విమల సాహితి ఎడిటోరియల్ 17 – వందే మాతరం..వందే భారతం !!

వందే భారత్ రైళ్ళు ఎవరికోసమండీ..? ఈ రోజు విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి.

“బండీర పొగ బండీర.. దొరలెల్లే రైలు బండీర.. దొరసానులెల్లే బండీర” మనదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ తెల్ల దొరలు, దొరసానులు పొగ రైలు బండ్లలో తిరుగుతుంటే, వారి భోగాన్ని చూసి మన దేశ జానపదులు పాడుకున్న పాట ఇది. వయో వృద్ధులైన కొంతమందికైనా ఈ పాట గుర్తుండే ఉంటుంది. దేశానికీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయి. తెల్లదొరలు మన దేశానికి వ్యాపారం పేరుతో వచ్చి, దురాక్రమణ చేసి కూడా చాల ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడు బ్రిటిష్ వారి వ్యాపార సౌలభ్యం కోసం మనదేశంలో కొన్ని చోట్ల రైలు మార్గాలను నిర్మించారు. అప్పట్లో తెల్ల దొరలకు, దొరసానులకు మాత్రమే రైళ్లల్లో ప్రయాణించే వెసులుబాటు ఉండేది. సామాన్య జనాలకు రైలు అంటే ఓ అద్భుతమైన వాహనం. జీవితంలో ఒక్కసారైనా రైల్లో ప్రయాణించాలనేది ఒక తీరని కోరిక. అయితే ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా మన దేశంలో సామాన్య ప్రజలు “వందే భారత్ బండీరా..ధనికుల కొరకే నడిచేనురా” అని పాడుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఇప్పుడు.

అసలు మనిషి బతకడానికి ప్రాథమిక అవసరాలు కూడు, గుడ్డ, గూడు. మన అధికార జనాంగం పదేపదే చెప్పే నినాదం కూడా రోటి, కపడా, మకాన్. గరీబీ హఠావో. ఎన్నికల మేనిఫెస్టొలో తప్పనిసరిగా చేర్చి, అధికారం పొందిన వారే అందరు. అయితే మారుతున్న కాలం, జరుగుతున్నా సాంకేతికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి దృష్ట్యా మనిషి ఒకప్పుడు విలాసం అనుకున్నవి ఇప్పుడు ప్రాథమిక అవసరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి అవసరాలకోసం మన దేశంలో ప్రజలు ఒకచోటి నుంచి మరోచోటికి ప్రతిరోజూ ప్రయాణించే వారు కొన్ని లక్షల, కోట్ల మంది ఉన్నారు. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి జనాలు ఉద్యోగ రీత్యా, కూలినాలి చేసుకుని బతికే జనాలు నిత్యం రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఈనాడు అధికారం నియంత్రించేవాళ్లు ధనవంతుల పక్షపాతులై, కలిమి గలిగిన మహారాజలకు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా కొత్తగా ప్రారంభించిన “వందే భారత్” రైళ్ళకు టిక్కెట్లపై ఆకాశాన్ని అంటే అధిక ధరలు నిర్ణయించారు. కనీసం దీంట్లో సామాన్యులకు ఒకటో రెండో జనరల్ బోగీలు వేసి ఉంటే ఈ ఆధునిక సౌకర్య ఫలాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సైతం అంది ఉండేవి కదా. ఇక సామాన్యులకు అధికార మాన్యులు చేసిన మేలేమిటి..? ఈనాడు విద్య, వైద్యం, వ్యాపారం, ఆర్ధిక, ఉపాధి రంగాలు అన్నీ ప్రైవేట్ సంస్థల పరం అయినాయి. ఒక సామాన్యుడికి జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు, వైద్యం దొరుకుతాయన్న నమ్మకం లేదు. ఆసుపత్రిలో చేరినా, ప్రాణాలతో తిరిగొస్తామనే నమ్మకం లేదు. ఆరోగ్య శ్రీ లాంటి రాయితీ ఉన్నంత వరకు వైద్యం చేసి, తర్వాత డబ్బు కడితేనే వైద్య సేవలు అందిస్తాం అంటాయి ప్రైవేట్ ఆసుపత్రులు. కార్పొరేట్ ఆసుపత్రుల మెట్లు ఎక్కాలన్నా భయపడే ఫీజులు. అటు స్వర్గానికి పోలేక , ఇటు నరకానికి పోలేక వ్యాధులతో బాధ పడుతూ త్రిశంకు స్వర్గం లాంటి స్థితిలో మానసిక వేదన అనుభవిస్తూ, ఎక్కడా సరైన వైద్యం దొరక్క అసువులు బాసిన పేద జనాలు ఎందరో ఉన్నారు మనదేశంలో.

