ఆకలితో ఉన్న వారికి అన్నమే దైవం. ఆకలితో ఉన్న ఓ వ్యక్తి అన్నం కోసం పడే ఆవేదనే ఈ కథ “పరబ్రహ్మం “. కథను ప్రచురించిన నమస్తే తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం “బతుకమ్మ “సంపాదకులకు ధన్యవాదాలు. మిత్రులారా, “పరబ్రహ్మం ” కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా…
——————————————————————————————————————————————————————————–
కిటికీలో నుంచి ఏటవాలుగా పడ్డ ఎర్రటి ఎండ ముఖాన్ని చురుక్కుమనిపించడంతో ఉలిక్కి పడి కళ్ళు తెరిచాడు స్వామి. “పొద్దునైనట్టు ఉంది ” తనలో తానే గొణుక్కున్నాడు. ” రాత్రయినా, పగలైనా గుడ్డివాడికి తేడా ఏముంటుంది..? తనకు చూపు ఉంది. అదే తేడా. అయితే తనక్కూడా పగటికి, రాత్రికి బేధం తెలియదు. ‘నాకు ఈ కుక్కి నులక మంచానికీ ఋణం ఇంకెంత కాలమో..!’ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. నులక తాళ్ళు తెగి వేలాడుతున్న కుక్కి మంచం మీద నుంచి అవస్థ పడుతూ లేచి మెల్లగా నడుస్తుంటే కడుపులో చుట్టలుగా ఉన్న పేగులన్నీ మరింత చుట్టుకుంటూ మెలికలు తిరిగి కడుపు పట్టేసింది స్వామికి.
బారిష్టర్ పార్వతీశం కథలో పార్వతీశం మొదటిసారి మద్రాస్ మహానగరానికి వెళ్ళి హోటల్లో గది కోసం వెళుతూ జీవితంలో మొదటిసారి లిఫ్ట్ ఎక్కి ఆ చిన్న డబ్బా లాంటి లిఫ్ట్ గదే తాను ఉండబోయే రూమ్ అనుకుని భ్రమ పడతాడు. ఇక్కడ స్వామిది మాత్రం భ్రమ కాదు. నికార్సైన నిజం. లిఫ్ట్ రూమ్ కంటే ఒక్క అంగుళం పెద్దది ఆ గది. గదిలో గోడ వారగా ఉన్న నులక మంచం. గోడకు దేవుడి పటాలు, అమ్మా, నాన్నల పటం. రెండు ఇత్తడి గిన్నెలు. రెండు సత్తు పళ్ళాలు, ఓ కుండ, ఓ పొడుగు ఇత్తడి లోటా, చిల్లులు పడ్డ రేకుల కప్పు, వంకర తిరిగిన చెక్క తలుపు. మొత్తంగా స్వామి ఆస్తి.
అతి కష్టం మీద వంగి బిందెలో ఉన్న నీటిని లోటాతో ముంచుకుని నోరు పుక్కిలిలించి చెక్క తలుపు తీసి బైటకు వచ్చి పుక్కిలించిన నీటిని ఉమ్మేసాడు. ఇంట్లోకొచ్చి ఇంకోలోటా నీళ్ళు ముంచుకుని కొన్ని నీళ్ళు ముఖమ్మీద పోసుకుని, మిగతా సగం నీళ్ళు గొంతులో పోసుకున్నాడు. గోడకి వేలాడే దేవుడు, అమ్మనాన్నల పటాలకు చేతులు జోడించాడు. మళ్ళీ కుక్కి మంచంలో కూలబడ్డాడు. చిన్న అలమరాలో పొడుగ్గా ఉన్న ఇత్తడి లోటా వంక చూసాడు. అమ్మ గుర్తుకు వచ్చింది స్వామికి.
అమ్మే ఉంటే ఈ పాటికి ఆ ఇత్తడి లోటా నిండా నిర్మలా కాఫీ పొడి గింజలను వేయించి, చికోరి కలిపి దంచిన కాఫీ పొడి డికాషన్ని చిక్కటి పాలు, చక్కెర కలిపి ” ఇదిగో నాయన కాఫీ తాగు, చల్లారి పొతే బాగుండవు ” అంటూ ప్రేమగా అందించేది. అమ్మని తల్చుకుంటే, అప్రయత్నంగా నాన్న మనసులో మెదిలాడు స్వామికి. పొద్దునే తాను లేచేసరికే ఆయన స్నానాదులు ముగించుకుని విభూది రేఖలు నుదిటికి దట్టంగా పట్టించి జంధ్యం సవరించుకుంటూ సంద్యావందనానికి కూర్చుని పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణతో రాగి పళ్ళెంలో వదులుతూ ధ్యానం చేసేవారు.
