దొడ్డెత్తే నరసమ్మ

ఇప్పుడు నరసమ్మ నా కళ్ళముందు కనిపిస్తే గుండెలకు హత్తుకుని, పన్నీరు, నా కన్నీరు కలిపి ఆమె పాదాలను కడిగి నెత్తిన చల్లుకోవాలని ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా “దొడ్డేత్తే నరసమ్మ” కథ చదవాల్సిందే.

విజయమహల్ సెంటర్ కథలు విశాలాక్షి పత్రికలో ప్రచురిస్తూ గొప్ప ప్రోత్సహం ఇస్తున్న శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి శిరస్సు వంచి వందనాలు. హృదయపూర్వక ధన్యవాదాలు.

ఇక పోయిన నెల నేను రాసిన “బాపనోల్ల పిల్ల-ముత్తరాశి యానాది పిలగాడు”, ఈ నెల వచ్చిన “దొడ్డేత్తే నరసమ్మ” రెండు కథలలో ఏ కులాన్ని కానీ, ఏ వృత్తిని కానీ తక్కువ చేసి కానీ నేను రాయలేదు. వీటన్నింటికన్నా మానవత్వము చాల గొప్పది అని నేను నమ్మి, ఆచరిస్తున్న ధర్మం. ఈ రెండు కథలు చదివితే ఆ విషయం అవగతం అవుతుంది. నా చిన్నప్పుడు అంటే నేను ఐదవ తరగతి నుంచి డిగ్రీ చదివే రోజులవరకు నెల్లూరులో, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను చూసిన వ్యక్తులు, సంఘటనల గురించి {నోస్టాల్జియా } కథలు రాస్తున్నాను. అప్పటి పరిస్థితులు, మనుషుల్లోని మంచి, చెడు, కల్మషం లేని మనుషుల మనోరథం, కుతంత్రపు బుద్దులు గల వ్యక్తుల గురించి కూడా ఏ మాత్రం సంశయం, జంకు లేకుండా రాస్తున్నాను. ప్రతి నెల మీరు ఇక్కడ చదివి నాకు ఇస్తున్న ప్రోత్సహం నాకు కొండంత అండగా నిలుస్తోంది. మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఈ ప్రోత్సహం నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ..🙏🌹

