బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..!

స్పూన్ తో నా, చేత్తో నా తినేది మీరు ..? తిండి కోసం, వివక్ష కోసం బతుకుదామా..? నలుగురి ఆకలి తీర్చేదానికి బతుకుదామా..? ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలపండి 🙏🌹

బతకడం కోసం, బతికించడం కోసం తిందామా..!

మొత్తం జీవరాశుల్లో మానవులు వర్టిబ్రేట్స్ [వెన్నెముక గల జీవులు ] జీవ సముదాయంలో మమ్మెల్స్ [క్షీరదాలు అనగా పిల్లలకు పాలు ఇచ్చే జీవులు] జాతికి చెందినవాళ్ళం. ఈ విశ్వంలో సముద్రాల్లో ఎమినో ఆమ్లాల రూపంలో జీవం ఏర్పడిననాటినుండి, ఎన్నో లక్షల సంవత్సరాల జీవ పరిణామం తర్వాత హోమో ఎరక్టస్ నాటి ఏప్స్ ల నుంచి నేటి హోమోసెపియన్ [రెండు కాళ్ళ మీద నిలబడగలిగే పరిపూర్ణ మానవుడు} గా పరిణామం చెందడం అందరికి తెలుసు. కనుక ప్రకృతి సహజంగా ఏర్పడ్డ ఒక్క మానవ జాతి తప్ప మిగతా కుల, మతాలు, తెగలు ఇవన్నీ సూడో [మిధ్య] నే.

నివసించే ప్రాంతాలను బట్టి, ఆ ప్రాంతాలలోని ఉష్ణోగ్రతని బట్టి , జీన్స్ ని బట్టి మానవులకు ఒంటి రంగు, జుట్టు రంగులు ఏర్పడతాయి. అలాగే నివసించే ప్రాంతాల్లో లభించే ఆహార వనరులను బట్టి, నివసించే కుటుంబాల్లోని అలవాట్లను బట్టి ఆహారపు పద్ధతులు భిన్నంగా ఉండవచ్చు. అంత మాత్రాన మనుషులు అందరు ఒకటి కాదు అనుకోవడం మూర్కత్వం. ప్రకృతి సహజంగా ఏర్పడిన మానవ దంత నిర్మాణంను పరిశీలించినట్లేతే, మనుషులు అటు పూర్తి శాకాహారులు కాదు, ఇటు పూర్తిగా మాంసాహారులు కాదు. శాకాహార, మాంసాహార జంతువుల్లో ఉండే incisors[కత్తెర పళ్ళు], canines[వాడి పళ్ళు] రెండు రకాల పళ్ళు, అదనంగా మోలార్స్, ఫ్రీమోలార్స్[విసురు దంతాలు] మొత్తం 32 పళ్ళు. అంటే మానవులు సర్వ భక్షకులు. వృక్ష, జంతు సంబంధమైన ఏ రకమైన ఆహరం తీసుకోవడానికైనా అనుకూలంగా ఉండే దంతాల అమరిక మానవులకు ఉంది.

ఇప్పుడెందుకీ సైన్స్ పాఠం అంటారా. ఓ పదిహేను ఏళ్ళ క్రితం బిగ్ బాస్ లాంటి ఓ టీవీ కార్యక్రమంలో మనదేశానికి చెందిన సినీనటి శిల్పాశెట్టి పాల్గొన్నారు. ఆ షో లో శిల్పాశెట్టి భోజనాన్ని చేత్తో తిన్నదని, అందరిముందు ఆమెను కించపరచింది ఓ విదేశీ నటి. అదే షో లో భారతీయులకు పరిశుభ్రత తెలియదు. భోజనానికి స్పూన్లు వాడరు. చేతులతో తింటారు అంటూ కామెంట్స్ కూడా చేసింది. ఆ విషయంలో శిల్పాశెట్టి అవమానపడి, టీవీ షో జరుగుతుండగానే కన్నీరు కార్చింది. ఆ తర్వాత ఆ నటి తన తొందరపాటు మాటలకు పశ్చాత్తాపం చెంది శిల్పాశెట్టికి సారి చెప్పింది. అప్పట్లో ఆ సంఘటన కాస్త దుమారం లేపింది కానీ, ఆ నటి మాత్రం అప్పుడు బతికి పోయింది. అదే ఇప్పుడైతే, ఇక సదరు నటి మీద ఎన్ని ట్రోలింగ్స్ నడిచేవో, సామాజిక మాధ్యమాల్లో ఆమె మాటలకు ఎన్ని వక్ర భాష్యాలు తీసేవారో, ఆమె నెత్తిన ఎంత దుమ్ము పోసేవారో కదా. కానీ శిల్పాశెట్టి చాల హుందాగా, ఆ నటిని పల్లెత్తి మాట అనకుండా తన సౌశీల్యాన్ని ప్రదర్శించి, ఆ నటి మనసునే గెలుచుకుంది.