నాన్న రాధాకృష్ణ శర్మ మహా పండితుడు. ఏ ఇంట శుభకార్యం అయినా, దైవ కార్యం అయినా ఆ ఇంట ఆయన మంత్రోచ్చారణ వినబడాల్సిందే. అమ్మ శారదమ్మ అనుకూలవతి అయిన ఇల్లాలు. ఇంట ఎప్పుడూ పాడి ఆవుల “అంబా అంబా ” అనే అరుపులు, నాన్న దగ్గర వేదం నేర్చుకోవడానికి వచ్చిన పిల్లల గొంతులనుండి వెలువడే మంత్రోచ్ఛరణలతో ఇల్లంతా ఎంత సందడిగా ఉండేదని..!. శుభకార్యాలు చేయించుకున్న వాళ్ళు ఇచ్చిన సంభావనాలు, దానాలతో ఇల్లు నిండిపోయి, లేమి అన్న మాట ఏ రోజు తాను వినలేదు. అమ్మ ప్రేమ, నాన్న ఆదరణ గుర్తుకు వచ్చి స్వామి పెదాలమీద ఓ నవ్వు పువ్వు పూసింది. మళ్ళీ అంతలోనే కడుపులోని ఆకలి వర్తమాన వాస్తవ స్థితిని జ్ఞప్తికి తెచ్చి పెదాల మీది నవ్వు మాయమైంది. చెమట గారలు పట్టి, ఉండలు చుట్టుకున్న బూరుగ దూది దిండు కింద చేయిపెట్టి చిన్న సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని, విరిగిన కళ్లజోడు పెట్టుకుని చూసాడు. అక్కడ మెసేజ్లు ఏమి లేవుఅయినా తనకు ఎవరు మెసేజ్ చేస్తారని..! ఇప్పుడు తన అవసరం ఎవరికి ఉందని..!. అసలు ఆ ఫోన్ మ్రోగి దాదాపు ఐదు నెలలపైనే అయింది. ఫోన్ పక్కన పెట్టేసి దిండు మీద వాలాడు స్వామినీరసంగా..
మళ్ళీ ఆలోచనల కందిరీగలు చుట్టుముట్టాయి స్వామిని. అందరు తల్లులు తొమ్మిది నెలలు కడుపులో మోసి ప్రసవ వేదన పడితే, లోపలి బిడ్డకూడా అమ్మ గర్భంలోనుంచి బాహ్య ప్రపంచంలోకి రావాలని తాపత్రయ పడి పేగుతెంచుకుని బయట పడతాడు. కానీ తన తల్లి తనను పది నెలలు తన గర్భంలో మోసింది. మూడు రోజుల తీవ్ర ప్రసవ వేదన అనంతరం తాను పుట్టాడు. అమ్మ కడుపులో నుంచి బయట ప్రపంచంలోకి రావడానికి భయపడి తాను అన్ని రోజులు అక్కడ ఉన్నాడేమో..!. బ్రతుకు మీద భయం అప్పుడే తనకు తెలిసిందేమో. పుట్టడమే చిన్న పర్వతమంత ఆకారంలో ఉన్న నన్ను చూసి, పుట్టిన బిడ్డ అంత పెద్దగా ఉండడం తాము ఇంతవరకు చూడలేదని వైద్యులు అనుకున్నారట. అమ్మ చనుపాలు సరిపోక అప్పుడే మా ఇంటికొచ్చిన పాడి ఆవు లక్ష్మి కూడా పాలిచ్చి తన ఆకలిని తీర్చేదట. అమ్మను, లక్ష్మిని తలచుకోగానే ఆకలి పేగులు మూగగా రోదించాయి స్వామికి. ఖాళీ ఇత్తడి గిన్నెలు మాత్రం మేము ఏమి చేయలేం అని స్వామి వంక జాలిగా చూశాయి.
