బంధం ఆర్థికమా..హార్దికమా.. ఏ బంధాలు ఎలా ముడిపడతామో, ఎలా వీగిపోతాయో.. మరి ఈ కథలోని మైత్రి బంధానికి ఉన్న బలం ఎంత..? తెలియాలంటే ఈ రోజు నవ తెలంగాణ ఆదివారం అనుబంధం సోపతి లో ప్రచురితమైన నా కథ “మైత్రి -వైచిత్రి” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగకోరుతూ.. సోపతి సంపాదకులు శ్రీ కటుకోజ్వల ఆనందాచారిగారికి ధన్యవాదాలతో 🌹🙏
రాఘవ ఇల్లు ఖాళీ చేసి ఊరొదిలి వెళ్ళిపోయాడట. రాత్రికి రాత్రే కుటుంబంతో సహా. ఎవరో అనుకుంటున్న మాటలు వినగానే శరాఘాతం తగిలినట్లు విలవిలలాడాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు ఎవరికి చెప్పకుండా..?
ఆ పక్క ఎక్కడో పశ్చిమం తట్టు వెలుగుపూలను తనలో ఇముడ్చుకుని పగటిరాజు వస్తాడని ఎదురుచూస్తున్న ముద్దమందారం పూమొగ్గలు తొలివెలుగు కిరణాలు నులివెచ్చగా తమని తాకగానే పరవశించిపోతూ పూరేకులను నిండుగా విప్పుకుని, చిరు తెమ్మెరల తాకిడికి సుతారంగా ఊగసాగాయి.
స్నానం చేసి తుండుగుడ్డ చుట్టుకుని సందుపక్కకు వొచ్చి అప్పుడే విచ్చుకున్న ముద్దమందారాలను ఆపేక్షగా తడిమి రెండిటిని కాడలవరకు తుంచి దేవుడి పటాల ముందు పెట్టి, నుదుటికి విభూతి రేకలు దిద్దుకుని, కుందిలో నూనె పోసి, వొత్తులువేసి దీపం వెలిగించి దేవుడి పటాలకు మొక్కాడు.
“మీరు స్నానానికి వెళ్ళినప్పుడు సుధాకర్ అన్నయ్య వొచ్చాడండి. ఒక్కక్షణం కూడా కూర్చోలేదు. అర్జెంటుగా మిమ్మల్ని వాళ్ళఇంటికి రమ్మన్నాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్లు అనిపించింది నాకు.” కాఫీ చేతికి ఇస్తూ అంది సుభద్ర.
“అవునా..” క్షణం ఆలస్యం చేయకుండా బీరువాలో నుంచి చేతికొచ్చినంత డబ్బు, ఏ.టి.ఎం. కార్డు జేబులో పెట్టుకుని కంగారుగా బయలుదేవరు రాఘవ.
ఇంటికెళ్ళగానే “అత్తమ్మకి సిరీస్ అయింది. పొద్దునే గుండె పట్టుకుని నొప్పి అంటూ విలవిలా లాడుతుంటే, ఆయన ఆస్పత్రికి తీసుకుపోయాడు” అని చెప్పింది సుధాకర్ భార్య కుముద.
ఆసుపత్రిలో రాఘవని చూడగానే బోరుమని ఏడ్చాడు సుధాకర్. “అమ్మకి సీరియస్ గా ఉందిరా. ఇప్పటికిప్పుడు గుండె ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకు ఏం చేయాలో తోచక పొద్దున నీ దగ్గరకి వొచ్చాను. అమ్మ నొప్పితో విలవిలా లాడుతుంటే నాకు దిక్కు తోచలేదురా. ఇంట్లో, బ్యాంకు లో నా దగర చిల్లిగవ్వ లేదు”
రిసెప్షన్ లో ఉన్న నర్సు పిలవడంతో వెళ్లారు ఇద్దరూ. ఆపరేషన్ కి అవసరమైన డబ్బు కట్టేసాడు రాఘవ. ఆపరేషన్ థియేటర్ ముందే క్షణాలు లెక్కపెడుతూ కూర్చున్నారు అమ్మకి బాగవ్వాలని అనుక్షణం దేవుడికి మొక్కుతూ ప్రాణస్నేహితులు సుధాకర్, రాఘవలు.