తూరుప్పక్క నుంచి వీచే గాలికి ఈదుల్లో దుమ్ముదుమారం రేగుతుండాది. దీపావళి పండగ అయి రెండు దినాలే అయింది. ఇళ్ళ ముందర కాల్చిపారేసిన లక్ష్మీ బాంబులు, తాటాకు టపాసులు, చిచ్చుబుడ్లు, చిలకూరు గన్, రాకెట్ టపాసాల కాయితాలు గాల్లోకి ఇంతెత్తున లెగిసి డాన్స్ ఆడతా ఉండాయి.
ఇంటి ముందర రిక్షాలో కూచోని మా ఇంటి యాదళంగా ఉన్న ఇంట్లో కరుణాకర్ రెడ్డి, వాడి తమ్ముడు సుధీర్ టపాసాలు కాలస్త ఉంటే చూస్తా ఉండాను. వీధిలో యాడి చెత్త ఆడ్నే ఉండాది. సైడు కాలవల్లో నల్లటి మురుగునీళ్ళు పారతా ఉండాయి. గబ్బు ఎక్కువై ముక్కు మూసుకున్న.
“నాలుగు దినాలనుంచి మునిసిపాలిటీ వొళ్ళు సమ్మె జేస్తా ఉండారు. ఈదులు చిమ్మే వొళ్ళు రాలేదు” సైకిల్ టైర్ కి పంచరేస్తా అన్నాడు కరీముల్లా బాబాయ్.
“కీలెరిగి వాత బెట్టినట్టు వాల్లు పండగలప్పుడే సమ్మె జేస్తారు” అన్నాడు గురవయ్య.
పద్మయ్య, నూనె గమళ్ళ ఓబయ్య అందరూ జేరి సైకిల్ షాప్ ముందర బల్ల మీద కూచోని బాతాఖానీ ఏస్తా ఉండారు.
అప్పుడొచ్చింది ఇంటి ముందరకి నరసమ్మ ” ఆదెక్కా ఆదెక్కా.. ” అని కేకలు పెడతా.
నరసమ్మ సన్నగా,పొడుగ్గా గెడకర్ర మాదిరి ఉంటాది. చింపిరి జుట్టు, చినిగిపోతే అతుకులేసి కుట్టుకున్న పాత పచ్చరంగు కోక కట్టుకోనుండాది. బొట్టులేని ముడుతలు పడ్డ నుదురు, ఎలిక తోకమాదిరి ఏలాడతా ఉన్న పొట్టి జడ. బొడ్లో దోపుకున్న ఒక్కాకు, చిల్లర డబ్బుల తిత్తి. ఎప్పుడు చూసినా రోట్లో ఏసి రుబ్బినట్లు తమలపాకు, వొక్కా నవలతా ఉండేతలికి నోరు, పళ్ళు ఎర్రగా ఔపడతా ఉండాయి.
ఒక చేతిలో పెద్ద బొక్కెన, ఇంకో చేతిలో రెండు ఇనప రేకులు పట్టుకొని వొచ్చింది.
నరసమ్మని చూస్తానే అమ్మ కొంచెం దూరం జరిగి “ఇన్ని దినాలు రాలేదేమి నరసమ్మ.. ఈదులు చిమ్మడానికే కదా సమ్మె. నువ్వు రాకపోతే ఎట్టా చెప్పా. దొడ్డంతా నిండిపోయి ఉండాది. ఇంకో రెండు రోజులు నువ్వుగాని రాకపోతే ఇల్లు, దొడ్డి ఏకమైపోయేటట్లు ఉండాయి. బాదం చెట్టు కింద పినాయిలు సీసా ఉండాది. దొడ్డి ఎత్తేసి రవ్వంత కడిగిపో” అనింది
“అట్నే ఆదెక్కా.. పార్టీ వొళ్ళు పనికి రానీలేదు ఎవురినీ” అంట స్నానాల దొడ్డి పక్కన టాపు లేని గదిలోకి పోయింది నరసమ్మ. పినాయిలు సీసా ఎత్తుకొని నరసమ్మ ఎనకమాల నేను పోయినా.
