విమల సాహితి ఎడిటోరియల్ 27 – ఉచితం ఉచితమా..? అనుచితమా..?

” ఫ్రీ ఫ్రీ ఫ్రీ” ఫ్రీగా వస్తే ఫినాయిల్ ని అయినా వదులుకోకూడదు అని మనం సరదాగా వింటుంటాం. మరి తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనిపై ఎన్నో జోకులు, సెటైర్లు, వ్యంగ్య కార్టూన్లు.

ఈ అంశం గురించి ఈ రోజు విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం ” ఉచితం..ఉచితమా? అనుచితమా?” చదివి, మీ అభిప్రాయాలు కూడా ఇక్కడ పంచుకోండి నేస్తాలు..

ఫ్రీ – ఫ్రీ – ఫ్రీ. అబ్బా ఈ మాట ఎంత వినసొంపుగా ఉందని. పైసలు ఖర్చు కాకుండా వస్తువో, సౌకర్యమో ఉచితంగా లభిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. “ఫ్రీగా వస్తే ఫినాయిల్ ని అయినా వదలకూడదు” అనే నానుడులు మనకి తెలుసు. మన సమాజంలో సగటు మనుషుల మనస్తత్వం ఇదే. ప్రజలకున్న ఆ మానసిక బలహీనత నాయకులకు గెలుపు అవకాశాలు దగ్గర చేస్తాయి ఒక్కోసారి. సునామీలా దూచుకొచ్చిన ఎన్నికలు అంతే వేగంగా ముగిసిపోయాయి. అన్నీ పార్టీల నాయకులు తమ ఎన్నికల మానిఫెస్టొ లో అన్నో, ఇన్నో ఉచిత పథకాలను ప్రవేశపెడతామని వాగ్దానాలు చేసాయి. ప్రజలను ఆకర్షించాయి. సముద్రపు లోతు అయినా సులభంగా కనుక్కోవచ్చును కానీ, ఓటరు నాడిని కనుక్కొనే యంత్రం ఇప్పటివరకు లేదనడం అతిశయోక్తి కాదు అనవచ్చు.

ఈ సారి ప్రజలు మార్పు కోరుకున్నారో ఏమో కానీ, కొందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ముఖమంత్రిగా గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికీ విదితమే. కొత్త ప్రభుత్వం. కొత్త పధకాలు. తమ ఐదేళ్ల బంగారు భవిష్యత్ కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు అమలుపరిచే క్రమంలో మొదటగా “మహా లక్ష్మి” పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని అమలు చేసింది. తెలంగాణాలో మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్లు, ఈ పథకం ప్రకారం ప్రభుత్వ బస్సు లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలలో ఒకటి.

అయితే ఇప్పుడు ఈ పథకం రాష్ట్రమంతటా చర్చాంశనీయం అయింది. ఈ పథకంవల్ల మహిళలకు ఒనగూడే ప్రయోజనం ఎంత? ఈ ఉచితం వల్ల ఆర్.టి.సి. పై పడే భారం ఎంత? ప్రభుత్వ ఖజానాకు జరిగే నష్టం ఎంత? ఇక సామాజిక అంశాలలో ఏవైనా సమస్యలు తలెత్తుతాయా అనేవి ఇప్పుడు వినిపిస్తున్న సందేహాల పరంపర.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మరికొందరికి మోదం అయితే, మరి కొందరికి ఖేదం అయింది. చాల మంది నెటిజన్లు పలు రకాలుగా దీని గురించి తమ స్పందనలు వెలిబుచ్చుతున్నారు. ఈ ఉచిత ప్రయాణాల కన్నా, ప్రాధమిక అంశాలైన గ్యాస్ ధర తగ్గించడం, కరెంటు, నీటి సౌకర్యం, నిత్యావసరాలపై రాయితీలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో రాయితీలు అమలు చేస్తే అందరికీ ప్రయోజం కదా అని కొందరు అంటుంటే, ఇప్పటి వరకు వంటింట్లో గిన్నెలు మగ్గుతున్న మహిళల జీవితాల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కొత్త మార్పులు తీసుకురావచ్చేమో..! ప్రయాణ చార్జీల భారంతో నిత్యం దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయలేని మహిళలు, ఈ పథకం వల్ల ప్రయోజనం పొంది తమ తమ కొలువులు సంతోషంగా చేసుకోవచ్చునేమో అనేది ఇంకొందరి ఆశాభావం.

మరొక కోణంలో చూస్తే నగరంలో నిత్యం కొన్ని వేలమంది ఆటో డ్రైవర్లు ప్రయాణికులను వారివారి గమ్యాలకు చేరుస్తూ, తాము ఉపాధి పొందుతున్నారు. అటువంటి వారికి ఈ పథకంవల్ల నష్టం వాటిల్లవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. పథకం అమలు పైన తప్పకుండా ప్రజల అభిప్రాయాన్ని సేకరించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. పలువురు రాజకీయ, సామజిక విశ్లేషకుల అభిప్రాయాలను సేకరించి,ఇటువంటి పథకాల అమలును మరింత సమర్ధవంతంగా, ప్రయోజనకరంగా మలచే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలి.

ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల అర్హులైన పేద, దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి మహిళలకు ప్రయోజనం కలిగితే అందరికీ ముదావహమే కదా. ధనికులైన మహిళలు ఎలాగూ బస్సులలో ప్రయాణం చేయరు. పేద మహిళల ప్రయాణ భారం ప్రభుత్వం తీరుస్తుంటే సంతోషమే కదా. అయితే ఎటువంటి అవసరం లేకుండా కేవలం ఉచితాన్ని వాడుకోవాలనుకోవడం మాత్రం అనుచితం అవుతుంది.

ఏదేమైనా ఓ రైతు కూలి తల్లి, ఓ భవన నిర్మాణ శ్రామిక చెల్లి, ఓ మధ్య తగరతి పేద అవ్వ అక్కా చెల్లి వీళ్లంతా కొంగున కట్టుకున్న ముడిలో ప్రయాణానికి పైసలు లేకున్నా పర్వాలేదు. ఎటువంటి సంకోచం, భయం లేకుండా తమతమ గమ్యాలను చేరుకోవచ్చు. స్త్రీ సహజ గుణమైన పుట్టింటి పై మమకారాన్ని కొనసాగించవచ్చు. పుట్టింటికి మెట్టింటికి మధ్య వారధిలా బంధాన్ని దృఢపరచవచ్చు. కష్టాలలో ఉన్న బంధువులను ఖర్చు లేకుండా వెళ్లి ఆదరించవచ్చు. వివాహ తదితర శుభకార్యాలకు హాజరై స్నేహ సంబంధాలను పెంచుకోవచ్చు. ప్రముఖ యాత్రా స్థలాలను సందర్శించి జ్ఞానాన్ని ప్రోది చేసుకోవచ్చు. గుళ్ళు గోపురాలు సందర్శించి తీర్థయాత్రలతో పుణ్యాన్ని మూటగట్టుకుని రావచ్చు. ఇది కొత్త ప్రభుత్వం మహిళా మహారాణులకు ఇచ్చిన ఆడబిడ్డ కానుక. స్త్రీమూర్తులకు జీవిత పర్యంతం కనీవినీ ఎరుగని వేడుక. తరచిచూస్తే స్త్రీ సాధికారితకు నిజమైన కరదీపిక.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630