మేధావులారా ..మేల్కొనండి. ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయం తెలుపండి.
మనసు లేని మనుషులు పుట్టుకొస్తున్నారు. కళ్ళు చెమ్మగిల్లడం మానేశాయి. కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. సాధించిన విజ్ఞానాన్ని నెత్తికెత్తుకుని భవిష్యత్ వైపుకు పరుగులు తీస్తూ మన సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఓ మహా మేధావుల్లారా..! దయచేసి మీ బిడ్డలకైనా జీవితపు విలువల గురించి కాస్త నేర్పించండి. అన్ని దేశాల సంస్కృతులు వేరు. మన దేశ సంస్కృతి వేరు. కన్న వారిని కావడిలో మోసిన శ్రావణ కుమారుడికి వారసులయ్యా మీరు.
ఉడుకు నెత్తురు,ఉక్కు నరాలతో దేశాభివృద్ధిని పటిష్టం చేయమన్న వివేకానందుని తెగువను పుణికిపుచ్చుకున్న చైతన్యవంతులయ్యా మీరు. కులమతాల రక్కసిని కూకటివేళ్లతో పెగల్చడానికి, నిచ్చెన మెట్ల వ్యవస్థని కూలగొట్టి అందరూ సమానమని రాజ్యాంగాన్ని లిఖించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ అనుచరులయ్యా మీరు.
భారతీయులను సొంత దేశంలో బానిసలుగా చేసి 38 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని 200 ఏళ్ళు పాలించారు బ్రిటిష్ వాళ్ళు. వ్యాపారం పేరుతో దేశంలోకి ప్రవేశించారు. కుటిల తంత్రాలతో దేశాన్ని దురాక్రమణ చేసారు. దేశ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టారు. ఎదురుతిరిగిన వారిని ఉరితీశారు. కాల్చి చంపారు. అయితే ఓ బక్క పలుచని వ్యక్తి దేశ ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చాడు. సత్యం, ధర్మం, న్యాయం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, అహింసలను ఆయుధాలుగా మలచుకుని, సత్యాగ్రహంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి,తెల్ల దొరలను మనదేశం నుంచి వెడలగొట్టి భారత దేశ ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చడానికి అనితరసాధ్యమైన కృషిని సల్పిన మహాత్ముడు మన జాతిపిత మోహన్ దాస్ కరం చంద్ గాంధీ.
అయితే ఆ స్వేచ్చా, స్వాతంత్య్రాలను మనం నిలుపుకున్నామా..? విడిపోయి బతకడంలోనే ఆనందం ఉందని పాలకులమీద ఒత్తిడి తెచ్చి దేశాన్ని రెండు ముక్కలు చేసుకున్నాం. అంత మాత్రాన దేశం ఆనందంతో వెలిగిపోతోందా..? మత ఘర్షణలను దాటి ఐక్యమత్యంతో ఉండడానికి ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని మానసిక రోగంతో ఉన్నాం. దేశానికి పట్టుగొమ్మ, దేశ ఆర్ధికరంగానికి వెన్నుముక అయిన రైతు కష్టాన్ని గుర్తించలేకున్నాము. మితిమీరిన వ్యసనాలు, విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి నేను, నాది అని తప్ప మనము మనది అనే భావనలను తొక్కి పెట్టి బంధాలకు, అనుబంధాలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నాం.
ఇక దేశంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తలచుకుంటే గుండె చేరువవక మానదు. ఎప్పుడు స్త్రీలు నిర్భయంగా,స్వేచ్ఛగా అర్ధరాత్రి పూట తిరగగలరో అప్పుడు దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నాడు. కానీ ఈనాడు అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా మహిళలు నిర్భయంగా తిరగలేని దౌర్భాగ్యపు రోజులివి. పగలు, ప్రతీకారాలకోసం ఇంట్లో ఉన్న మహిళలను కూడా బయటకీడ్చి హింసిస్తున్నారు. మహాత్ముడు చెప్పిన మూడు కోతుల సూక్తులు ఒకసారి గుర్తుకుచేసుకుంటే “చెడు కనవద్దు..చెడు వినవద్దు..చెడు అనవద్దు”. వీటిని పాటించడం సంగతి అటుంచితే “చెడు చేయడమే మా ధ్యేయం ” అంటూ నైతిక విలువలకు వలువలు ఊడబెరికి దేశం పరువుని నగ్నంగా ఊరేగిస్తున్నారు. ఈనాడు మహాత్ముడు మళ్ళీ పుట్టి వచ్చినా ఈ దుర్మార్గపు పతనాన్ని నేను చూడలేను అనుకుంటూ ఆత్మాహుతి చూసుకుంటాడు. మహా మేధావుల్లారా మీకో విన్నపం. సముద్రపు లోతులను కనుక్కోండి . చంద్రుడి మీద నివాసం ఏర్పరచుకోండి. అంతరీక్షాన్నిచాపలా చుట్టండి. అయితే మనిషి మనసులో నైతిక విలువలను నాటడం మాత్రం మరువకండి.
స్వాతంత్రం సాధించి 75 ఏళ్ళు గడిచినా…స్వతంత్ర భారత దేశంలో ఎటు చూసినా అవినీతి, హత్యలు, అత్యాచారాలు, మత ఘర్షణలు, సాటిమనిషిని దోచుకోవడం, ప్రతిభను అణగదొక్కడం, అభివృద్ధిని అడ్డుకోవడం, మానవత్వం మంటకలవడం..ఇవి నిత్యం మనం చూస్తున్న దారుణాలు. మరి మనం ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా..? నిత్యం చూస్తున్న ఈ నిజాల మధ్య బతుకీడుస్తున్నామా ..? ఇప్పుడు గాంధీ మహాత్ముడు మనకోసం మళ్ళీ పుట్టడు. గాంధీ జయంతి రోజున ఆయనను స్మరించుకోవడం కాదు. ఓ పూల దండ ఆయన పటానికి వేయడం కాదు. పనులకు సెలవు తీసుకోవడం కాదు.ఆయన చూపించిన మార్గం సత్యం, న్యాయం, ధర్మం, అహింసలను మనమందరం క్రియాత్మకం, ఆచరణాత్మకం చేయడమే మన ముందు ఉన్న కర్తవ్యం. అయన నుంచి నేర్చుకున్న కొన్ని గుణాలనైనా ఆపాదించుకుని అయన చూపిన బాటని అనుసరించి దేశాభివృద్ధికి పాటుపడడమే మహాత్మునికి మనమిచ్చే అసలైన నివాళి. ఈ అక్టోబర్ 2వ తేదీన జరుపుకునే
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా విమల సాహితీ పాఠకులకు శుభాకాంక్షలతో..
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630