
ఎందుకో ఈ సాయంసంధ్య వేళ
అలవికాని దిగులు చీకటిలా అలుముకుంటోంది
నింగినావరించి ఉన్న కెంజాయ వర్ణం
నిశ్శబ్ద రాగంతో విలపిస్తోంది..
అస్తమయమవుతున్న సూర్యుడికి దిగులేమీలేదు
తొలిపొద్దుకు వెలుగై మళ్ళీ పుడతాననే నమ్మకం అతనిది ..
బాల్యపు చైతన్యాలు
యవ్వనపు శిఖరాగ్రాలు ఎక్కేసాక
పడమటి మెట్లు దిగడమంటే ఎంత బెంగో..
నడిచొచ్చిన దారులు దూరమవుతున్నాయి
వెంట వచ్చిన మమతలు
మాయమవుతున్నాయి..
మాటల ఊతం లేకుండా మరలుతున్న ఒంటరి పయనం
మెట్లన్నీ దిగిపోయి అదృశ్యం అయినాక
ఇక అంతా చీకటే
శూన్యమే ..
ఉషోదయం అస్తమయం అంతా ఒక చక్రమే
మెట్లు ఎక్కడం దిగడం జీవనపు సహజమే..
అయితే
మనసును మళ్ళీ మళ్ళీ వెలిగించేది
మమతల జ్ఞాపకాలే..
అందుకే
గుడిమెట్లకు పసుపుకుంకుమలద్దినట్లు
ఎక్కే ప్రతి మెట్టుకీ
ప్రేమ గంధం అద్దుకుంటూ వెళ్ళాలి..
రోహిణి వంజారి
9000594630