మూడు గంటల తర్వాత డాక్టర్ వొచ్చి చెప్పిన ” ఆపరేషన్ సక్సెస్ అయింది. మీ అమ్మకి ప్రాణాపాయం తప్పింది అన్న మాటలు వాళ్ళ చెవుల్లో అమృతం పోసినట్లు వినిపించాయి. రాఘవ, సుధాకర్ లు ఇద్దరు ఒకరినొకరు ఆనందంగా హత్తుకున్నారు.
“సమయానికి నువ్వు దేవుడిలా ఆదుకుని అమ్మని రక్షించావురా రాఘవా. నీ బాకీ ఎలాగైనా తీర్చేస్తాను రా” కన్నీళ్ళతో సుధాకర్.
“ఒరే సుధా.. బాకీలు తీర్చుకునే బంధం కాదురా మనది. నీ కష్టం నాది కదా. అమ్మకి బాగైంది. అంతే చాలు. బాకీలు, రుణాలు అంటూ నన్ను దూరం చేయకు. మన మధ్య ఉన్నది ఆర్ధిక సంబంధం కాదురా ” అంటూనే మరోసారి సుధాకర్ ని గుండెలకు హత్తుకున్నాడు రాఘవ. ఆ స్పర్శలో నీకు నేను ఉన్నాను అనే ఆలంబన సుధాకర్ కి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది.
స్నేహితుడి పట్ల కృతజ్ఞత నిండిన కన్నీటి బొట్లు సుధాకర్ చెంపల నుంచి జారీ రాఘవ కన్నీటి బొట్లతో కలిసి పోయి వారిరువురి చొక్కాలను తడిపేసాయి. వారిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఊహ తెలిసినప్పటినుంచి ఒక కంచం, ఒక మంచంగా పెరిగారు.
“ఒరేయ్ సుధా.. మన కీర్తి వాళ్లకు బాగా నచ్చింది రా. అబ్బాయి కూడా మంచి ఉద్యోగ్యం చేస్తున్నాడు. నెమ్మదస్తుడు. అబ్బాయి ప్రవర్తన చూస్తుంటే నెమ్మదస్తుడు, యోగ్యుడు, మర్యాదస్తుడుగా కనిపిస్తున్నాడు. అమ్మ,నాన్నలకు ఒక్కడే కొడుకు. ఈ రోజుల్లో కూడా కట్నకానుకలు ఆశించకుండా పెళ్లి చేసుకుంటామనే వారు అరుదు” శాంతమ్మ చెప్పుకుంటూ పోతోంది పత్తితో ఒత్తులు చేస్తూ.
“అవునండి. అమ్మాయి,అబ్బాయి ఒకరికొకరు ఈడు, జోడు బాగున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇదంతా మన అదృష్టం అండి. పిల్లను చూసి వాళ్ళు నచ్చారు. మాఘమాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయి అని శాస్త్రి గారు చెప్పారు కదా అండి”. తాము మాట్లాడుతుంటే భర్త పరధ్యానంలో ఉన్నట్లు గ్రహించింది సుభద్ర.
“సుధా.. కట్న కానుకలు పెద్దగా ఇవ్వకపోయినా మన స్తోమతకి తగ్గట్టు మగపెళ్లి వారికి యేవో కొన్ని లాంఛనాలతో అయినా పెళ్ళి జరిపించి మంచి విందుభోజనం పెట్టాలి. ఎంత లేదన్నాతక్కువలో తక్కువ ఐదు లక్షలు అయినా కావాలి కదరా. ” శాంతమ్మ మాటలకి మౌనంగా తల ఊపాడు సుధాకర్.
