కూలీ పనులు చేసుకునే శ్రామిక తల్లి అయినా, మధ్య తరగతి ఇల్లాలు అయినా కళారంగంలోని నటి అయినా అందరూ మహిళలే. ప్రతి జీవితంలోనూ సంతోషాలతో పాటు వేదనల ఎడారులు, అగాధాలు ఉంటాయి. ప్రజాశక్తి ఆదివారం అనుబంధం లో వచ్చిన “పాసింగ్ ఫెజ్” లో ఓ మహిళ తన జీవన సమస్యను ఎలా అధిగమించింది అనేది కథలో చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹
“జీవితం చక్ర భ్రమణం, అది తిరుగుతూ తిరుగుతూ మొదలుపెట్టిన చోటుకే వస్తుంది ” అని ఎవరో కవి రాసాడంటే, బతకడం చేతకాని వెర్రి వాళ్ళు రాసుకునే మాటలు అనుకున్నాను ఇదివరకు. ఈ రోజుకి అదే నమ్మకానికి కట్టుబడి ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం సడలుతుందేమో నాలో అనిపిస్తోంది.
ఒంటరితనం, ఏకాంతం రెండింటిలో ఏది గొప్ప అంటే ఏం చెప్తాం. ఒకప్పుడు నేను చిటిక వేస్తే చాలు. వంద మంది నా చుట్టూ చేరేవారు. నేను కొండ మీది కోతిని తెమ్మన్నా, కొండను పిండి కొట్టమన్నా క్షణాల్లో నా కోసం పనులు జరిగిపోయేవి. నా ఓరకంటి చూపు కోసం, నా చిరునవ్వు కోసం ఎందరు పడిగాపులు కాచేవారో.
***
చాల దాహంగా ఉంది. ఒళ్ళంతా ఏదో సలపరం. నాకేమౌతోందో తెలియడం లేదు. పరమపద సోపాన పటంలో ఒక్కో నిచ్చెన మెట్టు ఎక్కుతూ శిఖరాగ్రం చేరుకున్నాను. అయ్యో ఏంటిది.. ! మంచం మీద నుంచి లేవలేక పోతున్నాను. దాహంతో గొంతు పిడచకట్టుకుపోతోంది. పదడుగులు వేస్తే టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకోవచ్చు. లేచి నిలబడ్డాను. తల దిమ్ముగా తిరుగుతోంది. సుత్తితో బాదినట్లు తలపోటు. అడుగుతీసి అడుగు వేయలేకపోతున్నా.
“మాయా..మాయా..” అరిచాననుకున్నాను. గొంతు దాటి మాట రాలేదు. కళ్ళ ముందు రంగురంగుల మెరుపులు అలవాటైన కెమెరా ఫ్లాష్ లైట్లలా. కాసేపు కనుగుడ్లు గిరగిరా తిరిగాయి. తర్వాత అంతా చీకటి. అయ్యో..! నాకు ఏం కనపడడం లేదు. నాకేం జరుగుతోందో తెలియడంలేదు. మెల్లగా నేలకు ఒరిగిపోతున్నాను. ఈ మాయా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నా శరీరం తాత్కాలికంగా అచేతనం అయింది. మనసు మాత్రం చేతన స్థితిలోనే ఉంది. ఇప్పుడు నా మనసు నాకు ఏదో చెప్తోంది. ఇన్ని రోజులు ఇంత తీరుబడిగా ఆలోచించుకునే సమయమే నాకు దొరకలేదు.
