జీవన్మృత్యువు

“జీవన్మృత్యువు”. ఈ వారం నవ తెలంగాణ సోపతిలో ప్రచురింపబడిన నా కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

శత్రువు లేని యుద్ధం

వరద పోటెత్తినట్లు నెత్తుటి ప్రవాహం..

క్షణక్షణానికి విస్తరిస్తున్న వేదన

ఆయుధాల కోతలతో ఉగ్గబట్టిన ఊపిరి ..

నడుముకింద నవనాడుల్లో భరించలేని రాపిడి

గాలిలో దీపమవుతున్న ప్రాణం..

తొమ్మిది నెలలు కాపురమున్న అతిధి

కొత్తలోకంలోకి రావాలని జరిపే విశ్వ ప్రయత్నం ..

ఉప్పెనలా ఉధృతమై ఊరుకుతున్న ఉమ్మనీరు

జీవన్మృత్యు పోరాటం ..

కేర్ కేర్ అని ఏడుపు వినపడగానే

యుద్ధం పరిసమాప్తమవుతుంది ..

పండంటి బిడ్డని తనివితీరా తడిమి

మురుగుపాలు నోటికిస్తేనే ఆనందం..

బిడ్డ ఎంగిలి, కన్నీరు కడకొంగుతో తుడుస్తుంది

మలమూత్రాలను దేవుడివన్నట్లు భక్తితో ఎత్తిపోస్తుంది ..

బిడ్డల ఆనందమే తన జీవన పరమావధి అనుకుంటుంది

పసివాడి అడుగులకు మడుగులొత్తుతుంది..

అమ్మ అన్న పిలుపుకోసం పరితపిస్తుంది

చెట్టంత ఎదిగిన బిడ్డ నీడే

నిశ్చింతని తలపోస్తుంది..

నడిరోడ్డుమీదో నట్టేట్లోనో వదిలేసిపోతే

బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనే

కోరుకుంటుంది ..

ఆమె మాతృమూర్తి

అమ్మతనం ఆమెకు

శాపమైన వరమా?

వరమైన శాపమా?

రోహిణి వంజారి

13-5-2024