విమల సాహితి ఎడిటోరియల్ 53 – తాంబూలాలిచ్చేసారిక

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

“ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే – ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే – ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి”. నాయకులు, కార్యకర్తలు , ఓటర్లు అందరు కంటిమీద రెప్ప వేయకుండా ఎదురు చూసిన ఎన్నికల పోలింగ్ రోజు మే 13 అలా వచ్చేసింది. ఇలా వెళ్ళిపోయింది. కాలానిదేముంది. ఎవరిని పట్టించుకుంటుతుందది? నిముషాలు, గంటలు, రోజుల లెక్కన నిరంతర పయనం దానిది. అయితే మనుషుల పయనం ఎటువైపు? ఆశల వెంట, అధికారం వెంట, అవసరాల వెంట పరుగులు.

ఎన్నికల తేదికి ఓ రెండు మూడు నెలలు ముందుకు కాల చక్రాన్ని తిప్పితే ..! ఎన్నికల పండగ కోసం ఎన్నెన్ని కసరత్తులు. పథకాలు, పాదయాత్రలు, హామీలని! తాము అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామని ఎన్నెన్ని భరోసాలు. ప్రతిపక్ష నాయకుల మీద విసిరే విమర్శల తూటాలు ఎన్నని. ఇంటింటికి తిరిగి పేరంటానికి పిలిచినట్లు పదిమంది కార్యకర్తలను వెంట తిప్పుకుంటూ, ఎన్నికల మహోత్సవానికి వచ్చి, ఓటు వేయమని బొట్టు పెట్టి, చీరలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి మరి అభ్యర్దించడం[అడుక్కోవడం] అనే తంతు పూర్తయిపోయింది. ఇక కార్యకర్తల అత్యుత్సాహం చెప్పనలవి కాదు. నాయకుల కొమ్ముకాస్తూ, ఇల్లు, వాకిలి వదిలి, కుటుంబాన్ని గాలికొదిలి, నాయకుల వెంట నమ్మిన బంటుల్లా తిరుగుతూ, తమకేదో ఒరుగుతుందని ఆశతో కరిగిపోతున్న కాలం సాక్షిగా పోటీ పడుతూ నాయకుల వాహనాల వెనుక, రధయాత్రల వెంట రేయింబవళ్ళు తిరుగులాట.

ఇక ఓటరు మహాశయులు. నాయకులు ఎర చూపే నోటు తమ ప్రాధమిక హక్కులా భావించి, డబ్బు ఇవ్వమని నాయకుల, కార్యకర్తల కాలర్ పట్టుకున్నంత పనిచేశారు కొందరు. మందు, బిర్యానీల కోసం ఆశ పడి అన్నీ పార్టీల మీటింగులను జయప్రదం చేసారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు ఎటు తీసుకుపోతుందో అని ఒకింత ఆందోళన కలుగుతోంది. ప్రతి నాయకుడు తానే గెలుస్తాను అన్నంతగా మాయ చేసారు. “ఏక్ దిన్ కా సుల్తాన్”లు అయినా ఈ రెండు నెల్ల కాలంలో ఓటర్లను దేవుడికంటే ఎక్కువ నెత్తిన పెట్టుకున్నారు నాయకులు. ప్రచారాలు, హామీలు, పథకాలు, బహుమతులతో ఓటర్లను ఊపిరాడనీయకుండా చేసారు. అయినా ఓటరు నాడి ఎటువంటిదో పైనుండే పెరుమాళ్ళకు తప్ప అన్యులకు తెలియదు. చేసిన సర్వేలన్నీ తారుమారు కావచ్చు. ఎవరిని అందలం ఎక్కిస్తారో, ఎవరిని పాతాళంలోకి నెట్టేస్తారో తెలిసే ముసళ్ల పండగా ఇప్పుడు మన ముందుంది. ప్రజల కొరకు, ప్రజలవలన, ప్రజల చేత ఎన్నుకోబడే ఆ నాయకులు ఎవరా అని ఎల్లెడలా ఆసక్తి కొనసాగుతోంది.

ఓటరు దేవుళ్ళు..ఎవరు డబ్బు ఇచ్చినా పుచ్చుకునేవారు ఉన్నారు. ఓటు మాత్రం మీకే వేస్తాం అని నమ్మబలికే వాళ్ళు కూడా ఉన్నారు. ఎదురు చూసిన దినం రానే వచ్చింది. పోలింగ్ తేదికి రెండు రోజుల ముందే ఎన్నికల డ్యూటీ కోసం కేటాయించబడిన టీచర్లు, ఇతర ఉద్యోగుల సందడి మొదలైంది. అందుకోసం ట్రైనింగ్. డ్యూటీ ఏ సెంటర్లో ఉంటే అక్కడికి ఓటింగ్ సరంజామాతో, చేతుల్లో సూట్ కేసు లాంటి [ E.V.M. పెట్టెలతో సహా ] బస్సుల్లో వెళుతూ, అతి ముఖ్యమైన పని చేయడానికి వెళ్ళే కర్తవ్యపరుల్లా, దీక్షగా, ఆకలి, ఆందోళన లాంటి సినిమా కష్టాలు అనుభవిస్తూ, కాసింత కంగారుగా కనపడ్డారు. మొత్తానికి గత ఎన్నికలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ వేసే వారి శాతం పెరిగింది.