నిండు చెందురుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్లు నేను అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. అమ్మా,నాన్నలకు నన్ను డాక్టరుగా చూడాలని ఉన్నా, వాళ్ళ అభీష్టాన్ని కాదని ఇంటర్ అవగానే నా అభిరుచికి అనుగుణంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో చేరాను. దాంతో పాటు యాక్టింగ్ స్కూల్లో చేరాను. థియేటర్ ఆర్టిస్ట్ గా నాటకాలు వేసాను. కాలేజీ బ్యూటీ అని బిరుదు మనకి. ‘లవ్ యూ’ అని ప్రొపోజ్ చేస్తూ అబ్బాయిలు రాసే కుప్పలు తెప్పల ప్రేమలేఖలు ఫ్రెండ్స్ అందరి ముందు చదివి నవ్వుకున్నా, హీరోయిన్, స్వప్న సుందరి అనే కిరీటాలు నా సంకల్పానికి ఊపిరి పోశాయి. వెండితెర మీద నటించాలనే కోరిక నాలో బలంగా విత్తుకుంది. గొప్ప నటిని కావాలని పగలు, రాత్రి కలలు కన్నాను. నా కల తీరే తరుణం అంత త్వరగా వస్తుందని ఆ క్షణం ఊహించలేదు. *** మెల్లగా కళ్ళు తెరిచాను. నేలమీద పడిపోయిన నేను మంచమ్మీదకి ఎలా వచ్చాను..? నా ముఖంలో ముఖంపెట్టి ఆతృతగా చూస్తున్న మాయకు నా సందేహం అర్ధమైందనుకుంటా. “ఏదో కొరియర్ వచ్చిందని వాచ్మాన్ పిలిస్తే గేటు దగ్గరకి వెళ్ళాను మేడం. వచ్చి చూసేలోగా మీరు నేలమీద పడిపోయి ఉన్నారు. నేను, వాచ్మాన్ మిమ్మల్ని ఎలాగోలా మంచమ్మీదకి చేర్చాము. డాక్టర్ గారికి ఫోన్ చేశాను. అర్ధగంటలో వచ్చేస్తానన్నాడు. ఈ రోజు ఉదయంనుండి మీరు పాలు కూడా తాగలేదు మేడం” గ్లాస్ చేతికి అందించింది. నా శరీరం వణుకుతోంది. డైలీ వేసుకునే మాత్ర మింగాను. పాలు రెండు గుక్కలు తాగగానే కడుపులో తిప్పేసింది. గ్లాస్ మాయ చేతికి ఇచ్చేసాను. కళ్ళు మూసుకుని పిల్లోమీద వాలిపోయాను . ఇంకో చోట నా మనసు తెరుచుకుంది. ఆ రోజు కాలేజీకి ఓ యాడ్ ఫిలిం డైరెక్టర్ మహిపాల్ బ్యూటీ ప్రోడక్ట్ అడ్వర్టైజమెంట్ కోసం వచ్చి నన్ను చూడంగానే ఇక సెలక్షన్ లేదు. నువ్వు ఈ యాడ్లో నటించాల్సిందే అని అప్పటికప్పుడు నా చేత అగ్రిమెంట్ రాయించుకుని ఐదు వేలు అడ్వాన్స్ గా నా చేతికి ఇవ్వడం. ఓహ్..! ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది ఆ క్షణం. ఇక అమ్మా, నాన్నలను ఒప్పించడం నాకు వెన్నతో పెట్టిన విద్య కదా. ఒక్కగానొక్క ముద్దుల కూతురిని. నా మాట వాళ్ళు కాదనరనే నమ్మకమే నాచేత అగ్రిమెంట్ మీద సంతకం చేయించింది. నేను నటించిన యాడ్ ఫిలింకు మంచి రెస్పాన్స్ రావడం, ఆ తర్వాత వరుసగా నన్ను ‘మిస్ హైదరాబాద్’ , ‘మిస్ ఫ్రెష్ స్కిన్’, ‘బ్యూటీ క్వీన్ అఫ్ ది సౌత్ ఇండియా’ టైటిల్స్ వరించడం అంతా ఓ కలలా జరిగిపోయింది. విజయం ఇచ్చిన ఆనందం ఇంత బాగుంటుందా..! ఇక బోలెడన్ని అవకాశాలు వద్దన్నా వదలకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. వెనక్కి తిరిగి చేసుకునేంత తీరిక, ఓపిక లేకుండా చేసాయి. *** “హాయ్ కృతిక..హౌ అర్ యూ బేబీ” వస్తూనే తను తీసుకొచ్చిన రిపోర్ట్స్ నా చేతికిచ్చాడు డాక్టర్ విశ్వనాథ్. నాన్న క్లోజ్ ఫ్రెండ్ తను. రిపోర్ట్స్ పక్కన పడేసి మెల్లగా లేచి పిల్లోకి అనుకుని కూర్చున్నాను. “కృతిక ” అంటూ విస్మయంగా చూసాడు. “అంకుల్.. నాకు ఈ రిపోర్ట్స్ అంతా వద్దు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి ” అన్నాను నిర్లిప్తంగా. ” గతంకంటే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది బేబీ నీలో” తలవంచుకుని రిపోర్ట్స్ చూస్తూ చెప్పాడు. “అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలి అంకుల్. మీరు నా దగ్గర దాచకండి. నాకు నిజాలు కావాలి. ఈ మెడిసిన్స్ వాడేకంటే చావడమే మంచిదనిపిస్తుంది”
“నో..నో..కృతిక..అలా ఆలోచించకు. నీ రిపోర్ట్స్ అన్నీ నా ఫ్రెండ్ డాక్టర్ రెహ్మాన్ కి పంపాను. తను ఇంగ్లాండ్ లో గొప్ప న్యూరోసర్జన్ అండ్ సైకోఅనాలసిస్ట్. తను నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీటింగ్స్ కోసం ఇండియా వస్తున్నాడు. తనని ప్రత్యేకంగా నీ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ రమ్మని రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ రెండు నెలలు ఉంటాడు.సో..నువ్విక పిరికితనాన్ని వీడి హ్యాపీగా ఉండు. ఈ లోగా నువ్వు ఈ ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేయాలి. ఓకేనా బేబీ “.