“పండిత పుత్ర పరమ శుంఠ” ఈ సామెత తనలాంటి వారికోసమే పుట్టిందేమో. నాన్న అంత పండితుడైనా తనకు చదువు అబ్బలేదు. పొట్ట పొడిచినా అక్షరం ముక్క రాలేదు. పోనీ వేదం, నాలుగు మంత్రాలు నేర్పిస్తే నా పొట్ట నేను పోసుకుంటానని నాన్న ఎంత ప్రయత్నం చేసినా ఒక్క మంత్రం నోరు తిరిగితే కదా తనకు. రోజురోజుకు ” తిండికి తిమ్మ రాజు, పనికి పోతరాజు ” లా తయారైన నా పరిస్థితికి అమ్మ, నాన్న క్రుంగి పోయారు. నాన్నకు వయసు మీరుతుండడంతో కార్యక్రమాలకు పోలేక ఉన్నది తింటూ ఉంటే, మెల్ల మెల్లగా ఉన్న ఆస్తి మంచులా కరిగిపోసాగింది. తమ తదనంతరం తన బ్రతుకు ఎట్లా అనే దిగులు వాళ్ళకి. చదువు రాలేదు, మంత్రాలు రాలేదు అని నాన్న నా కడుపు నిండా ఆకలైన తీరుతుందని కొందరింటికి ” బ్రహ్మచారి” గా పంపించేవాడు. షష్ఠి తిధి నాడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి, కొత్త వస్త్రాలు ఇస్తే సాక్షాత్తు ఆ నెమలివాహనుని సేవించినట్లే అని కొందరు షష్ఠి నాడు ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఆ క్రమంలోనే తద్దినాలకి భోక్తగా వెళ్ళడం కడుపు నిండా తినడం, సాయంత్రాలు గుడిలో పిచ్చయ్య శాస్త్రికి సహాయకుడిగా, ఆయన అర్చన చేస్తే తాను హారతి పళ్ళెం పట్టడం, ప్రసాదంతో కడుపు నింపుకోవడం. ఇదే అప్పుడు తన రోజువారీ దినచర్య . రోజురోజుకి పెరిగిపోతున్న తన దేహ భారం భరించడం తనకే కాదు. అమ్మా, నాన్నకి భారంగా మారింది. అయినా వాళ్ళు ఉన్నంత వరకు తనకు కడుపాకలి తెలియలేదు.
ఆలోచిస్తున్న స్వామికి కళ్ళు తిరగడం ప్రారంభం అయింది. కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులైందో. గుడిలో హారతి పట్టే పనికూడా లేదిప్పుడు. కుండలో నీళ్ళు ఇంకో లోటా తాగాడు. లేని ఓపిక తెచ్చుకుని గూటిలో ఉన్న చిన్న పుస్తకం తీసి వరసగా తిప్పుతూ ఓ చోట ఆగాడు. ఈ రోజు రఘురాం వాళ్ళ నాన్న సుబ్రమణ్య శర్మ ఆబ్దికం. మనసులో ఏదో ఆశ చిగురించింది స్వామికి. రఘురాం నెంబర్ కి ఫోన్ చేసాడు. అవతల రఘురాం ” ఎవరండీ ” అన్నాడు. ” రఘురాం గారు, నేను అన్నం స్వామిని. ఈ రోజు మీ నాన్నగారి ఆబ్దికం కదా. భోక్తగా రమ్మంటారా..?” ఆశ కొండలా పెరిగిపోయింది రఘురాం గొంతు వినపడగానే. “అయ్యో..! మీరా స్వామి. ఈ యేడు నాన్న గారి ఆబ్దికం చేయడం లేదు. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ప్రభాకర శాస్త్రిగారిని పిలిచి ‘మొయిన’ ఇచ్చేశాం. ఏం అనుకోకండి” అంటూ ఫోన్ కట్ చేసాడు అతను. కొండంత ఆశ కరిగిపోయి మినుకు మినుకు మంటున్న ఆశాజ్యోతి చప్పున ఆరిపోయినట్లయింది స్వామికి. దిండు మీద తలవాల్చడానికి కూడా ఓపిక లేక మంచమ్మీద కూర్చుండిపోయాడు.