” మీరు రిటైర్ అయినప్పుడు వొచ్చిన ప్రోవిడెంట్ ఫండ్ డబ్బు బ్యాంకులో ఉంది కదా. ఇప్పుడు దానికి బ్యాంకు వాళ్ళ వడ్డీ కూడా జమ అయివుంటుంది కదండీ ” కాఫీ గ్లాసు చేతికి ఇస్తూ అంది సుభద్ర.
“అది..అది..అంటూ నీళ్లు నమిలాడు సుధాకర్”
“ఏమిటండి అది. కొంపదీసి డబ్బు ఎవరికైనా ఇచ్చారా ఏంటి” కళ్ళు ఇంతవి చేస్తూ సుభద్ర. మౌనంగా కళ్ళు మూసుకున్నాడు సుధాకర్.
“అదేంట్రా. మేము అడుగుతుంటే నువ్వలా బెల్లంకొట్టిన రాయి లాగా ఉలక్కుండా, పలక్కుండా ఉన్నావు” కొడుకు వంక అనుమానంగా చూస్తూ ఒత్తులకు విభూది రాస్తోంది శాంతమ్మ. అతని మనసుని సూన్యం ఆవరించిందిఆ క్షణం.
“అమ్మ..ఆ..ఆ .. డబ్బు రాఘవకి ఇచ్చాను” ఏ భావం లేదు సుధాకర్ ముఖంలో
అదిరిపడ్డారు అత్తా, కోడళ్ళు ఇద్దరు.
“ఏంట్రా సుధా నువ్వు చెప్పేది. ఎప్పుడు పిల్ల పెళ్ళి గురించి అడిగినా అది ఇంకా చిన్న పిల్ల. దానికి ఇప్పుడే పెళ్ళి ఏంటి అని దాటవేసింది ఇందుకట్రా..! ఇక పిల్ల పెళ్ళి ఎలా చేయాలి దేవుడా ” వాళ్లిద్దరూ పెద్దగా అరుస్తూ గగ్గోలు పెట్టసాగారు.
సుధాకర్ కి ఏమి వినపడడం లేదు. కళ్ళు మూసుకున్నాడు. అతని ఆలోచనలు ఇప్పటి శూన్యం లో నుంచి అప్పటి గతంలోకి వెళ్లాయి.
రోజు లాగే ఆ రోజు సాయంత్రం రాఘవ ఇంటికి వెళ్ళాడు సుధాకర్. గదంతా చీకటిగా ఉంది. మెల్లగా లోపలి అడుగుపెట్టి “ఒరే రాఘవా.. లైట్ వేసుకోకుండా చీకట్లో ఏం చేస్తున్నావు రా..?” అంటూ లైట్ వేసాడు
మంచం మీద కూర్చొని ఉన్నాడు రాఘవ. ఎన్నాళ్ళ నుంచో ఒంటరిగా ఏదో తెలియని వేదనని అనుభవిస్తున్నట్లు ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఉన్నాడు ఒళ్ళంతా చెమటలతో తడిసి. ఆ స్థితిలో స్నేహితుని ఎప్పుడు చూడలేదు సుధాకర్.
“రాఘవా..ఏమయిందిరా. చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావు..? చెల్లెమ్మ, పిల్లలు ఎక్కడ రా. ఆ దిగాలు ముఖం ఏంటి “. రాఘవ చేతులు పట్టుకుని కుదిపేస్తూ ఉన్నాడు సుధాకర్.
ఆత్మబంధువు లాంటి స్నేహితుని పరామర్శ అంతవరకూ అతని మనసులో గూడుకట్టుకుని ఉన్న మౌన వేదనని చేధించింది. తన అంతరంగంలో మధనపడుతున్న సమస్యను స్నేహితుని ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ రాఘవ
“వ్యాపారం నష్టాల్లో నడుస్తోంది రా. కాస్త పెట్టుబడి పెట్టి సరుకు తెప్పిస్తే కొంచెం పుంజుకోవచ్చు. మెల్లగా అప్పులు కూడా పెరుగుతున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదురా సుధా”నుదుటిని చేతులతో రుద్దుకుంటూ.