నా కళ్ళు మూత పడుతున్నాయి. విశ్వనాథ్ అంకుల్ ఏం చెప్తున్నాడో నాకేం వినపడడం లేదు. మళ్ళీ నా శరీరం అచేతన స్థితిలోకి, మనసు ఉపచేతన స్థితిలోకి వెళ్ళాయి. మళ్ళీ నా మనసు నాకు ఏదో చెప్తోంది.
మొదటి సినిమా ప్లాప్. చెప్పలేని నిరాశ ఆవహించింది. అమ్మా ,నాన్న ఇంటికి వచ్చేయమన్నారు. ఆదిలోనే హంసపాదు. ఏదైనా జాబ్ చూసుకోవచ్చు, ఇక నటనకు స్వస్తి చెప్పేద్దామనే అనుకున్నా కమల్ పరిచయం అయ్యేదాకా. తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ మంచి సినిమాకు డైరెక్ట్ చేయాలనీ ఆశతో ఇంకా చెప్పాలంటే కసిగా ఉన్నాడు. నిరాశతో ఉన్న నాకు తోడుగా నిలిచాడు.
“పడినచోటే వెతుక్కోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు. ఇక్కడే ఉండి నిన్ను నీవు నిరూపించుకో. రేపటిరోజు ఏమైనా జరగవచ్చు” కమల్ మాటలు నా మీద మంత్రంలా పనిచేసాయి.
మా ఇద్దరి అదృష్టమో, మా సంకల్పం నెరవేరాలని కాలానికి కూడా ఇష్టమేమో కానీ, తలవని తలంపుగా తను డైరెక్ట్ చేసిన సినిమాలో నేను హీరోయిన్గా నటించడం ఓ అద్భుతమైన మలుపు మా జీవితంలో. ఆరు నెలలపాటు జరిగింది షూటింగ్. చివరి షెడ్యూల్ అయిపోయిన ఆఖరి రోజు షూటింగ్ కి పేకప్ చెప్పేసాక సినిమాకోసం పనిచేసిన అందరు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు వాళ్ళ ఇళ్లకు. కమల్, నేను కూడా ఇంటి దారిపట్టాం. ఇందులో వింతేముందంటారా. ఇద్దరం వెళ్ళింది ఒకే ఇంటికి. మా ఇంటికి. అప్పటికే మాకు పెళ్ళై రెండు నెలలైంది మరి.
మా సినిమా బంపర్ హిట్ అయింది. ఇక నాకు అవకాశాల వెల్లువ. కమల్ కి మాత్రం వెంటనే అవకాశాలు రాలేదు. నేను నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్. దక్షిణాది భాషలన్నిటిలో నా సినిమాలు విడుదల అయినాయి. నేను షూటింగ్స్ లో, కమల్ ఇంట్లో..ఒక ఏడాది గడిచిపోయింది. ఇక కాస్త గ్యాప్ ఇచ్చి పిల్లల కోసం ప్లాన్ చేయాలి అనుకున్నాను. కానీ అప్పటికే మా మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని నాకు అర్ధం అయ్యేసరికి జరగాల్సినదేదో జరిగిపోయింది.
