భూమిలో భూతం

ప్రజాశక్తి స్నేహలో ఈ రోజు ప్రచురితం అయిన నా బాలల కథ “భూమిలో భూతం” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి.

“ఇంకెంత దూరం నడవాలి తాతా, బాగా దాహం వేస్తోంది. నీళ్ళు తాగకుండా నేను ఒక్క అడుగు వేయలేను” అంటూ నిలబడిపోయాడు వాసు.
ఇంకో నాలుగడులేస్తే పక్క వీధి వస్తుంది. వీధి చివర్లోనే మీ అత్తా వాళ్ళ ఇల్లు ఉండేది.కాస్త ఓపిక తెచ్చుకుని నడవరా నాయనా ” మనవడిని బుజ్జగిస్తునే చుట్టూ చూసాడు వీరయ్య.
పల్లె, పట్టణం కానీ చిన్న ఊరది. అంతకు ముందైతే ఆ ప్రాంతమంతా పచ్చటి చెట్లతో నిండి ఉండేది. జనాభా పెరిగి, ఇళ్ళు పడ్డాక, అంజనం వేసి వెదికినా చెట్లు కనపడడం లేదు. ఎండ మాడ్చేస్తోంది. తాతామనవాళ్ళ ఒళ్ళు మొత్తం చెమటతో తడిసిపోయింది. బుజానికున్న తుండుగుడ్డతో ముఖం తుడుచుకున్నాడు.
“తాతయ్య..ఎక్కడైనా నీళ్ళు తాగివెళదాము” తనకి కూడా దాహం వేస్తోంది. మనవడి మాటకి తలూపాడు. రెండిళ్ళ అవతల ఖాళీ స్థలం, ఆ పక్కన పశువుల కొట్టం దగ్గర మాటలు వినిపించాయి. అటు వైపు వెళ్ళారు ఇద్దరు. అక్కడ పశువుల డాక్టర్ ఒక ఆవుని పరిశీలిస్తున్నారు. డాక్టర్ కి సహాయకుడిని తాగడానికి నీళ్ళు అడిగారు వాసు, వీరయ్యలు. అక్కడ ఉన్న కుండలో నుంచి చెంబుతో నీళ్ళు ఇచ్చాడతను. చల్లటి నీళ్ళు తాగాక ఇద్దరి ప్రాణాలు నెమ్మదించాయి. అక్కడే ఉన్న అరుగు మీద కూర్చున్నారు.
ఆవు సరిగా మేయకుండా, నొప్పితో అరుస్తూ ఉందట. దాని పొట్ట చాల పెద్దదిగా చిన్న సైజు కొండలా ఉంది. అవుపొట్టకి స్కానింగ్ చేసి చూశాడట డాక్టర్. దాని పొట్టలో దాదాపు పది కిలోల పైన ప్లాస్టిక్ కవర్లు నిండి పేగులకు అడ్డుపడుతున్నాయట. ఆవుకి ఆపరేషన్ చేయాలి అని దాని యజమానికి చెప్తున్నాడు డాక్టర్,
అది విన్న వాసుకి అమితమైన ఆశ్చర్యం కలిగింది.
“తాతా..మరి ఆవులు గడ్డి మేస్తాయి కదా..దాని పొట్టలో ప్లాస్టిక్ కవర్లు ఎందుకు ఉన్నాయి?”
“భలే మంచి ప్రశ్న అడిగావు వాసు. ఆవులు గడ్డిని మేస్తాయి. కానీ పంటపొలాలు, చెట్టు చేమలు తగ్గిపోయాక, వాటికి ఆహారం దొరకడం బహుకష్టమైపోయింది. వాటిని పెంచేవాళ్ళు కూడా గడ్డి ఎక్కువ దొరక్క, ఏదోఒక ఆకులు మేతగా వేసి, వీధుల్లోకి వదులుతారు. ఆవులకి ఆకలి తీరక, కంటికి కనిపించిన రంగుల ప్లాస్టిక్ కవర్లను ఆహారం అనుకోని తినేస్తాయి. అవి పేగులకు అడ్డుపడి ఇదిగో ఈ ఆవుకు వచ్చినట్లు కడుపునొప్పికి కలిగిస్తాయి.” ఆవు వంక బాధగా చూస్తూ అన్నాడు వీరయ్య.