మళ్ళీ తన ప్రాభవం గుర్తుకు వచ్చింది అతనికి. పెళ్ళిళ్ళు, వ్రతాలూ జరిగినప్పుడు ఎంత మంది ఇంటికి వచ్చి భోజనం చేస్తే అంత మంచిది అనుకునే రోజుల్లో, తాను ఏ ఇంటికి వెళ్ళి భోజనం చేసినా, వాళ్ళకి ఏదో ఓ మంచి జరగడం యాదృచ్చికమో ఏమో కానీ ఏ ఇంట్లో స్వామి తృప్తిగా తింటే ఆ ఇంట్లో మంచి జరుగుతుంది అని తనకు పేరు రావడంతో తన పేరు స్వామి కాస్త అన్నం స్వామిగా రూపాంతరం జరిగింది. తాను ఎంత తిన్నా ఎవరు విసుక్కునేవారు కాదు. శుభకార్యాలలో అయితే రెండు, మూడు బంతుల భోజనాలు అయినా తాను తింటూనే ఉండేవాడు. మూడు, నాలుగు శేర్ల అన్నం అవలీలగా తీనేసేవాడు తాను. భోజనం తనకు వడ్డించడానికి పిల్లలు ఎంత సంబరపడేవాళ్ళో. లడ్డులు, వడలు అయితే లెక్కే లేదు. ఓ మోస్తరుగా విందు చేసేవారైతే తన తిండి చూసి మిగతావారికి చాలవేమో అని సందేహించేవారు. అయినా తనను ఎవరూ నిరాదరించలేదు. కడుపు చూసి అన్నం పెట్టేవారు ఆ నాటి మహా తల్లులు. కొత్తగా తనను చూసిన వాళ్ళు తాను అంత అన్నం తినడం గురించి వింతగా చెప్పుకునేవారు. తాను తృప్తిగా భోజనం చేసి వారిని ఆశీర్వదిస్తే ఎంత సంతోషించేవారో. అన్నం పరబ్రహ్మ స్వరూపం. విస్తరి ముందు కూర్చున్న వాళ్ళకి కడుపు నిండా పెట్టాలి అనుకునే రోజులు అవి. అయినా ఆ రోజులు తన జీవితంలో స్వర్ణ యుగపు రోజులు. స్వామి కళ్ళలో మెరుపులు ఒక్క క్షణం.
మరి ఇప్పుడో ఇంటికి పిలిచి ఇంత అన్నం పెట్టేవారు కరువైనారు. మనిషితో మనిషి మాట్లాడాలంటేనే భయపడే రోజులు దాపురించాయి. కనీసం ఎదుటివాడిని పలకరిస్తే నాకేంటి లాభం అనే రోజులు ఇవి. ఇప్పుడు మరి మనిషిని మనిషి శత్రువులా చూస్తూ మనిషి ఎదురు పడితే ముక్కు, మూతి కప్పుకుని పక్కకు తప్పుకు తిరిగే మహమ్మారి దినాలు ఇవి.
ఎడతెగని ఆలోచనల దారాలు స్వామిని ముంగిసను కొండశిలువ చుట్టినట్లు చుట్టేస్తున్నాయి. పర్వతమంత ఉన్న తనను వివాహం చేసుకోవడానికి ఏ ఆడపిల్ల ఇష్టపడుతుంది. తమ తర్వాత తన జీవితం గురించే అమ్మా, నాన్నకి దిగులు. ఆ బెంగతోనే అమ్మ తీసుకుని తీసుకుని కాలం చేసింది. ఓ పక్క అమ్మ పోయిన దిగులు, మరో పక్క తన మీది చింత కాక వీపు మీద లేచిన విష వ్రణంతో నరకం అనుభవిస్తూ బ్రతుకు రణంలో ఓడిపోయి నాన్నభూమి మీద తన ఋణం తీరిపోయిందని అమ్మతో పాటే తనను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళతోపాటే ఉన్న ఇల్లు తన ఆకలికి కరిగిపోయింది. ఎప్పుడో ఓ దాత నాన్నకు ఇచ్చిన ఈ జానెడు తావు ఇప్పుడు తనను ఎండా, వాన నుంచి కాపాడుతోంది. కానీ ఈ పొట్ట నిండడానికి మాత్రం దారి కనపడడం లేదు.
పుట్టిన ప్రతి మనిషికి ఓ లోపం ఉంటుంది. ఏదో ఒక లోపం ఉన్నంత మాత్రాన ఆ మనిషికి బ్రతికే హక్కు లేదా? ఎందరు దివ్యాంగులు, మానసిక రోగులు బ్రతుకుతున్నారు ఈ లోకంలో. తాను దివ్యాంగుడు కాదు..మానసిక వికలాంగుడు కూడా కాదు. తన పర్వతాకార దేహమే తన లోపం. ప్రతిమనిషికీ బ్రతికే హక్కు ఉంటుంది కదా. కష్ట పడి పని చేసేవాడికే కడుపుకి తినే హక్కు ఉంది అని ఎవరో పెద్దలు అన్నారట. కానీ తాను ఈ దేహ భారంతో ఏ పని చేయలేడు. ఆకలి తీరే మార్గం కనపడడం లేదు. కాబట్టి తనకు బ్రతికే హక్కు లేదేమో..? మొదటిసారిగా తాను చనిపోతే బాగుంటుంది అనిపించింది స్వామికి. కానీ ఎలా చావాలి.