“లోనికి రాబాకు బుజ్జమ్మా. నేను దొడ్డి ఎత్తేదాక బైటనే ఉండు” అంటానే చక చకా ఇనప రేకులతో దొడ్డికి ఎత్తేసి బొక్కెనలో ఏస్తా ఉండాది. వొక్కాకు నమలడం మాత్రం ఆపలే. సులభంగా యాభై ఐదేళ్ళ పైనే ఉంటాయి నరసమ్మకి. కానీ పనిలోకి దిగిందంటే మాత్రం వయసు మరిచిపోయి ఉషారుగా పరుగులు తీస్తుంది.
దొడ్డి కంపుతో నాకు వాంతికి వొచ్చినట్లయింది. పాపం నరసమ్మ రోజూ అందరి ఇళ్లల్లో గబ్బు ఎట్ట భరిస్తోందో. అందుకే కంపు వాసన తెలీకండా వొక్కాకు నమలతా ఉండాదిగామాల అనిపించింది.
అప్పుటికే సగం బొక్కెన దొడ్డితో నిండి ఉండాది. కంపు భరించలేక వాకిట్లోకి లగెత్తిన. దొడ్డికంతా బొక్కనలో ఏసేసి మిగిలిన చెత్తని మొక్కట్టతో ఎత్తి చెత్తకుప్పలో ఏసి, పినాయిలు పోసి, దబర్లో ఉన్న నీళ్ళతో దొడ్డి కడిగేసి చేతులు కడుక్కోని వొచ్చింది నరసమ్మ.
మణుగుబూలు, కజ్జికాయలు కాయితం పొట్లంలో కట్టి నరసమ్మ చేతిలో వేసింది అమ్మ. పొట్లం మిద్ది మెట్ల కింద గూట్లో పెట్టి “పైటేల వొచ్చి ఎత్తకపోతా ఆదెక్కా” అంటా బొక్కెన ఎత్తుకొని వీధిలోకి పోయింది నరసమ్మ.
నరసమ్మని చూడంగనే, ఎదురింటి నూనె గమళ్ళ ఓబయ్య వాళ్ళ ఇంటి కాడికి పిల్చక పోయినాడు.
చల్ల కాలవ అంచుల అమ్మిడిగా ఉన్న యెద్దలరేవు సంగం కొనాకి నరసమ్మ గుడిసె ఉంది. మొగుడు చంచయ్య బాడుక్కి రిక్షా తొక్కేవాడు. సందేళకి సారాయి తాగి గుడిసెకి పోయి నరసమ్మ దుంప తెంచేటోడు. ఓ తూరి కల్తీ సారాయి తాగి పండుకున్నోడు మరి లేవలేదుట.
వాళ్ళీళ్ళ కాళ్ళుబట్టుకోని, మునిసిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి ఇంటి చుట్టూతా చానా రోజులు తిరిగి, మునిసిపాలిటీ తరపున ఇంటింటికి వొచ్చి దొడ్డి ఎత్తే పనిలో కుదురుకునింది.
కూతురు రంగికి పెళ్లి చేస్తే ఒక పిలగాడు పుట్టిన పాట, రంగి మొగుడు ఎర్రయ్య శ్రీకాకుళం నుంచి ఇళ్ల స్లాబులకి బండ పొసే దానికి వొచ్చిన వోళ్ళల్లో సుబ్బమ్మ అనే ఆమెని మరిగి ఆమె వెనకమాల శ్రీకాకుళం బోయినాడట. ఓ తూరి నరసమ్మ అమ్మకి చెప్తా ఉంటే ఇన్నాను.
కూతురు, మనవడిని పెట్టుకొని నరసమ్మ కష్టపడతా ఉండాది. రోజు ఇళ్ళకాడికి వొచ్చి దొడ్డి ఎత్తితే నెలకి పదిరూపాయలు నరసమ్మకి వొచ్చే జీతం. పొద్దన దొడ్డి నిండిన కాడ్నించి నరసమ్మ ఇంకా రాలేదు అని ఎదురు చూస్తా ఉంటారు. బొక్కెన, రేకులు ఎత్తుకుని నరసమ్మ ఈదిలో కనపడిందంటే చాలు
“నరసమ్మ వస్తా ఉండాది. ఎడంగా జరగండి” అంటా నరసమ్మకి దూరంగా జరిగి పోతారు అందురు. ఎందుకు నరసమ్మని తాకరో నాకు తెలవక పాయ. దొడ్డి ఎత్తే పని అయినాక బక్క నాయిరు అంగట్లో టీ తాగుతుంది నరసమ్మ. మిగిలిపోయిన సద్దికూడు, నాస్తా ఎవురైనా ఇస్తే తీసుకుంటుంది. ఎవురు చీదరించుకున్నా తననికాదని తుడిచేసుకుని వెళ్ళిపోతుంది.
