విమల సాహితి ఎడిటోరియల్ 39 – సంతోషమా..! ఏది నీ చిరునామా..?

సంతోషమా..! ఏది నీ చిరునామా? ఈ నెల 20న World Happiness Day సందర్భంగా ఈ వారం ‘విమల సాహితీ పత్రిక ‘ లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🎊

ఏడాదికి 365 రోజులు. ప్రతి రోజు ఓ ప్రత్యేక దినమే. మదర్స్ డే, ఫాథర్స్ డే, ప్రేమికుల దినోత్సవం, సైనిక దినోత్సవం. ఏడాది పొడవునా ప్రత్యేక దినాలే. నవమాసాలు మోసి, ప్రసవ వేదన అనుభవించి, జన్మనిచ్చిన అమ్మ త్యాగానికి, ప్రేమకు కృతజ్ఞత చెప్పడానికి ఏడాదిలో ఒక్క రోజు సరిపోతుందా..? జీవితాన్ని ఇచ్చిన తల్లికి జీవితకాలం ఊడిగం చేసినా ఋణం తీరదు. మంచుగడ్డల మధ్య, మరణాన్ని లెక్కచేయక, ప్రాణాలు పణంగా పెట్టి, మన క్షేమం కోసం కావలి ఉండే సైనికుల త్యాగనిరతిని గుర్తించడానికి ఒక్క రోజు సరిపోతుందా..?
ఇప్పుడు “వరల్డ్ హ్యాపీనెస్ డే” మనముందుకు వచ్చింది. సంతోషంగా ఉండడానికి ఒక రోజు. వినడానికే హాస్యాస్పదంగా ఉన్నా నవ్వుల దినోత్సవం ఒకటి ఉంది అంటే విస్మయానికి గురికాక తప్పదు. అసలు సంతోషం అంటే ఏమిటి? అది ఎక్కడ దొరుకుతుంది? మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.
తనకేం లేకున్నా పర్వాలేదు. పక్కవాడికి మాత్రం ఏమి ఉండకూడదు. పక్కవాడు బాగుంటే మనకి కడుపుమంట. ఉన్న సంతోషం గాలికి ఎగిరిపోతుంది కొందరికి. మరికొందరుంటారు. ఎదుటి వారిని విమర్శిస్తే కానీ వారికి మనసు బాగుండదు. ఎదుటి వాడిని దూషించాలి. ట్రోలింగ్ చేయాలి. అనవసరపు విషయాలను నెత్తికి ఎక్కించుకోవాలి. ఎదుటి వాడిని విమర్శించాలి. వీలైనంత విషం కుమ్మరించాలి ఏదో ఒక మాధ్యమంలో. అప్పటికి కానీ ఆనందం కలగదు. ఇంకొందరుంటారు. అందరు కలిసికట్టుగా ఉన్న చోట పనిగట్టుకుని అడ్డుగోడలు కడతారు. మనుషులందరూ వేరువేరు అంటూ కుల గజ్జి, కుల దురభిమానంతో, మతాంధకారంలో మనుషులని మరచి, మానవత్వాన్ని విడిచి, ఎదుటివారిని దూషించడమే తమ ద్వేయం. తమకు నచ్చిన వాడు ఎంత దుర్మార్గుడైన, ఎంత అవినీతిపరుడు అయినా వాడు మన కులపోడు అనే కులపిచ్చి.
ఉచితానుచాలు మరచి, తమ మృగ రూపాన్ని బయట పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందేవాళ్ళు కొంతమంది. సామాజిక మాధ్యమాల్లో చెత్తని అందరికీ షేర్ చేసి, పనికి రాని చీప్ రీల్స్, లేకి జోక్స్, నానావిధ భ్రష్టకారి పనులకోసం అమూల్యమైన సమయాన్ని వినియోగించి, మెదడు పొరలకు చీడ ఎక్కించడం , కేంద్రనాడి వ్యవస్థకు చెదలు పట్టించి, అదే తమకి సంతోషం అనుకుంటూ భ్రమల్లో పరిభ్రమిస్తుంటారు. ఇవన్నీ నిజమైన సంతోషాలా..? ఇలాంటి సంతోషం కోసం ఒక రోజు గుర్తుపెట్టుకోవాలా?
ఇంకొందరు ఉంటారు. కోట్లు సంపాదించినా తృప్తి ఉండదు. పక్క వాడి బాగు అసలు సహించలేరు. పక్కవాడు నాశనం అయితే వీళ్ళకి ఆ రోజు కమ్మటి నిద్ర పడుతుంది. మనసు ఆనందంతో చిందులేస్తుంది వీరికి.
