“తూర్పు పడమరల ఏకత” కవితా వేదిక కవితల సంకలనం 2024 లోని కవితా గుచ్ఛం లో నా కవితా మాలిక “బొమ్మలు “. డాక్టర్ నెల్లుట్ల నవీన్ చంద్ర గారికి కృతజ్ఞతలతో..
గాయమైన మా గుండెలమీద
మీ కవిత్వ గేయలేపనాలద్దవద్దు..
మాటల తూటాలతో అబలలంటూ
మాపై మానసిక దాడి చేయకండి..
చీకటి ఒంటరితనం అవకాశమిచ్చిందని
మా దేహాలతో ఆడి మా మానాల్లోకి
గాజు పెంకులు దూర్చకండి..
జాతుల సమరం మమ్మల్ని నగ్నంగా ఊరేగిస్తే
మా అడుగులకు, మీ జాలిచూపుల
మడుగులొత్తవద్దు..
తలలేని మొండేలను చేసి
మమ్మల్ని మీ మగతనపు గుమ్మాలకు
అలంకారాలుగా వేలాడదీయకండి..
మీ ఆరాధనలు వర్ణనల్లో
మమ్మల్ని రొమ్ములు, మర్మస్థానం
మాత్రమే ఉన్న బొమ్మలను చేయకండి..
మీ బుద్ధికి పుట్టిన తెగుళ్ళతో
మమ్మల్ని ఓసారి కొండ శిఖరం ఎక్కించి
మరోసారి అథఃపాతానికి నెట్టివేయకండి..
మా కోసం ఏ దినోత్సవాలు జరపకండి
మమ్మల్ని మాలాగానే గుర్తించండి
మీ సహచర జీవులుగా నమోదు చేసుకోండి..
రోహిణి వంజారి