“రాఘవా..ఇన్ని రోజులు ఈ విషయాన్నీ నా దగ్గర దాచి, ఒక్కడివే బాధ పడుతున్నావా ” అనునయంగా రాఘవ చేతులు పట్టుకున్నాడు సుధాకర్.” మౌనంగా స్నేహితుని వంక చూస్తున్నాడు రాఘవ.
” నాకు చెప్పడానికి ఎందుకు సంశయించావురా..! నీకంటే ఇంక నాకెవరున్నారు చెప్పు. మొన్ననా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన ప్రోవిడెంట్ ఫండ్ డబ్బు మొత్తం నువ్వు తీసుకొని నీ వ్యాపారం అభివృద్ధి కోసం వాడుకోరా”
“అది కాదురా సుధా..కీర్తి పెళ్ళికోసం నువ్వు ఇన్ని రోజులు కష్టపడి దాచిన సొమ్ము…” రాఘవని మాట పూర్తిచేయనీకుండా “కీర్తి ఇంకా చిన్న పిల్లరా. చదువుకుంటోంది. అప్పుడే దానికి పెళ్లేంటి. నువ్వు ఇంకేం ఆలోచించకు రాఘవా “
చీకట్లో ఉన్న స్నేహితుడి మనసులో చిరుదీపం వెలిగించాడు సుధాకర్. తన ప్రోవిడెంట్ ఫండ్ డబ్బు మొత్తం రాఘవ బ్యాంకు అకౌంటీకి ట్రాన్స్ఫర్ చేసాడు సుధాకర్. ఆ విషయం మాట మాత్రంగా అయినా ఇంట్లో చెప్పలేదు.
ప్రామిసరీ నోటు, పత్రాలు, సంతకాలు రాయించుకోవడం తమ స్నేహబంధాన్ని అవమానించినట్లు అవుతుంది అన్నాడు సుధాకర్. స్నేహితుని ప్రేమకు తలవంచాడు రాఘవ. స్నేహంలో ఇవ్వడమే కాదు పొందడం కూడా ఓ వరమే అనుకుంటూ.
నేను ఎప్పుడైనా ఎవరికోసరమైనా ఆగడం మీరు చూసారా..? మీ సంతోషం, దుఃఖం, మీ కష్టం దేనితో నాకు సంబంధం లేదు. నాకు వెనుకడుగు వేయడం రాదు అంటూ కాలం అరయై రోజులు ముందుకు వెళ్ళింది.
రాఘవులు వెళ్ళిపోయాడట..! కుటుంబంతో సహా. రాత్రికి రాత్రి భార్య, బిడ్డలను తీసుకుని. వ్యాపారం దివాలా తీసి, అప్పుల్లో కురుకుపోయాడట. ఎక్కడికి పోయారో, ఏమి అఘాయిత్యం చేసుకున్నారో. ఒక్క పెదవి దాటి వచ్చిన పుకారు క్షణాల్లో ఊరు దాటేసింది.
ఇక వినలేకపోయాడు సుధాకర్. నడి నెత్తిమీద ఎర్రటి ఎండ కాల్చేస్తుంటే, మనసులోని బాధ అతన్ని నిర్వీర్యుడిని చేసింది. నడి రోడ్డుమీద నిస్సత్తువగా కూలబడిపోయాడు.
ఆ రోజు నుంచి రెక్కలు తెగిన ఒంటరి పక్షి అయిపోయాడు సుధాకర్. రాఘవ కుటుంబం కోసం చాల చోట్ల వెతికాడు. ఎక్కడా రాఘవ ఆచూకీ తెలుసుకోలేకపోయారు.