పరి పరి విధాలుగా పయనిస్తున్నాయి స్వామి ఆలోచనలు. లేచి గూటిలో చెయి పెట్టి దేనికోసమో వెతికాడు అతను. చేతికి తగిలింది. తుప్పు పట్టిన టోపాజ్ బ్లేడు ముక్క. గోడకున్న పటాల వంక చూసి ” ఏనాడూ మిమ్ములను అన్నం తప్ప ఇక ఏ కోరిక కోరలేదు. ఈ రోజు ఆ అన్నం నాకు అందనంత దూరంలో ఉంది. ఈ ఆకలికి తాళలేకుంట ఉన్నాను. ఈ బ్లేడు తో నా మణికట్టు కోసుకుంటాను. ఆకలి నరం ఉంటే మొదట దానిని తెంపి, తర్వాత నా ప్రాణం పోయేటట్టు చేయండి ” రెండు చేతులు జోడించి బ్లేడును మణికట్టు మీద పెట్టుకున్నాడు స్వామి. కాళ్ళు,చేతులు వణికి పోతున్నాయి. గుండె దడ దడ కొట్టుకుంటోంది. చెమటలు కారిపోతున్నాయి. కళ్ళవెంబడి నీళ్ళు కారిపోతున్నాయి. ఒక్కసారిగా కోసుకుందామని చేతిని పైకెత్తాడు.
‘ఆత్మహత్య మహాపాపం, అది హత్య సాదృశ్యమే’ నాన్న చెప్పిన మాటలు ఆ క్షణం గుర్తుకు వచ్చాయి స్వామికి. మరుక్షణం బ్లేడు ముక్కను దూరంగా విసిరేసాడు. అటక మీద ఉన్న ఎప్పటిదో విస్తరాకు తీసి నేలమీద పద్మాసనం వేసుకుని కూర్చుని లోటాలో ఉన్న నీళ్లతో విస్తరి చుట్టూ ఆచమనం చేసి అవపోసన పట్టాడు . కళ్ళు మూసుకుని ” భగవాన్, ఏ పనిచేయలేని బద్దకస్తుడినైనా ఇన్ని రోజులు నన్ను భోక్తగా పిలిపించి నా ఆకలి తీరేటట్లు చేసావు. ఎందరో నేను భోజనం చేస్తుంటే తమ పితృదేవతలే భోజనం చేస్తున్నట్లు తృప్తి చెందారు. ఈనాడు నాకు ఆకలి తీరే మార్గం తెలియడం లేదు. బ్రతికేందుకు నాకు ఏదైనా ఆధారం చూపించు. ప్రార్థిస్తున్నాడు స్వామి ,”అన్యదా శరణం నాస్తి , త్వమేవ శరణం” అని పరమాత్ముని వేడుకున్న గజేంద్రునిలా..
అంతలో ఫోన్ మ్రోగింది .అచ్చెరువొందుతూ వణుకుతున్న చేతులతో ఫోన్ ఎత్తాడు అతను.
“స్వామి..ఇంట్లో ఉన్నావా..? నేను వినాయకుడి గుడి పూజారి శివ సుబ్రమణ్య శర్మని. నాకు సహాయకుడిగా రాగలవా నువ్వు. పెద్దగా పని ఏమి ఉండదు. నేను లేనప్పుడు వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు ఇస్తే చాలు. నేను పొద్దునే వచ్చి పూజ చేసిపోతాను. నేను కొన్ని వేరే పూజలకు వెళ్లాల్సి ఉంది” శివ సుబ్రమణ్య శర్మ మాటలు వినగానే “తప్పకుండా వస్తాను శర్మ గారు. ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను ” అంటూ ఫోన్ పెట్టేసాడు స్వామి. కళ్ళల్లో నుంచి జారేవి కన్నీరో, పన్నీరో తేడా తెలియక జోడించిన చేతులతో పటాలకు మొక్కాడు స్వామి. ” అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది. అదియే దైవం” బైట ఎక్కడ నుండో లీలగా పాట వినిపిస్తోంది . నమ్మకమే దైవం . నమ్మడం అంటూ జరిగితే మనిషికి మనిషే దైవం..
God is great
Thank you
చాలా బాగుండమ్మా! మీరు అనుమతీస్తే నా “కథా మంజూష” whatsapp గ్రూపులో పోస్ట్ చేస్తాను. అలాగే మీరు ఇష్టపడితే మిమ్మల్ని కూడా ఆగ్రూపులో చేరుస్తాను. ఆ గ్రూపు పూర్తిగా కథలకు మాత్రమే పరిమితం.
సూర్యనారాయణ నేమాని
+91 99899 22322
విశాఖపట్నం
ధన్యవాదాలు సర్. తప్పకుండా మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి. కథలో గ్రూప్ లో చేరే అవకాశం నాకు కల్పించండి