసరానికి మించి చంపుతాడు. అభివృద్ధి అంటూనే ప్రకృతిలోకి విధ్వంసక కారకాలను విడుదల చేస్తాడు. కూర్చున్న కొమ్మని నరుక్కుంటూ ఆనందపడతారు. పాతాళంలోకి పడిపోతాననే ద్యాస ఉండదు. ఆకలి వేస్తే తప్ప క్రూర మృగాలు వేటాడవు. అదేపనిగా ఇతర జంతువులను చంపి, తమ నివాసాల్లో నిల్వ చేసుకోవు. శాఖాహార జంతువులు కూడా అంతే. ఆకలివేస్తే చెట్లనో, పచ్చ గడ్డినో తింటాయి తప్ప, చెట్లను కొట్టి తమ నివాసాల్లో వేసుకోవు. మనిషి మాత్రం తాను తినాలి. తన తర్వాత తన పది తరాలు తినాలి అనే అత్యాశతో అక్రమార్జన చేస్తాడు. .

ఇటువంటి అక్రమార్కులకు కొమ్ముకాసే ప్రభుత్వ పెద్దలు కూడా తమ మిత్రులకు సహజ వనరులను కట్టబెట్టడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. వివేచనలేని, విచక్షణ లేని అక్రమంగా జరుగుతున్న ప్రకృతి వనరుల విధ్వంసాన్ని తక్షణమే ఆపాలి. ప్రకృతి వనరులపై కొంతమంది అత్యాశాపరులైన వ్యక్తుల పెత్తనాన్ని వారి అన్యాయమైన, దుర్మార్గమైన వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించాలి. లేదంటే రోజురోజుకు అంతరించిపోతున్న అడవులు కనుచూపుమేరలోనే మనకు కనపడకుండా పోతాయి.

ఫలితం ప్రకృతి వైపరీత్యాలు. అతివృష్టి, అనావృష్టి. కరువు కాటకాలు. స్వయానా మనిషి కొని తెచ్చుకునే కష్టాలు. ఎప్పుడైతే మనిషి తాను ప్రకృతిలో భాగం అని, తను ప్రకృతిని సంరక్షిస్తే ప్రకృతి తనని సంరక్షిస్తుందని తెలుసుకున్ననాడు మనిషి ప్రకృతిలో మమేకం అవుతాడు. కాలానికి తగ్గట్టు ప్రకృతి స్పందించి, సకాలంలో ఎండ, వాన, శీతల కానుకలను మనపైన కుమ్మరిస్తుంది ప్రేమగా. అందుకే మనిషి ఏనాడు ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించకూడదు. అప్పుడే మనిషి ప్రకృతిలో మమేకం అయి, ప్రకృతి ఇచ్చే వరాలను సంపూర్ణంగా పొందగలడు .అందుకే మనుషులుగా మనం మన ధర్మాన్ని పాటించాలి. విరివిగా చెట్లను నాటాలి. అవి మన ఊపిరి తిత్తులకు వాయు వేణువులను ఊదుతాయి. ఆహారపు అవసరాలకు మించి జంతువులను చంపకుండా ఉండేనే మేలు. సాత్విక ఆహారం కూడా అప్పుడప్పుడూ మంచిదే. అనవసరంగా నీటిని వృధా చేయడం, అవసరానికి మించి విద్యుత్తు ను వాడటం కూడా తగ్గించుకోవాలి. ఎయిర్ కండిషనర్ల వాడకం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. సహజమైన ప్రకృతి సిద్ధమైన చల్లదానాన్ని ఇచ్చే వట్టివేర్లు లాంటి ప్రకృతి ప్రసాదాలను విరివిగా వాడాలి. భూమిలోని నీరు ఇంకిపోకుండా సంరక్షించుకోవాలి. మనిషిగా సాటి మనిషికి సాయమందించాలి. అందుకే అన్నారు “ధర్మో రక్షతి రక్షిత:” ధర్మం రక్షించేవారిని రక్షిస్తుంది.

రోహిణి వంజారి

9000594630