“మేడం.. మేడం ” మాయ అరుస్తోంది. ఎక్కడో నూతిలోనుంచి వస్తునట్లు వినిపిస్తోంది మాయ గొంతు. బలవంతంగా కనురెప్పలు తెరిచాను. “డాక్టర్ బాబు చెప్పిన మందులు వాచ్మెన్ తెచ్చాడు. ఈ సిరప్ తాగండి అంటూ చిన్న మూత లో పోసి ఇచ్చింది. చేయి వణుకుతోంది. మాయ కాస్త సందేహంగా నన్ను ముట్టుకుని సిరప్ నా చేత తాగించింది. మొదట కాస్త తియ్యగా అనిపించింది సిరప్. తర్వాత నోరంతా చేదు. నా జీవితంలాగే. కడుపులో తిప్పేసింది. పాలతో పాటు వాంతి అయింది. ముఖంలో విసుగు కనపడనీకుండా మానేజ్ చేస్తోంది మాయ. విసుక్కున్నా నాకు తప్పదు మరి. డ్రెస్ మార్చి శుభ్రం చేసి పడుకోబెట్టింది . గాజు బొమ్మలా ఇలా ఎన్ని రోజులు..? మనిషి పుట్టినప్పుడే కొన్నిమనసు పొరల్లో దాగుండిపోతాయేమో! సమయం వచ్చినప్పుడు నేనున్నాను అంటూ హఠాత్తుగా బయటపడతాయో లేక విత్తనం నుంచి చిన్న మొలకల పుట్టి మహావృక్షములా ఎదిగి వేళ్లూనుతాయో తెలియదు కానీ ఈ అసూయా ఉందే అది మాత్రం మహా చెడ్డది. అది కమల్ లో ఇన్నిరోజులు ఎక్కడ దాగి ఉండిందో కానీ, చాపకింద నీరులా మెల్లగా పాకి, పెను ఉప్పెనలా ఎగసి మా బంధాన్ని ముంచేసింది. కమల్ కి ఇప్పుడు ఓ పెద్ద హిట్ కావాలి. అందుకు పెద్ద బడ్జెట్ కూడా కావాలి. దానికి డబ్బు చెట్టు లాంటి ఊతం కావాలి. లీనాకి కూడా స్టార్ హీరోయిన్ టాగ్ కావాలి. ఒకరికొకరు ఆసరా అయినారు. ఆ రోజు హఠాత్తుగా కమల్ కొన్ని పేపర్లు నా చేతికిచ్చి చదవమన్నాడు. కమల్ తో విడాకులు కావాలని నేను కల్లోకూడా కోరుకోలేదు. కానీ తనకి ఇష్టం లేకుండా బలవంతంగా తనతో ఉండాలని నేను కోరుకోవడం నా అత్యాశ, మూర్కత్వం అవుతుంది. భరణం కూడా తీసుకోలేదు నేను. తనే నన్ను వద్దనుకున్నప్పుడు తన డబ్బుమాత్రం నాకు ఎందుకు చెప్పండి..? అద్దం ముక్కలు అతికించావచ్చేమో. చెదిరిన నా మనసుని అతికించే ఔషధం ఎవరు కనిపెట్టలేదు. ఎడతెగని ఆలోచనలతో శరీరం కూడా గాడి తప్పుతోంది. రెండంటే రెండేళ్లలోనే ఎంత మార్పు. ఈ కాలం అనేది ఉంది చూసారు..! పెద్ద మాయావి. ఎన్నికుట్రలు చేసి మనసులను గాయపెడుతుందో..! ఒకప్పుడు నిలబడి నీళ్ళు తాగడానికి కూడా సమయం లేని నాకు ఇప్పుడు పగలేదో, రాత్రేదో కూడా తెలియని ఒంటరితనం. అప్పుడు కాసేపు నాకు ఏకాంతం కావాలని ఎంత తపించిపోయానో. ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలియడం లేదు. నాకు అంతు చిక్కని రోగం వచ్చిందని, నా కాల్షీట్స్ కోసం పడిగాపులు కాసిన నిర్మాతలు, దర్శకులు ఒక్కొక్కరే నన్ను దూరం పెట్టారు. మనసులో రేగుతున్న గాయాలతోపాటు, చర్మం మీద మొలుస్తున్న పుండ్ల గాయాల సలపరం కూడా ఎక్కువవుతోంది. ఈ దేహంతో ఇంకెంత కాలం, ఎక్కడికి ప్రయాణం చేయాలి నేను..? మమ్మీ, డాడీ తమ దగ్గరకి వచ్చేయమని పదే పదే