బడి కాడ్నించి వొచ్చి ఎక్కాల పుస్తకం తీసుకొని చెక్కతలుపు నెట్టుకొని వాకిట్లోకి వొచ్చా. ఒక చక్రం లేని పాత రిక్షా గోడకి ఆనించి ఉండాది వంకరగా. ఎక్కి కూచొని తొమ్మిదో ఎక్కం బట్టి పడతా ఉండాను. రేపు బడిలో కమలమ్మ టీచర్ కి ఒప్ప జప్పాలి.
నరసమ్మ మనవడు సురేషు రిక్షా కాడికి వొచ్చాడు. వాడి చేతిలో నోటుపుస్తకం ఉండాది.
“బుజ్జమ్మా..నేను బొమ్మలు ఏసాను, బాగుండాయా ఓ తూరి చూడా ” అంటా పుస్తకం నా చేతికిచ్చాడు. సీతాకోకచిలుక, ఏనుగు, పూల చెట్టు, ఆకాశం, నక్షత్రాలు..భలే భలే. చానా బాగుండాయి బొమ్మలు సురేషు. నా కాడ ఇంకా రంగు పెన్సిళ్ళు ఉన్నాయి. నీకు ఇస్తాగాని నాకు బొమ్మలు వేయడం నేర్పిస్తావా” అన్నా.
పక్క వీధిలో ఉండే స్వర్ణమ్మ మా కాడికొచ్చింది. ” ఏంది బుజ్జమ్మా. నువు జేసే పని. ఆ దొడ్డికెత్తే మాదిగ నరసమ్మ మనవడితో ఏం మాటలు నీకు. మీ అమ్మకి చెప్తా ఉండు” అంటా ఇంట్లోకి పోయింది.
సురేషు భయపడి పుస్తకం తీసుకొని లగెత్తినాడు. నేనెవురితో మాట్లాడితే ఈమెకెందుకో.. చానా కోపంవొచ్చింది నాకు స్వర్ణమ్మ మీద. నోటికొచ్చిన తిట్లు అన్ని తిట్టుకున్నా.
ఆ రోజు పొద్దన వస్తానే బొక్కెన బయట పెట్టి వసారాలో కూలబడి ఎన్నవలు బెట్టి ఏడస్తా ఉండాది నరసమ్మ.
” దేనికి నరసమ్మా ఆ వాటానా ఏడుస్తా ఉండావా..?” జీతం డబ్బులు పది రూపాయలు నరసమ్మ చేతికిస్తా అడిగాడు నాయన.
“అయ్యోరా.. నా కూతురు రంగి మతం బుచ్చుకోని, మనవడిని తీసుకొని గుంటూరు ఎల్లిపోయింది. ఫాదిరి ఇంటికాడ పని జేసేదానికి ఆ అమ్మిని పీల్చక పోయినారు. ఇకన నాకు ఎవురు లేరు సామే” అంటా కొంగుతో కన్నీళ్లు తుడుచుకునింది.
” మనసు రాయి చేసుకో నరసమ్మా. ఎవురికి ఎంత కాలమో ఏమో ఈ ఋణానుబంధాలు. బతికినంత కాలం బతుక్కోసం పోరాడాల్సిందే కదా” నాయన ఒకింత దిగాలుగా నరసమ్మ చాయ చూసి, గమ్మున సంతపేటకు పోయినాడు కాలేజీ కాడికి. అయ్యో. .! సురేషు నాకు బొమ్మలు గీయడం నేర్పిస్తానన్నాడు. గుంటూరుకి వెళ్లిపోయినాడా..? ఇంక నెల్లూరికి రాడేమో. నాకు చానా దిగులేసింది.
నవంబర్ మాసం చివరి రోజులు. వారం నించి ముసురుపట్టి ఉండాది. ఆకాశానికి చిల్లులు పడినట్లు కుండపోతగా వాన. రవ్వంత సేపు కూడా తెరిపి లేకండా కురుస్తానే ఉండాది. మా ఇంటికి ఏదాలంగా సుబ్బారెడ్డి ఇంటి ముందరున్న పెద్ద అవిసె చెట్టు ఏళ్ళతో సహా బైటికి వొచ్చి రోడ్డుకడ్డంగా పడిపోయింది.
