భూమి దినోత్సవం సందర్భంగా ఈనాటి ‘విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక ‘ లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి
పక్షి శత్రువులనుంచి తనను తాను రక్షించుకోవడానికి, గుడ్లను పొదిగి పిల్లలను సంరక్షించడానికి, వాతావరణ మార్పులు తట్టుకోవడానికి, నానా యాతనలు పడి పుల్లాపుడక తెచ్చుకుని ఓ చెట్టు కొమ్మలో గూడునల్లుకుంటుంది. అంతే ఇక ఆ పక్షికి నిశ్చింత. ఆ గూటీని ఎన్నడూ వదలదు. ఏ తుఫాను గాలి గూటిని చెరిపేస్తేనో, ఏ గొడ్డలివేటు చెట్టుకొమ్మను కూలగొడితేనో తప్ప, ఇంకో గూటి గురించి ఆలోచించదు. మరి ఉన్న గూడు చాలదన్నట్లు ఆలోచించేదెవరు? స్వార్ధంతో ఆస్తులు కూడబెట్టేదెవరు? ఇంకెవరు..! జీవకోటి అంతటిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నా స్వార్ధంతో పాతాళానికి కుంచించుకు పోయినవారు మనుషులు.
ఒక ఇల్లు ఉంటే చాలదు. సిటీలో నాలుగైదు చోట్ల విల్లాలు ఉండాలి. ఒక కారు ఉంటే చాలదు. మార్కెట్లోకి కొత్త మోడల్ కారు వస్తే, అది తన ఇంటిలో ఉండాలి క్షణాల్లో. పదితరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదించాలి ఏమి చేసైనా, ఎన్ని అడ్డదారులైనా తొక్కాలి. తనకు అడ్డు వచ్చినవారిని తొక్కుకుంటూ వెళ్ళాలి. తనొక్కడి కడుపు చల్లగుండాలి. ఎవరెటు పొతే తనకేం. దేశం ఏమైపోతే తనకేం. ఇది నేటి సమాజంలో మనుషుల వైఖరి. అందుకోసం ఎన్ని అనర్ధాలకైనా పాల్బడతాం. ఎన్ని జీవులనైనా హతమారుస్తాం. అడవులు అడవులనే నరికివేస్తాం. తాత్కాలిక సుఖాలకోసం తహతహలాడుతాం. అదే నిజమనుకుంటే మాత్రం మనిషి నిప్పులో కాలేసినట్లే.
ప్రాణికోటినంతటిని తన గుండెలపై పెట్టుకుని, చల్లగా చూసే అవని, అమ్మ మన నేల తల్లి. ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవించినా సహనంతో అన్నింటికి ఓర్చి, అన్నింటినీ తనలోకి పొదువుకుంటుంది పిల్లలను సాకే తల్లిలా. అందుకే ‘భూ’ గ్రహాన్ని ‘భూమాత’ అంటున్నాం. సహనంతో అన్నింటినీ భరిస్తోందని, నిర్లక్ష్యం చేస్తే, అదనపుభారాన్ని మోపితే, కలుషితం చేస్తే, ఏదో ఒకనాటికి ఆగ్రహించక మానదు. అవని అయినా. అతివ అయినా. ఆదరిస్తే చల్లగా చూస్తుంది. ఆగ్రహిస్తే అంతం చూస్తుంది. ఇది తెలుసుకోలేని మనుషులు విచ్చలవిడిగా భూమి తల్లి గుండెలమీద తూట్లు పొడుస్తున్నారు. కాలుష్యపు రక్కసి కోరల కింద నేల తల్లిని బలిపెడుతున్నారు.
కబ్జా చేసి మరీ చెరువులను పూడ్చేస్తున్నారు. తన ఇంటికి కలప కోసం జంతువుల నివాసాలు అడవులు నరుక్కుంటూ వెళుతున్నారు. ఆధునిక సదుపాయాల రుచి మరిగి చెట్లను కొట్టేసి, కొత్త కొత్త ఫ్యాక్టరీలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం, అటవీ శాఖలో కొంతమంది, ధనవంతుల కొమ్ము కాస్తూ, వారికి అనుమతులిచ్చేసి, చూసి చూడనట్లు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితం భూమి కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం. ప్రాణవాయువు ఆక్సిజన్ ను విడుదల చేసే చెట్లను నరికి పరిశ్రమలు నెలకొల్పితే వాటి నుంచి, వాహనాల నుంచి విడుదలైయ్యే విషపూరిత రసాయనాలు, వాయువులు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఆర్సేనిక్, ఆమ్ల పూరిత విష పదార్థాలు జల, వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. నేల తల్లి మీద తూట్లు పొడిచి బోరు బావుల నుంచి ప్రాణాలు తోడేసినట్లు, పాతాళంలో ఉన్న నీటి ఊటలను కూడా పీల్చేసి, నీటిని తోడేసి, కన్నీటి చుక్కలు రాల్చడానికి కూడా గుండెల్లో చెమ్మ లేనంత బండబారి ఉన్నారు మనుషులీనాడు.