పిలుస్తున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతే ఈ బాధలు, ఒంటరితనం ఉండదు కదా. ఈ ఆలోచన కొత్త ధైర్యాన్ని ఇచ్చింది నాకు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు, ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరింది ఈ క్షణం. మాయ పని మీద బయటకు వెళ్ళింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతే సరి. మెల్లగా లేచాను. ఒళ్ళంతా మంటలు. తల తిరుగుతోంది. ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని, పంటిబిగువున ఒంటి నొప్పులను ఓర్చుకుంటూ, టేబుల్ దగ్గరకి నడిచాను. ఆపిల్ పండ్లు ఉన్న ప్లేటువంక చూసాను. నాకు కావాల్సింది అక్కడే ఉంది. మెల్లగా చేతిలోకి తీసుకున్నాను. ఎదురుగా గోడమీద పూలదండ మధ్య ఉన్న మమ్మీ, డాడీలను చూసాను. ” కృతిక..బేబీ..రామ్మా..నువ్వు కూడా మా దగ్గరకు వచ్చేయి” నవ్వుతూ పిలుస్తున్నారు వాళ్ళు. “వస్తున్నా డాడీ. ఇక మీతోనే ఉంటాను అమ్మా” అనుకున్నాను. *** “కృతిక.. బేబీ..ఏంటి నువ్వు చేసిన పని. ఎందుకు ఇంత రాంగ్ డెసిషన్ తీసుకున్నావు. మేము రావడం కాస్త ఆలస్యం అయిఉండే ..” విషాదం గొంతులో విషంలా సలపరిస్తుంటే ఇక మాట్లాడలేకపోయాడు డాక్టర్ విశ్వనాథ్ . కాస్త అయోమయంగా చూసి లేచికూర్చోవాలని వృధా ప్రయత్నం చేశాను. ఎడమచేతి మణికట్టుకు పెద్ద కట్టు. మాయ చున్నీతో కళ్ళు తుడుచుకొంటోంది. చెప్పాలనుకున్నమాటలు నా గొంతుదాటి బయటకు రావడంలేదు. “అంకుల్..” ఆందోళన నా గొంతులో. “ఎస్, కృతిక.. నీకు చెప్పాను కదా. తను డాక్టర్ రెహ్మాన్. నీ హెల్త్ కేసు తను డీల్ చేస్తాడు.” ఆయనకి కళ్ళతోనే కృతఙ్ఞతలు చెప్పాను. “హాయ్ కృతిక..! నీ గురించి మొత్తం చెప్పాడు డాక్టర్ విశ్వనాథ్. నీ రిపోర్ట్స్ కూడా చూసాను. నేను అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పు. చనిపోయి ఏమి సాధించాలని సూసైడ్ అటెంప్ట్ చేసావు” పెదవులు కదల్చడానికి కూడా చాల కష్టంగా ఉంది నాకు. “కమల్ దూరమైనాడు. మమ్మీ, డాడి చనిపోయారు. నేను ఇంకా ఎవరి కోసం బతకాలి. అంతుచిక్కని ఈ జబ్బుతో బతికి ఏం సాధించాలి ఇప్పుడు నేను. నా అనుకున్నవాళ్ళు దూరమైనారు. కెరీర్ డౌన్ అయింది. నా జబ్బు గురించి తెలిసి నాకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు వేరే హీరోయిన్లను వెతుక్కున్నారు. ఇక ఒంటరితం, ఈ శారీరక బాధ నన్ను అనుక్షణం మృత్యువుకి దగ్గర చేస్తోంది. అదేదో నేనే చావుకి దగ్గరగా వెళ్లితే..” ఒక్కొక్క మాట కూడదీసుకున్నా, ఇక మాట్లాడడానికి శక్తి లేక దిండు మీద వాలిపోయాను. “నో..నో..కృతిక. నువ్వు చాల రాంగ్ ఆలోచనలు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చెప్పిన సమస్యలు చాలామందికి ఉన్నవే. నువ్వు అన్నింటినీ భూతద్దంలో చూసి బూచిలా భయపడుతున్నావు. నీ ఆరోగ్యం పాడుచేసుకుని ఇంత దూరం తెచ్చుకున్నావు.”