ఎవరో అనుకుంటున్నట్లు వాడు ఏ అఘాయిత్యం అయినా చేసుకోలేదు కదా. ఆ ఊహే భరించలేకపోయాడు సుధాకర్. స్నేహితుడు ఎక్కడ ఉన్నా అతని కష్టాలు తీరాలని, సంతోషంగా ఉండాలని కనిపించని దేవుడికి అనుక్షణం మొక్కుతున్నాడు.
కాలం క్షణం ఆగకుండా పరుగులు తీస్తోంది. తనకి మాత్రం రాఘవ లేకుండా క్షణం గడవడం లేదు. క్షణమొక యుగంలా. అయితే మనసులో ఏదో ఒక మూలా చిరు ఆశ. రాఘవ తిరిగి వస్తాడని.
“బాగుందిరా సుధా..నువ్వు చేసిన పని. బిడ్డ పెళ్ళి కోసం దాచిన డబ్బు రాఘవ చేతుల్లో పోసావా..? వాడు ఊరు వదిలిపోయి నాలుగేళ్లు అయింది. ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలియదు. అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇక ఆ డబ్బుకి తిలోదకాలు వదులుకోవాల్సిందే. నాకు మనవరాలి పెళ్ళి చూసే యోగం లేదు ” మనసులో ఉన్నదంతా బయటకు కక్కింది ఆవేదనగా శాంతమ్మ.
“అమ్మా..నీకు గుండె ఆపరేషన్ చేయాల్సివచ్చినప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఆపరేషన్ ఖర్చు మొత్తం వాడు భరించాడు. తిరిగి డబ్బు ఇవ్వబోయినా తీసుకోలేదు. అటువంటివాడు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోను” బాధతో సుధాకర్ గొంతు బొంగురుపోయింది.
“మీ స్నేహితునికి ఇచ్చే ముందు ఒక్క మాటైనా మాకు చెప్పాలనిపించలేదాండీ..? ఇప్పుడు పిల్ల పెళ్ళి ఎలా జరిపించాలని..? చేతికందిన ముద్ద నోట్లోకి పోయేలోగా నేలపాలైనట్లు, ఇంత దూరం వచ్చిన సంబంధం పెళ్ళి పీటలు ఎక్కకుండానే ఆగిపోయేటట్లు ఉంది ” చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ సుభద్ర
ఎంత ప్రాణ స్నేహితుడైనా కష్టంలో ఉంటే ఏదో మన శక్తి చూసుకుని ఆదుకోవాలి. అంతేకానీ , మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తే ఎట్లారా..? శాంతమ్మ దీర్ఘాలు తీసింది. కాలమే అన్నిటికి సమాధానం చెప్పాలి. మౌనమే నా భాష అన్నట్లు సూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు సుధాకర్.
ఆ రోజు ఉదయం కీర్తితో మాట్లాడాలని అంకిత్ వచ్చాడు.
ఇదే సమయం రా సుధా.. మనం ఇప్పుడు పెళ్ళి జరిపించడానికి చేతిలో డబ్బు లేదు. కొంత కాలం ఆగుదాం అని అబ్బాయికి చెప్పరా నువ్వు” గదిలోకి పిలిచి కొడుక్కి చెప్పింది శాంతమ్మ.
“సమయం చూసుకుని చెప్తాలే అమ్మ” అన్నాడు. అందరు మౌనంగా కాఫీ తాగుతున్నారు.
” ఒరే సుధాకర్ ” మాట వినపడనే వాకిలితట్టు చూసారు అందరు. చేతిలో సంచి, ముఖంలో నవ్వుతో రాఘవని చూడగానే సంబ్రమాశ్చర్యాలతో పులకించి పోయాడు సుధాకర్.
ఆ క్షణం అక్కడ తలవని తలంపుగా, ఊహించని అద్భుతం కళ్ళముందుకు వచ్చినట్లు అయింది రాఘవని చూడగానే అతనికి. ఎదురు వెళ్లి మిత్రుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు సుధాకర్. కాసేపు మాటలు రాలేదు ఇద్దరికి ఆనందంలో. రాఘవని చూడగానే విస్తుపోయారు సుభద్ర, శాంతమ్మలు.