ఎడారుల్లో సంచార జీవనం చేస్తూ బతికే వాళ్ళకు సరిగ్గా తాగడానికి నీళ్ళు దొరకడమే కష్టం. కనుచూపు మేరలో హరిత వర్ణం కానరాని ఆ ఇసుక భూముల్లో దొరికే ఎడారి జంతువులు పాములు, తేళ్ళు, సాలీడులు లాంటివి తినడం తప్ప వారికి వేరే దారిలేదు. అట్లని వారిని అసహ్యించుకుంటామా..? అంటార్కిటికా మంచు ఇగ్లూ ఇళ్ళల్లో బతికేవాళ్ళకి మంచులో దొరికే జీవులు తప్ప బిర్యానీలు దొరుకుతాయా..? వారిని నీచంగా చూస్తామా..? సముద్రం మీద బతికే జాలరి అన్నకి చేపలు తప్ప ఇంకేం ఆహరం దొరుకుతుంది చెప్పండి..? పసితనం నుంచి కోడిగుడ్డు అయినా రుచి చూపని తల్లి దగ్గర పెరిగిన మనిషి జీవితాంతం శాఖాహారం వైపు మొగ్గు చూపడం తప్పా..? ఈ ప్రశ్నలకు ఎవరికి వారం సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు.

ఒక పట్టు చీర తయారీకి ఎన్నో వందల, వేల పట్టు పురుగులను చంపాల్సివస్తుందని జీవితాంతం పట్టువస్త్రాలు ధరించకుండా, నేత దుస్తులు ధరించేవారు ఉన్నారు. సముద్రపు మొలస్కా జీవుల ఆల్చిప్పల్లోకి చేరిన ఇసుక రేణువులు ముత్యాలు గా మారుతాయి. ఆ జీవులను చంపి ముత్యాలు తీస్తారని ముత్యాలు ధరించని వాళ్ళు ఉన్నారు. అది వారి వ్యక్తిగతం. అయితే ఆహారపు అలవాట్లు, తినే ఆహారాన్ని బట్టి మనుషులను ద్వేషించడం మొదలు పెడితే, కులాన్ని, మతాన్ని ఆహారపు అలవాట్లకు ముడిపెట్టి వివక్ష చూపితే, మేము అధికులం అనుకుంటున్న వారంతా, వారి పంట వారే పండించుకోవాలి. వారి దుస్తులు వారే తయారు చేసుకోవాలి. వారి చెప్పులు వారే కుట్టుకోవాలి. నిచ్చెన మెట్ల మీదికి చాల వివక్షలు వచ్చాయి. ఇప్పుడు తినే తిండి కూడా చేరితే మన విజ్ఞానం చంద్రయాన్ వైపుకు వెళ్ళినా, మన మనసులకు పట్టిన ద్వేషపు బూజు మనుషులుగా ఉన్న మనల్ని మృగాలుగా చేసి పాతాళంలోకి నెట్టివేస్తుంది.

కులం, మతం, ప్రాంతం, పగలు, రాత్రి అనే విభేదాలు చూడకుండా అర్ధరాత్రి, అపరాత్రి అనికూడా చూడకుండా ఆకలితో కడుపు పట్టుకువచ్చిన అన్నార్తులకు అన్నం వండి వడ్డించి, వారి ఆకలి కడుపులను చల్లబరచిన పూటకూళ్ళ పేదరాశి పెద్దమ్మలు, డొక్కా సీతమ్మలు లాంటి ఎందరో అన్నపూర్ణలు ఉన్న దేశం మనది. “నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు “అనే సామెత మనకి తెలుసు. తినే తిండి మీద, తిండి తినే అలవాట్లమీద చర్చలు, ద్వేషాలు, వివక్షలు చేసే పెద్ద మనుషులకన్నా, ఆకలితో ఉన్న మనిషికి పట్టెడన్నం పెట్టేవారే మహానుభావులు. వారందరికీ పాదాభివందనాలు.

రోహిణి వంజారి

సంపాదకీయం