“ఆవులు, పశువులు ప్లాస్టిక్ కవర్లను తింటే, అవి ఆహారంలాగా జీర్ణం కావా వాటి పొట్టలో?” వాసు.
“లేదురా. ప్లాస్టిక్ కవర్లు వాటిపొట్టలో జీర్ణం కావు. అక్కడే కాదు. భూమి అడుగు పొరల్లో కలిసిన ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు కూడా మట్టిలో కలిసిపోవు. వేల సంవత్సరాలు అయినా కరిగిపోకుండా మట్టిలో ఉండి, చెట్ల పెరుగుదలకు ఆటంకంగా మారుతాయి”
“మరి భూమిలోపల బొగ్గు గనులు ఉంటాయి కదా. కార్మికులు బొగ్గు గనుల నుంచి తవ్వి, బొగ్గును తీస్తారు కదా? అలాగే ప్లాస్టిక్ గనులు ఉంటాయా తాతా?
ప్లాస్టిక్ గనులు ఉండవు. భూకంపాల వంటి ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దపెద్ద చెట్లు భూమి లోపలిపొరల్లోకి చాల అడుగుల కిందికి పడిపోయి, అక్కడి వేడి, రసాయనిక చర్యలవల్ల మాడిపోయి, బొగ్గు గనులు తయారవుతాయి. ఇదంతా జరగడానికి చాల సంవత్సరాలు పడుతుంది. అలా ఏర్పడినవే కొత్తగూడెం, రామగుండం, కొల్లారు వంటి ప్రాంతాల్లో ఉన్న బొగ్గుగనులు. వాటిని కార్మికులు తవ్వి బయటకు తీసి, విద్యుత్తు మొదలైన పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.”
“అయితే తాతా అబ్రకం గనులు కూడా ఉంటాయి కదా. అవి ప్లాస్టిక్ కాదా? వాసు.
“కాదు. అబ్రకం ఒక ప్రత్యేకమైన రసాయన పదార్ధాలతో ఏర్పడుతుంది. ఈ గనులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో అబ్రకం గనులు ఉన్నాయి. గనుల నుంచి అబ్రకన్ని తీసి, శుద్ధి చేసి, కొన్ని పరిశ్రమల్లో వాడుతారు. కానీ ప్లాస్టిక్ మాత్రం చాల ప్రమాదకరం. అది భూమి మీద ఉన్నా ప్రమాదమే. భూమి అడుగుపొరల్లో ఉన్నా ప్రమాదమే. ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు విచక్షణ రహితంగావాడి, వాటిని పారవేసినప్పుడు కొంతకాలానికి అవి భూమి అడుగు పొరల్లో చేరి, భూగర్భ జలాలకు అడ్డుపడతాయి. చెట్ల పెరుగుదలకు అడ్డుపడతాయి. తత్ఫలితంగా ప్రకృతిలో చెట్లు తగ్గిపోతే, భూవాతావరణం వేడెక్కి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. భూమి పైన ఉండాల్సిన ప్రాణవాయువు శాతం తగ్గి, కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతుంది”.
“అబ్బా..నీకు చాల విషయాలు తెలుసు తాతా.. మా సైన్స్ టీచర్ కూడా చెట్లను ఎక్కువ పెంచాలి అని చెప్తుంది” అన్నాడు వాసు.
“చెట్లను పెంచడమే కాదు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్ కప్పులను, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. వాటికి బదులుగా మట్టి పాత్రలు, కాగితం సంచులు వాడుకోవాలి . అప్పుడు మనకే కాదు జంతువులకు కూడా ఏ హాని జరగదు” అన్నాడు వీరయ్య
“మీ మనవడికి చాల మంచి విషయాలు చెప్పారు మీరు. అందరు ఈ విషయాలు తెలుసుకుంటే ఊర్లు పచ్చని చెట్లతో సస్యశామలం అవుతాయి” అన్నాడు డాక్టర్.
నవ్వుతూ వారికి వీడ్కోలు చెప్పి, మనవాడి చెయి పట్టుకుని బయటకు నడిచాడు వీరయ్య తాత.