ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక కోసం నేను రాసిన సంపాదకీయ వ్యాసం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి

“ప్రేమ అనే పరీక్ష రాసి..వేచి ఉన్న విద్యార్థిని”, “ప్రేమంటే తెలుసుకోండి రా..ప్రేమించి సుఖపడండి రా..ప్రేమ తల్లిరా”, “ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు..కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు”. నిజంగానే ఇప్పుడు ప్రేమ కలలు కమ్మగా నిజం అవుతున్నాయా..? కల్లలుగా చెదిరిపోతున్నాయా..? ప్రేమ గురించి ఇప్పుడు చెప్పుకునే సందర్భం వచ్చింది.
మూడవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం క్రింద హింసించబడిన క్రైస్తవులకు పరిచర్య చేసినందుకు రోమ్ లోని సెయింట్ వాలెంటైన్ ను ఖైదు చేసారు. ఆయన త్యాగాలకు గుర్తుగా ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆ తర్వాత కూడా ఎందరో ప్రేమకోసం బలిదానాలు చేసిన పురాణ కథలు ఉన్నాయి. వాలెంటైన్స్ డే ని ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు.ఆ తర్వాతి కాలంలో వాలెంటైన్స్ డే అచ్చంగా ప్రేమికుల దినోత్సవం అయిపోయింది. అరవిరిసిన గులాబీలు, గ్రీటింగ్ కార్డులు, దుస్తులు, నగలు ఇలా బోలెడన్ని కానుకలు ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమికులు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని చెట్టూ, పుట్టల వెంట తిరగడం, పార్కులు, సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ ఎక్కడా చూసినా ప్రేమికుల సందడే.
సందట్లో సడేమియా అన్నట్లు ప్రేమ అనే భావన మీద వ్యాపారం చేసి, ఈ ఒక్క వాలెంటైన్స్ డే నాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ధనాన్ని అర్జించే వ్యాపారవేత్తలకు కూడా కొదువ లేదు. ఇక మన దేశంలో కూడా ప్రేమికుల దినోత్సవాన్ని చాల ఉత్సాహంగా జరుపుకుంటాయి ప్రేమ జంటలు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సరేసరి. తమ మనసులో దాచుకున్న ప్రేమను కూడా తమ ప్రేయసి, ప్రియులకు తెలుపుకునే ప్రొపోజ్ ని కూడా ఈ రోజు తెలపాలనుకుంటారు కొత్తగా ప్రేమలో పడ్డ యువతీయువకులు. కొన్ని సంస్థలు ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ, ‘ఇది మన సంసృతి కాదు, అంటూ ప్రేమికులను బెదరగొట్టి, మీది నిజమైన ప్రేమ అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోండి’ అంటూ బలవంతం చేయడం కూడా మనం చూసాం.
అయితే ప్రేమలు అన్ని నిజమైనవేనా?ప్రేమని స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నారా..? ప్రేమికులు ఆలూమగలుగా మారాక కొంతకాలానికే ఎందుకు బద్ద శత్రువులుగా మారి కాళ్ళ పారాణి ఆరకముందే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారు? ప్రేయసి ప్రేమికులదే నిజమైన ప్రేమనా? తల్లితండ్రులు, స్నేహితులు చూపించేది ప్రేమ కాదా? ఈ ప్రశ్నలు ఎవరికి వారు వేసుకుని తీరాలి. ఈ సందర్భంలో ఒకసారి చరిత్రని తరచి చూస్తే రోమియో-జూలియట్, లైలా-మజ్ను, పార్వతి -దేవదాసు లాంటి విఫల ప్రేమికుల కథలు మనకి తెలుసు. పెద్దలను ఒప్పించలేక విడిపోయి జీవితాన్ని అంతం చేసుకునే ప్రేమికులు, తల్లిదండ్రుల కుటుంబ పరువు పిచ్చి, ఊరికట్టుబాట్లు ,కులమతాలు అంటూ దారుణంగా ప్రేమజంటలను హత్య చేసే నికృష్టపు మనుషులు కూడా మన సమాజంలో ఉన్నారు. అయితే పెద్దలను నొప్పించో, ఒప్పించో తమ ప్రేమని పెళ్ళి దాక తీసుకుని వెళతాయి కొన్ని జంటలు. ఎంతవేగంగా ప్రేమలో పడతారో, పెళ్ళి అయినాక అంతకంటే వేగంగా వీడిపోయే జంటలను మనం చూస్తున్నాం. దీనికి కారణం తరచి చూస్తే ప్రేమ అంటే కేవలం శారీరక ఆకర్షణ, వయసు వేడి అనుకోవడం అది చల్లారిపోయాక నిజమైన వ్యక్తిత్వం బయట పడడం. నిజానికి ఏ ఇద్దరు వ్యక్తులు ఎప్పటికీ ఒకే రకమైన వ్యక్తిత్వం, అభిప్రాయాలూ, అలవాట్లు కలిగిఉండరు. కానీ ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ, తమ గౌరవానికీ, అత్మాభిమానానికీ భంగం కలగకుండా, ఆహాలను వీడి, సర్దుకుపోవడంలోనే ప్రేమ శాశ్వతం, అజరామరం అవుతుంది.
ఈ సందర్భంగా ఒకసారి బాపు గారిని ‘మీరు,రమణ గారు ఎప్పుడూ కలిసే ఉంటారు. మీ మధ్య ఒక్కసారికూడా అభిప్రాయ బేధాలు రాలేదా?’ అని ఎవరో అడిగితే ‘ ఇరువురి మధ్య బంధం నిలవాలంటే కొన్నింటిని భరించాలి’ అన్నారట. ప్రేమికులు అయినా, ఆలుమగలు అయినా, స్నేహితుల మధ్య అయినా అపార్ధాలు అనే అడ్డుతెరను తొలగించుకుని, అవసరం అయితే ఒక్క ‘మన్నించు’ అనే పదంతో బంధాన్ని మరింత దృడంగా నిలుపుకోవచ్చు. ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన. ప్రేమికుల మధ్యనే కాదు. స్నేహితులు, తల్లిదండ్రులు చూపించేది కూడా అద్భుతమైన వాత్సల్యమే. ఆ ప్రేమను నిలుపుకోవడంలోనే ఉంది అసలైన ప్రేమ.
ఈ రోజు ఫిబ్రవరి 14 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వాలెంటైన్స్ డే సందర్భంగా విమల సాహితీ పాఠకులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.
రోహిణి వంజారి
సంపాదకులు
9000594630
14-2-2024