ముందడుగు

మిత్రులారా..లాక్ డౌన్ కష్టకాలంలో కరోనా నేపథ్యంలో వ్రాసిన మరో కథ ఈ “ముందడుగు”. నవంబర్ నెల 2020 “నెచ్చలి” అంతర్జాల పత్రికలో ప్రచురితం అయింది. డా. గీత కల గారికి ధన్యవాదాలతో.. మీ కోసం ఈ కథ ఇక్కడ.  మరి చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా..

———————————————————————————————————————————————————————

పిల్లలిద్దరూ రంగు పెన్సిళ్ళతో కాగితాలమీద బొమ్మలేవో వేసుకుంటున్నారు. సోఫాలో కూర్చుని కూర్చుని నడుం నొప్పి పుడుతోంది. ఐదు నిముషాలు టీవీ లో వార్త చానెల్స్, మరో ఐదు నిముషాలు సెల్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ లు మార్చి మార్చి గంట నుంచి చూస్తున్నాను. అన్ని చోట్లా ఇపుడు ఒకటే వార్తలు. కరోనా వ్యాధి గురించి. కరోనా ఏ దేశంలో ఎంత శాతం ప్రజలకు అంటుకుంది. కరోనా రాకుండా నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు, ఇదే సమాచారం నాలుగు నెలల నుంచి చూసి చూసి ఏదో నిస్తేజం ఆవరించింది నన్ను. వంటింట్లో నుంచి గిన్నెల చప్పుడు ఉండుండి పెద్దగా ఆగి ఆగి వినిపిస్తున్న ఫ్యాక్టరీ సైరన్ లా వినబడుతోంది. ” ఉమా, టిఫిన్ తిని గంట అయింది. కాస్త కాఫీ తెచ్చి ఇవ్వకూడదా…” కేకవేసాను.

” చీర కొంగు నడుంచుట్టూ తిప్పి బిగించి కట్టి, రేగిన జుట్టుతో, చెమటలు కారుతుండగా కాఫీ గ్లాస్ తెచ్చి నా చేతికి ఇచ్చింది ఉమ విసుగ్గా.
” ఏమిటోయ్, అలా ఉన్నావ్” అన్నాను ఉమను ఎప్పుడూ అలా చూడలేదు నేను. రోజు నేను నిద్ర లేచేలోగానే లేచి స్నానం చేసి చక్కని చుక్కల తయారవుతుంది తను.

” మీకేం అండి మగ మహారాజులు. బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా మీకు చక్కగా గడిచి పోతుంది. పని మనిషి మానేసి ఇరవై రోజులు అయింది. అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టే నాధుడు లేదు. ఇంటిపనంతా చేసుకోలేక చస్తున్నాను. ఈ కరోనా లాక్ డౌన్ నా ప్రాణానికి వచ్చింది” అంది ఉమ. తను కోపంగా అన్నా నాకు సత్యభామలా నాటకీయంగా అనిపించింది.

” ఏమిటోయ్ చెట్టంత ఈ నాధుడిని ఎదుట పెట్టుకుని అంత చింత నీకు ఏల బాల…పద నీ సామ్రాజ్యంలోకి, నీ యుద్ధంలో ఈ నాధుడి సాయం తీసుకుందువు కానీ” అంటూ తన వెనుకే వంటింట్లోకి నడిచాను.

అక్కడ సింకు నిండా గిన్నెలు ఉన్నాయ్. “అదేంటి ఉమ! రాత్రి అన్నీ గిన్నెలు తోమేసావు కదా. మళ్ళీ ఇవి ఏమిటి ” అన్నాను. ” బాగుందండి…ఇవి పొద్దున కాఫీ, టిఫిన్లు అయిన తర్వాతవి. రోజుకు నాలుగైదు సార్లు గిన్నెలు పడతాయి ” అంది చిరాకుగా ఉమ.