నగరాల్లో కొందరు విద్యావంతులు కూడా ఓటింగ్ కి దూరంగా ఉండి, రోమ్ నగరం తగలబడుతుంటే, నిశ్చంతగా ఫిడేలు వాయించుకున్న నీరో రాజులా నిమ్మకు నీరెత్తినట్లు ఇంటిపట్టున ఉండి సెలవు దినాన్ని ఫలవంతం చేసుకున్నారు. మరికొందరు ఎవరికి ఓటు వేస్తే ఏం లాభంలే, ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు ఒరిగేది ఏమి లేదనే మీమాంసతో ఉన్నట్లు కనపడ్డారు. వారు నిరాశతో ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. మరి కొందరు ఓటు వేయడానికి వచ్చి, లిస్ట్ లో తమ పేర్లు డిలీట్ అయినాయి అని తెలుసుకుని ఓటు వేయకుండానే నిరాశగా వెనుదిరిగిపోయారు. ఓటర్ల పేర్లను నమోదు చేసుకోవడం, లిస్ట్ లో ప్రతి ఒక్కరి పేరు ఉండేటట్లు చూడడం ఎన్నికల నియమావళి అధికారుల భాద్యత. ప్రతిఒక్కరు ఓటు వేయకపోతే ఎవరికి నష్టమో, ఒక్క ఓటు తేడాలో ఓడిపోయే అభ్యర్థిని అడిగితే చెప్తాడు. చాల దూరం నుంచి వచ్చినా వృద్దులు కూడా, లిస్ట్ లో తమ పేరు డిలీట్ చేయబడిఉందని నిరాశగా వెనుదిరిగి వెళ్ళిన సంఘటనలు దొర్లాయి.

అయితే ఈసారి చెప్పుకోదగ్గ పరిణామం ఏమిటంటే మహిళా ఓటర్ల శాతం గణనీయంగా పెరగడం. పల్లె, నగరం అనే తేడాలు ఇప్పుడు చాలావరకు సమిసిపోయాయి. సెల్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండడం. సోషల్ మీడియా, యు ట్యూబ్ వాడకం అందరికీ తెలియడంతో ఇప్పుడు ఎవరు గొర్రె దాటుగా లేరు. ప్రజలను గొర్రెలు అనుకుని, తాము చూపిన ఆశలకు, అతిశయాలకు లొంగిపోయి, తమని గెలిపిస్తారు అని నాయకులు అనుకుంటే వారు ఎన్నికల ఊబిలో కాలేసినట్లే ఈసారి. నాయకులు ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తీర్చమని, నిలబెట్టి, నిగ్గదీసి, తేల్చిపారేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు.

మే 13 వ తేదీన ఉదయం 6 గంటలనుంచి మొదలైన పోలింగ్, కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కొనసాగడం ఈసారి ఓటు వేయాలనే చైతన్యం చాల మంది ప్రజలకు రావడానికి ఓ చక్కటి నిదర్శనం. ఎలక్షన్ డ్యూటీ చేసే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారుల కష్టాలు మాత్రం పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు, కొన్ని చోట్ల భౌతిక దాడులు, కొండవీటి చాంతాడంత పొడుగునా బారులు తీరిన జనాలు, వీల్ చైర్లలో ఓటు వేయడానికి వచ్చిన వృద్దులు, చెరువులు, దొరువులు దాటుకుంటూ పడవల్లో, డోలీల్లో వచ్చిన ఓటర్ల సాక్షిగా పోలింగ్ అనే ప్రహసనం ముగిసింది.

ఇక మళ్ళీ మొదలైంది ఎదురు చూపుల ప్రహసనం. అంచనాలు, సర్వేలు, బెట్టింగులు, పోటీలు, ఘర్షణలు, ఆశలు, ఆశయాలు, ఆవేదనలు, అతిశయాలు అన్ని కట్టకట్టుకుని ఎదురుచూసే రోజు జూన్ 4. అప్పటి వరకు E.V.M. లను దాచిన గదుల దగ్గరే అందరి మనసులు తిరుగాడేది. నాయకులను కూర్చోనీయక, నిలబడనీయక, రెప్పవేయనీయక, ఆకలిదప్పులను మరిపించే బంగారు గనులు ఆ E.V.M. లు ఉంచిన గదులు ఇప్పుడు. ప్రజలు ఎవరికి పదవి పట్టం గట్టారో, ఎవరిని అధికార సింహాసనం మీద కూర్చోబెడతారో తెలియాలంటే జూన్ 4 వరకు అందరూ ఎదురు చూడాల్సిందే.

రేపు ఏమైనా జరగవచ్చు. రేపేమవుతుందో [జూన్ 4] తేలాలంటే ఎదురు చూడాల్సిందే.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630