ఇవన్నీ సంతోషాలా..? మానసిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, వ్యక్తిత్వవికాస నిపుణులు ఎందరో ఎన్నో పరిశోధనలు చేసి, ఎందరినో కలిసి తమ అనుభవసారాన్ని రంగరించి చెప్పిన విషయం. సంతోషం అంటే సంతృప్తిగా జీవించడం. అందనివాటిని పొందాలనే ఆరాటంలో పరుగులు తీస్తూ, అందినవాటిని వదిలేస్తూ, నిరంతరం అసంతృప్తితో జీవిస్తూ, జీవచ్ఛంలా బ్రతుకీడుస్తూ గడుపుతుంటారు మనుషులు. కోరికలే దుఃఖానికి కారణం. కోరికలను త్యుజిస్తే అంతా ఆనందమే అంటాడు తధాగతుడు. ఏది ఆశించకుండా, ఫలితం గురించి కలత చెందకుండా నీ కర్మని నువ్వు నిర్వర్తించు అంటాడు గీతాచార్యుడు. ఇతరులకు మేలు చెయి. అప్పుడే అసలైన ఆనందం పొందగలవు అంటాడు మొహమ్మద్ ప్రవక్త. నిన్ను వలె నీ పొరుగువారికి ప్రేమించు. అదే విశ్వ ప్రేమకు, సంతోషానికి ఆలంబన అంటాడు క్రీస్తు.
నిన్ను నీవు తరచి చూసుకో. నీ గురించి నువ్వు తెలుసుకో. ఇతరుల నుంచి ప్రేమనో, మరేదో ఆశించేముందు నీవు ఇతరులకు ఏమి ఇస్తున్నావో గమనించుకో. నువ్వు ఏదైనా పొందాలంటే, ముందు నీకు ఇవ్వడం తెలిసి ఉండాలి. నీ ఆనందాన్ని పదిమందితో పంచుకో. నీకు లభించినదానితో సంతృప్తిగా జీవించు. నీ కర్తవ్యాన్ని లోపం లేకుండా నువ్వు నిర్వర్తించు. పక్కవాడు బాగు పడితే సంతోషించు. అలాంటి బాగు కోసం నువ్వు కూడా ప్రయత్నించు. మాటలతో, చేతలతో ఎవరిని హింసించకు. నీ పట్ల ఎదుటివారు ఎలా ప్రవర్తించకూడదు అనుకుంటావో అలా నువ్వు ఎదుటివారితో ప్రవర్తించకు. వాదులాటకు దిగకు. మౌనమే నీ ఆయుధంగా ధరించు. కాలం అన్నింటికీ జవాబు చెప్పి తీరుతుంది. అప్పుడు నీకు ఆనందం తప్ప మరే దుఃఖం అంటదు. స్వార్ధాన్ని విడిచి త్యాగధనులుగా జీవిస్తే, విశ్వవ్యాప్తమైన సంతోషం నీ సొంతమవుతుంది. పెద్ద పెద్ద విషయాలు వదిలివేయి. చిన్న చిన్న ఆనందాలు అనుభవించు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా అన్నం పెట్టు. ఆకలి తీరిన ఆ కళ్ళల్లో మెరుపులు చూడు. చిన్న మొక్కకు నీళ్ళు పొయి. విచ్చుకున్న పూల పరిమళాలు ఆస్వాదించు. నీకున్నదాంట్లో లేనివాడికి సాయం చెయి. ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎంత సంతృప్తినిస్తుందో గమనించు. నీ హృదయాన్ని మందిరంలా మార్చుకో. నువ్వు వేరే ప్రార్ధనలు చేయబల్లేదు. నీ మనసే సకల ఆనందాలకు మూలం. ఆ మనసుని పరిశుద్ధం చేసుకో. సంతోషం నిన్ను ఎప్పుడు వదిలిపోదు ఇక. ఇవన్నీ మనఃతత్వశాస్త్రవేత్తలు, మానవతావాదులు చెప్పిన సంతోష సూత్రాలు. ఆచరిస్తే ఆనందం మన ముంగిట్లోనే కదా.
ఈ నెల 20 వ తేదీన world happiness day సందర్భంగా విమల సాహితీ పాఠకులకు శుభాకాంక్షలతో..
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630