సరే అని ఓ నాలుగు గిన్నెలు, గ్లాసులు తోమి కడిగాను. పిల్లలు, భర్త బయటకు వెళ్ళాక ఇక ఇంట్లో ఆడవాళ్లకు ఏం పని ఉంది అనుకునేవాడిని. ఈ పది రోజుల నుంచి తెలుస్తోంది ఆడవాళ్ళ కష్టం ఏంటో. ఒక్క రోజు వాళ్ళు ఇంట్లో లేక పొతే ఇక ఆ ఇల్లు చెత్త కుప్పకంటే ఘోరంగా తయారవుతుంది అనిపించింది. ఏంటో ఈ రోజు మరి విసుగ్గా ఉంది. కరోనా అంటు వ్యాధి అని తెలిసినప్పటినుంచి ఉమ రోజు మిరియాల చారు, ఏదో ఒక తాలింపు కూర చేస్తోంది. ఈ రోజు ఏదైనా వెరైటీ చేయమనాలి అనుకుంటూ ” ఉమా…ఈ రోజు కాస్త మునక్కాడలు, సొరకాయ ముక్కలు వేసి మజ్జిగ పులుసు పెట్టకూడదు” అన్నాను వంటింట్లోకి వచ్చిన ఉమని చూసి.

అంతే తోక తొక్కిన తాచులా నా మీద తాడెత్తున లేస్తూ ” అసలు మతి ఉండి మాట్లాడుతున్నారా మీరు..’.మొదులు లేదురా మొగుడా అంటే..పెసల పప్పు చేయవే పెళ్ళామా’ అన్నాడంట వెనకటికి మీ లాంటివాడు. పచారీ సరుకులు నిండుకున్నాయి నిన్న వెళ్ళి తెమ్మంటే సంచి తీసుకుని వెళ్ళి పచారీ కొట్టు దగ్గర క్యూలో చాలామంది ఉన్నారు, నిలబడలేకపోయాను అంటూ అరగంట గడవక ముందే ఇంటికొచ్చేసారు కదా. ఇప్పుడు మజ్జిగ పులుసు అంటే పెరుగు, కొబ్బరి కాయ ఎక్కడ నుంచి వస్తాయి. కడుపుతో ఉన్న ఆడవాళ్ళలాగా మీ కోరికలు. హు” అంటూ నన్ను నెట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది ఉమ.

బెల్లం కొట్టిన రాయిలాగా కిమ్మనకుండా వచ్చి సోఫాలో కూలబడ్డాను. గోడగడియారం తనకు ఎవరితో పనిలేదు కాలాన్ని అనుసరించడం తప్ప అంటూ పదకండు గంటలు కొట్టింది. ఇపుడు అదొక్కటే మా ఇంట్లో ఉన్న పాత తరానికి వారధి. యధాప్రకారం టీవీ పెట్టాను. కరోనా అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణాలో విజృంభిస్తోంది. జిల్లాల వారిగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య….నాయకుల సందేశాలు..ఏ ఛానల్ చూసినా ఇదే. టీవీ కట్టేసాను. పిల్లలు ఓ మూల కూర్చుని ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసి కాస్త అసూయ కలిగింది. చీకు, చింత లేని బాల్యం. ఆ లేత అమాయక ముఖాల్లో ఎంత నిబ్బరం. బయటకు పోయి ఆడుకోవడం తప్పించి ఇక వాళ్లకు ఏ ఇబ్బంది లేదు. ఏం జరిగినా చూసుకునేదానికి తమకు అమ్మ,నాన్న ఉన్నారని నమ్మకం. కానీ తమ జీవితాలకు భరోసా ఇచ్చేదెవరు. సరుకులకు తప్ప కాలు గడప అవతల పెట్టి ఇరవై రోజులైంది. ఆఫీస్ లేదు.ఈ నెల జీతం అందుతుందో లేదో తెలీదు. ఈ మధ్య తరగతి వాళ్ళ బతుకులు మధ్యాన్నపు ఎండలాగా సెగలు రగిలించేవే. ఒక్కసారి తల విదిలించి లేచి సంచి తీసుకున్నాను. కళ్ళతోనే ప్రశ్నించింది ఎక్కడికని ఉమ.

“అలా పచారీ కొట్టు దాక వెళ్లివస్తాను అన్నాను “. ఇపుడు గంట పదకండు. లాక్ డౌన్ సమయం. పొద్దున పొమ్మంటే పోలేదు మీరు” అంది ఉమ. లాక్ డౌన్ మొదలైన గంట వరకు మూసేసి పదకండు కు మెల్లగా కొట్టు తెరిచి ఉంచుతాను. వెనక వైపు నుంచి వచ్చి తీసుకోండి అన్నాడు కొట్టతను. రెండు వీధుల అవతలే కదా. త్వరగా వచ్చేస్తాను” అంటూ ఉమ పిలుస్తున్నా పట్టించుకోకుండా బయటకు వచ్చేసాను.

