విమల సాహితి ఎడిటోరియల్ 28 – నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు

“నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు” ఈ వారం విమల సాహితీ సంపాదకీయ వ్యాసం చదివి, మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. మిత్రులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు 🎂🎂🎂🎂🎂🎂🎂🎂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

“ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా వద్దకు రండి. నేను మీకు స్వస్థతను కలుగచేతును” అద్భుతమైన ఈ వాక్య సంపదను చూసారా..? ఇది సరిగ్గా నా కొరకే చెప్పబడింది అని ప్రతిఒక్కరికీ అనిపిస్తోంది కదా. నిత్య జీవితంలో మానవులు ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. తినడానికి తిండి, నివసించడానికి గూడు లేని ఎన్నో నిరుపేద బతుకులు కొందరివి. ధనికులై సమస్త సంపదలు కలిగి ఉన్నా ఆనారోగ్యం, చోర భయం, అనేకానేక సంకటాలతో అనునిత్యం బాధపడే వారు మరికొందరు. ఎటువంటి వారు అయినా, ఏ సమస్యలతో ఉన్నా నిబ్బరం కోల్పోకుండా నీతి మార్గమున నన్ను అనుసరించండి. మీ సమస్త వేదనలను నేను ఉపశమింపచేస్తాను అనే భరోసా మనకుంటే జీవితం ఎంతో ఆనందమయం అవుతుంది కదా.

మందలోనుంచి తప్పిపోయిన గొర్రె పిల్లవలె మనం ఇప్పుడు మన నిత్య ఆనందకర జీవితం నుంచి మనం వేరు పడి ఉన్నాం. ప్రమాదపు రహదారుల్లో పయనిస్తూ, ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ప్రయాణపు దారుల్లో మనిషిని బలహీనపరిచే వ్యసనాలు, ఆకర్షణల ముసుగువేసి మనిషిని అంతంచేసే రాబందులు రాజ్యమేలుతున్నాయి ఇప్పుడు. కొండకోనల్లో తప్పిపోయిన గొర్రె పిల్ల, గొర్రెల కాపరి చేతికి చిక్కి, పచ్చటి, మెత్తటి గడ్డి మైదానంలోకి తీసుకురాబడ్డట్లు, దిక్కుతెలియని మానవులకు, నక్షత్ర కాంతి వెలుగై సన్మార్గంలో నడిపించే ఓ చేయి దొరికితే ఎంత బాగుంటోందో కదా.

ప్రేమించే తల్లిదండ్రులకు దూరమై, ఇంటినుండి వెడలిపోయి, యవ్వన తప్పిదాలెన్నో చేస్తూ, తెగులు సోకి చెట్టు నుండి రాలిపోయిన లేత పిందెలవలె మనం పతనమైనా కూడా, పశ్చాత్తాపంతో తప్పుతెలుసుకుని, గుండెలోని రక్తాన్నంతా కన్నీటిగా మార్చి, కన్న తండ్రి ప్రేమను వెతుక్కుంటూ ఇంటి మార్గం వైపు పయనిస్తే, ఏ తండ్రి బిడ్డను అక్కున చేర్చుకోకుండా ఉండగలడు? అలాంటి ప్రేమామృతధారలను మనపై కురిపించే ఓ తండ్రి మనకందరికీ కావాలి ఇప్పుడు.

“నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు ” సమస్త విశ్వమానవ సమూహంలో ఇంత కంటే గొప్ప మాట ఇంకొకటి ఏదైనా ఉందా? ఇతరులు మన పట్ల ఏమి చేస్తే మనకి బాధ కలుగుతుందో, ఆ పనిని మనము కూడా ఇతరులపట్ల చేయకుండా ఉండడమే అసలైన మానవత్వం. జాతి, ప్రాంత, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరిపట్ల ప్రేమ చూపగలగడం ఎంత గొప్ప విషయం. కానీ ఈనాడు మనుషులు కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడిపోతున్నారు. భూకబ్జాలు, దురాక్రమణలు, ఆధిపత్యం కోసం నరికి చంపుకోవడాలు, ఫిరంగులతో, మారణాయుధాలతో యుద్ధం చేస్తూ, మతాన్ని మలినం చేసి రక్తపుటేరుల్లో కలిపేస్తున్నారు. మనుషుల్లో నుంచి మనిషి తప్పిపోయి, సైతాను నెత్తిపైకెక్కి తైతక్కలాడుతున్నాడు. ద్వేషాన్ని తరిమికొట్టి, దేహాల నిండా ప్రేమను నింపి, నువ్వు, నేను వేరువేరు కాదు.

సమస్త మానవాళి ఒకరినొకరు ఆలింగనం చేసుకోవాలి. ప్రేమతో బతుకులను పునీతం చేసుకోవాలి. ఒకరికోసం ఒకరు త్యాగమయులు కావాలి. పరిశుద్ధమైన ఆత్మలతో ప్రతిఒక్కరు పరిపూర్ణులు కావాలి. ఈ దివ్య సందేశాలన్ని ఏ ఒక్క మతం వారికోసమో కాదు. సమస్త మానవాళి అనుసరించితీరవలసిన అద్భుత సందేశాలు. ఇవి. కాబట్టి మనుషులంతా కుటుంబం ఎడల, ఇతరుల ఎడల ప్రేమకలిగి ఉండాలి. మన పాత్రలను జ్ఞానం, సంతోషం, త్యాగం, ప్రేమ అనే పదార్ధాలతో నింపుకొని ఉండాలి. సర్వ మానవాళి జీవితాలు ఆనందమయం కావాలి.

విమల సాహితీ పాఠకులకు క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలతో..

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630