” రాఘవా..వచ్చావా..! నాకు తెలుసురా. నువ్వు ఎక్కడున్నా నాకోసం వస్తావని. నీ గురించి ఎవరెన్ని చెప్పినా నేను నమ్మలేదురా. చెల్లెమ్మ, పిల్లలు ఎలా ఉన్నారు. అసలు ఎక్కడ ఉన్నారు ..? ఇంత కాలం ఈ అజ్ఞాతవాసం ఏంటిరా..? స్నేహితుడిని చూసిన ఆనందంలో సుధాకర్ మౌనం బద్దలైంది.
“నిజమేరా.. ఇన్ని రోజులు అజ్ఞాతవాసమే చేశాను. ఆ రోజు నువ్వు డబ్బు ఇచ్చిన విషయం బ్యాంకు వాళ్ళ ద్వారా కొందరికి తెలిసింది. పక్క రోజే అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ దడి కట్టారు బాకీలు తీర్చమని. ఇక వారికి ఇవ్వక తప్పలేదు నాకు. తర్వాత అడుగుముందు వేయడానికి నా దగ్గర ఏం మిగల్లేదు. రెండు నెలలు ముళ్ళమీద ఉన్నట్లు గడిచింది కాలం. ఇక నా వల్ల కాలేదురా.. ఇక పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేక, బతికుంటే చాలు బలుసాకు అయినా తినొచ్చని, హైదరాబాద్ వెళ్ళిపోయాంరా”.
“మరి ఇన్ని రోజులు ఏం చేసారు అన్నయ్య మీరు” కాఫీ ఇస్తూ సుభద్ర
“అక్కడికే వస్తున్నా తల్లీ. మీ వదిన ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేరింది. నేను ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరాను. ఇద్దరం ఈ నాలుగేళ్ళు కష్టపడ్డాం. ఇదిగో ఈ రోజు మీ ముందుకు ఇలా రాగలిగాను. నీకు చెప్పకుండా వెళ్లినందుకు నన్ను మన్నించారా సుధా” స్నేహితుని వంక ఆపేక్షగా చూస్తూ రాఘవ.
“మన మధ్య మన్నింపులు ఏమిటిరా. నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. అది చాలురా నాకు” సుధాకర్
“నీ మనసు నాకు తెలుసురా. నేను ఎక్కడ ఉండేది మీకు తెలియదు. కానీ నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. మన కీర్తికి పెళ్ళి కుదిరిందని తెలిసింది. కీర్తి పెళ్ళి కోసం నువ్వు ఎన్ని తంటాలు పడతావో కూడా నాకు తెలుసు. ఈ నాలుగేళ్ళు మేము పడిన శ్రమకి ఫలితం దక్కింది. బిడ్డలు చేతికి అంది వచ్చారు. నేను ఇప్పుడు ఉద్యోగం మానేసి ఓ చిన్న హోటల్ నడుపుతున్నానురా . ఆ రోజు బిడ్డ పెళ్ళి కోసం దాచిన సొమ్ము క్షణం ఆలోచించకుండా నాకు ఇచ్చావు. ఇన్ని రోజులు డబ్బు చేతిలో లేక మీరు ఎంత బాధ పడ్డారో. తీసుకోరా సుధా అంటూ డబ్బు కట్టలు ఉన్న సంచిని స్నేహితుడికి అందించాడు రాఘవ.
” ఆగరా రాఘవా..ఆ డబ్బు నాకు ఇచ్చి మన స్నేహం విలువ తగ్గించకు రా. నువ్వు వ్యాపార నష్టం నుంచి కోలుకున్నావు. మళ్ళీ నా ముందుకు వచ్చావు చాలు. ఆ డబ్బు నీ నుంచి తిరిగి ఆశించలేదురా నేను” ఆర్తిగా సుధాకర్.