మా వీధి దాటేసి వడి వడిగా నడవసాగాను. ఇంకో ఐదు నిముషాల్లో పచారీ కొట్టు వచ్చేస్తుంది అనగా అప్పుడు ఎదురయింది నా పాలిటి యమ వాహనం. వేన్ నుంచి దిగాడు ఓ పోలీస్. ఏంటి ఎక్కడికి అని నన్ను అడగడానికంటే ముందే అతని చేతిలో లాఠీ నా కాళ్ళమీద నాట్యం చేసింది. “అమ్మా” బాధగా అరిచాను. పుట్టి బుద్దెరిగిన తర్వాత అమ్మా, నాన్న కానీ, బడిలో టీచర్స్ చేత కానీ ఒక్క దెబ్బ తిన్నట్టు గుర్తు లేదు నాకు. ” లాక్ డౌన్ సమయంలో బయట తిరగగూడదని తెలియదా… పైగా ముక్కు,నోటికి మాస్కు కూడా వేసుకోలేదు. కరోనా అంటుకుంటే ఆ తర్వాత ఎవరు బాధ్యులు. మేము ఎన్ని జాగ్రత్తలు చెప్పిన వినకపోతే ఎలా” అన్నాడు ఆ పోలీసతను దెబ్బ కొట్టినాక కాస్త అనునయంగా వాతపెట్టినాకా వెన్న రాసినట్టు. అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు ఇంటినుంచి వచ్చే తొందరలో మాస్కు వేసుకోలేదని. అపరాధ భావం, అభిమానం రెండు కలగలిసిన గొంతుకతో ” ఈ పక్కనే మా ఇల్లు. పచారీ సరుకులు బొత్తిగా నిండుకుంటే పక్క వీధిలో ఉన్న కొట్టులోనే తెచ్చుకుందామని వెళుతున్నాను” సంజాయిషీ ఇచ్చుకున్నాను.

” లాక్ డౌన్ సమయంలో షాపులకు వెళ్ళకూడదు. త్వరగా ఇంటికి వెళ్ళండి” మరో మాటకు తావు లేకుండా వేన్ ఎక్కి కూర్చున్నాడు పోలీస్. వేన్ ముందుకు కదిలింది. లాఠీ దెబ్బకు కాలుమీద చర్మం లేచినట్టు ఉంది. మంట పుడుతోంది. “ఛీ… ఈ రోజు లేచిన వేళ మంచిది కాదు. ఇంత వయస్సులో ఈ దెబ్బ తినడం ఏమిటి. చాల చిన్నతనంగా అనిపించింది. ఇక పచారీ కొట్టుకు పోవాలనిపించలేదు. వెనుదిరిగి ఇంటికెళదాం అనుకున్నా. ఈ గొడవలో పడి గమనించలేదు నేను మా వీధి దాటి ఎడమ వైపు ఉన్న వీధిలోకి ఎప్పుడూ వచ్చానో నేను.

ఆ వీధిలో నరమానవుడు అన్నవాడు కనపడలేదు. మళ్ళీ వెనుదిరిగితే ఆ పోలీస్ వేన్ నాకు ఎదురు పడవచ్చు అనుకుని ముందుకే కదిలాను. వెనుక వీధిలో నుంచి మా ఇంటికి వెళ్లవచ్చని. నాలుగడుగులు వేసి తలఎత్తాను. అక్కడ సోమసుందరం మాస్టారి ఇంటి ముందు నలుగురు నిలబడిఉన్నారు ముఖం కనబడకుండా మాస్కులతో ఉన్నారు.ఇంటి ముందు ఓమునిసిపాలిటీ వేన్ ఉండడం కూడా అపుడే గమనించాను. ఏమై ఉంటుందా అని మరో నాలుగడుగులు ముందుకు వేసాను. అంతే కరెంటుషాక్ కొట్టినట్టు చేష్టలుడిగి నిలబడిపోయాను.