ఇంటి పైకప్పూ దంతులు నానిపోయి ఇల్లు మొత్తం ఉరస్తా ఉండాది. వసారా పెంకులమీద తాటాకులు ఒత్తుగా కప్పిచ్చాడు నాయన ఈ మద్దెనే. వసారాలో మాత్రం ఒక్కరవ్వ ఊరుపు లేదు. కుంపటి ఆడ్నే పెట్టి కాఫీ డికాషన్ కాచింది అమ్మ. రోజు అల్లీపురం నుంచి పాలు తెచ్చే పాల బాలయ్య కూడా తుఫాన్ వానకి రావడం లేదు. డికాషన్ లో చక్కిర వేసుకొని తాగతా ఉండాం అందరం.
దొడ్డికి పోవాలంటేనే నరకంగా ఉండాది. వానలు మొదలైన కాడ్నించి నరసమ్మ దొడ్డెత్తేదానికి రావడం మానేసింది. దొడ్డి అంతా నిండిపోయి వానకి తడిచి పరమ చీదరగా ఉండాది.
దొడ్డికి పోయేదానికి నాయన, ఎదురింటి ఓబయ్య, ఇంకొందరు చల్లకాలవ వంతెన కిందికి పోతా ఉండారు. ఎటొచ్చి ఇంటికాడ ఉన్న ఆడోళ్ళకి దొడ్డికి పోవాలంటే నరకంగా ఉండాది. అమ్మ సణుగుడు మొదులు పెట్టింది నరసమ్మ రాలేదని.
“నేను మాత్రం ఏం చేసింది చెప్పా.. నరసమ్మ ఒచ్చేదాకా సర్దుకోవాల్సిందే కదా ” నాయన బతిమాలతా ఉండాడు.
చిల్లుల గొడుగేసుకుని వాకిట్లోకి వొచ్చి వెంకయ్య శెట్టి “సత్యం సామే..ఓ తూరి బయటకి రా ” అన్నాడు. నాయన వాకిట్లోకి పోయినాడు. నాయన ఎనకీడ్తనే నేను కూడా వాకిట్లోకి పోయినా.
అప్పటికి సూర్యుడిని చూసి వారం దినాలపైనే అయింది. వాన ఒక్కరవ్వ తగ్గుముఖం పట్టింది. రవ్వంత ఎండ వద్దామా..వద్దా అన్నట్లు సూరీడు కనపడి వెలుతురు రావడం, నల్ల మబ్బులు అడ్డమొచ్చి మల్లా చీకటైపోవడం. పొద్దన నుంచి ఇదే వరసగా ఉండాది. చెట్లన్నీవేళ్ళతోసహా పైకి వొచ్చి వీధుల్లో అడ్డదిడ్డంగా పడిఉండాయి. కొమ్మలు, ఆకులు, బురదతో వీధులన్నీ నిండిపోయి ఉండాయి. తుఫానుకి చచ్చిన కాకులు, ఎలుకలు ఆడాడ కుళ్లిపోయి కనిపిస్తావుండాయి వీధుల్లో.
“నరసమ్మ ఇల్లు యాడ్నో నీకుగాని తెలుసా సామే..? వాన సాకు పెట్టి పనికి రాకండా ఎగనూకింది నరసమ్మ. ఇంట్లో ఆడోల్లతో పాణం పోతా ఉండాది ” అన్నాడు ఎంకయ్య శెట్టి.
” నాకు తెలుసు” గట్టిగా అరిచినా నేను.
“ఏడ బుజ్జమ్మా” అన్నాడు ఓబయ్య చుట్ట కాలుస్తా.
చల్ల కాలవ అమ్మిడిగా ఎద్దలరేవు సంగం కొనాకి ఉంటది నరసమ్మ వాళ్ళ గుడిసె. ఓ తూరి సురేషు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. అది గుర్తు పెట్టుకుని చెప్పా నేను.
