నేను – పుస్తకం

పదేపదే బయట తిరగటం కన్నా

ఒంటరీకరణలో

పుస్తకాల మధ్యన కూర్చుని

చదువుకుంటూ

సంబరంగా ఏకాంతాలని

జాతరలా గడపటం ఇష్టం

సిల్వర్ ఫిష్ లాగా

పుస్తకాల పేజీల్లో తిరగటం ఆసక్తి

పేజీలు తిప్పినప్పుడల్లా

వాటి మధ్య దాచిన

నెమలీకలు

ఎండిన రోజా పూల రెక్కలు

జ్ఞాపకాల కథల మూటలను విప్పుతాయి

ఒకసారి పచ్చటి అడవుల్లోకి వెళతాను

కొండకోనల్లో జాలువారే నీటిని

ఒడిసిపట్టుకుని తాగుతాను

ఎడారి ఇసుక వేడి భరించలేక

అరికాళ్ళను రుద్దుకుంటాను

జలపాతాల హోరుతో పోటీపడుతూ

తోటి గువ్వలా అరుస్తూ

గిరికీలు కొడుతూ ఎగురుతాను

అమాయకులను చూస్తాను

వంచకుల పన్నాగాలు తెలుసుకుంటాను

శ్రమ జీవుల చెమట చుక్కలకు

గంగాజలమంత భక్తిగా మొక్కుతాను

రైతుల పాదాలకంటిన బురదను

ఆర్తీగా ముద్దాడుతాను

నింగి నేల నీరు నిప్పు

రంగు పూల తోటలు

వెన్నెల రాత్రులు

వెచ్చని కన్నీరు

అన్నీ చూస్తాను

ప్రేమామృతధారలను కురిపించే

మనిషి మనిషినీ కలుసుకుంటాను

అనేకానేక పుస్తకాలు

అనేకానేక నేనులు

నిరంతరం సహజీవనం చేస్తూనే ఉంటాం

నేను నా పుస్తకాలు.

రోహిణి వంజారి

9-8-2024