అక్కడ ఇంటిముందు పాడే మీద సోమసుందరం మాస్టారి పార్థివదేహం. నిలబడ్డ నలుగురు మాస్టారి కొడుకులు, అల్లుళ్ళు. వాళ్ళు తప్ప ఇంకా ఎవరు అక్కడ లేరు. అయ్యో….మాస్టారు ఎంత గొప్ప వ్యక్తి. ఎంత మంచివాడు. మాస్టర్ అంటే ఆ ప్రాంతంలో అందరికి పెద్దదిక్కు అని గౌరవం. పోయిన ఏడాది మాస్టారి భార్య జానకమ్మ గారు చనిపోతే ఊరు ఊరంతా కదిలి వచ్చారు ఆమె అంతిమ సంస్కారాలకు. మరి ఇప్పుడు మాస్టారి కొడుకులు, అల్లుళ్ళు తప్ప ఇంక ఎవరు లేరు అక్కడ. అంటే ఈ కరోనా భయంతో పక్కఇంటి వారుకూడా బయటకి రాలేదన్నమాట. అయ్యో ఎంత దయనీయ పరిస్థితి వచ్చింది వీళ్ళకి అనుకుంటుండగా మాస్టారి పెద్ద కొడుకు నా ఆఫీస్ కొలీగ్ రఘుపతి అనుకుంటా ” శంకర్ “అని పెద్దగా పిలిచి చేయి ఊపాడు రమ్మని. ముందుకు కదలపోయి చెళ్ళున ఎవరో కొట్టినట్టు ఆగిపోయాను. అప్పుడు ఆ క్షణం మొదటిసారిగా నాలో పురుడు పోసుకుంది మరణభయం. అప్రయత్నంగా నా చేయి నా ప్యాంటు జేబులోకి వెళ్ళింది. చేతి రుమాలు తీసి ముక్కుకు కట్టుకుని వాళ్ళను చూడనట్టు వెనుతిరిగి వడి వడిగా నడుచుకుంటూ ఇంటికొచ్చేసాను. ఉమ ఏం అడిగిందో, నేను ఏం చెప్పానో ఏం తిన్నానో గుర్తుకు రాలేదు. పోలీస్ లాఠీ దెబ్బ, మాస్టారి మరణం అవి రెండే నా మనసులో కలకలం రేపుతున్నాయి. కాసేపు చేతనా మరి కాసేపు అచేతన అవస్థలో, లాఠీ దెబ్బకి కాలి పిక్క మీద ఎర్రగా కంది మంట ఓ వైపు, మాస్టారి మృత దేహం మరోవైపు నా ఆలోచనలను తొలిచేస్తూ రాత్రి అయింది కూడా తెలియలేదు నాకు. నిస్సత్తువగా మంచం మీద వాలాను. నిద్రాదేవత కూడా నా మీద పగపట్టిందేమో నిద్ర రాలేదు కానీ కళ్ళు మండుతున్నాయి. రెప్పలు మూత పడ్డాయి.

పొద్దునే సన్నగా మొదలైన దగ్గు తెరలు తెరలుగా వస్తోంది. ఒళ్ళు కూడా వేడిగా ఉన్నట్టు ఉంది. ఉమ ధర్మమేటర్ పెట్టి చూసింది. టెంపరేచర్ నూటఒకటి ఉంది. ఇంట్లో జ్వరం మాత్రలు కూడా లేవు. నాన్న నా డ్రాయింగ్ చూడు అంటూ పాపా నా దగ్గరకు రాపోయింది. వెంటనే ఉమ రమ్యను పట్టి వెనక్కి లాగి ” రమ్యా… నాన్నకు జ్వరంగా ఉంది.

నువ్వు డిస్టర్బ్ చేయకుండా అన్నతో కల్సి రూంలో ఆడుకోండి అంటూ పంపించేసింది. నాలో ఏదో అనుమానపు బీజం మొలకెత్తింది. అది ఇంతింతై వటువింతై చందాన పెరిగి పోయి నన్ను క్షణం నిలకడగా నీలవనీయలేదు. ఉమ మిరియాలు, తులసి ఆకుల కాషాయంని కాచి త్రాగించింది. రెండురోజులు అయిన గుణం కనపడలేదు. ఆయాసం కూడా మొదలైంది. ఇక లాభం లేదని పొద్దునే దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్ కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అంతే నన్నెవరో అమాంతంగా పాతాళంలోకి నెత్తినట్టు అయింది. ఇంటికి వెళ్ళడానికి లేదు. క్వారెంటైన్లో ఉండి చికిత్స తీసుకోవాలని, ఇంటిలో వాళ్ళకి సమాచారం అందిస్తామని చెప్పి ఇంటి అడ్రస్ తీసుకుని నన్ను గదిలోకి పంపించారు. పదిరోజులలోనే పగ పట్టిన పాము కాటు విషంలా కరోనా వైరస్ నా ఊపిరితిత్తులను ఛిద్రం చేసింది. నేను ఏం నేరం చేశాను. నేను ఏ పాపం ఎరగను. బయట అనవసరంగా ఎప్పుడూ తిరగలేదు. నాకు ఎందుకు ఈ శాపం. అయిన పాపపుణ్యాలతో, కులమతాలతో, ధనిక పేద అంతరాలతో కరోనా మహమ్మారికి ఏం పని. మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా, వస్తువుల ద్వారా వ్యాప్తి చెందడమే దానికి తెలుసు.