ఎనకింటి సుబ్బరాయడు, రమణా రెడ్డి , టెంకాయల బండి రంగయ్య, సారాయి అంగడి అరుణమ్మ అందరు వొచ్చి వాకిట్లో చేరినారు. అందరిదీ ఒకటే సమస్య. నరసమ్మ పనికి రావడం లేదు. దొడ్డి నిండిపోయింది. ఎవరిళ్ళల్లో బాంబే కక్కసులు లేవు. అందరివీ టాపు లేని దొడ్లే. అందరికీ నరసమ్మే గతి.
అందరూ నరసమ్మ ఇంటికాడికి బైలుదేరినారు. నేను కూడా నాయన చేయి పట్టుకొని నడస్తా ఉన్నా. వాన తూర పడతానే ఉంది. మాములుగా నరసమ్మ కనిపిస్తేనే ఏడ ఆమె చేయి తగులుతుందో, బొక్కెన తగులుతుందో అని చీదరించుకుని దూరం దూరం జరిగిపోయే అందరూ ఈ రోజు నరసమ్మ జపం జేస్తా ఆమె గుడిసె కాడికి పోయేదానికి మల్లుకున్నారు.
ఎద్దల రేవు కొనాకి పోయినాం అందరం. చల్లకాలవకి అనుకోని ఆడొకటి, ఈడొకటిగా ఉండాయి గుడిసెలు. కొన్ని వానకి పడిపోయి ఉండాయి. నరసమ్మ గుడిసె ఏడా కనపడలా మాకు.
అక్కడ ఓ గుడిసె ముందు ఓ తాత కూర్చొని ఉంటే నరసమ్మ గురించి అడిగాం.
“చల్ల కాలవ కొనాకి ఉండాది ఆ అమ్మి గుడిసె”అన్నాడు.
బురదలో ఇంకో ఫర్లాంగ్ దూరం నడిచాం. అక్కడ ఒక చిన్న గుడిసె ఉండాది. ఆడ ఇంకే ఇళ్ళు లేవు. గుడిసెకి ముందర చెక్క అడ్డంగా పెట్టి ఉండాది.
“నరసమ్మ..ఓ నరసమ్మ..ఓ తూరి బైటకు రా. ఎన్ని దినాలయింది నువ్వు పనికొచ్చి. ఇళ్ళు, వాకిళ్లు ఏకమై ఉండాయి గబ్బుతో. వాన సాకు పెట్టి గుడిసెలో హాయిగా పండుకొని ఉండావా పని ఎగనూకి”..
“ఓ నరసమ్మ.. ఓ తూరి బైటకు రా “
ఎంత పిల్చినా నరసమ్మ బైటకి రాలేదు. ఇంకిట్ల గాదని చెక్క తలుపు నెట్టి మొదటిసారి నరసమ్మ చిన్న గుడిసెలోకి తలలు వంచి అడుగు పెట్టారు వెంకయ్య శెట్టి, ఓబయ్య. వాళ్ళ ఎనకే అందరం లోపలికి పోయినాం.
లోపల బురద నేల మీద పండుకొని ఉండాది నరసమ్మ శాశ్వతంగా నిద్రపోతూ..
అదిరిపడ్డం అందరం. గుడిసె పైకప్పుకి ఉన్న తాటి దూలం నరసమ్మ తల మీద పడినట్లు ఉండాది. తల మీద నించి మొకం మీదకి నెత్తురు కారి ఎండిపోయి ముద్దకట్టి ఉండాది.
నరసమ్మని అట్టా చూసేతలికి అందరికీ నోటా మాట రాలేదు. బొమ్మల మాదిరి నిలబడుకొని, నరసమ్మ పీనిగ చాయ చూస్తా ఉండారు అందురు.
” మీ అవసరం కోసరం ఇన్ని దినాలకి నా గుడిసె కాడికి వొచ్చారు, కానీ ఈ తుఫానులో నరసమ్మ తినిందో లేదో అంత సద్దికూడు ఎత్తక పోదాం అని కానీ, అసలు నరసమ్మ ఎట్టా ఉండాది అని చూడడానికి కానీ, మీలో ఒక్కరైనా నా కోసరం వొచ్చారా అని అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నట్లు నరసమ్మ కళ్ళు తెరుచుకునే ఉండాయి..

