ప్రేమలు

నేను గొప్ప

నేనే గొప్పని విర్రవీగుతారు..

చిన్న కష్టానికే

ఓర్వలేక కుదేలయిపోతారు..

కులమతాల కుళ్ళులో

జలగల్లా పొర్లుతుంటారు..

ఎవరో పట్టించుకోలేదని

ప్రేమకోసం దేబిరిస్తూ ఉంటారు..

స్వార్ధాన్ని నెత్తిన పెట్టుకొని

ఊరేగుతూ ఉంటారు..

విజ్ఞానపు ఫలాలనెన్నింటినో

చేజిక్కించుకుంటారు..

ఆధునిక వసతులనెన్నిటినో

అందిపుచ్చుకుంటారు..

డబ్బు జబ్బు చేసి

నానా యాతనలు పడుతుంటారు..

ఎదిగిన బిడ్డలకు వీసా రెక్కలు

కట్టి లోహ విహంగం ఎక్కించేస్తారు..

డాలర్లు బంగారు బిస్కెట్లు

కడుపాకలి తీర్చవని తెలిసి

ఒంటరితనాన్ని నిందిస్తూ ఉంటారు..

నడుమొంచి పనిచేయక

రాని నిద్రను తిట్టుకుంటారు..

అందరికంటే అధికులమని

భీకరాలు పోతుంటారు..

పంచ భూతాలముందు తామల్పులమని

ఏనాటికీ తెలుసుకోలేరు..

బాహ్య సౌందర్యమే శాశ్వతమని

లేని రంగులను దేహానికి పులుముకుంటారు..

కామ వాంఛలే ప్రేమనుకుని

దేహ ఇచ్చ కోసం పరితపిస్తుంటారు..

సాయమడిగిన వారికి

ఊతమియ్యడంలో

ఆనందం దాగుందని

ఏనాటికీ తెలుసుకోలేరు..

ప్రకృతిని మించిన ప్రేయసీ, ప్రియుడు

ఇంకేవరూ ఉండరని

తెలిసుకోలేరు ..

వెర్రి మానవులు

ఎన్నటికీ చైతన్యాన్ని కోరుకోలేరు..

రోహిణి వంజారి

22-4-2024