ఇక ఈ బాధ భరించలేకున్నాను. నా ఆఖరి శ్వాస వదిలేలోగా ఉమను, పిల్లలను ఒక్కసారి మనసారా గుండెలకు హత్తుకుని, ఆమ్మో వద్దు వద్దు ఈ కరోనా పిశాసి వాళ్ళకి అంటుకుంటే, నేను చనిపోయిన పర్వాలేదు వాళ్ళు క్షేమంగా ఉండాలి. అదిగో ఆగిపోయింది నా ఊపిరి ఆ రక్కసి కరోనా కోరలకు చిక్కి.

నా శవం అంతా కరోనా ఇన్ఫెక్షన్తో నిండిపోయివుందని ఇంటి వాళ్ళకు అప్పగించమని గాజు పెట్టెలో ఉన్న నా దేహాన్ని దూరం నుంచి చూడమని చెప్పినట్టు ఉన్నారు. పాపం ఉమ ,పిల్లలు నా కోసం ఏడుస్తూ గాజు పెట్టదగ్గరకు రాసాగారు. ” ఉమా….ఉమా.. అయ్యో రావద్దు. నువ్వు పిల్లలు నా దగ్గరకు రావద్దు. ఇంటికెళ్లి పోండి. మీరు క్షేమంగా ఉండాలి ఉమా.. ఉమా….
” అయ్యో, నిద్రలో ఏమిటండి ఆ కలవరింతలు.నేను మీ పక్కనే ఉన్నాను. పిల్లలు అదిగో ఆ మంచమ్మీద పడుకొని ఉన్నారు చూడండి” అంది ఉమా. అంటే అంటే నేను కరోనా సోకి చనిపోలేదన్నమాట. ఇప్పటివరకు కల కన్నానా…
” ఎందుకండీ అంతలా అరిచారు నిద్రలో ఏమైనా పాడు కల వచ్చిందా” అంటూ నీళ్ళు తాగించి నన్ను తన ఒడిలోకి తీసుకుని అనునయంగా నా జుట్టు నిమరసాగింది ఉమ.

అవునంటూ తల ఊపి తన ఒడిలో సేదతీరుతూ అనుకున్నా. నేను లేక పొతే నా ఉమ , పిల్లలు ఎలా బ్రతకగలరు. వాళ్ళే కాదు కుటుంబంలో ఎవరు మరణించిన అది ఆ కుటుంబానికి జీవితాంతం తీరని శాపమే. ఈ కరోనా రక్కసిని పారత్రోలాలంటే ఒకేటే మార్గం. గడప దాటాక పోవడమే. పరిసరాలు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని, మితంగా తింటూ, అమితమైన ఆశాభావంతో ఉండడం . ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు, ఎర్రటి ఎండను సైతం లెక్క చేయక, లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న పోలీసులకు, ప్రాణభయాన్ని పక్కన పెట్టి సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల క్షేమం కాంక్షిస్తూ ఇంటిపట్టున ఉండి మంచి రోజుల కొరకు ఎదురు చూడడమే మనం చేయాల్సింది.
కాస్తో కూస్తో నాకు ఉన్న సాహితి కళతో నా చుట్టూ ఉన్న వారిని చైతన్య పరిచేలా , కరోనా గురించి అవగాహనా కలిగించేలా కవితలు, కథలు రాయాలని నిర్ణయించుకున్నాను. ఆ దిశగా ముందడుగు వేస్తాను. ఇప్పుడు నాకు మనఃశాంతిగా వుంది. నిద్రాదేవి దయతో నన్ను ఆదరించింది.

6 thoughts on “ముందడుగు”

  1. Anil Telikicherla

    చాలా బాగుంది అమ్మ… నాటకీకరణ కు ప్రయత్నం చేస్తే దృశ్య రూపం ఇన్ క బాగుంటుంది. ఈ వైపుగా నా అడుగులు పడతాయేమో ప్రయత్నిస్తాను….

Comments are closed.