విమల సాహితి ఎడిటోరియల్ 30 – ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయం “ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు”. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి

నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు జరుపుకుని అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. రెక్క విప్పుకున్న గువ్వ పిట్టని ఎగరనీయకుండా ఆపడం ఎవరికైనా సాధ్యమా..? అదేవిధంగా కాలాన్ని ముందుకుపోనీకుండా ఆపడం, సూర్యుడి తేజస్సుకి అరచేయి అడ్డుపెట్టి ఆపడం కూడా ఎవరితం కాదు. అందుకే అంటారు ధనం, గొప్ప పేర్ల కంటే విలువైనది కాలం. డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించవచ్చు. గొప్పపేరు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. కానీ ఒక్క క్షణం వృధా చేసినా అది గతం జాబితాలోకి వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కాలం మునుముందుకు దూసుకుపోతుంటే మనం ఎక్కడో చాల వెనుకబడి ఉన్నాం అనిపిస్తుంది. ముఖ్యంగా ఈనాటి యువత గురించి చెప్పుకోవాలి.
యువ రక్తం. కొండలను అయినా పిండి చేసే యువ శక్తి. లావాలాగా ఉప్పొంగే ఉడుకు నెత్తురు, ఇనుప సంకెళ్లలాంటి బలమైన నరాలు గలిగిన యువత. కౌమార దశను వీడి యవ్వనంలోకి అడుగిడి జీవితంలో అతిముఖ్యమైన మరియు శారీరక, మానసిక శక్తులన్నీ తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించగల యువ దశ.
అయితే ఈనాటి యువశక్తి అంతా ఎక్కడ కేంద్రీకృతమై ఉంది చూస్తుంటే ఒకింత ఆందోళన కలగక మానదు. ఎన్నెన్నో ఆశయాలు, లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. అయితే వాటిని సాధించడానికి చేసే ప్రయత్నాలను కూడా ఎంతో అట్టహాసంగా ప్రారంభిస్తారు. మధ్యలో ఏదైనా ఓ చిన్న ఆటంకం కలిగినా వెనకడుగు వేస్తారు. మానసికంగా కృంగిపోయి పానిక్ అయితాము ఎందుకూ పనికిరాము, ఏమి సాధించలేము అని ఆత్మహత్యలకు పాలబడతారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థుల్లో ఈ విధమైన మానసిక రుగ్మతల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కళాశాల యాజమాన్యాల ఒత్తిడులు, తల్లిదండ్రుల పేరాశ కూడా విద్యార్థులను కృంగదీసే అంశాలు. యువత కన్నా ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. తమ బిడ్డలు డాలర్లను తయారు చేసే యంత్రాలుగా చూస్తూ, విదేశాలకు వెళ్ళి సంపాదించమని ఎగదోస్తున్నారు. తల్లిదండ్రులు తెలుపవలసిన కుటుంబ విలువలు, చూపించవలసిన ప్రేమ కరువై నేటి యువత స్వార్ధానికి బానిసలు అవుతున్నారు. లేదంటే తాము అనుకున్న లక్ష్యం చేరుకోలేమని కృంగిపోయి నిండు జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.
ఇంకోపక్క యువ శక్తులను లక్ష్యం వైపు పోనీకుండా నిర్వీర్యం చేసే దుష్ట శక్తులు నలువైపులా పొంచి ఉండి, అదును చూసి యువత కుంభ స్థలాన్ని కొడుతున్నాయి. సోషల్ మీడియా, యూ ట్యూబ్, వెబ్ సిరీస్లు, వీడియోలు లెక్కలేనన్ని పుట్టగొడుగుల్లా పెరిగి, యువత అరచేతిలో కరాళ నృత్యం చేస్తున్నాయి. ఏ మాత్రం వాటి ఆకర్షణలో పడితే చాలు జీవితం అదుపు తప్పిపోతోంది. ఆశయాలు, లక్ష్యాలు చేజారిపోతాయి. జీవితం పాతాళంలోకి నెట్టివేయబడుతుంది.
మరి ఈ దుష్టశక్తులను అదుపు చేయడం ఎలా..? లక్ష్యం వైపు మనసుని లగ్నం చేయడం ఎలా..? ఒక్క యువతే కాదు. మానవ జీవితంలో ప్రతిఒక్కరినీ ఈ ప్రశ్నలు తొలిచివేస్తాయి. లక్ష్యాన్ని సాధించడం అంటే అరచేతిలో ఉన్న వెన్న ముద్దని తిన్నంత తెలీక కాదు. పూల తివాసీ మీద చేసే ప్రయాణం కాదు. ప్రతిక్షణం అపప్రమత్తంగా ఉంటూ, లక్ష్యం వైపే మనసుని లగ్నం చేయాలి. ఆకర్షణల సుడిగుండంలో చిక్కుకోకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ, దేహాన్ని, మనసుని సమన్వయము చేసుకుంటూ, దృష్టిని లక్ష్యం వైపే గురి చూస్తూ ఉండాలి. ఇదంతా కాస్త కష్టసాధ్యమే కానీ యువతకు అసాధ్యం మాత్రం కాదు. అయితే ఈ లక్ష్య సాధనకు యువతకు కుటుంబ సహకారం ఉండాలి. అదేవిధంగా యువత తమ ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టంతో కాకుండా ఇష్టంతో చేయడానికి వారికి మార్గదర్శనం చూపించే గురువులు కూడా ఎంతో అవసరం. యువత చేసే సాధనకు ఉత్తమ గురువులు మార్గ నిర్దేశనం చేస్తారు.
మనసు మనిషి స్వాధీనంలోకి రావడానికి ఏకాగ్రచిత్తం అవసరం. అలాగే మనుషులు చేసే పనులు క్రియాత్మకం, సృజనాత్మకం, ఆచరణాత్మకం అయినప్పుడే యువత అయినా, ఎవరైనా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన దివ్య సందేశాలను ఇచ్చిన ఉత్తమ గురువు స్వామి వివేకానంద. ఈ నెల అనగా జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన దేశంలో “జాతీయ యువజన దినోత్సవం” జరుపబడుతుంది అని మనకు తెలుసు కదా. భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటి, యువతే మన దేశానికి గొప్ప సంపద. యువత ధైర్యంగా, బలంగా ఉండాలి . నైతిక విలువలను కలిగి, ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండి, భారత దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి కలిగిన ఉన్నత దేశంగా ప్రపంచదేశాలన్నిటి కన్నా శిఖరాగ్రం మీద నిలబెట్టాలి అని స్వామి వివేకానంద సూటిగా యువతకు ఉద్భోదించారు.
“జాతీయ యువజన దినోత్సవం”[జనవరి 12] సందర్భంగా విమల సాహితీ పాఠకులకు శుభాకాంక్షలు.


రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630