18 thoughts on “దొడ్డెత్తే నరసమ్మ”

  1. జి.వి.శ్రీనివాస్

    సూటిగా గుండెను తాకడం అంటే ఇదేనేమో. అద్భుతమైన కథ, కథనం. నెల్లూరీ భాషా సోయగాలు, అప్పటి దొడ్ల పరిస్థితులు కళ్ళ ముందు కదలాడాయి. అభినందనలు మేడం గారు

    1. వంజారి రోహిణి

      చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏

  2. Ganapuram sudarshan

    నరసమ్మ చేసే పనిని అందరు చీదరిస్తరు. ఆమె మాత్రం పని కల్పించినందుకు అందరినీ పూజిస్తది. బతికిననాడు కన్నెత్తి కూడా చూడని జనం పోయిన నాడు తలదించి అయ్యో పాపం అని ప్చ్ అంటరు. ఇటువంటి వాళ్ల మనసును, బుద్ధిని మార్చి వారిలో కూసింత మానవత్వం పరిమళించే పూలు పూయించేందుకు మాటల ద్వారా, కథల ద్వారా, చేతల ద్వారా పాటుపడుతున్న మీకు అభనందనలు. చివరలో ఫినిషింగ్ టచ్ కథకు పరిపూర్ణతను తీసుకొచ్చింది.
    కథా వస్తువులో ఎబ్బెట్టు ఏ మాత్రం లేదు. అది సత్యం. అదే సత్యమని నమ్మిన వాళ్లకు ఏది చీదరగా ఉండదు.
    మంచి కథ చదివినందుకు ఆనందిస్తూ కృతజ్ఞతాభినందలు మేడం.

  3. Meenakshi srinivas

    హాయ్ రోహిణి గారూ! మనసుని కదిలించే కథ. ఎప్పటి రోజులో స్ఫురణకు తెచ్చారు.
    అప్పటి అంత కాకపోయినా ఇప్పటికి, డ్రైనేజి తుడిచే వారినీ, మాన్ హాల్స్ లో దిగి తోడే వారినీ తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది.
    నిజమే అవసరమే వారిని నరసమ్మ ఇంటికి తీసికెళ్ళింది కానీ ఆమెకు ఏమై ఉంటుందోనన్న అక్కర లేదు.
    కథ చదువుతున్నంత సేపూ ఆనాటి రోజులు దృశ్య మానం అయ్యాయి.
    సమాజంలోని అసమానతలనూ, అమానవీయతను ఎత్తి చూపే ఇతివృత్తాలతో మంచి మంచి కథలు వ్రాస్తున్న మీకు అభినందనలు 🌹🌹

    1. Rohini Vanjari

      చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు 🙏

  4. తెలికిచెర్ల విజయలక్ష్మి

    కన్నీళ్లు వచ్చేయండి. కథ పూర్తి అయ్యేసరికి చాలా బాధ కలిగింది. చాలా బాగా రాసేరు అభినందనలు రోహిణిగారూ.

    1. వంజారి రోహిణి

      చాలా చాలా ధన్యవాదాలు విజయలక్ష్మీ మేడం గారు 🙏

  5. Ramakoteswara rao chebrolu

    కథ చాలా బాగుంది రోహిణి గారూ మీ అవసరం కోసం వచ్చారు కానీ నరసమ్మ తిన్నదా తినలేదా అనుకున్నారా అని నరసమ్మ అంతరంగాన్ని చక్కగా వివరించారు.

    1. వంజారి రోహిణి

      చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏

  6. Athaluri Vijayalakshmi

    మీ కథలు అప్పుడప్పుడు చదువుతూనే ఉంటాను. Realistic stories… హృదయాన్ని మెలిపెట్టి తిప్పింది కథ. కొన్నాళ్ళు నేను కూడా ఏలూరులో ఇలాంటి వాళ్ళని చూశాను. హైదరాబాద్ లో పుట్టి పెరగడం వల్ల open టాయిలెట్స్ మొదటిసారి చూశాను ఏలూరులో… నరసమ్మ లాంటి వాళ్ళు వచ్చి క్లీన్ చేసే వాళ్ళు. అప్పుడు నా వయసు 18… పెళ్లి అయిన కొత్త… ఇంత ఆలోచన లేదు టాయిలెట్ ఎప్పుడు క్లీన్ చేస్తారా అని చూసేదాన్ని. చాలా బాగా రాశారమ్మ… అభినందనలు

  7. Venkateshwar Reddy Gadarla

    సమగ్రంగా,సంపూర్ణంగా వివరించారు

Comments are closed.