. మాయ తెచ్చిన కాఫీ గ్లాస్ చేతికి తీసుకుని నెమ్మదిగా సిప్ చేసారు డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ రెహ్మాన్ లు. రెండు నిమిషాల నిశ్శబ్దం. ” కృతిక బేబీ..స్కిజోఫ్రీనియా అడ్వాన్స్డ్ దశలో ఉన్నావు నువ్వు. అయినా ప్రమాదం లేదు. రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాల త్వరగా మాములు మనిషివి అవుతావు. చేపపిల్ల ఒడ్డున పడి ఊపిరిపీల్చుకోవడం కష్టమైతే అలాగే ఉండిపోదు. అనుక్షణం ప్రయత్నం చేసి నీటిలోకి జారి తన ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తుంది. ఆ చేప పిల్ల ఎవరికోసం చేస్తుంది ఆ పని. తన ప్రాణం కోసం కదా. ఇప్పుడు నీకు వచ్చిన ఈ పరిస్థితి తాత్కాలికం. ఎప్పుడూ ఈ స్థితే ఉండదు. ఈ క్షణం ఉన్న కష్టం మరుక్షణానికి ఉండకపోవచ్చు. ఇప్పుడు నీకు పుష్కలంగా కావాల్సింది జీవితంపై ఆశాభావం, మళ్ళీ జీవితం మీద గెలుస్తాననే నమ్మకం”
డాక్టర్ రెహ్మాన్ మాటలు నా చెవుల్లో అమృతాన్ని పోస్తున్నాయి. మంత్రముగ్ధురాలిలా చెంపకు చేయి ఆనించి వింటున్నాను.
“ఇక నీ వాళ్ళు అంటావా.. బయట నిన్ను, నీ నటనను అభిమానించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. నీ సహాయకులు, టెక్నిషన్స్ ఇరవై కుటుంబాలవరకు నీమీద ఆధారపడి ఉన్నారు. జీవితంలో కెరీర్, డబ్బు, హోదా, బంధాలు, వీటన్నింటికన్నా అతిముఖ్యమైనది ప్రాణం. సో ఇప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి కృతిక” అపేక్ష నిండిన స్వరంతో విశ్వనాధ్ అంకుల్ డాక్టర్ రెహ్మాన్, విశ్వనాధ్ అంకుల్ ల మాటలు నాలో కొడిగట్టిన ఆశ దీపానికి ఇంధనాన్నిపోసి , గాయపడ్డ నా హృదయానికి చల్లటి నవనీతపు లేపనాన్ని అద్దుతున్నాయి. ట్రీట్మెంట్ కొనసాగుతోంది నాకు. కాలం మెల్లగా గాయాలను మాన్పుతోంది. శరీరం మీద, మనసు మీద కూడా. *** మాయ ఇచ్చిన బత్తాయి జ్యూస్ తాగుతున్నాను. డైరెక్టర్ ‘సెంథిల్’ నుంచి ఫోన్ అని సెల్ చేతికిచ్చింది మాయ. నా హెల్త్ బాగాలేదని తెలిసిన రోజు నుండి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు ఆయన. “హాయ్ సెంథిల్ సర్ ” నిర్లిప్తంగా అన్నాను. “కృతిక డియర్. నీకు బిగ్ కంగ్రాట్స్అండ్ బిగ్ హగ్స్. మన మూవీ సూపర్ హిట్. బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్. అందరం చాల కష్టపడ్డాం. ఈ సక్సెస్ ని అందరం కల్సి పంచుకోవాలని ఉంది. త్వరలోనే మన యూనిట్ అందరం కలుద్దాం. అవును నీ హెల్త్ ఎలా ఉంది..? నువ్వు ఓకే కదా” . స్పీకర్ లోనుంచి సెంథిల్ మాటలను వింటూ, నా వంక నవ్వుతూ చూసారు అప్పుడే గదిలోకి వచ్చిన విశ్వనాథ్ అంకుల్, డాక్టర్ రెహ్మాన్ లు కుడి చేతి బొటన వేళ్ళు పైకెత్తి నా వంక చూపుతూ ..