యుద్ధమే ముద్దు

గణేష్ దిన పత్రికలో ఈ రోజు[29-10-2023] నేను రాసిన కవిత “యుద్ధమే ముద్దు” ప్రచురితమైంది. మిత్రులు చదివి మీ స్పందనను తెలుపండి.

యుద్ధం అనివార్యం
పోరాటం జరగాల్సిందే
శత్రువుని తుదముట్టించాల్సిందే
బాంబర్ల మోతతో చెవులు తూట్లు పడుతున్నా
యుద్ధ ట్యాంకుల శబ్దం గుండెల్లో వణుకుపుట్టిస్తున్నా
యుద్ధమే ముద్దు మాకు అంటావా?
తెగిన తలలనుంచి ఏరులై పారుతున్న నెత్తురు
తల్లి శవం మీద పడి తల్లడిల్లుతున్న శిశువు
కూలిపోయిన ఇళ్ళు పొగ చూరిన గోడలు
శిధిలాల మధ్యనుంచి వినిపించే ఆర్తనాదం
ఏవి కదిలించలేవు నిన్ను
యుద్ధమే కావాలి నీకు
యుద్ధ విజేతల సమాధులు చెప్పే కథలు విను
ఎన్నిఉసురులు నువ్వు తీసినా
ఎంత గొప్ప వీరుడివి అయినా
నీకు మిగిలేది శూన్యమే బూడిదే
అశోకుడు ఔరంగజేబుకే తప్పలేదు
కాలగతిలో కలిసిపోవడం
ఇక్కడ ఎవరు శాశ్వతం అనుకుంటున్నావు
ఈ రోజు వాడు, రేపు వీడు, అటు తర్వాత నువ్వు
ఏదో రోజు కాలం చేతిలో ఓడిపోకతప్పదు
అందుకే యుద్ధం చేయి
పోరాటం జరుపు
శత్రువు వణికిపోయేలా తరిమికొట్టు
కానీ ఆ శత్రువు ఎక్కడున్నాడో గుర్తించు
నీలోకి నువ్వు వెళ్లు
నిన్ను నీలోని మనిషిని చేరుకోవడానికి
నీలోని మానవత్వాన్ని బతికించడానికి
నీలోని శత్రువులను నువ్వు వెతికి పట్టుకో
నీలో పగ, ద్వేషం రూపంలో నిన్ను
నిలువరిస్తున్న శత్రువులను తుదముట్టించు
ప్రేమ అనే ఆయుధానికి పదును పెట్టు
నీలోని ప్రేమతో నీలోని ద్వేషాన్ని తునాతునకలు చెయి
మానవత్వపు పల్లకి బోయివై ప్రేమను మోస్తూ
కన్నీటితో పన్నీటితో గుండెగదులను నింపుకో
మనిషి తనాన్ని ప్రేమగా హృదయానికి హత్తుకో

రోహిణి వంజారి
9000594630