చెత్త, చెదారం వ్యర్థ పదార్థాలు, లక్షల సంవత్సరాలు కూడా భూమిలో కరగని ప్లాస్టిక్ వస్తువుల వాడకం, విష వాయువుల విడుదల, అవసరానికి మించి చెట్లను, జంతువులను హింసించటం, చంపటం, తన స్వార్థం కోసం… ఫలితం గ్లోబల్ వార్మింగ్. పర్యావరణానికి ముప్పు.
వ్యర్థ కాలుష్యాలే కాదు. యుద్ద కాలుష్యాలయిన అణు బాంబులు, అణు ఆధారిత విషవాయువులు భూమి పై వాతావరణ పొరల్లోకి, గాలిలోకి విడుదలై, సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి భూమిని రక్షించే ఓజోన్ పొరను నిట్టనిలువునా చీలుస్తున్నాయి.
ఒకప్పుడు మూడు కాలాలు, ఆరు ఋతువులు, సకాలంలో వర్షాలు, పచ్చటి చేలు, పాడిపంటలతో కళ కళలాడే పల్లెటూర్లు ఇప్పుడు ఒకప్పటి వైభవానికి శిథిల ఆనవాళ్ళు గా మిగులుతున్నాయి. వ్యవసాయం కరువైన పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళే వలస కార్మికులు . అడుగుకో అపార్ట్మెంట్. కనుచూపు మేరలో కానరాని పచ్చదనం. కాంక్రీట్ జంగిల్. గుక్కెడు నీళ్లు కూడా డబ్బు పెట్టి బాటిళ్ళలో కొనుక్కోవాల్సిన పరిస్థితి. భూమి లో 16 అంతస్తుల పార్కింగులు. పైన మాల్స్. భూమాత గుండెల మీద సమ్మెట పోట్లు. భూమి పొరలను చీల్చుకుంటూ పోతే, వాయు కాలుష్యం పెంచుకుంటూ పోతే భూమి పైన ఉష్ణోగ్రత దినదినానికీ పెరుగుతోంది.
అదుపు తప్పిన మనుషుల ప్రవర్తన సరైన మార్గంలోకి రాకుంటే, విచ్చల విడిగా విలాసాలకు అలవాటు పడితే, అవసరాన్ని మించి ప్రకృతి వనరులకు హాని కలిగించి, వ్యర్థాలను పెంచుకుంటూ పోతే భూమాత ఆగ్రహానికి గురై, ఏదో రోజు మనిషి మనుగడ జాడలు కూడా లేకుండా మాడి మసై పోతుంది. తస్మాత్ జాగ్రత్త అంటోంది భూమాత.
భూ కాలుష్యంతో పాటు మనో కాలుష్యం కూడా ముఖ్యమైనదే. స్వార్థం, కుల మత బేధాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాలు, అవినీతి, లంచగొండితనం ఇవన్నీ కూడా మనుషుల మనో కాలుష్యానికి ప్రమాదకరమైన కారకాలు. అదుపు తప్పి చేసే పని ఏదైనా అనర్ధానికి హేతువే.
మనుషులమని తెలుసుకుని, మనమంతా ఒకటని ఎరుక కలిగి, మానవత్వాన్ని రక్షించిన నాడు మనిషి కలుషితమైన మెదడును, కలుషితమైన పరిసరాలను అదుపులోకి తెచ్చుకుని, అవసరాలకు మించి విలాసాలకు పోకుండా, చెట్లను పెంచడం, పచ్చదనాన్ని రక్షించటం, నీటి వనరులను కాపాడుకోవటం,అడవి జంతువులకు హాని తలపెట్టకుండా ఉండటం, సాటి జీవుల పట్ల ప్రేమి కలిగి ఉండటం లాంటి ఉదాత్తమైన లక్షణాలు పెంచుకుంటూ, తమ మనసులోని మృగ లక్షణాలను అణచివేయగలిగితే మనుషులు మహాత్ములు అవుతారు.
ఈ ఏప్రిల్ నెల 22న భూమి దినోత్సవం సందర్భంగా విమల సాహితీ పాఠకులకు ఈ వ్యాసం అంకితం.
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630