“అది కాదు సుధా.. కీర్తి పెళ్ళికోసం నువ్వు” అతని మాట పూర్తి కానీకుండా “రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఓ చిన్న ఉద్యోగంలో కుదురుకున్నానులేరా, ఇప్పుడంత ఇబ్బంది ఏంలేదు” ఆపేక్షగా రాఘవ కళ్ళల్లోకి చూసి అన్నాడు సుధాకర్.
ఇచ్చిన డబ్బు వద్దంటున్నాడే అని ఆందోళనగా చూడసాగారు శాంతమ్మ, సుభద్రలు.
” నిజం అంకుల్. ఆ డబ్బు మీ వద్దనే ఉంచండి. కీర్తి నాకు అంతా చెప్పింది. మీ అపురూపమైన స్నేహబంధం గురించి” అంకిత్ మాటలకు అబ్బురంగా చూసాడు రాఘవ.
“అంకుల్..మీరు కస్టపడి సంపాదించిన డబ్బు అంతా ఇలా పిల్లల పెళ్లి కోసం ఖర్చు పెట్టేస్తే ఇక మీరెలా గడపాలని. పెట్టుపోతలు, డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటివి అన్ని ఉండేది వ్యాపార, ఆర్థిక సంబంధాల్లో. కానీ ఇద్దరు వ్యక్తులు పెళ్ళి ద్వారా ఏకం కావాలంటే వారిమధ్య ఉండాల్సింది అనురాగ బంధం. వారు ఇచ్చిపుచ్చుకోవాల్సింది మనసులను” కాసింత ఉద్వేగంగా కీర్తి వంక చూస్తూ చెప్పాడు అంకిత్
“అవును నాన్న. ఆ విషయమే మాట్లాడాలని అంకిత్ ఈ రోజు మనింటికి వచ్చాడు. మీరు రాఘవ అంకుల్ కి డబ్బు ఇచ్చిన విషయం ఫోన్లో అంకిత్ కి చెప్పాను నేను. మేము ఇద్దరం చాల సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాం. మమ్మల్ని కస్టపడి పెంచి, చదివించారు మీరు. అది చాలు నాన్న. ఇప్పుడు మాకు ఉద్యొగ్యలు ఉన్నాయి. అంకిత్ వాళ్ళ అమ్మ, నాన్న కూడా ఒప్పిస్తాం మేము”.
వారి ఆదర్శ నిర్ణయానికి విస్మయం చెందారు. మీ లాగా ఆలోచించే బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. ఈ రోజు ఆ అదృష్టాన్ని మాకు కలిగించారు మీరు అని సుధాకర్ అన్న మాటకు కీర్తి , అంకిత్ ల వైపు ఆప్యాయంగా చూసారు అందరూ.
“అవునంకుల్. ఒకరికొరకు ప్రాణం అన్నంతగా అల్లుకున్న మీ స్నేహబంధంలోని వైచిత్రిని చూసి మేము కూడా అబ్బురపడ్డాం. మీ స్నేహంలో పొరపొచ్చలు రాకూడదు. అందుకు మా పెళ్ళి మీకు అడ్డురాకూడదు. ఇంకా అంతకుముందే మేము చాల నిరాడంబరంగా పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. మీ స్నేహం మాకు ఆదర్శం. మేము తీసుకున్న నిర్ణయానికి మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం ” అన్నాడు అంకిత్ మెరిసే కళ్ళతో కీర్తి వంక చూస్తూ.
పిల్లల నిర్ణయానికి, తమకంటే ఎంతో ఉన్నతంగా ఎదిగిన వారి ఆదర్శానికి తలవంచారు స్నేహితులు ఇద్దరు పరమానందంగా.
ఏమనిరాయాలి ఇది కథ కాదు మా అమ్మ.. జీవిత గాద………
ధన్యవాదాలు 🙏