విద్యారంగాన్ని చూస్తే ఇంకా దారుణం. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఉండవు. ఎప్పుడు కూలుతుందో తెలియని పైకప్పులు, రాళ్ళు గుచ్చుకునే గచ్చులు, పాఠశాల భవనాలు సరిగా లేక చెట్లకిందే తరగతులు. త్రాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కూడా లేని బడుల్లో విద్యార్థినీ, విద్యార్థులు అనుభవిస్తున్న ఇబ్బందులు పాలకుల దృష్టికి రాకపోవడం విచారకరం . ఇక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి గొప్ప అధ్యాపకులతో పాటు, నామమాత్రంగా హాజరు పట్టీలో తమ సంతకం చేసి, పాఠాలు చెప్పకుండా తమ సొంత పనులు చూసుకుంటూ విద్యార్థుల బంగారు భవిష్యత్ ను నాశనం చేసే ఉపాధ్యాయులు కూడా కొద్దిమంది ఉన్నారు. విద్యార్థినులను, తోటి ఉపాధ్యాయినులను లైంగికంగా వేధించే అధ్యాపకులకూ కొదవ లేదు. ప్రభుత్వ పాఠశాలల పనితీరును, కనీస సౌకర్యాలను, మధ్యాన్న భోజనం నాణ్యతను పరిశీలించాల్సిన అవసరం పాలకులకు ఉంది.

కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు కూడా లక్షల్లోనే. బిడ్డలను నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కోర్సు చదివించాలన్నా సామాన్యడుకి రెండెకరాలు అమ్ముకుంటే కానీ చేసిన అప్పు తీరదు. ఆరోగ్యం, విద్య తో పాటు ఇప్పుడు ప్రయాణం కూడా కార్పొరేట్ స్థాయిలో ఉంది తప్పితే సామాన్య జనాలకు అందని ద్రాక్ష పండు అవుతోంది. దేశం వెలిగి పోతోంది, అభివృద్ధిలో అగ్ర దేశాలతో పోటీ పడుతోంది అంటున్న అధికారులు అభివృద్ధి ఫలాలను అందరికి సమానంగా పంచడం లేదన్నది మాత్రం నికార్సయిన నిజం. “వందే భారత్ రైలు” అంటూ డబ్బులు ఉన్న వాళ్ళకి సూపర్ ఫాస్ట్ సౌకర్యాలు కల్పిస్తున్నారు గాని, పేద ప్రజలకు కనీస సౌకర్యాలు లేని జనరల్ కంపార్టుమెంట్లు కూడా మామూలు రైళ్లల్లో వేయకుండా నానా వెతలకు గురిచేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక అసమానతలు రోజురోజుకీ బలపడుతున్న, భయపెడుతున్న అసంతులిత వ్యవస్థలో నడుస్తున్నాం. సామాన్య ప్రజలు కనీస సౌకర్యాల కోసం అల్లాడుతుంటే, ధనికుల కోసం కొత్త కొత్త సౌకర్యాలు, అధునాతనమైన సదుపాయాలు కల్పించడం బహు శోచనీయం. ఇదా మన జాతిపిత గాంధీజీ, నవ భారత నిర్మాత నెహ్రూజీ, రాజ్యాంగ ప్రధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ కోరుకున్న అధునాతన భారతం..?ఎన్నికల సమయంలో మాత్రం సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడుక్కుని, అధికారంలోకి వచ్చాక పేద వారిని మరువడం యేరు దాటాక తెప్ప తగలెయ్యడం కదా..?

అధికారులారా ఆలోచించండి. దేశాభివృద్ధికి కార్పొరేట్ ధనికులు ఎంత అవసరమో, అన్నం పెట్టే రైతులు, రైతు కూలీలు అంతే అవసరం. కార్పొరేట్ సంస్థలో ఆఫీసర్ చేసే పని ఎంత గొప్పదో, నాలాలు, డ్రైనేజీలు శుభ్రం చేసే సౌచాలయ కార్మికునిది కూడా అంతే గొప్ప పని. అందరిని సమానంగా చూసిన ప్రభువులే ప్రజల మనసులు గెలవగలరు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగలరు. ప్రజల హృదయాలు గెలుచుకున్న మహారాజులు కాగలరు.

రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630